పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం

ఆంధ్రప్రదేశ్

పేదల పొట్టకొట్టిన అన్న క్యాంటీన్ల మూసివేత
గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభంచిన చంద్రబాబు
గుడివాడ : ఐదేళ్ళ వైసీపీ పాలనలో సామాన్యుడు ఎన్నో కష్టాలు పడ్డాడని ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. పేదవాడి ఆకలి తీర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెడితే ఎంతో మానసిక ఆనందం కలుగుతుందన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేసిందన్నారు. గుడివాడకు టీడీపీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. జగన్‌ దుర్మార్గపు ఆలోచనలు, అసమర్థత కారణంగా అన్న క్యాంటీన్లను రాష్ట్రంలో పున:ప్రారంభించాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటుచేసి పేద ప్రజల ఆకలి కష్టాలను తీర్చే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. గుడివాడలో అన్నక్యాంటీన్లను ప్రారంభించిన తర్వాత జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. గుడివాడలో మూడు అన్న క్యాంటీన్లను ఏర్పాటుచేస్తున్నామన్నారు. దివంగత నేత ఎన్టీఆర్‌ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం గుడివాడని చంద్రబాబు గుర్తుచేశారు. ఎంతోమంది ఆకలి తీర్చిన అన్నపూర్ణగా డొక్కా సీతమ్మ పేర్గాంచారన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తిరుమల వెళ్లిన ఎన్టీఆర్‌ అన్నదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చంద్రబాబు తెలిపారు. అరకొర సంపాదనతో జీవించే వారికి ఆన్న క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు పెట్టామని.. వీటికోసం రూ.130 కోట్లు ఖర్చుచేశామన్నారు. 4 కోట్ల 60 లక్షల మందికి భోజనం పెట్టామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి సీఎం జగన్‌ మూసివేశారని.. పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను మూసివేయొద్దని చెప్పినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ ఖజనా నుంచి నిధులు ఖర్చుచేసి పెట్టకపోయినా.. అన్నదానానికి ఎంతోమంది దాతలు ముందుకొస్తారని, అలాంటివారికి అవకాశం ఇచ్చి ప్రభుత్వంపై భారం పడకుండా క్యాంటీన్లను నిర్వహించాలని చెప్పినా వినలేదన్నారు. సెప్టెంబర్‌ నాటికి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అన్న క్యాంటీన్లను ఏర్పాటుచేస్తామన్నారు. అన్నక్యాంటీన్ల కోసం ఏడాదికి సుమారు రూ.200 కోట్లు ఖర్చు అవుతుందని.. పేదప్రజలకు అన్నం పెడితే పెత్తందారీ ఎలా అవుతారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లలో ఒక మనిషికి రోజుకు 96 రూపాయిలు ఖర్చు అవుతుందని. ఆహారం తినే వ్యక్తి రూ.15 చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం లేదా దాతలు భరిస్తారని సీఎం చంద్రబాబు చెప్పారు. అన్న క్యాంటీన్లను పున:ప్రారంభిస్తామని చెప్పగానే ఎంతోమంది దాతలు ముందుకొస్తున్నారని తెలిపారు. అన్న క్యాంటీన్లు మళ్లీ పెడతామంటే శ్రీనివాస్‌ రాజు అనే వ్యక్తి కోటి రూపాయిల విరాళం ఇచ్చారన్నారు. తన భార్య నారా భువనేశ్వరి సైతం కోటి రూపాయిలు విరాళాన్ని అందజేశారన్నారు. మరింతమంది దాతలు ముందుకొచ్చి అన్న క్యాంటీన్లకు సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. ఎవరైనా ఇంట్లో పెళ్లి జరిగితే.. వివాహ ఖర్చు కొంత తగ్గించుకుని అన్న క్యాంటీన్లకు విరాళం అందించాలన్నారు. డిజిటల్‌ రూపంలోనూ విరాళాలు సేకరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 2019లో టీడీపీ ప్రభుత్వం వరుసగా రెండోసారి గెలిచి ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో ముందుండేదన్నారు. విజయవాడ: గుడివాడ మునిసిపల్‌ పార్క్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ’అన్నా క్యాంటీన్‌’ను ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్‌ స్టేడియానికి చేరుకొని ’అన్నా క్యాంటీన్‌’ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి దంపతులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అన్నాక్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం స్వయంగా ముఖ్యమంత్రి దంపతులు భోజనాన్ని వడ్డించారు. ఆపై చంద్రబాబు దంపతులు సైతం టోకెన్‌ తీసుకుని మరీ అక్కడే భోజనం చేశారు. భోజనం చేస్తున్న సమయంలో చంద్రబాబు ప్రజలతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు రూ.5 లకే ఆహారాన్ని అందిస్తారు. అన్న క్యాంటీన్‌లో భోజనం చేయడం ఎలా అనిపిస్తుంది? అని పేద ప్రజల్ని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. రూ.5 లకే కడుపు నింపే అన్న క్యాంటీన్లు పున: ప్రారంభం మహోన్నత కార్యక్రమానికి నారా భువనేశ్వరి రూ. 1 కోటి విరాళం అందించారు. అందుకు సంబంధించిన చెక్‌ను మున్సిపల్‌ శాఖ మంత్రి పీ.నారాయణకు అందజేశారు. కోటి రూపాయల విరాళం అందించిన వారి పేరు విూద ఒక రోజు ఆహారం అందిస్తామని ఇంతకు ముందు మంత్రి నారాయణ పేర్కొన్నారు. సూపర్‌ సిక్స్‌లోని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తోంది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సైతం త్వరలోనే అమలు చేస్తామని నారాయణ తెలిపారు. కాగా ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్టుగానే ఈ రోజు ప్రారంభమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *