న్యూఢిల్లీ : తెలుగు తేజం, స్టార్ షట్లర్ పివి సింధు మలేషియా మాస్టర్స్ ఫైనల్‌లో ఓటమిపాలైంది. సూపర్ సిరీస్ టైటిళ్ల కరవు తీర్చుకోవాలని, రెండేళ్ల నిరీక్షణకు తెరదించాలని భావించిన సింధుకు మరోసారి నిరాశే ఎదురైంది. మలేషియా మాస్టర్స్ ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్ జి యి చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో ఓడిపోయింది. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు జరిగిన ఈ సూపర్ సిరీస్ టైటిల్‌ను నెగ్గి ఆత్మవిశ్వాసం పెంచుకుందామని పీవీ సింధు భావించింది. మొదటి రౌండ్‌లో ఆధిక్యం సాధించిన సింధుకు అసలైన పోటీ రెండో రౌండ్ నుంచి ఎదురైంది. ప్రత్యర్థి వాంగ్ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సెకండ్ రౌండ్‌లో చెలరేగిపోయింది. ఇద్దరు క్రీడాకారిణులు చెరొక రౌండ్ గెలిచి సమంగా నిలిచారు. విజేతగా తేల్చే చివరి రౌండ్ ఉత్కంఠభరితంగా సాగింది. వాంగ్ మరోసారి కీలక సమయంలో దూకుడు పెంచి చివరి రౌండ్‌లోనూ గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దాదాపు 79 నిమిషాలపాటు సాగిన పోరులో సింధుకు ఓటమి తప్పలేదు.