పదుగురికి మేలు చేసే సాహిత్యం కావాలి- ఈతకోట సుబ్బారావు

సాహిత్యం

కవి,కథకుడు,చరిత్రకారుడు,సంపాదకుడు ఈతకోట సుబ్బారావు. విభిన్నాంశాలపై సంఘటనాత్మకం, సందర్భానుసారంగా తన సంస్పందనల్ని సంపాదకీయాలుగా విశాలాక్షి మాసపత్రికలో రాస్తున్నారు. వాటిలో కొన్నిటిని ‘విశాల నయనం’ పేరుతో కవిత్వ సంపుటిగా వెలువరించారు. ఈ సంపుటిలోని కవితలు పదునైన అభివ్యక్తితో సాంద్రత,గాఢతతో వెలువరించడం మెచ్చుకోదగినది. సాహిత్య పత్రికలలో ఏ పత్రిక కూడా తమ సంపాదకీయాలను వచన కవిత్వంలో రాయలేదు. ఇది ఒక చరిత్ర. ఒక పత్రిక యొక్క ప్రయాణంలో ఇది చెప్పుకోదగిన మలుపు. ఈతకోట.. కథ రాసినా,కవిత రాసినా,చరిత్రకు సంబంధించిన వ్యాసం రాసినా,విలేకరిగా ఒక ప్రత్యేక వార్త రాసినా అభివ్యక్తి సారళ్యంతో, క్లుప్తత,సాంద్రత ఉట్టిపడుతుంటాయి.

తన స్వీయానుభవాలను వస్తు వైవిధ్యతతో కూడిన కథలుగా మలిచి, నిజాయితీగా తన అంతరంగాన్ని అభివ్యక్తం చేసే తీరు ఎంతో ఆర్ద్రతతో కూడి, అభివ్యక్తి సౌందర్యంతో, ఆలోచనాత్మకంగా ఉంటుంది. అంతే కాదు, దాదాపు అన్ని కథలలోను మానవ జీవన తాత్త్విక సారాన్ని అంతర్లీనంగా మనం గమనించవచ్చు.

చరిత్ర,కథ,కవితలతో వీరి సాహితీ ప్రయాణం విశిష్టమైనది. స్నేహమంటే ఎనలేని ప్రేమ. స్నేహితుల కోసం, అవసరమైనప్పుడు ఎంత సమయమైనా వెచ్చించే ప్రత్యేక జీవి, ఈతకోట. స్థానిక నెల్లూరు మాత్రమే కాదు,నెల్లూరు నేలపై నిల్చుని,దాని పరిసర ప్రాంతాల చరిత్రను అన్ని కోణాల్లోంచి తవ్వి తీసి గ్రంథ రూపమిచ్చిన హృదయ సంస్కారి. చారిత్రాత్మక అంశాలు, పరిశోధన వీరి సృజనలో అంతర్భాగాలు. యాభై వసంతాల సాహితీ సేవలో తరించిన సందర్భంగా వీరితో ప్రత్యేక ముఖాముఖి సృజనక్రాంతి పాఠకులకు ప్రత్యేకం.

 

1.మీరు సాహిత్యంలోకి ఎప్పుడు ప్రవేశించారు.

సాహిత్యం యొక్క నిర్వచనం, ప్రయోజనం తెలియని రోజుల్లో రచనల వైపు అడుగులు వేశాను. మా పెద్దన్న ఇ.టి. రామారావు గారు రచయిత. అందుకని 8వ తరగతి చదువుతున్నప్పటి (1974)నుండే పజిల్స్ పూర్తి చేయడం, ‘బాలమిత్ర, బుజ్జాయి, విజయ చిత్ర’ లాంటి పత్రికలలో కథలు చదవడం, వాటికి ఉత్తరాలు, వ్యాసాలు రాయడంతో నా సాహిత్య ప్రస్థానం మొదలయ్యింది. భాషావేత్త, మా తెలుగు అయ్యోరు బండి నాగరాజు గారు కూడా నా సాహిత్య ఎదుగుదలకు ఒక కారణం. సూళ్లూరుపేటలో ఇంటర్మీడియట్‌ లో తెలుగు లెక్చరర్ నలుబోలు రాంగోపాల రెడ్డి గారు స్ఫూర్తిదాయకం. నా సాహిత్యానికి ప్రధాన ప్రేరకులు వీరే. సృజనాత్మక పోటీలలో సహజంగా ముందుండే వాడిని. ఆ దశలో మా పాఠశాల వార్షికోత్సవంలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిచే మొదటి ఉత్తమ కవితా బహుమతి అందుకున్నాను. రెండో ఏడాది ‘సినీ నటుడు’ అనే ఏకపాత్రాభినయం సొంతంగా రాసి సినీహీరో రంగనాథ్ గారిచే మొదటి బహుమతి అందుకున్నాను. అలా మొదలైన నా సాహితీ ప్రస్థానం ఐదు దశాబ్దాలుగా సాగుతూనే ఉంది.

2. మీరు కథ ముందు రాశారా కవిత ముందు రాశారా?

అచ్చు విషయం పక్కన పెడితే కవిత మొదటిగా రాశాను.‘పుస్తక ప్రపంచం,జాగృతి, జనసుధ,పల్లకి, స్రవంతి’ లాంటి అనేక పత్రికలలో వరుస కవిత్వం వస్తుండేది. స్వాతి వార పత్రికలో ‘కవితా.. కవితా’ అనే శీర్షికలో ఎక్కువగా నా కవిత్వం ప్రచురణ జరిగింది. “అడుగుల భారం” అనే నా కథ మొదటిగా ప్రచురితమైనది. ఇది 5.5.1978వ తేదీన సినీ హెరాల్డ్ లో వచ్చింది. మద్రాసులో నేను చూసిన సినిమా షూటింగ్ నేపథ్యం నుంచి వచ్చిన కథ ఇది. నా మొదటి కథ ప్రచురితమై తృప్తినివ్వటం,మిత్రులు అభినందించడంతో ఇక వెనక్కి తిరిగి చూడలేదు.

3. ఇప్పటివరకు ఎన్ని కథలు కవితలు రాశారు?

ఇంతకు ముందే చెప్పినట్టు,8వ తరగతి నుండే కవిత్వం రాసినా,కొద్ది అవగాహనతో రాసిన నా కవితలు, కథలు1977 నుండి ప్రచురణ జరుగుతూ వచ్చాయి. ఇక్కడ ఒక నిజం చెప్పాలంటే, విస్తృతంగా స్థానిక పత్రికలు మొదలుకొని ప్రతి పత్రికలో నా రచనలు వస్తుండేవి.అప్పటిలో ఒక నిబద్దత లేదు.పేరు కోసం,మిత్రుల మధ్య పోటీతత్వం కోసం రాసే వాడిని. ఎంతగా రాసానంటే హామీపత్రం కూడా ప్రింట్ చేయించాను. పల్లకిలోనో, స్రవంతిలోనో గుర్తు లేదు గానీ..ఒక పత్రికలో నా హామీపత్రం అచ్చువేసి నా గూర్చి,కోలపల్లి ఈశ్వరరావు గూర్చి,మా హామీపత్రం గూర్చి ప్రత్యేకంగా రాశారు. సంఖ్యాపరంగా చెప్పాలంటే రెండో ఇన్నింగ్స్ నుంచే చెప్పాలి. ఇప్పటిదాకా 400 పైగా కవితలు,100 పైగా కథలు రాశాను.

4. రెండో ఇన్నింగ్స్ అంటే?

1986లో వివాహం అయితే 1989లో రెండో పాప పుట్టింది. ఆ పాప కోసం మద్రాసు, తిరుపతి, హైదరాబాదు హాస్పిటల్స్ చుట్టూ 10 ఏళ్ల తరబడి తిరిగాము. NIMSలో కొన్ని నెలలపాటు కాపురం పెట్టాము.అప్పుడే పాత కవిత్వ సంపుటాలు కొని, వాటిని చదువుతూ, వాటితోపాటు కథలు,వ్యాస పుస్తకాలు చదవటమే నా రెండో ఇన్నింగ్స్. 2000 సంవత్సరంలో మొదలైన నా సాహితీ ప్రయాణమే నా కథ గురించైనా,కవిత గురించైనా చెప్పుకోగలను.

5. మీ సాహితీ ప్రయాణంలో వివిధ మలుపుల గురించి…

మలుపులు లేకుంటే ఉన్నతి ఎక్కడుంటుంది. సూళ్లూరుపేటలో పదవ తరగతి చదివేటప్పుడు మద్రాసులో చూసిన ‘పల్లెటూరి చిన్నోడు’ సినిమా షూటింగు మదిలో ఉంది. ఆ స్టూడియోలో జరిగిన సంఘటనను 4 ఏళ్లు తర్వాత కథగా మలిస్తే,అది అచ్చయ్యింది.అంటే మనసులో ఆ సంఘటన అంతగా నలుగుతూనే ఉండింది. అలా కథా రచయితగా మలుపు. కోలపల్లి ఈశ్వర్,నేను నాలాంటి మిత్రులు పదిమంది కలిసి ‘నవత’ అనే మాసపత్రికను నాలుగేళ్లు నడిపాము. అప్పుడు అందరి వయసు 20 నుంచి 24 ఏళ్ల మధ్యనే. చరిత్ర మీద అవగాహనతో, ‘మన జిల్లా చరిత్ర ఎవరు చెబుతారు’ అనేది నా ఆలోచనగా ఉండేది. నేనేమీ చరిత్ర అధ్యాపకుడిని కాదు.కానీ,చరిత్ర అంశాలు తెలుసుకోవాలని అంతకుమించిన ఆసక్తి ఉంది. అందుకే స్థానిక చరిత్రను గ్రంథస్థం చేయాలనే ఉద్దేశ్యంతో, తీరని దాహంతో ‘పెన్నా తీరం,నెల్లూరు నాటకం,అలనాటి నెల్లూరు,దీపాల పిచ్చయ్య శాస్త్రి నెల్లూరు గాలివాన,ఆనాటి నెల్లూరోళ్ళు, నెల్లూరు సంగతులు,పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం’ పేర్లతో ఏడు గ్రంథాలు వెలువరించాను.

ఆంధ్రజ్యోతి నెల్లూరు సాంస్కృతిక ప్రతినిధిగా 30 ఏళ్లు పైగా పని చేస్తే, దాదాపు 20 ఏళ్లు ప్రతివారం చరిత్ర, సాహిత్యంపై టాబ్లాయిడ్ లో వ్యాసాలు రాశాను. ఇంటర్వ్యూలు చేశాను. విశాలాక్షి మాసపత్రికకు సంపాదకీయ బాధ్యతలను సాహసంగానే అంగీకరించానని చెప్పవచ్చు. ఇది నా సాహిత్య జీవితంలో ఒక మలుపు. నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని భావించాను. విశాలాక్షి మాసపత్రికకు సంపాదకీయ బాధ్యతలలో భాగంగా ప్రతి నెలా సంపాదకీయాన్ని వచన కవిత్వ రూపంలో గత పద్నాలుగేళ్లుగా రాస్తున్నాను. వీటిలో ముఖ్యమైనవి “విశాల నయనం” పేరుతో సంపాదకీయ కవిత్వంను సంపుటిగా తీసుకు వచ్చాను. దీనికి ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ గారు ముందుమాట రాయడం కూడా నా ప్రయత్నాన్ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు.

నా మొదటి కవితా సంపుటి ‘హృదయలిపి’ తరువాత ‘చీలిన మనిషి’, ‘కాకిముద్ద’ వెలువరించాను. అలాగే ‘అక్షరానికో నమస్కారం,నీటి చుక్క,పక్షి తీర్ధం,మహాత్మ’ టైటిల్స్ తో దీర్ఘ కవిత్వం వెలువరించాను. నా మొదటి కథల సంపుటి ‘కాశీ బుగ్గ’. ఇటీవలే ‘పోడుగాలి’ పేరుతో మరో కథా సంపుటి వెలువరించాను.

మన రచనలు మనమే అచ్చు వేసుకోవడం కాదు, కవి గురువు శివారెడ్డి గారి అమృతోత్సవం సందర్భంగా కేవలం శివారెడ్డి గారిపై వివిధ కవులు రాసిన కవితలను సేకరించి ప్రత్యేక సంకలనంగా “అతడు మేము కవిత్వంలా…” తీసుకురావడం.. దానికి కె.ఎన్. వై పతంజలి గారు, ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీ కె.శ్రీనివాస్ గారు సంపాదకీయాలు రాయడంతోపాటు, శివారెడ్డిగారి 75వ జన్మదిన (ఆగస్టు 6,2018) వేడుకలను నెల్లూరు టౌన్ హాల్లో దేవిప్రియ గారి అధ్యక్షతన మేము నిర్వహించ గలిగాము. 1981 ప్రాంతంలో నాగభైరవ కోటేశ్వరరావు గారు నిశ్చితార్ సాహితీ యువత అని నా గురించి, కోలపల్లి ఈశ్వరరావు గురించి ఆంధ్రపత్రికలో అప్పట్లోనే ఒక వ్యాసం రాశారు. ఇదొక పెద్ద మలుపు మా ఇద్దరికీ.

6. మీ కథలలోని ఏక సూత్రత గురించి

నా జీవన నేపథ్యమే నా కథలు. మానవతా విలువలకు పట్టం కట్టి, నా స్వీయానుభవాలను గానీ,చూసిందే చెప్పాలనుకోవడం గానీ, కథాఅంశాలుగా సూటిగా చెప్పదలుచుకున్నదే చెప్పేస్తుంటాను. సమాజ ఉన్నతీకరణ ప్రయత్నంలో, ఉన్నతంగా ఆలోచింప చేయాలనే ప్రయత్నం చేయటమే నా కథలలో ఏక సూత్రత అని నేను భావిస్తాను.

7. మీ కథలలో కన్ఫెషనల్ రైటింగ్ కథలు ఎక్కువగా ఎందుకు ఉంటాయి?

అవును కదా. కథ అంటేనే జీవితం. ఎవరి జీవితాలను తెరచి చూసినా కథలు ఉంటాయి. ఇటీవల ఆవిష్కరణ జరిగిన నా ‘పోడుగాలి’ కథల సంపుటి సభలో నేను చెప్పాను..‘నేను చూసిన నా జీవిత కథలే ఈ పోడుగాలి’ అని. వస్తువు ఏదైనా, వాడే భాష విలక్షణమైన వచనం,చదివించే శైలి ఉంటే పాఠకులు ఏ కథ అయినా,ఎవరి కథ అయినా భాగస్వాములు అయి తీరుతారు. అందుకే నేను నిలబడి ఉన్న నేలే నా కథా వస్తువులు అవుతుంటాయి.నా జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని, అనుభవాల్ని, ఎలాంటి దాపరికం లేకుండా నా పాఠకులతో పంచుకోవాలనేదే నా కోరిక. నా కథలు కొంతమందిని ప్రభావితం చేయగలిగితే అదే నాకు సంతోషం.

8. మీ కథ కొరమీనులకయ్య ఇతివృత్తం వివరిస్తారా?

ఈ రోజుల్లో మనిషి అవయవాలకు ఉన్నంత గిరాకీ మనిషికి లేదు. ఇక మనిషిలోని గుణాత్మకతను ఎవరు శోధిస్తారు. నా ‘కొరమీనులకయ్యలోని చేపలు’ అదే చెబుతున్నాయి.

9. మీ మొదటి కథా సంపుటి ‘కాశీబుగ్గ’ కు రెండో సంపుటి ‘పోడుగాలి’ కి మధ్య 11 సం.ల వ్యవధికి కారణం?

ఆర్థిక వనరులే ప్రధాన కారణం. ‘పోడుగాలి’ కథల సంపుటిలో 21 కథలు ఉన్నాయి. ఎంతలేదనుకున్నా కనీసం నలభై వేల రూపాయలు కావాలి. అమెరికా నుంచి ప్రముఖ సాహితీవేత్త మామిడిపూడి రామకృష్ణయ్య గారి కుమారులతో ఏదో విషయం గురించి మాట్లాడుతూ,నా కథల సంపుటి గురించి చెప్పినప్పుడు వారు స్వచ్ఛందంగా ఆర్థిక సహకారం అందించడానికి ముందుకు రావడంతో ఇప్పటికైనా నా కథలను సంపుటిగా తీసుకు రాగలిగాను. నిజంగా వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. వివిధ పత్రికలలో అచ్చు అయిన కథలు ఇంకా రెండు సంపుటాలకు సరిపడా ఉన్నాయి. వాటి విషయం కూడా ఆలోచించాలి.

10. మీరు కవిత రాసే పద్ధతి తెలుసుకోవాలని ఉంది.

వస్తువు మదిలో జనించాలి.అది వెంట పడుతుండాలి అప్పుడే రాస్తాను.అలా రాసిన కవిత శైలి,శిల్పంతో వస్తువును సరిగ్గా ఆవిష్కరించేందుకు కృషి చేస్తాను. అసంపూర్తిగా ఉంటే నచ్చక పక్కన పెట్టిన కవితలు 100కు పైగానే ఉంటాయి.

11. మీ రచనకు శీర్షిక ముందే నిర్ణయిస్తారా రాసిన తర్వాతనా! శీర్షిక ప్రాముఖ్యత వివరిస్తారా?

కవిత, కథ ఏదైనా వాటి శీర్షికకు ప్రాధాన్యత ఇస్తాను. నా Content శీర్షికలో దొరకకూడదను కుంటాను. కవిత విషయంలో శీర్షికకు చాలా ప్రాధాన్యత ఇస్తాను. కవిత / కథ ఏదైనా దాని ముఖచిత్రమే శీర్షిక. రచన పూర్తయితేనే శీర్షిక ఆలోచిస్తా.

12. ప్రచురణ అయిన మీ గ్రంథాలలో 8 చరిత్రకు చెందినవి ఉన్నాయి. చరిత్రను ఎక్కువ ఇష్టపడటానికి కారణం?

కారణం గురువే. ఇంతకు ముందే మీకు చెప్పినట్టు..నాకు చరిత్ర గురించి తెలుసుకోవాలనే ఆశ,ఇష్టం.స్థానిక చరిత్రను భావితరాలకు అందించాలనే తపన. అందుకు మద్రాసు, తంజావూరు, మధురై, బెంగుళూరు, హైద్రాబాదు ఆర్కేవ్స్, కేంద్ర గ్రంథాలయాలు తిరిగాను, రికార్డులు చదవటం కాదు కానీ, ఎక్కడెక్కడ ఇమేమి దొరుకుతాయో తెలుసుకొని వాటిని సంపాదించటం కూడా ఒక కళ. అదే నన్ను ముందుకు నడిపించింది. ఇంకా చరిత్రకు చెందిన ‘మా ఊరు మహాకావ్యం, నూరేళ్ల నెల్లూరు, పొట్టి శ్రీరాములు’ మూడు పుస్తకాలు స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. ఆర్ధిక వనరులు చూసుకొని ముందుకు పోవాలి.

13. మీకు నచ్చిన సమకాలీన రచయితలు, కవులు గూర్చి వివరిస్తారా?

శివారెడ్డి గారు చెప్పినట్టు నేను యువకవుల కవిత్వం మిస్ కాకుండా చదువుతాను. కొత్త పోకడల ఎత్తుగడలు యువకవులు అద్భుతంగా పండిస్తున్నారు. దాదాపు 15 మందికి పైగా యువ కవుల కవిత్వం ఇప్పుడు తరచుగా కనిపిస్తుంది.

14. సాహిత్య ప్రయోజనం. దాని అవసరం?

సాహిత్యమే సమాజానికి దిక్సూచి.ఎన్నో ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. ప్రభుత్వాలను నిలబెట్టింది.మార్పులకు నాంది పలికింది. మనం కొన్ని కళ్లారా చూసాము. కొన్ని చరిత్ర ద్వారా చదివాము, వింటున్నాము. ప్రస్తుతం సాహిత్యానికి ఇంతకు ముందు ఉన్నంత ప్రభావం లేదేమో అనిపిస్తుంది. చదివే వారేరి? ప్రస్తుత పరిస్థితులలో ఒక రచన కనీసం ఆలోచింపచేస్తే చాలు అనిపిస్తుంది.

15. ప్రస్తుత సాహిత్య విమర్శకు దారి దీపాలు అనదగిన ఇద్దరు యువ సాహితీ విమర్శకులు గురించి చెప్పండి?

ఇప్పుడంతా ముఖస్తుతి పరామర్శ. నిజానికి సాహిత్య విమర్శ ఈ రోజుల్లో కనిపించటం లేదు. పాత రచనలు భారతి లాంటివి చదివితే, ఒక వ్యాసం, గ్రంథం మీద వరస విమర్శలు, జవాబులు ఉంటాయి. చర్చ జరుగుతూ ఉంటుంది. పాఠకులు కూడా చాలా ఎడ్యుకేట్ అవుతారు. ఇప్పుడు సాంద్రత గల విమర్శలు లేవు అనేది నా భావన.

16. మీ సాహిత్యానికి దక్కిన అరుదైన ప్రశంస ఎవరి వద్ద నుంచి వచ్చింది. ఆ అనుభవం?

ఘనంగానూ, గర్వంగానూ చెప్పకోదగ్గది- నా కవితా సంపుటి ‘చీలిన మనిషి’ కి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం అందుకోవడం. చాలామంది కవులు ఈ పురస్కారాన్ని అందుకోవడం ఒక ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. నేను ఈ పురస్కారానికి నోచుకోవడం నా అదృష్టం.ఈ కవితా సంపుటిలోని కవితలు చదివి పండితులు ఆవంత్స సోమసుందర్ గారు 60 పేజీల ఉత్తరం రాశారు. అది నాకు ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చింది.దానిని అచ్చులోకి తీసుకు రావాలి. ఇదొక గొప్ప ప్రయత్నం అవుతుందని శివారెడ్డి, గోపి, నిఖిలేశ్వర్ గార్లు ప్రోత్సహించటం

అలాగే నేను కొన్ని కవితా సంపుటాలకు, కథా సంపుటాలకు సంపాదకీయాలు రాశాను. వాటిని సంపుటిగా తీసుకు రావాలి.

17. మీ రచనల మీద మూడుతరాల సాహితీవేత్తల ప్రభావం ఎక్కువగా వున్నట్లుగా ఉంది.

1990-2000 వరకు నేను రాయలేదు. చదవటమే. శ్రీశ్రీ, అజంతా, కుందుర్తి, శివారెడ్డి, గోపి, నాగభైరవ గార్ల కవిత్వంలో ఒక్కొక్కరి వద్ద శైలి, శిల్పం, అభివ్యక్తి, సామాజిక స్పృహ విలక్షణత, ఇలా అనేక అంశాలు పొదివి పట్టుకోగలిగాను. మొదటి రోజుల్లో ఉంటే ఉండవచ్చు గానీ, ఇప్పుడు మాత్రం ఎవరి ప్రభావం పడకుండా ఉండాలనే నా రచనా వ్యాసంగం సాగుతుంది.

18. పత్రికా విలేకరిగా, విశాలాక్షి సంపాదకుడిగా ఒత్తిడులు ఎదుర్కోవటంతోపాటు రచనా వ్యాసంగం ఎలా కొనసాగించారు?

అనేక ఒత్తిడుల నేపథ్యం వలనే రచనా వ్యాసంగం సులభతరమైందనే నా భావన. మౌనంగా ఉంటే కుదిరేది కాదేమో. పత్రికా విలేకరిగా సినీ,రాజకీయ, సాహిత్య, కళా రంగాల ప్రముఖులు దాదాపు వంద మందిని పైగా ఇంటర్వ్యూ చేసాను. అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.పి. బాలు, ఆనం సంజీవరెడ్డి, తనికెళ్ల భరణి, గొల్లపూడి, శాంతాసిన్హా ఇలా ఎంతోమందిని, అవన్నీ కలిపి ఒక పుస్తకం తీసుకువస్తున్నాను.

19. విశాలాక్షి సంపాదకుడిగా మీ అనుభవాలు?

రెండు చప్పట్లు., నాలుగు చీవాట్లు. ఇవన్నీ చెప్పాలంటే ఒక గ్రంథమే విప్పాలి.

20.మీ సాహిత్యానికి దక్కిన పురస్కారాలు.

కథా పరంగా.. ‘కాశీబుగ్గ’ కథకు సిపి బ్రౌన్ కథా పురస్కారం,‘మనిషి వాసన’కు కొడవటిగంటి కుటుంబరావు కథా పురస్కారం, ‘వాసన’ ఫోటో కథలు ఆంధ్రజ్యోతి నవ్యలో బహుమతులు పొందాయి. ‘చినుకు’ మాసపత్రిక నిర్వహించిన కథల పోటీలో ఓ కథకు బహుమతి,మరికొన్ని కథలు వివిధ సంస్థలలో పత్రికల్లో బహుమతులు పొందాయి.

కవితా సంపుటి పరంగా.. ‘చీలిన మనిషి’ కవితా సంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం, ‘కాకిముద్ద’ కవితా సంపుటికి కొలకలూరి వారి పురస్కారం, ఉమ్మడిశెట్టి రాధేయ పురస్కారం,రావి రంగారావు కళాపీఠం వారి జనరంజక కవి ప్రతిభా పురస్కారం లభించాయి.కవితల పరంగా.. ఆటా, తానా, ఆంధ్రజ్యోతి, ఈనాడు కరోనా కవితల పోటీ, చినుకు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ నిర్వహించిన కవితల పోటీలలో బహుమతులు..ఇలా కొన్ని.

21. విశాలాక్షి తరపున విస్తృతంగా కవితల,కథల పోటీలు నిర్వహిస్తున్నారు కదా. ఆర్ధిక వనరులతోపాటు మీకు అలసట అనిపించటం లేదా? మీ అనుభవాలు.

పోటీలు పెట్టే ఆర్ధిక స్థోమత మా పత్రికకు లేదు. 14 ఏళ్లుగా మా పబ్లిషర్ కోసూరు రత్నం గారు నిర్విరామంగా, అంటే కరోనా లాంటి కష్టకాలంలో కూడా పత్రిక ఆపకుండా తీసుకురావటమే ఒక గొప్ప సాహసం. కేవలం భాషాపరంగా సాహిత్య పరంగా ఏదో చేయాలని వారి తపన. అందుకే ఈ పోటీల భారం కూడా వారి మీద నేను పెట్టలేదు.కానీ పత్రిక మీద ఉన్న నమ్మకం,గౌరవంతో కొంతమంది స్పాన్సర్స్ స్వచ్ఛందంగా రావడంతో, వారి ఆర్థిక సహకారంతోనే మేము కథ/కవిత/కార్టూన్ పోటీలు నిర్వహిస్తున్నాం. నెల్లూరులో స్థానికంగా సాహితీ మిత్రులు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్, ఏటూరి నాగేంద్ర రావు,కోలపల్లి ఈశ్వరరావు ,ఎస్పీ ఎం నాగ గాయత్రి, గోవిందరాజుల సుభద్రా దేవి, పాతూరి అన్నపూర్ణ,అవ్వారు శ్రీధర్ బాబు, డాక్టర్ టేకుమళ్ళ వెంకటప్పయ్య,ఇలాంటి అనేకమంది మిత్రులు ప్రాథమికంగా,పోటీలకు వచ్చిన కవితలను,కథలను పరిశీలించడంలో సహాయ పడటం వలన వేగవంతంగా చేయగలుగుతున్నాను. ప్రాథమిక పరిశీలన తరువాత,తుది తీర్పు కోసం మేము ఎంచుకున్న సాహితీవేత్తలకు పంపడం జరుగుతుంది. తుది నిర్ణయం కోసం ఎవరికి పంపామో నాకు తప్ప ఎవరికీ తెలియదు.ఇందులో నా ప్రమేయం ఏమీ ఉండదు. న్యాయ నిర్ణేతలు ఇచ్చిన నిర్ణయమే శిరోధార్యం.అలా ఒక నిబద్ధతతో పోటీలు నిర్వహించడంలో ఉన్న గొప్ప ఆనందంలో అలసటకు తావేది!. ఈ సందర్భంగా మేము మా పత్రిక ద్వారా నిర్వహించే పోటీలకు ఆర్ధిక సహాయం చేసి ప్రోత్సహిస్తున్న వారికి ధన్యవాదాలు.

కొ.వి.రా: ధన్యవాదాలు సుబ్బారావు గారు.మీ విలువైన సమయాన్ని కేటాయించి సంధించిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చినందుకు. మీరు సమాజానికి మేలు చేసే మరింత మంచి సాహిత్యాన్ని వెలువరించాలని అభిలషిస్తూ మా సృజనక్రాంతి తరపున ప్రత్యేక శుభాకాంక్షలు.

ఈతకోట: ధన్యవాదాలు విల్సన్ రావు గారు. నన్ను నేను మళ్ళీ తిరిగి చూసుకొని,నా సాహిత్య జీవితం గురించి మీ పాఠకులకు చేరువ చేస్తున్నందుకు మీకు,మీ సంపాదకులకు కృతజ్ఞతలు.

ఇంటర్వ్యూ: విల్సన్ రావు కొమ్మవరపు
89854 35515

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *