చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టిన మోదీ
(యం.వి.రామారావు,ప్రత్యేక ప్రతినిధి)
ఏపీ అభివృద్ధికి కేంద్రబడ్జెట్లో నిధులు భారీగా కేటాయించడం నిజంగా రాష్ట్రానికి ఊపిరి పోసినట్లేనని సర్వత్రా వినిపిస్తున్నది. ప్రధానిమోదీపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన బడ్జెట్లో చూపారు. బీహార్, ఏపీలకు అనేక వరాలు కురిపించడం గమనార్హం. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు నిధులు కేటాయించారు. ఈ నిధులు అప్పుగా ఇస్తున్నా అభివృద్ధికి తోర్పాటు అవసరం. అలాగే ఆహార భద్రతలో భాగంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుకు పూర్తి ఆర్ధిక సహకారం అందిస్తామని ఆర్ధిక మంత్రి నిర్మల్ సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం విశేషం. వెనుకబడిన జిల్లాలు ముఖ్యంగా రాయలసీమ,ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్యాకేజీ ద్వారా నిధులు బడ్జెట్ లో కేటాయించారు. అలాగే విశాఖ-చెన్నై-ఒరుగల్లు-బెంగళూరు పారిశ్రామిక క్యారిడార్ నిర్మిస్తామన్నారు. రోడ్లు,పరిశ్రమల అభివృద్ధికి కనీససౌకర్యాల కల్పనకు సహకారం అందిస్తామని, ఐటీ అభివృద్ధికి చర్యలు చేపడాతామని ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం విశేషం.అలాగే విభజన చట్టానికి అనుగుణంగా సహకారం అందిస్తామన్నారు. 50శాతం మిగిలేలా పంటల మద్దతు ధరలు పెంచుతామని హామీ ఇవ్వడం రైతులకు శుభవార్తే. పప్పు ధాన్యాల,నూనె గింజల ఉత్పత్తి లో స్వయం సంవృద్ధి సాధించేలా యత్నాలుచేస్తామన్నారు.కూరగాయల ఉత్పత్తికి ప్రోత్సాహం, చిన్నమధ్యతరహా పరిశ్రమలకు ఆర్ధికసాయం, పేదలఇళ్ల నిర్మాణానికి చేయూత తదితరాలు రాష్ట్రానికి మంచి చేయనున్నాయి. కేంద్రం ఏపీకీ బడ్జెట్లో అన్నివిధాల తోర్పాటు అందివ్వడం నిజంగా సంతోషదాయకమని సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ నిధుల వల్ల ఆర్ధిక కార్యకలాపాలు పెరుగుతాయన్నారు.వెనుకబడిన రాయలసీమ,ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్ ఖ్‌ండ తరహా సాయం లభిస్తుందని బాబు ఆశిస్తున్నారు.వాజపేయి హాయాం తరువాత బడ్జెట్‌లో ఏపీ పేరు కనపడడం నిజంగా ముదావహం. 2014లో రాష్ట్ర విభజన తెలంగాణకు మంచి చేసింది. విడిపోయిన తెలంగాణ బాగానే ఉంది. విడగొట్టబడిన ఏపీ మాత్రం అధ:పాతాళంలో కూరుకుపోయింది. 10ఏళ్లగా రాజధాని లేదు.పోలవరం ఆగిపోయింది. అభివృద్ధి 20ఏళ్ల వెనుకబడిరది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి బడ్జెట్లో నిధులు కేంద్రం కేటాయించడం ఫెడరల్ ప్రభుత్వ స్భూర్తికి నిదర్శనం.