దేవుడే నన్ను రక్షించాడు

అంతర్జాతీయం హోమ్

డొనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నం
వాషింగ్టన్‌: ప్రాణాపాయం నుంచి దేవుడే తనని రక్షించాడని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్‌ ట్రంప్‌ అన్నారు. వెంట్రుక వాసిలో మృత్యువు నుంచి బయటపడ్డానని తెలిపారు. అమెరికా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అల్లర్లు చోటు చేసుకోకుండా సంయమనం పాటించాలని కోరారు. ‘ఊహించని పరిణామం నుంచి ఆ దేవుడే నన్ను కాపాడాడు. ఎలాంటి అల్లర్లకు తావివ్వకుండా అమెరికా ప్రజలంతా ఐక్యం కావాలి’ అని సామాజిక మాధ్యమం ద్వారా ట్రంప్‌ పిలుపునిచ్చారు. వివరాల్లోకి వెళితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్‌ ట్రంప్‌పై ఆదివారం దాడి జరిగింది. పెన్సిల్వేనియాలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. వేదికపై ట్రంప్‌ మట్లాడుతుండగా ఒక్కసారిగా ఆగంతుకుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో ట్రంప్‌ కుడిచెవికి బుల్లెట్‌ తగిలి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ట్రంప్‌ను సురక్షితంగా వేదికపై నుంచి తరలించారు. ఈ ప్రమాదంలో డొనాల్‌ ట్రంప్‌ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ట్రంప్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా బలగాలు మట్టుబట్టాయి. ఈ కాల్పుల్లో ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సీక్రెట్‌ సర్వీస్‌ అధికార ప్రతినిధి వివరాల ప్రకారం, ఈ ఘటన అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6:15 గంటలకు జరిగింది. ఈ ర్యాలీకి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. అమెరికా మీడియా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తూ ఉంది. దీంతో కాల్పుల దృశ్యాలు, తర్వాత జరిగిన పరిణామాలన్నీ వీడియోల్లో రికార్డయ్యాయి. బుల్లెట్‌ ట్రంప్‌ చెవి పైనుంచి దూసుకెళ్లడం, ఆయనకు రక్తస్రావం కావడం సహా అన్ని దృశ్యాలు టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో కనిపించాయి.
ట్రంప్‌పై హత్యాయత్నం యావత్‌ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిని ఎఫ్‌బిఐ గుర్తించింది. 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌గా ధ్రువీకరించింది. పెన్సిల్వేనియాలోని బెతెల్‌ పార్క్‌కు చెందిన వ్యక్తిగా తెలిపింది. ప్రభుత్వ ఓటింగ్‌ రికార్డుల ప్రకారం, అతడు రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదాడిగా నమోదు చేసుకున్నాడు. 2021 సంవత్సరంలో 15 డాలర్లను డెమొక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసీవ్‌ టర్న్‌ఔట్‌ ప్రాజెక్టకు విరాళంగా ఇచ్చాడు. ప్రస్తుతం క్రూక్స్‌ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *