శైలజామిత్ర కవిత్వం ఒక అంతర్ముఖ పరిమళ భరితం

సాహిత్యం

శైలజామిత్ర 1997 లో తొలి కవితాసంపుటి ముద్రించి 2024కి తన తాజా 10 వ కవితా సంపుటి
“జన్మించడమే కవిత్వం” తో పాఠకుల ముందుకొచ్చింది. ప్రతిష్టాత్మక తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, అపురూప విమర్శ పురస్కారాలు అందుకున్న అనంతరం బహు భాధ్యతతో వెలువరించిన కవిత్వ గ్రంథమిది.
పాలస్తీనా మహాకవి మహమూద్ దార్విష్ అన్నట్లు “నా హృదయ వృక్షం పై నిలిచి లక్ష పక్షులు యుద్ధగీతాలు పాడుతుంటాయి” -అన్న మాటలు ఈ కవిత్వం చదువుతుంటే చప్పున గుర్తుకొచ్చాయి.అవును దశాబ్దాలుగా సంపద్వితమైన సృజనాత్మక రచనలు అవిశ్రాంతంగా, అలుపెరుగక చేస్తున్న ఒక విదుషీమణి ఆమె. బైరాగి లాంటి అంతర్ముఖ మానసిక యుద్ధ భావాల్ని స్పృశిస్తూ చేసిన అద్భుతమైన కవితా సృజన చదివాక పైన ఉదహరించిన మహాకవి మాటలు గుర్తురావటం సముచితమే కదా..!

పుస్తక ముందు మాటలో ప్రముఖ సాహితీవేత్త ఓలేటి పార్వతీశం కూడా ఈ కవయిత్రి తన అస్తిత్వాన్ని విశేషంగా ప్రకటిస్తుంది, నవ్య భావనని ప్రతిపాదిస్తుంది. ఇందులోని ప్రతి కవితా ఒక రస నిర్భర చషకం. మొత్తంగా ఇదొక భావమృత కలశం అనడం గమనార్హం. మరో అభినందన రాసిన సుప్రసిద్ధ రచయిత్రి, అనువాదకురాలు అంబికా అనంత్ ఈ కవిత్వంలో సమన్వయ ధోరణిలో కొన్ని, జ్వలిస్తూ ప్రశ్నించేవి కొన్ని. కానీ అన్నీ మానవజీవితాలకు స్పందన స్ఫూర్తినిచ్చేవి, భావచేతనాశక్తి నింపుకున్నవి అనడం సందర్భోచితం.

61 కవితలు సుదీర్ఘ కాలంలో వివిధ పత్రికల్లో ప్రచురణ పొందినవి పొత్తంగా గుదిగుచ్చి ప్రకటించినవి.

కవయిత్రి శైలజామిత్ర తన మాటలో “నాలో అంతర్ముఖంగా సాగే పోరాటాన్ని, బాహ్యరూపంలో కనిపించే ఆవేశాన్ని బహిర్గతం చేయడం ద్వారా నేను ఆశిస్తున్న సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కృతంచేయగలననుకున్నాను అనడం మనం అనుకున్న అంతర్యుద్ధం మాటకు బలమిచ్చేలా వుంది. తన అంతర్యుద్ధ ప్రకటనకు కవిత్వాన్ని ఆయుధంగా చేసుకున్న సృజనకారిణిగా ఆమె ఈ తాజా కవిత్వంలో దర్శనమిస్తుంది.ఆమె కవిత్వ భూమికలు ఆధునికానంతర, విలక్షణ అభివ్యక్తి, మార్మికత, విశిష్ట భావుకతలతో ఆమెను ప్రామాణిక కవయిత్రిని చేసాయి. “ఋషి కానివాడు కావ్యం రాయలేరు”అన్నట్లు అనేక రోజువారీ అంశాలను ఆమె ఒక ధ్యాన ముద్రలో రాశి ప్రసరింప చేసినట్లు అనిపిస్తాయి.
అనేక సందర్భాల్లో ఆమె పుచ్చుకున్న ఆశ్రమ వైరాగ్యం ప్రతిబింబిస్తుంది.. ఈ వాక్యాలు అసమానం అని మెట్లుకట్టి చెప్పడం నాకు ఇష్టం వుండదు, కనుక నన్ను విశేషంగా ఆకట్టుకున్న రెండు కవితల్ని విశ్లేషించి మీకు పరిచయం చేస్తాను.

పిట్ట: ఆధునిక కవిత్వం గతానుగతికత్వాల్ని పూర్తిగా విసర్జించింది. ఏ కవి/కవయిత్రికి ఆ కవి కొత్త దిణుసులకోసం అన్వేషిస్తూ నవనవోన్మేషశాలిగా కవిత్వాన్ని శిఖరాగ్రం మీద నిలుపుతున్నదిప్పుడే! ప్రతి కవి/కవయిత్రి ఒక ప్రయోగశాలగా సాగిపోతున్నాడు. కవిత్వం కాలక్రిమి దష్టం కాకుండా కాపాడే నాఫ్తలీన్ ఉండలు లాగా ఆధునిక కవిత్వంలోని వస్తువులు, పదచిత్ర సంవిధానం ఉపయుక్తమౌతున్నది.

ఈ పిట్ట కవితను పరిశీలిస్తే “ఆ పిట్టకి వేరే పనిలేదు/ ఎంత తరిమినా దూరంగా పోదు” అని ప్రారంభించారు. ఈ పిట్ట జ్ఞాపకాల పిట్ట. మనిషి జీవితంలో అన్నీ జ్ఞాపకాలే! అనుభూతులే! ఆ అనుభూతుల్ని నెమరువేసుకుంటూ సాగిపోతాడు మనిషి. కవితను కొనసాగిస్తూ “నాకు వేరే పని తోచనీయకుండా/ నా తలచుట్టూ చేరి/ తన గొంతు ప్రావీణ్యాన్ని చూపాలనే/ దాని తపనంతా..” అంటారు. గొంతు ప్రావీణ్యం అనడంలో జ్ఞాపకాల దొంతర ఎంత దట్టంగా ఉందో చెప్తున్నారు. “నా కనులు తడిసిపోయినప్పుడు/ కాసేపు కనుమరుగైనట్లు నటిస్తుంది/ శూన్యంలోకి నా చూపును గమనించి/ తనలోని నేనిష్టపడే రంగుల్ని/ ఫ్యాషన్ పెరేడ్ లా పదే పదే చూపుతుంది” అన్నారు. ఈ ఆలోచనలు, అనుభూతుల దొంతరకు కొంత విరామం ఉంటుంది. వెంటనే బాధను కలిగించేవి, బోధను కలిగించేవే కాక, మధురానుభూతుల్ని అందించే జ్ఞాపకాలు సైతం మదిలో సప్తవర్ణాలతో దర్శనమిస్తుంది అంటున్నారు. “మనిషి జీవితంలోకి/ మొదటి పేజీ నుండి ప్రారంభమైన/ ఈ జ్ఞాపకాల పిట్ట/ ఎంత తరిమినా నన్నొదిలిపోదు/ ఎవరున్నా లేకున్నా/ నన్నొదిలిపోదు” అని ముగించారు. అనుభూతుల దొంతరను, జ్ఞాపకాల నీడలను ఆపడం ఎవరి తరం కాదు. జీవిత చరమాంకం వరకూ వెంటాడుతూనే ఉంటాయన్న సత్యాన్ని తెలియజేస్తారు.

“జన్మించడమే కవిత్వం” అన్న మరో కవిత ఈ కవితా సంపుటికి శీర్షిక. ఆ కవితలో జీవితానికి కవిత్వానికి ఉన్న సహ సంబంధాన్ని విశదపరుస్తారు రచయిత్రి. ప్రథానంగా తాత్త్వికులు తత్త్వ విషయ వివేచనతో పాటుగా భావజాలంతో సైతం ప్రమేయం కలిగి ఉంటారు. కవితల్లో ఏవో వైయక్తిక ప్రతీకలు, భావజాలం ద్వారా తమ వ్యక్తీకరణలకు స్పష్టత చేకూరుస్తూ ఉంటారు. ఆధునిక కవిత్వానికి కేవలం హృదయమే కాదు, మనస్సు సైతం కార్య రంగమే! కవిత్వానికి ప్రథానంగా కావలసినది ఆవేశపరతకీ, ఆత్మపరతకీ సమన్వయత ఘటింపబడడం. ఆ సమన్వయ విశేషమే పాఠకుడు ఈ కవితలో అనుభవిస్తాడని అనుకుంటున్నాను.

“కవిత్వమంటేనే కవికి మరో జన్మ/ అమ్మ ఎన్ని బాధలు పడి నాకు జన్మనిచ్చిందో/ నాకు తెలియదుకానీ/ నాలోంచీ కవిత్వం రూపుదిద్దుకున్నప్పుడల్లా/ నాకు మరో జన్మ ఎత్తినట్టుంది/ నేను మరో బిడ్డకు జన్మనిచ్చినట్లుంది” అంటూ ప్రారంభించి, కవిత్వాన్ని ఆషామాషీగా తీసుకో కూడదనీ, కవిత్వ సృజన అంత తేలికైనది కాదని, నిజమైన కవితకు జన్మ నివ్వాలంటే పురిటినొప్పులు అనివార్యమని చెప్తున్నారు. కవిత్వం రచయిత్రిలో ఎప్పుడెప్పుడు తన్నుకొస్తుందో వివరించాక “స్వేచ్ఛలేని చోట సర్వం కోల్పోయినట్లుగా/ స్వాతంత్ర్యమే స్వాహా అయినచోట స్వగతం నిలదీస్తున్నట్లుగా/ అక్కడక్కడా నిరాశా నిస్పృహలు కావలి కాస్తున్నప్పుడు/ నే కవిత్వంగా మారిపోతున్నాను” అంటారు. కవిత్వం ఎప్పుడు పుడుతుంది? వాల్మీకికి కరుణరసంతో పుట్టినట్లు ఒక్కరికి ఒక్కో సమయాల్లో కవిత్వం జనిస్తుంది. రచయిత్రికి స్వాతంత్ర్యం అపహరింపబడ్డప్పుడు కవిత్వం జనిస్తుంది. నిరాశా నిస్పృహలు ఆవరించినప్పుడు జనిస్తుంది. కవిత ముగింపులో “ప్రారంభమైనా.. ముగింపైనా/ కవిత్వమే కదా కవిని ఆదరించేది” అనే ఒక్క భావనను బలంగా విసిరారు.

శైలజామిత్ర తెలుగు సాహిత్యలోకానికి చిరపరిచితం అని, ఈ సంపుటిలో తనని తాను సృజనలో విముక్తం చేసుకుంది అన్న సుప్రసిద్ధ కవయిత్రి శిలాలోలిత మాటలు అక్షర సత్యాలు. ఈ కవిత్వంలో అంతర్లీనంగా కనిపించే కవయిత్రి ధిక్కార స్వరం కూడా పఠితలు తప్పక గమనిస్తారు.

సమకాలీన రుగ్మతల పట్ల వీరి కలం ఘులిపిస్తూనే మరింత కాలం తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేస్తారని ఆశిస్తూ ఈ కవిత్వాన్ని స్వాగతిస్తాను…!!

జన్మించడమే కవిత్వం
అన్విక్షికి ప్రచురణలు
పుటలు:216, వెల:175/-

డాక్టర్ పెరుగు రామకృష్ణ
9849230443

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *