అధికారం చేసే మ్యాజిక్ అదే
నాయకులు పదవీ వైభవాన్ని అనుభవించి ప్రజల విశ్వాసం,గౌరవం అతిగా పొందితే కొంతకాలానికి తాను, మిగతా మానవులంతా వేరే అనే భావన కలుగుతుంది. అంతే ప్రజలకు నెమ్మదిగా దూరం అవుతారు.దాంతో వారు మాట్లాడే మాటలు ప్రజలు ప్రవచనాలు గా భావించాలని అనుకుంటారు.తాము దైవాంశ సంభూతులుగా భావిస్తారు.అక్కడి నుంచే వారు అహంకారం(అతిగా)తో తప్పులు చేయడం ప్రారంభిస్తారు.అందుకు 80,90 దశకంలో ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు.ఆయనపై ప్రజలు వీరాభీమానం చూపేవారు.ఆయన జానపద, పౌరాణిక సినిమాలు ప్రజల్లో ఆ అభిప్రాయం కలిగించాయి.శ్రీకృష్ణుడి వేషం నిజంగా దేవుడిని చేసింది. ఆ వేషంలో ఎన్టీఆర్ నిజమైన కృష్ణుడు (కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియక పోయినా కవులు,చిత్రకారులు వర్ణించిన విధంగా)గానే ప్రజలు భావించి ఆ ఫోటోకి కొబ్బరికాయలు కొట్టడం,పూజలు చేయడం చేసేవారు. 1980లో తెలుగు దేశం పార్టీ స్థాపించి కేవలం 8 నెలల్లో అధికారం చేపట్టి రికార్డు సృష్టించడం కూడా ఆశ్చర్యమే.అలా అయన ప్రజలకు ఆరాధ్యుడు అయ్యాడు. ఫలితంగా ఆయనకొన్ని పరిస్థితుల వల్ల 1989 నాటికి ప్రజలు చేత తిరస్కరించబడ్డారు. మళ్లీ 1995లో అధికారంలోకి వచ్చినా ఆ ప్రాభవం కనిపించలేదు. ఆయన ఎన్నో మంచి పనులు చేసినా ప్రజలు మరిచిపోయారు. కొద్దిరోజులకే ఆయనను మరచిపోయారు.
2020లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించి2014లో రాష్ట్రం సాధించే వరకూ అవిశ్రాంతంగా రాజకీయపోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అధికారంలోకి వచ్చిన 10ఏళ్లలో ఎన్నికల్లో పరాజయం పొందడం ఆయన ప్రత్యేక వైఖరే కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు దేశంలో ఎన్టీఆర్ అభిమానిగా పార్టీ లో చేరి మంత్రిగా చంద్రబాబు హయాం లో ఉమ్మడి రాష్ట్రంలో వెలుగు వెలిగారు. ఆ అభిమానం ఎన్టీఆర్ పేరు తనకుమారుడికి పెట్టు కునేంత ఉండేది.తెలంగాణ లోని ప్రతి పల్లె ఆయనకు కరతలామలకం.ఉద్యమమే ఊపిరిగా ఉద్యమకారులకు ఆదర్శంగా నిలిచారు. బలిదానాలను ఆపలేకపోయినా వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.తాను ఆమరణదీక్ష చేసి కేంద్రాన్ని దిగివచ్చేలా చేసి రాష్ట్రాన్ని సాధించారు.ఎన్నికల్లో అధికారం చేపట్టారు.అంతటితో ఆయన వైఖరి మారింది.ప్రతిపక్షం లేకుండా చేయడానికి చాణిక్యనీతి వాడారు. బలిదానం చేసిన కుటుంబాలకు హామీ మేరకు చేయలేకపోయారు.అనుకున్న మేరకు యువతకు ఉద్యోగాలు కల్పించలేక పోయారు.తనను నమ్ముకున్న వారిని కాక వలస వచ్చిన వారిని అందలం ఎక్కించారు.అధికారమే పరమావధిగా భావించారు.ప్రజల అభిమానం క్రమంగా కోల్పోయారు.రెండోసారి అధికారంలోకి వచ్చినా మారలేదు.నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు భూమి పెంచారు.రైతులకు బంధువుగా అండగా ఉన్నారు.హైదరాబాద్ ను ప్రపంచ నగరంగా తీర్చిదిద్దారు.కానీ హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేసారనే అపవాదు ఉంది. ఫాంహౌస్ వదిలి బయటకు రారని అపప్రధ ఆయనపై ఉంది.ఎన్నికల సమయంలో విస్తృతంగా పర్యటిస్తారు మినహా మిగిలినసమయాలలో ప్రజలకు అందుబాటులో ఉండరని చెబుతారు.ఆయన తాను నిర్మించుకున్న ప్రగతీ భవనంలోకి ఎమ్మెల్యే కు కూడా అనుమతి ఉండదు.ఆయన ను దర్శించుకోవాలంటే ఎంతటివారికైనా అనుమతి ఉండదు. ప్రజాగాయకుడు గద్దర్ ఒకసారి కేసీఆర్ ను కలవడానికి వస్తే ఆయన అనుమతించలేదు.ఇలాంటి అహంకార పూరిత పనులు చేసారనే కేసీఆర్ పై ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఆయన వైఖరే ఆయన ఓటమి కారణమని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ప్రజలు తెలంగాణ పితగా భావించిన కేసీఆర్ తనకు తానుగా పతనాన్ని తెచ్చుకున్నారు.
ఇక ఇటీవల ఎన్నికల వేళ ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు.’తాను మామూలు మానవుడిగా జన్మించ లేదు.కొన్ని పనులు చేయించడానికి దేవుడు నన్ను పంపించాడని అన్నారు.ఆయన పంపడం వల్ల తాను చేసే పనులకు శక్తి లభిస్తున్నదని’ అన్నారు.అందుకే నేను అలసిపోవడం అనేది లేదన్నారు.అందుకే నేను గత 10ఏళ్లుగా అవిశ్రాంతంగా దేశంకోసం పనిచేయగలుగుతున్నానని అన్నారు. మోదీ వ్యాఖ్యలు సంచలనం రేపడమే కాక సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.మోదీ ఈ ఎన్నికల్లో తాము మూడోసారి గెలవబోతున్నామని,400 మార్కు దాటితే తమ అసలు అజెండాను అమలు చేసి చూపిస్తామని ప్రచారంలో చెప్పారు.దానికి కాంగ్రెస్,ఇతర ప్రతి పక్షాలు మోదీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని, రిజర్వేషన్లు కూడా తీసివేసే ఆలోచన బీజేపీకి ఉందని ఆరోపణలు వెల్లువెత్తించారు. ఇలా అసలు అజెండాను అంటూ మాట్లాడడమే ప్రజల్లో మోదీ అనుమానాలు పెంచారు.అలాగే వ్యవసాయ నల్లచట్టాల విషయంలో కూడా మొండిగా ప్రవర్తించారు. మణిపూర్ అల్లర్లు పై ఇంతవరకూ ఆయన నోరు మెదపలేదు.పార్లమెంటులో ఏనాడు ప్రశ్నోత్తరాల సమయంలో పాల్గొనలేదు. ఐదేళ్లుగా ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వలేదు.పాతతరం నేతలకు కనీసం గౌరవం ఇవ్వకుండా తెరమరుగు చేసారు.సొంత పార్టీ సీఎంలను పట్టించుకోవడంలేదు.ఇలా పార్టీలోనూ, ప్రభుత్వం లోనూ నిరంకుశంగా వ్యవహరించడం ఎంతో కాలం సాగదు.ఏదైనా ప్రజాభిమానంతో నిర్ణయాలు తీసుకోవాలి గానీ, నిరంకుశంగా తీసుకునే నిర్ణయాలు కొద్దికాలం మనగలుగుతాయి.కాని ఫైనల్ గా అవి బెడిసికొడతాయి. ఆ విషయం తలలు పండిన ఈ రాజకీయ నాయకులకు తెలియనిదికాదు.కాని తాను మిగతావారి కంటే అధికుడని భావం నరనరాల్లో జీర్ణం కావడంతో , ఆ దేశంలో తీసుకునే నిర్ణయాలు పతనానికి దారితీస్తాయి. ఆ విషయం చరిత్ర చెబుతున్న నిజం. గత పాలకుల అనుభవాలను చూసైనా నేటి పాలకులు నేర్చుకోవాలి.అప్పుడే శాశ్వతంగా ప్రజాభిమానం కోల్పోరు. ప్రజలు తమకు మేలు చేస్తారని ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు.గెలిచేవరకూ కాళ్లావేళ్లా పడతారు.మద్యం,డబ్బులు ఆశ చూపి ప్రలోభపెడతారు.ఎన్నో హామీలు గుప్పిస్తారు.అధికారంలోకి రావడంతోనే చేసిన హామీలు మర్చిపోతారు. తాము అనుకున్నదే చేస్తారు.తాము చెప్పిందే వేదంగా ప్రజలు భావించాలని అనుకుంటారు.’తొండ ముదిరి ఊసరవెల్లి’ అయినట్లు నాయకుల ఆలోచన ల్లో మార్పు వచ్చి ప్రజలకు దూరమవుతారు.అంతే ఇంకా వారిని కాపాడేవారు ఎవరూ ఉండరు,అంతే సంగతులు.
(యం.వి.రామారావు, ప్రత్యేక ప్రతినిధి)