తెలుగు కథా, నవలిక సాహిత్య వైభవానికి స్వర్ణాభరణాలు అందించిన అరుదైన అక్షర నిరంతర సాధకుడు ‘బుచ్చిబాబు’. సాహిత్య చరిత్ర పుటలలో చిరస్థాయిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్న ‘బుచ్చిబాబు’..తెలుగుభాషతోపాటు ఆంగ్లభాషలో సైతం సారవంతమైన రచనా చమత్కారాన్ని తన అరచేతి గీతలుగా మార్చుకున్న సాహిత్య తపస్వి ఆయన. తన మనసు స్పందించే సవ్వడుల తరంగాలకు సరిగమలు నేర్పి, ఆ రాగాలనే నేర్పుగా అక్షరాల ఆకృతులలోకి తర్జుమాచేసి, తన మాతృభాషలో మహోత్తరమైన పసిడి వెలుగుల సాహిత్యపు వెన్నెలను, వెన్నలాగా పాఠకులకు అందించి, ఇంద్రధనుస్సులోని రంగులకు కథ, కవిత, నవల, వ్యాసం, చిత్రలేఖనం, పీఠికలు, నాటకంలాంటి నామకరణాలు చేసిన ఆధునిక అభ్యుదయ రచయిత ‘బుచ్చిబాబు’.
__________
బి.ఎ. చదువుతున్న విద్యార్థి దశలోనే తన రచనావ్యాసంగానికి ‘జువెనిలియా’, బ్రోకెన్ వయోలిన్’ అనే ఆంగ్ల కవితలతోనూ, ‘పశ్చాత్తాపం’ అనే తెలుగు కథానికతోనూ తిరుగులేని రహదారిని నిర్మించుకున్న సహృదయ సంపన్నుడు ‘బుచ్చిబాబు’. ఆయన రచనాలోచన స్రవంతిపై ‘సోమర్ సెట్ మామ్’, ‘ఓ హెన్రీ’ తదితర ఆంగ్ల రచయితల ప్రభావం తొంగి చూడటం వెనక, ఆంగ్ల సాహిత్య అధ్యయనానికి అంకితమైన ఆయన ఆసక్తి, విశ్వవిద్యాలయ స్థాయి పట్టాను పుచ్చుకున్న దృశ్యం మనతో కరచాలనం చేస్తుంది.
__________
ఆయన సృష్టించిన సాహిత్య సంపద ఖాతాను తెరిస్తే అందులో వజ్రాల్లా మెరిసే 82 కథలు, విశాలమైన సాగరంలోని అలల శబ్దాలను నిశ్శబ్దంగా వినిపించే ఒక నవల, గాలి వీస్తున్నప్పుడు ఆకులు చేసే సవ్వడికి స్వాగతం పలికే వచనకావ్యం, విజ్ఞానపు ఢంకాలు మ్రోగించే 40 వ్యాసాలు, రంగస్థలం మీద నటీనటుల నటనావైభవానికి అవకాశాలు కల్పిస్తూ తామే రంగోద్దీపనంగా వెలిగే 40 నాటికలు, కొన్ని పీఠికలు, పరిచయాలు… ఇలా లెక్కించటానికి అంకెలు చాలని అపురూపమైన రచనలెన్నో జలపాతంలా ఆయన కలంనుంచి దూకిన క్షణాలు, మనకు క్షయం కాని ఒక చరిత్రను అందించాయి.
ఒక్కసారి భక్తిపూర్వకంగా ఆ పేజీలను తిరగవేస్తే… అందులో ‘చివరకు మిగిలేది ‘ (నవల), ‘అజ్ఞానం’ (వచన కావ్యం), ‘నా అంతరంగ కథనం’, ‘షేక్ స్పియర్ సాహిత్య పరామర్శ’, ‘మేడమెట్లు’ (కథాసంపుటి) గొంతులు విప్పి సామూహిక గానం చేస్తాయి. అక్కడ ఆ గీతాలకు స్వరకల్పన చేస్తున్న వ్యక్తితో కరచాలనం చేసినప్పుడు ‘బుచ్చిబాబు’ అనే స్వరం, మన స్వరపేటికలో అన్ని రాగాలకు వేదికను సిద్ధం చేసుకుంటుంది. ఆ ప్రక్కనే ఆకాశవాణిలో 1945 నుండి 1967 వరకు ఆయన అందించిన సేవల నీడలు, గాలితరంగాల్లా దూసుకువచ్చి, మనల్ని తిరిగి రేడియోల ముందు కూర్చోబెడతాయి.
బుచ్చిబాబు అసలు పేరు ‘శివరాజు వెంకట సుబ్బారావు’. నామకరణం రోజున తల్లిదండ్రులు శివరాజు సూర్యప్రకాశరావు, వెంకాయమ్మ గారలు అందించిన జాతక కస్తూరితిలకం అది. తన చేతిలోని కలానికి ఒక బ్రహ్మముహూర్తాన ఆయన పెట్టుకున్న పేరు ‘బుచ్చిబాబు’. అంతే ఆ బుచ్చిబాబు కలం ఆనాటినుంచి ఏనాడూ అలసట అనే పదాన్ని ఎరుగదు. విశ్రాంతికి ఏనాడో సెలవుచీటి రాసి, అక్షర సేద్యానికి మాత్రం చివరి శ్వాసదాకా శ్రమించే పత్రంమీద చెరగని సంతకం చేసింది. అంతటితో ఆగలేదు. 14 జూన్, 1916లో జన్మించిన ఈ చిరునవ్వు మరో వైవిధ్యానికి తిలకం దిద్దుతూ ‘సంతోష్ కుమార్’ పేరుతో ఆంగ్లరచనలు చేయటం ఒక విశేషంగా, సశేషంలేని అంశంగా తన స్థావరాన్ని నిర్మించుకుంది. తన అంతరంగ కథనాన్ని ముగిస్తూ “తన వ్యక్తిత్వాన్ని దిగమింగి అహంని జయించటంలోనే కళాకారుడి పురోగమనం ఉందన్న సూత్రాన్ని నేను స్వీకరిస్తాను” అంటూ తన కలం కదిలించిన ఆ మాటను, అక్షరాలా తన శ్వాసలో జీవించేలా చేసుకున్న దార్శనికుడు ‘బుచ్చిబాబు’.
కథకుడిగా ‘బుచ్చిబాబు’ నిర్మించుకున్న చరిత్ర, రోజూ ఉదయించే సూర్యుడిలా క్రొత్త వెలుగులతో మన అభిరుచి మైదానాల మీద ప్రసరించటానికి కారణం.. అందరి కథకుల్లాగా ఆయన మనిషి బాహ్య రూపాన్నే కాకుండా, ఆయా కథలలో, ఆయా సన్నివేశాలలో మనిషి అంతరంగ ప్రదేశాలలోకి స్వేచ్ఛగా ప్రవేశించి, సారవంతమైన భావాల సారాన్ని తెల్లకాగితం మీద కుమ్మరించి, కథలకు ఒక రూపాన్ని అందించటంలో దిట్టగా నిలిచే ఆయన ముద్రలు గుడిలోని గంటల్లా మ్రోగుతూ వుండటమే. తెలుగు కథానికను, మళ్లీమళ్లీ పాఠకుల చేత చదివించగల నేర్పరితనానికి ఆయన కలం ఒక గర్భాలయంగా మారటం తెలుగుజాతి అదృష్టరేఖల్లో మెరిసే రేఖలా మిగిలిపోయింది.
ఆయన కథల్లో కవితావేశం మన స్నేహాన్ని అడుగడుగునా కోరుకుంటూ వుంటుంది. ప్రవాహంలా కదిలే ఆయన కథలనిండా ఒక కళాత్మక వైభవం దివిటీల పడవలతో పలకరిస్తూ, పాఠకుల పులకరింతకు ‘హైలెస్సా’ పాటలను అందించటం, ‘బుచ్చిబాబు’ కథల్లో మాత్రమే సాధ్యమైన ఒక సాధారణ విషయం. పుట్టుకతోనే మనిషి అంతరంగంలో ఏ మూలనో దాగివున్న ‘కళాతృష్ణ’ మరియు అలౌకిక విలువలు ఏదో ఒక సందర్భంలో పంజరంనుండి గాల్లోకి ఎగిరిన పక్షుల్లా బయటపడే సన్నివేశాలకు ‘బుచ్చిబాబు’ కథలు స్థావరాలుగా కనిపిస్తూ వుంటాయి.
ఆయన కలంనుండి వెలువడిన ‘మేడమెట్లు’, ‘నన్ను గూర్చి కథ వ్రాయవూ’, కలలో జారిన కన్నేరు, ‘నిరంతరత్రయం’, ‘తీర్పు చేసిన వాడికే శిక్ష’, ‘జ్ఞాన నేత్రం’, ‘తడిమంటకి పొడినీళ్లు’, మొదలైన కథా సంపుటాలు, మరో వందేళ్లదాకా కథా ప్రేమికుల్ని ఉర్రూతలూగించగల అరుదైన కళాఖండాలుగా పేర్కొనడానికి ఏ అభ్యంతరాలు మన ఎదుట నిలబడవు.
__________
సజీవమైన సత్తువ కలిగిన అసంఖ్యాకమైన కథలకు ప్రాణప్రతిష్ట చేసిన ‘బుచ్చిబాబు’ కలంనుండి వెలువడిన ఏకైక నవల ‘చివరికి మిగిలేది’. ఆయన సాహిత్య ఆకాశంలో సూర్యుడిలా ఉదయించిన నవల ఇది. పాఠకుడి చేతి స్పర్శతో తూర్పుదిక్కును నిత్యం ఆవిష్కరించుకునే మహత్తరమైన నవల ఇది. ఇది స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో వెలిచిన ఒక సాహితీ మహావృక్షం. ఈ నవల మొదటి పేజీని తెరవగానే…. ‘చివరికి మిగిలేదేమిటి? దీనికి సమాధానం తెలిస్తే జీవిత రహస్యం తెలుసుకున్నట్లే. అసలు జీవితానికి అర్థం ఏమై ఉంటుంది.?’ లాంటి మాటలతో ఈ నవల మొదలవుతుంది. ఏ ప్రశ్నతో మొదలయ్యిందో ‘అదే ప్రశ్నతో ఈ నవల ముగింపు ద్వారాలు మూసుకోవటం జరుగుతుంది. ఇది మనిషి శరీర, మానసిక, హృదయ, ఆత్మ సంస్కారాలకు సంబంధించిన నవల.
__________
ఒక్క మాటతో హారతి ఇవ్వాలంటే ‘చివరకు మిగిలేది’ మనోవైజ్ఞానిక నవల. మనషుల జీవితాలను వరుసల్లో నిలబెట్టి, మానవ స్వభావాలకు సంబంధించిన వేలాది ప్రశ్నలను సంధించిన సాహిత్య మేఘం ఈ నవల. అప్పటి కాలానికి సంబంధించిన మనుషుల మనస్తత్వాల కనురెప్పల మధ్య మన ఛాయాచిత్రాలు కనిపించటం నవలాకారుడి రచనా వైదుష్యానికి దండోరాలు మ్రోగించినట్లుగా వుంటుంది. ‘చివరకు మిగిలేది’ నవల 1946 మరియు 1947 మధ్య తెలుగు పత్రిక ‘నవోదయ’లో ధారావాహికంగా ప్రచురించబడింది. 1957 లో ఆదర్శ గ్రంథమండలి వారు ఈ నవలను ప్రచురిస్తే ‘బెస్ట్ సెల్లర్’ గా తన స్థానాన్ని సగౌరవంగా నిలబెట్టుకుంది.
1941 లో నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. పట్టాను పొంది, కొంతకాలం అనంతపురం మరియు విశాఖపట్నం కళాశాలల్లో ఆంగ్ల ఉపన్యాసకుడుగా పని చేసిన ఈ మహా రచయిత తెలుగులో ‘నన్ను మార్చిన పుస్తకం’, ‘నేను మరియు శంకర్ నారాయణ్ నిఘంటువు’ వంటి వ్యాసాలు రాశారు. రంగస్థలం గుర్తించిన గొప్ప నాటక రచయిత ఈయన. ఆయన నాటకాలలో సావిత్రి, పుండరీకాక్షయ్య మొదలైనవారు నటించి, గొప్ప గుర్తింపును నమోదు చేసుకున్న సందర్భాలు చరిత్రపుటల్లో శిలాఫలకాలుగా కనిపిస్తున్నాయి. ఆంధ్ర కళాపరిషత్, కాకినాడ వారు ఏర్పాటు చేసిన నాటక పరిషత్ పోటీలలో హేమాహేమీల్లాంటి నాటకాలు పాల్గొన్నాయి. అందులో ‘బుచ్చిబాబు’ రచన ‘ఆత్మవంచన’ నాటకానికి ‘పృథ్వీరాజ్ కపూర్ నుండి ఉత్తమ నాటక పురస్కారాన్ని అందుకున్న ఘట్టం ఎప్పటికీ చిరస్మరణీయం. బుచ్చిబాబు గొప్ప చిత్రకారుడు. అతడి చిత్రాలు సైతం కథల్లాగా మనల్ని కదిలిస్తాయి, కదిలి కబుర్లు చెప్పుతాయి. ప్రకృతి దృశ్యాలలోని పచ్చదనం ఆకాశంలోని మేఘాలతో స్నేహం చేయటం నేరుగా ఆయన చిత్రాలలో మనం దర్శించుకోవచ్చు. ఆయన రంగుల మేళవింపుల్లో మంగళవాయిద్యాల మ్రోత లీలగా వినిపించటం, కళాత్మక హృదయ సంపన్నుల అనుభవాలకు అదొక విందుభోజనం.
షేక్స్ పియర్ సాహిత్యంపై తాను రాసిన సాహితీ పరామర్శకు తన మరణానంతరం ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డును పొందిన ‘బుచ్చిబాబు’ రచనల్లోనే కాదు నిత్య జీవితంలోనూ కళాత్మకమైన, గౌరవప్రదమైన, రహదారులవెంట నడిచిన సంపూర్ణ మానవుడు ఆయన. తన దేహంలో ప్రవహించే రక్తకణాలకు స్నేహమనే రంగును శాశ్వతపరచుకున్న ఒక సాహిత్య ఉత్తుంగ తరంగం ‘బుచ్చిబాబు’. 20 సెప్టెంబరు, 1967, అది కాలం క్యాలెండర్లో తెలుగు జాతిని నిలువునా కన్నీరు కార్పించిన దినం. ఆ రోజే ‘బుచ్చిబాబు’ అనే సాహిత్యశిఖరం కనుమరుగై పోయిన రోజు. ఒక రచయితగా, ఒక కళాకారుడిగా ఆయనకు మరణం లేదు. ఆయన వదిలిన శ్వాస, సాహిత్య రూపంలో నిక్షిప్తమై, తెలుగుజాతి పాఠకులను అనునిత్యం పలకరిస్తూ, తరింపజేస్తూనే వుంటుంది.
(జూన్ 14 బుచ్చిబాబు 108వ జయంతి )
-డాక్టర్ కె.జి. వేణు
98480 70084