(యం.వి.రామారావు,ప్రత్యేక ప్రతినిధి)
కేంద్ర ఉక్కు,గనుల మంత్రి కుమారస్వామి,ఆయన డిప్యూటి గురువారం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శిస్తారని,దీనిపై సమీక్ష చేస్తారని అధికారిక సమాచారం.గత కొన్నిసంవత్సరాలుగా ఉక్కుఫ్యాక్టరీ ని ప్రైవేటీకరణ చేయనున్నట్లు కేంద్రం చెబుతున్నది. దాని ఉత్పత్తి సామర్ధ్యం 60శాతానికి తగ్గించి నష్టాలు చూపుతున్నారని కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. అలాగే అవగాహన లేని సీఎండీని కూడా మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి.ఎన్నికల సందర్భంగా కేవలం పెట్టుబడుల ఉపసంహరణ మాత్రమే చేస్తున్నామని కేంద్రం చెప్పడం గమనార్హం. విశాఖ ప్రజలు,రాష్ట్రం కూడా ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అనేక సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తునేఉన్నారు.1962 నుంచి విశాఖ ఉక్కు..ఆంధ్రా హక్కు అని ఉమ్మడిరాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసి మరీ సాధించుకున్న విషయం విదితమే.ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితమే ఈ ఉక్కు ఫ్యాక్టరీ అని,దాన్ని కేంద్రం కొమ్ము కాస్తున్న కార్పొరేట్ వర్గాలకు చౌకగా కట్టబెట్టాలని చూస్తున్నదని ఆరోపణలు హోరెత్తుతున్నాయి.కరోనా సమయంలో విశాఖ ఉక్కు ఆక్సిజన్ ఉత్పత్తి చేసి దేశవ్యాప్తంగా ఎంతోమందికి ప్రాణాలు పోసింది. ఎన్నికల తరువాత ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అంశాన్ని వాయిదా వేసింది. ఇటీవల ఉక్కు కర్మాగారానికి కేంద్రం నిధులు మంజూరు చేసి దారిలో పెడుతుందని వార్తలు వచ్చాయి.ఇన్నాళ్లూ విశాఖ ఉక్కుపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదనే ఆరోపణల్లో నిజం ఉంది. దేశంలో సొంత గనులులేని ఏకైక ఉక్కు కర్మాగారం ఇది మాత్రమే.దీనిపై అనేక సార్లు విజ్ఞాపనలు, ఆందోళనలు జరిగాయి.ఫలితంలేదు.దేశంలో అత్యంత నాణ్యమైన ఉక్కును ఉత్పత్తి చేస్తున్న ఏకైక కర్మాగారం ఇది.అలాగే 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న ఈ ఫ్యాక్టరీని అమ్మాలని కేబినెట్ కమిటి గతంలో సిఫార్సుచేయడం శోచనీయం. సెయిల్ లో విలీనం చేస్తే నష్టాలు పోతాయని కార్మిక వర్గాల నుంచి సూచనలు వస్తున్నాయి. 100 శాతం సామర్థ్యంతో నడిచేలా చర్యలు తీసుకోవాలని కార్మిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
గురువారం కేంద్రమంత్రుల పర్యటనలో సెయిల్లో విలీనం నిర్ణయం తీసుకుంటారని కార్మిక వర్గాలు ఆశ పడుతున్నాయి.విశాఖ ఉక్కు కు వేలాది ఎకరాలు ఉన్నాయి. ఈ భూమిపై కూడా కార్పొరేట్ కన్ను పడిరది. అదానీ గ్రూప్ కు కట్టబెట్టాలని కేంద్రం ఎన్నికల ముందు భావించింది. కాని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో టీడీపీ తోర్పాటు చాలా ఉంది.అందుకు కేంద్రం ఇప్పుడు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే నిర్ణయం తీసుకోదని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర మంత్రుల పర్యటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కార్మిక వర్గాలు,రాష్ట్రప్రభుత్వం శుభవార్త వినాలని ఎదురు చూస్తున్నారు.