“సాహిత్యం వైపు నిలబడితే సమాజం వైపు నిలబడినట్లే..!”

కవితో కరచాలనం

సుప్రసిద్ధ కవి, రచయిత,
శ్రీ యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆచార్యులు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎన్ ఈశ్వరరెడ్డి తో ఈ వారం కరచాలనం..

*గ్రామీణ నేపథ్యం నుండి ఉన్నత విద్య ద్వారా మీరు వేమన విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధినేతగా ఎదిగిన తీరు
చెప్పండి..?

మాది చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మొండి వెంగనపల్లె గ్రామం. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మా ఊరికి సమీపంలోని వెదురుకుప్పం గ్రామంలో చదువుకున్నాను. అనివార్య కారణాలవల్ల ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేయవలసి వచ్చింది. ఇంటర్మీడియట్ మధ్యలో ఆపేసిన తర్వాత, దారి తప్పిన బాటసారిలా ఇంటి నుంచి బయటపడ్డాను. పొట్టకూటి కోసం రకరకాల పనులు చేసుకుంటూ ముందుకు సాగే క్రమంలో మళ్లీ చదువు గురించి ఆలోచించాను. ఆ తరువాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ పూర్తి చేశాను. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంఏ తెలుగు పూర్తి చేసి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి పట్టా అందుకున్నాను. వీటితోపాటు జర్నలిజంలో కూడా పీజీ చేశాను. తెలుగు విశ్వవిద్యాలయంలో తాత్కాలిక వేతనంతో చిరుద్యోగంతో ప్రారంభించిన నా ప్రయాణం యోగి వేమన విశ్వవిద్యాలయం, తెలుగు శాఖలో ఆచార్యుడి స్థాయికి చేరింది. దీని వెనక కఠోర శ్రమ ఉంది. రచన వ్యాసంగం ఉంది. అనేకమంది ఆచార్యుల ఆశీర్వాదం ఉంది. విశ్వవిద్యాలయంలో చేరిన తరువాత నిబద్దతగా పనిచేసే అలవాటును చేసుకున్నాను. ముఖ్యంగా తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావడం, విద్యార్థులను స్నేహపూర్వకంగా చూడడం, ప్రేరేపించే విధంగా పాఠం చెప్పడం వంటి అంశాలు నాకు గుర్తింపును తెచ్చిపెట్టాయి.

*తెలుగు సాహిత్యం చదవడానికి , పరిశోధనకు ప్రేరణ..?

తెలుగు సాహిత్యం వైపు రావడానికి తెలుగు భాష పట్ల పాఠశాల స్థాయిలో అధ్యాపకులు బోధించిన విధానం, భాష పట్ల కలిగించిన మమకారం మొట్టమొదటగా చెప్పుకోవలసి ఉంటుంది. హైస్కూలులో పాఠం చెప్పిన తెలుగు ఉపాధ్యాయులు పేట ఈశ్వర రెడ్డి తెలుగు భాషా సాహిత్యాల పట్ల అభిరుచిని కలిగించాడు. ముఖ్యంగా పద్యాన్ని రాగయుక్తంగా పాడి మాతో పాడించి సాహిత్యానికి మమ్మల్ని జత కలిపాడు. సాహిత్యమే కాకుండా, ఏ పాఠ్యాంశంతో నైనా ఒక విద్యార్థి మమేకం కాగలిగినప్పుడు అతని ఆలోచన విధానం మారిపోతుంది. దానికి అనుగుణంగానే విద్యార్థులు పాఠ్యాంశాల అధ్యయనానికి, సంబంధిత డిగ్రీలకు ఉపక్రమిస్తారు. నా విషయంలోనూ అలాగే జరిగింది. నాకు సంపూర్ణ గ్రామీణ నేపథ్యం ఉంది దాని చుట్టూ అల్లుకున్న జానపద కళారూపాలు ఉన్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రాంతంలో ప్రదర్శించే వీధి నాటకాలు చూపించిన ప్రభావం చాలా ఉంది. వీటి కారణంగా తెలుగు భాషా సాహిత్యాల వైపు సహజంగానే ముగ్గు చూపాల్సి వచ్చింది.
పరిశోధన విషయానికి వస్తే పీహెచ్డీ చేయాలని ఆలోచన పీజీ పూర్తయ్యేదాకా లేదు. డిగ్రీ పూర్తి కాక ముందు నుండి కవిత్వం గేయాలు రాస్తూ ఉండినందువల్ల గతంలో రాసిన కవుల గురించి వారి రచనల గురించి అధ్యయనం చేయాలనే ఉచ్చుకత కలిగింది. అలా చదువుతున్న క్రమంలో, నా బిఏ డిగ్రీ మూడవ సంవత్సరం చదివే సమయంలో నన్ను బాగా ఆకర్షించి ప్రేరేపించిన కవితా సంపుటి “ఉద్యమం నెలబాలుడు”. శివసాగర్ రాసిన ఈ విప్లవ కవిత్వం నన్ను వ్యాసరచన వైపు ప్రేరేపించింది 1994 ప్రాంతంలో ఉద్యమం నెల బాలుడు పై రాసిన వ్యాసం అప్పట్లో రాజమండ్రి నుంచి వెలువడే ‘కోస్తా వాణి ‘ దినపత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత నన్ను ప్రేరేపించిన కవితా సంపుటుల మీద రాయడం మొదలుపెట్టాను. అలా రాసే అలవాటు పీజీ పూర్తయిన తర్వాత నన్ను పరిశోధన వైపు మళ్ళించింది. డాక్టర్ “ఆవంత్స సోమ సుందర్ రచనలు- అభ్యుదయ దృక్పథం” అనే అంశంపై పిహెచ్.డి చేశాను. ఆ తర్వాత అనేక అంశాల మీద పరిశోధన చేస్తున్నాను ఇప్పటిదాకా 80 కి పైగా పరిశోధన వ్యాసాలు, 6 విమర్శా గ్రంథాలు ప్రచురితమయ్యాయి.

