మధురాతి మధురం జిక్కి గాత్రం …

సినిమా

జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా… అనే గీతాన్ని ఎవ‌రికైనా ఠ‌క్కున గుర్తుకువ‌చ్చే మొద‌టి పేరు జిక్కి. ఆదిత్య-369 చిత్రం కోసం పాడిన ఈ పాట తెలుగు సినీ వినీలాకాశంలో అత్యంత ప్రాచుర్యం పొందింది.
జిక్కి.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేర‌ది…
తెలుగు చిత్ర సీమ‌లో మ‌ధుర‌మైన ఎన్నో గీతాలు ఆల‌పించిన గాయ‌నీమ‌ణి. స్వ‌త‌హాగా తాను తెలుగు రాష్ట్రానికి చెందిన‌దైనప్ప‌టికీ త‌మిళం, సింహ‌ళం, తెలుగు, క‌న్న‌డం, మ‌ల‌యాళ , హిందీ భాష‌ల‌లో దాదాపు 10000 పై చిలుకు పాట‌లు పాడిన ప్ర‌తిభావంతురాలు.
జిక్కి అస‌లు పేరు పిల్లవాలు గజపతి కృష్ణవేణి. తండ్రి గ‌జ‌ప‌తి నాయుడు, త‌ల్లి రాజ‌కాంత‌మ్మ‌. వీరు జీవ‌నోపాధి కోసం ఆంధ్ర ప్ర‌దేశ్ లోని తిరుప‌తికి స‌మీపంలోని చంద్ర‌గిరి ప్రాంతం నుంచి చెన్నైకు వ‌ల‌స వెళ్ళిన దంప‌తులు. కృష్ణ‌వేణి అక్క‌డే నవంబర్ 3వ తేదీ, 1935 సంవ‌త్స‌రంలో చెన్నైలో జన్మించింది.
కృష్ణ‌వేణి మేనమామ దేవరాజు నాయుడు ప్రఖ్యాత కన్నడ నాటక దిగ్గజం , చలనచిత్ర పయినీరు గుబ్బి వీరన్నతో సంగీత స్వరకర్తగా పనిచేశారు. వారి ఆ పరిచయమే జిక్కి పరిచయానికి దారి తీసింది.
కృష్ణవేణి 1943లో బాలనటిగా తన వృత్తిని ప్రారంభించి, గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించిన పంతులమ్మ అనే తెలుగు సినిమాలో చిన్న పాత్ర పోషించింది. 1946లో, ఆమె ఒక హాలీవుడ్ చిత్రం ఎక్స్ క్యూజ్ మీ అనే చిత్రం రీమేక్ అయిన మంగళసుత్రం చిత్రంలో కనిపించింది.
1948లో విజయవంతమైన తమిళ చిత్రం జ్ఞానసౌందరీ కోసం పాడటానికి ఆమెకు ఒక అవకాశం వచ్చింది, దీనికి అప్పటి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.వి. వెంకట్రామన్ సంగీతం సమకూర్చారు. ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. అదే ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది . అంతేకాదు బాల నటి కృష్ణవేనిని ఒక నేపథ్య గాయనిగా మార్చింది.
ఈ క్రమంలో ఆమెకు తమిళ , తెలుగు చిత్రాలకు మాత్రమే కాకుండా కన్నడ మలయాళ చిత్రాల నుంచి కూడా అనేక ఆఫర్లు వచ్చాయి.
తమిళ చిత్రం సంసారం ద్వారా 1950 లో ఆమెకు నేపథ్య గాయకుడు ఎ.ఎం. రాజాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తో ఆయన ఆమెను 1952 లో హిందీ చిత్ర రంగానికి పరిచయం చేశాడు.
పి.బి. శ్రీనివాస్ కూడా ఆ చిత్రంలో తన మొదటి పాటను కోరస్ లో పాడారు. ఆ రోజులలో మద్రాసులో సింహళ చిత్రాలు నిర్మించినప్పటి నుండి ఆమె సింహళ పాటలు కూడా పాడింది.
