ప్రమాణం చేయించిన గవర్నర్ రాధాకృష్ణన్
రాంచీ : జేఎంఎం నేత హేమంత్ సోరెన్ రaార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవలే బెయిల్‌పై విడుదలైన హేమంత్.. 5 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేశారు. ఈ పరిణామానికి కొద్దిసేపటి ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఫిబ్రవరి 2న చంపయీ సోరెన్ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. హేమంత్‌కు హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేయడంతో అయిదు నెలల తర్వాత జూన్ 28న బిర్సా ముండా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఈ తరుణంలో బుధవారం చంపయీ సోరెన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలంతా బుధవారం సమావేశమై హేమంత్ సోరెన్‌ను తమ సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్‌ను కలిసిన హేమంత్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి గవర్నర్ అంగీకరించడంతో రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా గురువారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. కాగా.. కొత్త కేబినెట్‌లో సీఎం సతీమణి కల్పనా సోరెన్‌కు చోటు దక్కే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేశారు. గురువారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత జులై 7వ తేదీన ఆయన సీఎంగా ప్రమాణం చేయొచ్చని వార్తలు వచ్చాయి కానీ, నాటకీయ పరిణామాల మధ్య ఆయన జులై 4నే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి జార్ఖండ్ ముక్తి మోర్చా పితామహుడైన హేమంతో సోరెన్ తండ్రి, మాజీ సీఎం శిభు సోరెన్ హాజరయ్యారు.