నీరజ్ చోప్రాకు గాయం
న్యూఢిల్లీ : భారత జావెలిన్ త్రో అభిమానులకు షాక్‌కు గురిచేసే వార్త. స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా గాయపడ్డాడు. పారిస్ ఒలింపిక్స్ 2024 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న క్రమంలో నీరజ్ గాయపడటం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన ఫెడరేషన్ కప్‌లో పోటీ పడిన సంగతి తెలిసిందే. చెక్ రిపబ్లిక్లో మే 28న జరగనున్న ఆస్ట్రావా గోల్డెన్ స్పుక్లో పాల్గొనడం దాదాపు కష్టమే. ఈ మేరకు నిర్వాహకులు ఓ ప్రకటన జారీ చేశారు. ‘ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా సందేశాన్ని మేం పరిశీలించాం. రెండు వారాల కిందట గజ్జల్లో గాయం కారణంగా ఇబ్బంది పడ్డాడు. ఆస్ట్రావాలో అతడు విసరడం కష్టమే. అయితే, ఈ ఈవెంట్‌కు అతిథిగా వస్తాడు” అని ప్రకటనలో పేర్కొంది.
ఫెడరేషన్ కప్‌లో..
మే 15న భువనేశ్వర్ వేదికగా జరిగిన ఫెడరేషన్ కప్‌లో చోప్రా 82.27 మీటర్లు విసిరి స్వర్ణం గెలిచాడు. అయితే, అతడి బెస్ట్ 88.94 కంటే చాలా తక్కువే. రెండేళ్ల కిందట స్టాక్లోమ్ డైమండ్ లీగ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. త్వరలోనే 90 మీటర్ల దూరం త్రో చేయడానికి సిద్ధమవుతున్న క్రమంలో గాయపడటం ఇబ్బందికరంగా మారింది. జులై 26 నుంచి పారిస్ వేదికగా ఒలింపిక్స్ 2024 పోటీలు ప్రారంభం కానున్నాయి. సరిగ్గా రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. నీరజ్ ఫిట్నెస్ సాధించి మెరుగైన ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. అదే సమయంలో 90 మీటర్లు ఘనతను సాధించాలనేది వారి ఆకాంక్ష.