రంగారెడ్డి జిల్లాకు మహర్దశ

తెలంగాణ

ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
రాచకొండ ప్రాంతాన్ని ఫిల్మ్‌ ఇండస్ట్రీకి అణువుగా మారుస్తాం
హైదరాబాద్‌ మహానగరాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ పార్టీయే
‘కాటమయ్య సేఫ్టీ కిట్స్‌’ పంపిణీ పథకం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన
హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లాకు మహర్దశ రాబోతోందని, ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా ఈ జిల్లాను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. న్యూయార్క్‌ సిటీతో పోటీ పడేలా మహేశ్వరంలో ఒక అద్భుతమైన నగరం నిర్మించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. ఊటీ కంటే అద్భుతమైన రాచకొండ ప్రాంతాన్ని ఫిల్మ్‌ ఇండస్ట్రీకి అణువుగా మార్చబోతున్నామన్నారు. పదేళ్లు రాష్ట్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్టు మండలం లస్కర్‌గూడలో కల్లు గీతకార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘కాటమయ్య కిట్స్‌’ పంపిణీ పథకాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, జూపల్లి కృష్ణరావు, అర్బన్‌ ఫైనాన్స్‌,ఇన్‌ ఫాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చల్లా నరసింహారెడ్డిలతో కలిసి సిఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం ఎంఎల్‌ఎ మల్‌ రెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం ప్రోత్సాహం లేక వివిధ కుల వృత్తుల వారు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు వెళ్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కులవృత్తులు చేస్తున్న వారి ఆదాయ మార్గాలు పెంచేందుకు కృషి చేస్తోందని అన్నారు. దివంగత నేత వైఎస్‌ఆర్‌ హయాంలో బలహీనవర్గాల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తీసుకొచ్చారని సిఎం రేవంత్‌ రెడ్డి గుర్తు చేస్తూ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కూడా కంకణబద్ధమై ఉందన్నారు. ప్రభుత్వ భూముల్లో తాటి,ఈత చెట్లు పెంచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎల పార్టీ మార్పుపై సిఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. తెలంగాణ అభివృద్ధి కోసం బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పని అయిపోయిందన్న వాళ్లంతా….. ఇప్పుడు ఎంతమంది మిగిలారో లెక్కపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కొందరు ప్రభుత్వాన్ని పడగొడతామంటే….. ప్రభుత్వాన్ని నిలబెట్టాలని ఎంఎల్‌ఎలు తమకు మద్దతుగా వస్తున్నారని సిఎం తెలిపారు. హైదరాబాద్‌ను కాంగ్రెస్‌ పార్టీయే అభివృద్ధి చేసిందన్నారు. తెలంగాణను బిఆర్‌ఎస్‌ అప్పులకుప్పగా మార్చిందని, తాము ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వెళ్తున్నామని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఔటర్‌రింగ్‌ రోడ్డు, ఫార్మాఇండస్ట్రీతో పాటు..అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే అని గుర్తు చేశారు. గత పాలకులు డ్రగ్స్‌, గంజాయి తెచ్చారంటూ తీవ్రంగా ధోజమెత్తారు.