*వేమన విశ్వవిద్యాలయ
ప్రాంగణం మీకు ఏమి నేర్పింది..?

యోగి వేమన విశ్వవిద్యాలయం నేను చదువుకున్న చదువుకు తగిన గౌరవం, గుర్తింపును ఇచ్చింది. వెనుకబడ్డ రాయలసీమకు నమూనాగా ఉండే కడప జిల్లాలో ఏర్పడిన యోగి వేమన విశ్వవిద్యాలయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సులభంగా విద్యావకాశాలను మెరుగుపరిచింది. అందువల్ల ఎం ఏ తెలుగు చదవడానికి వచ్చే విద్యార్థులు బాగా ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లు అయి ఉండడం, వాళ్లను ప్రయోజకులుగా మార్చే విద్యను బోధించగలిగితే మా అధ్యాపక జీవితం ధన్యత సాధించినట్టు భావించడం తదనగుణంగా పాఠ్యప్రణాళికలను బోధన విధానాలను ఎంపిక చేసుకుని విద్యార్థులతో మమేకమయ్యే అవకాశాన్ని యోగి వేమన విశ్వవిద్యాలయం కల్పించింది. ఒక గురువుకు తన శిష్యులు తన కన్నా ఉన్నతంగా ఎదిగితే లభించే ఆనందం కన్నా ఆనందం మరొకటి ఉండదు. అలాంటి శిష్యులను తయారు చేయాలనే అభిలాష విద్యార్థులకు నన్ను మరింత చేరువ చేసింది. యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో చదువుకున్న విద్యార్థులు ప్రతి సంవత్సరం యూజీసీ నిర్వహించే జె ఆర్ ఎఫ్ ఉపకార వేతనానికి ఎంపిక అవుతున్నారు అంటే అది మాకు చెప్పుకోవడానికి ఎంతో గర్వించ గర్వించదగ్గ విషయంగా ఉంటుంది. ఆ తర్వాత పిహెచ్.డిలు చేసి డిగ్రీ కళాశాల లెక్చరర్లుగా, జూనియర్ కళాశాల లెక్చరర్లుగా,ప్రభుత్వ టీచర్లుగా, గవర్నమెంట్ ఉద్యోగులుగా స్థిరపడుతూ ఉంటే, ఆ తృప్తి ఇచ్చే ఆనందం ఎప్పటికీ మరువలేనిది. శ్రమకు తగ్గ ఫలితం లభించడం వల్ల, ఆ శ్రమను ఇంకా ఉన్నతంగా చేయాలని సంకల్పాన్ని బలోపేతం చేయడాన్ని ఈ విశ్వవిద్యాలయం మాకు నేర్పింది.

*సృజనాత్మక సాహిత్యం లో చేసిన రచనలు, ప్రచురణల వివరాలు పొందిన అవార్డుల పంచుకోండి..?

నేను సాహిత్యంలో గేయంతో అడుగుపెట్టాను. ఆ తర్వాత వచన కవిత్వం రాశాను. కన్నీటి సీమ, మనసు పాట, నాకొక మనిషి కావాలి, నాలో నువ్వు అనేవి నేను రాసిన కవితా సంపుటులు. సోమ సుందర్ సాహిత్య దృక్పథం, రైతన్నా మేలుకో- ఆత్మహత్య మానుకో, కవిత-మానవీయత, సాహిత్యం- సమాజిక అవసరం, సాహిత్యంలో సమాజం, తిలక్ సాహిత్యం- సందేశం (సంపాదకత్వం) రచనలు నా చేతి నుంచి వెలబడ్డాయి.
పీజీ పూర్తయిన తర్వాత భారత దేశ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రకటించిన జూనియర్ ఫెలోషిప్ (2002-03)లభించింది.
విశాఖపట్నంలోని సహృదయ సాహితీ సమితి నిర్వహించిన జాతీయస్థాయి కవిత్వ పోటీలో నాకు ప్రథమ బహుమతి(1996) లభించింది.
కడప ద్విశతాబ్ది ఉత్సవాలకు రాసిన గేయానికి ఉత్తమ గేయంగా అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రశంసా పత్రం లభించింది.
పిహెచ్. డి పరిశోధనకు సోమ సుందర్ సాహిత్య సత్కారం(2010) లభించింది.
కందుకూరి సెంటినరీ మెమోరియల్ అవార్డు (2018)
సాహితీ విశిష్ట సమ్మాన్ (2019)
గిడుగు రామమూర్తి పంతులు భాషా సేవా పురస్కారం (2021)
శ్రీశ్రీ ప్రతిభా పురస్కారం (2021)
శ్రీ స్వర్ణ భారతి జాతీయ సాహిత్య పురస్కారం (2022)
పల్లా జాతీయ కవిత పురస్కారం (2022)
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం (2022) మొదలైన పురస్కారాలు సత్కారాలు వరించాయి.

*తెలుగు శాఖ అధ్యక్షులుగా మీరు చేసిన భాషా,సాహిత్య సేవలు తెలపండి..?

తెలుగు శాఖ అధ్యక్షులుగా పాఠ్య ప్రణాళికను అమలు చేయడంలోనూ, నిర్ణీత సమయంలో సిలబస్లు పూర్తి చేయడంలోనూ, డిగ్రీ కళాశాలకు వెళ్లి విద్యార్థులకు తెలుగు సాహిత్య రుచిని చూపించి, వారిని విశ్వవిద్యాలయం దాకా తీసుకోవడంలోనూ, పరిశోధక విద్యార్థులను చేర్చుకోవడంలోనూ నా వంతు కృషి చేశాను. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ పద్ధతిలో భాషా సాహిత్యాలను అధ్యయనం చేయడానికి పరిశోధనలు కొనసాగించడానికి ఒక భాషా ప్రయోగశాలను ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి చేశాను.

*ఆంధ్రప్రదేశ్ అరసం కార్యవర్గ బాధ్యులుగా మీ అనుభవం చెప్పండి..?

ఆంధ్రప్రదేశ్ అరసం కార్యవర్గ సభ్యుడిగా నా చేతనయినంత భాషా సాహిత్య సేవ చేస్తున్నాను. అరసం కడప జిల్లా అధ్యక్షుడిగా ( 2012 నుండి) జిల్లాలోని అభ్యుదయ రచయితలను ప్రోత్సహిస్తూ అనేక సాహిత్య సభలు నిర్వహించాము. అంతేకాకుండా ప్రముఖ కవులు రచయితల జయంతులను వర్ధంతులను నిర్వహిస్తూ సాహిత్యానికి సమాజానికి ఇతోదికంగా మేలు చేసిన రచయితలను నేటి తరానికి పరిచయం చేస్తున్నాం. వీటితోపాటు పాఠశాలలకు కళాశాలలకు వెళ్లి నేటి తరానికి సాహిత్యం ద్వారా జరిగే మేలు గురించి వివరిస్తున్నాం. జిల్లా మహాసభ నిర్వహణలోనూ, రాష్ట్ర మహాసభ నిర్వహణలోనూ మా వంతు పాత్ర పోషించాం.

*కవిత్వానికి మీరిచ్చే స్వీయ నిర్వచనం..?

నా దృష్టిలో కవిత్వం అంటే అది మనిషిని మార్చే ఒక అద్భుత మంత్రం. మండుటెండలలో వెన్నెలను కురిపించగల శక్తి కవిత్వానికి ఉంది. శక్తి హీనమైన మానవజాతిని చైతన్యపరిచే గుణం కవిత్వానికి ఉంది. అంతెందుకు నన్ను ఒక మనిషిగా చేసి ఈ స్థాయికి రావడానికి ఈ కవిత్వమే ఒక కారణం అంటే ఒప్పుకోవాల్సిందే.

*రచయితగా మీ భవిష్యత్ ప్రణాళికలు..?

ఒక రచయితగా సామాజిక బాధ్యతను స్వీకరిస్తాను. సమాజంలో జరిగే అనేక పరిణామాలకు కార్య కారణ సంబంధాలను అన్వేషిస్తుంటాను. ప్రజాస్వామ్యం వైపు నిలబడి ప్రశ్నించడానికి రచనలు ఉపయోగపడాలని కోరుకుంటాను.
ఈ నేపథ్యం నుండే భవిష్యత్తు లో రాబోయే రచనలు ఉంటాయని అనుకుంటున్నాను. ఇప్పటిదాకా వచ్చిన రచనలన్నీ కూడా ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆశించి వచ్చినవే.

*యువరచయితలకు మీరిచ్చే సందేశం..?
యువ రచయితలకు నేను ఇచ్చే సందేశం ఒక్కటే. సాహిత్యం వైపు నిలబడితే సమాజం వైపు నిలబడినట్టే. మంచి సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే మంచి సమాజాన్ని నిర్మించడానికి తగిన వ్యక్తులుగా తయారు కాగలరు. కాబట్టి గొప్ప రచయితల రచనలను అధ్యయనం చేయడం, తద్వారా రాబోయే తరానికి దిశా నిర్దేశం చేయగల స్థాయికి రచయితలు ఎదగాలని కోరుకుంటాను.

డాక్టర్ పెరుగు రామకృష్ణ
9849230443