ఇదే చివరిది కాదు… మరిన్ని ఖాళీలతో మరో డిఎస్‌సి

తెలంగాణ

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్‌: నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ఐదు వేల ఖాళీలతో పాటు మరిన్ని ఖాళీలతో కలిపి మరో డిఎస్‌సిని నిర్వహిస్తామని, రాష్ట్రంలో ఇదే చివరి డిఎస్‌సి కాదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. డిఎస్‌సి అభ్యర్థులు కొన్ని నెలలుగా పరీక్షలకు సిద్ధమవుతున్నందున ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. పదేళ్ల బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఎన్నడూ ఒక్క డిఎస్‌సి కూడా నిర్వహించలేదని విమర్శించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లోఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే యువతకు ఉద్యోగాల కోసమని, ఇప్పటికే తాము మూడు నెలల్లో 30 వేల మందికి నియామకపత్రాలను అందజేశామని గుర్తు చేశారు. మిగిలిన ఉద్యోగాలను ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. 11 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశామని,16 వేల ఉపాధ్యాయ ఖాళీలను గుర్తించామని వివరించారు. 19,717న మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, 34 వేల మందిని బదిలీలు చేశామన్నారు. సిఎల్‌పి నేతగా తాను అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం, నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలోనే నోటిఫికేషన్‌ జారీ చేశారని, ఆ పేపర్‌ కూడా లీక్‌ అయిందని మండిపడ్డారు. మరో 13,321 మంది ఉద్యోగ నియామక ప్రక్రియ చివరి దశకు చేరిందని, ఇందులో గురుకుల పిఈటి, అసిస్టెంట్‌ ఇంజనీర్లు, డివిజనల్‌ అకౌంట్‌ ఆఫీసర్లు, లైబ్రేరియన్లు, జూనియర్‌ లెక్చరర్లు, మెడికల్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌ వంటి పోస్టులు ఉన్నాయని భట్టి తెలిపారు. గ్రూప్‌-2ను ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేశారని, పరీక్షలు అన్నిసార్లు వాయిదా వేయడం సరికాదని, త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క అన్నారు. ఈ నెల 11 నుంచి డిఎస్‌సి హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంచామని, ఇప్పటికే 2,00,500 మంది హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని వివరించారు. డిఎస్‌సిని పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. సమస్యల పరిష్కారానికి 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేశామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *