నోటిఫికేషన్లు..పరీక్షలు.. తేదీల వివరాలు
అసెంబ్లీలో ప్రకటించిన డిప్యూటి సిఎం భట్టి
గతంలో అస్తవ్యస్త విధానాలతో నిరుద్యోగులకు నిరాశ
ఇచ్చిన హావిూ మేరకు ముందుకు వెళుతున్నామని వెల్లడి
సృజనక్రాంతి/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఏయే ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే విషయాలను క్యాలెండర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసే నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలతో పాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన అర్హతల గురించి అందులో పొందుపర్చారు. ఈ మేరకు జాబ్ క్యాలెండర్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్`1 పరీక్షలు అక్టోబరులో, గ్రూప్`2ను డిసెంబరులో, గ్రూప్`3 నవంబరులో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దశాబ్దం పాటు అధికారంలో ఉన్నా, నిరుద్యోగులకు న్యాయం జరగలేదన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయడంలో భాగంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసినట్లు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రెండు సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు అయిందని, ఉద్యోగాల భర్తీ పక్రియ గందరగోళంగా మార్చారని ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ ఐఏఎస్ లతో రెండు కమిటీలు ఏర్పాటు చేసి, వారి సూచనల్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి, 60 కొత్త పోస్టులతో మొత్తం 563 పోస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కు 3 లక్షల మంది హాజరుకాగా, పరీక్ష సజావుగా నిర్వహించి ఫలితాలు ప్రకటించామన్నారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఒక లక్షా 45 వేల 368 మంది హాస్టల్ వేల్ఫెర్ ఆఫీసర్ పరీక్షలకు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్ కు 1 లక్షా 6 వేల 2 వందల 60 మంది హాజరుకాగా, విజయవంతగా నిర్వహించాం. 32 వేల 4 వందల 10 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేశాం. అదనంగా 13,500 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చాం. 11 వేల 62 ఖాళీలతో టీచర్ రిక్రూట్ మెంట్ కోసం డీఎస్సీ ఎగ్జామ్ ప్రకటించాం. జులై 18న ప్రారంభమై ఆగస్టు 5న ముగియనున్నాయి. 465 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఖాళీల భర్తీకి, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ లో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాం. పరీక్షల ప్రిపరేషన్ కు తగినంత సమయం లేదని అభ్యర్థులు కోరడంతో ఆగస్టు నుంచి డిసెంబర్ కు గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేశాం. పరీక్షా తేదీలు ఒకటే కాకుండా, పరీక్షల మధ్య ప్రిపరేషన్ కు సమయం ఉండేలా అన్ని నియామక బోర్డులు ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాయని భట్టి విక్రమార్క ప్రకటించారు. గత ప్రభుత్వం నిర్వహించిన నియామక పరీక్షల పేపర్లు లీకయ్యాయి, పేపర్ల అమ్మకంతో పరీక్షలు రద్దయ్యాయి. పేపర్ లీక్ కారణంగా 2023 మార్చి 17న తొలిసారి గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దయింది. అభ్యర్థుల బయో మెట్రిక్ తీసుకోని కారణంగా హైకోర్టులో రెండోసారి ఎగ్జామ్ రద్దు అయింది. ప్రస్తుతం ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాం. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి, కొత్త చైర్మన్ ను నియమించి వరుసగా పోస్టుల భర్తీని పూర్తి చేశాం. పాత నోటిఫికేషన్లను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసి, ఎగ్జామ్స్ సజావుగా నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తున్నామని’ భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఇకపోతే షెడ్యూల్ ప్రకారం..వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల… నవంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ట్రాన్స్‌కోలోని వివిధ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్‌లో నోటిఫికేషన్.. వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు చేపడతారు. నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహిస్తారు. వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్‌లో పరీక్షలు చేపడతారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల .. ఏప్రిల్‌లో పరీక్షలు జరుగుతాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ .. మేలో పరీక్షలు చేపడతారు. గ్రూప్`1 మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జులైలో నిర్వహించ నున్నారు. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారు. డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్‌లో నోటిఫికేషన్..సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూపు2 నోటిఫికేషన్.. అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. వచ్చే ఏడాది జులైలో గ్రూప్`3 నోటిఫికేషన్ నవంబర్‌లో పరీక్షలు జరుపుతారు. సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జులైలో నోటిఫికేషన్.. నవంబర్‌లో పరీక్షలు చేపడతామని ప్రకటనలో వివరించారు.
