స్టార్మర్‌కు ప్రధాని మోదీ అభినందనలు
బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అద్భుత విజయం సాధించింది. 14 సంవత్సరాల కన్జర్వేటీవ్ పార్టీ పాలన ముగిసింది. లేబర్ పార్టీ విజయంలో ప్రధాని అభ్యర్థి కీర్ స్టార్మర్ కీలక పాత్ర పోషించారు. 650 సీట్లు ఉన్న పార్లమెంట్‌లో లేబర్ పార్టీ ఇప్పటివరకు 412 స్థానాలను గెలుచుకుంది. రెండు శతాబ్దాల చరిత్రలో కన్సర్వేటీవ్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. లేబర్ పార్టీ విజయంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. బ్రిటన్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థి కీర్ స్టార్మర్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అలాగే కన్జర్వేటీవ్ పార్టీ ఓటమికి సంబంధించి బ్రిటన్ మాజీ పీఎం రిషి సునాక్ నాయకత్వాన్ని కొనియాడారు. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో రిషి సునాక్ కీలక పాత్ర పోషించారని మోదీ పేర్కొన్నారు. కీర్ స్టార్మర్ అద్భుతమైన విజయం సాధించారని.. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి నిర్మాణాత్మక సహకారం కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. గత ప్రధాని రిషి సునాక్‌పై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని మోదీ. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు రిషి సునాక్ క్రియాశీలక సహకారం అందించారని.. అతని నాయకత్వం అద్భుతమైనదని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు ప్రధాని మోదీ. బ్రిటన్ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు కన్జర్వేటీవ్ పార్టీ నేత రిషి సునాక్ చెప్పారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన లేబర్ పార్టీకి అభినందనలు తెలిపారాయన. లేబర్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన కీర్ స్టార్మర్‌కు అభినందనలు తెలియజేశారు.