పి.లీలతో కలిసి, ఆమె 1950 ల ప్రారంభంలో దక్షిణ భారత చలనచిత్ర రంగాన్ని ఏలింది. పి. సుశీల ప్రవేశించడానికి ముందు వరకు గాయనీమణిగా ఆమె వెలుగొందింది. పి. సుశీల చిత్ర రంగంలో ప్రవేశించిన తరువాత ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. అలాగే ఆనాటి ప్రముఖ పురుష గాయకులందరితో చిరస్మరణీయమైన యుగళ గీతాలు పాడింది. ఎక్కువగా ఎ.ఎ.రాజా, సౌందరరాజన్, సీర్కాజి గోవిందరాజన్, తిరుచ్చి లోకనాథన్, ఘంటసాల, సి.ఎస్.జయరామన్, పి.బి. శ్రీనివాస్, టి.ఎ. మోతి, ఎస్.సి . కృష్ణన్, వి.ఎన్.సుందరం, ఎ.ఎల్.రాఘవన్, ఆర్.బి. రామచంద్ర, పిథాపురం నాగేశ్వరరావు, ఎం.సత్యమ్, ఎం.ఎస్.రామారావు, ఎస్.పి. బాలసుబ్రమణ్యం, కె.జె. యెసుదాస్, మలేషియా వాసుదేవన్ లతో పాటు గాయకుడు మనోలతో కలిసి అనేక పాటలు పాడింది. అలాగే మహిళా గాయకులయిన పి.ఎ. పెరియనాయకి, ఎం.ఎల్. వసంతకుమారి, టి.వి. రతినం, పి.సుశీల, ఎ.పి.కోమల, రాధా జయలక్ష్మి, సూలమంగళం రాజలక్ష్మి, కె.జమునా రాణి, ఎస్.జానకి, ఎ.జి. రత్నమాల, కె. రాణి లతో పాటు వాణి జైరామ్ వంటి వారితో అనేక పాటలు పాడింది.
గాయనిమణిగా పేరు ప్రఖ్యాతలు సాధించి తన తోటి గాయకుడు
సంగీత దర్శకుడు ఎ.ఎం. రాజాను వివాహం చేసుకుంది. ఆ జంట పాడిన అనేక పాటలు విజయవంతమయ్యాయి. అలాగే ఆమె తన భర్త సంగీత దర్శకత్వంలో కూడా అనేక పాటలు పాడింది. అలాగే ఆ దంపతులు యు.ఎస్.ఎ, మలేషియా , సింగపూర్ వంటి అనేక దేశాలలో ప్రత్యక్ష కార్యక్రమాల కోసం అనేక పాటలు పాడారు.
ఆరుగురు పిల్లల తల్లి అయిన జిక్కి రైలు ఎక్కే సమయంలో జారి పట్టాల మధ్య పడిపోవడంతో తన భర్తను కోల్పోయింది. 1989 ఏప్రిల్ 8న కన్యాకుమారి జిల్లాలోని ఒక ఆలయంలో కచేరీ చేయడానికి ఇద్దరూ వెళ్తుండగా తిరునల్వేలి జిల్లాలోని వల్లియూర్ రైల్వే స్టేషన్ లో ఈ ప్రమాదం జరిగింది. ఆయన మరణం తరువాత ఆమె కొంతకాలం పాటు పాడటం మానేసింది. అనంతరం ఆమె తిరిగి ఇళయ రాజా చిత్రం కోసం పాడింది.
ఆమె తన ఇద్దరు కుమారులతో కలిసి ఒక సంగీత బృందాన్ని కూడా ప్రారంభించింది. అలాగే యునైటెడ్ స్టేట్స్, మలేషియా ,సింగపూర్ తో సహా అనేక దేశాలలో ప్రదర్శన ఇచ్చింది.
తమిళ నిర్మాత వలంపురి సోమనాథన్ తన చిత్రంలోని అన్ని పాటలు ఆమె చేత పాడించడం తో తన పారితోషికాన్ని ఆమె తగ్గించుకుంది. వృత్తి పట్ల ఆమెకున్న అంకిత భావం అలాంటిది.
అలాగే ఆమె ప్రతిభను గుర్తించి అనేక పురస్కారాలు వరించాయి. వీటితో పాటు మద్రాసు తెలుగు అకాడమీ “ఉగాది పురస్కారం”తో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం ఆమెకు “కలై మా మణి” పురస్కారం ఇచ్చి గౌరవించింది.
ఇలా సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్న జిక్కి 2004 సంవత్సరం ఆగస్టు 16న చెన్నైలో అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది. ఆమె మరణం సంగీత ప్రపంచానికి ఎప్పటికీ తీరని లోటుగా మిగిలి పోతుంది.
(ఆగ‌స్టు 16న జిక్కి వ‌ర్ధంతి సందర్భంగా )

.. దాస‌రి దుర్గా ప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *