ముస్లిం మహిళ కేసులో సుప్రీం కీలక తీర్పు
న్యూఢల్లీి : ముస్లిం మహిళలకు భరణం ఇచ్చే విషయంలో బుధవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విడాకుల తర్వాత వారు కూడా భరణానికి అర్హులని స్పష్టం చేసింది. 125 సీఆర్‌పీసీ ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టీన్, జార్జ్ మాసిప్‌ాలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. విడాకుల తర్వాత తమ భర్త నుంచి వారు భరణం కోరవచ్చని తీర్పునిచ్చింది. భరణానికి సంబంధించిన హక్కును కల్పించే ఆ సెక్షన్‌ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. సెక్షన్ 125 వివాహితలకే కాకుండా మహిళలందరికీ వర్తిస్తుంది. మతంతో సంబంధం లేకుండా ఈ సెక్షన్ కింద వివాహితలు భరణం కోరవచ్చు. భరణం ఇవ్వడం అనేది దాతృత్వం కాదు. భార్య తమపై మానసికంగా, ఇతర రకాలుగా ఆధారపడి ఉంటుందనే వాస్తవాన్ని కొందరు భర్తలు గుర్తించడం లేదు. గృహిణి పాత్రను, ఆమె త్యాగాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చిందని ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ప్రతి నెలా బాధిత మహిళకు 10వేల రూపాయలు ఇవ్వాలని పిటిషనర్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం ఇవ్వాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేశారు పిటిషనర్. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్థించింది. నిర్వహణ అనేది దాతృత్వం కాదని.. వివాహిత మహిళల హక్కు అని సుప్రీం కోర్టు తెలిపింది. గృహిణి అయిన భార్య మానసికంగా.. తమపై ఆధారపడుతుందనేది భర్తలకు తెలియదా అని, ప్రతీ పరుషుడు గృహిణి పాత్రను గుర్తించాలని జస్టిస్ నాగరత్న అన్నారు.