సర్రియలిస్ట్ నవలకి నోబెల్ సాహిత్య బహుమతి

సాహిత్యం హోమ్

“జీవిస్తున్నది శరీరం మాత్రమే!
ఆత్మ ఎప్పుడో మరణించింది.
లొంగిపోతున్నది శరీరం మాత్రమే !
ఆత్మ విభేదిస్తూనే వుంది”

(2024వ సంవత్సరపు నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత హాన్ కాంగ్ “ది వెజిటేరియన్” నుండి.)
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అకాడమీ ఈ సంవత్సరం దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ కి సాహిత్యంలో నోబెల్ బహుమతి ప్రకటించింది. యాభయ్ మూడేళ్ళ హాన్ నోబెల్ బహుమతి పొందిన మొదటి కొరియన్. “చారిత్రక దుఃఖాన్ని, వేదనను,గాయాలను విశదపరచే క్రమంలో కనిపించే మానవ దుర్బలత్వాన్ని సాంద్రమైన కవిత్వ వచనం” లో వ్యక్తీకరించినందుకు నోబెల్ బహుమతి ప్రకటిస్తున్నట్టు అకాడమీ పేర్కొన్నది. “మీకు నోబెల్ బహుమతి వచ్చింది కదా! మీ తక్షణ ప్రతిస్పందన ఏమిటి?” అని ప్రశ్నిస్తే “నాకు చాలా ఆనందంగా, ఆశ్చర్యంగా వున్నది. మా అబ్బాయితో కలసి ఒక కప్పు కాఫీ తాగి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాను” అన్నది ఆమె. కుటుంబానికీ, మానవ సంబంధాలకు ఆమె ఎంత విలువ ఇస్తుందో ఆమె ప్రతిస్పందన తెలియచేస్తే.. “విచ్ఛిన్నమవుతున్న మానవ సంబంధాలు,గాయపడుతున్న స్త్రీల అస్తిత్వాలను” ఆమె బలంగా ‘ద వెజిటేరియన్’ నవలలో చిత్రీకరించింది.
______________

స్త్రీ ని మనం ప్రకృతి అంటాము. ఇలా అనటం వెనుక గొప్ప ఉదాత్త దృష్టి ఉంటే ఉండొచ్చేమో కానీ, పెట్టుబడిదారీ, పితృ స్వామిక వ్యవస్థలో వున్న మనం ఆచరణలో స్త్రీని, ప్రకృతినీ రెండింటినీ ఎన్ని రకాలుగా దోపిడీ చేయాలో అన్ని రకాలుగానూ దోపిడీ చేస్తాము. ఎన్ని రకాలుగా అగౌరవ పరచాలో అన్ని రకాలుగా అగౌరవపరుస్తాము. అలా చేస్తున్నాము అన్న స్పృహ కూడా మనకు ఉండదు. ఇదంతా సహజమే అనుకుంటాము. ఈ నేపథ్యంలో స్త్రీ మనస్తత్వాన్ని, పితృస్వామిక వ్యవస్థ తన మీద కలిగించే ఒత్తిడిని హాన్ తన రచనలలో ప్రతిభావంతంగా చిత్రించింది.
_______________
Crow’s Eye View and The Wings లాంటి కవిత్వ సంపుటాలు ప్రకటించిన ప్రముఖ కొరియన్ రచయిత Kim Haegyong చెప్పిన “I believe that humans should be plants” మాట హాన్ ను చదువుకునే రోజుల్లో బాగా ఆకర్షించింది. ఆ మాట ఇచ్చిన ప్రేరణతో ఆమె మొదట ఒక కథను 1997లో ‘The Fruit of my Woman’ శీర్షికన రాసింది. ఆ తరువాత కొన్నాళ్ళకు అదే కథను విస్తరించి 2007లో ‘ది వెజిటేరియన్’ గా రాసింది. ఇది మూడు భాగాల నవల. మొదటి భాగం ‘ది వెజిటేరియన్’ , రెండవది ‘మంగోలియన్ మార్క్’, ‘మూడవది ఫ్లెమింగ్ ట్రీస్’ ఈ మూడు భాగాలను ఒకే నవలగా ఆంగ్లంలోకి డెబోరా స్మిత్ 2015లో అనువదించారు. ఇంతకుముందే ఈ నవల ప్రతిష్టాత్మకమైన ‘మాన్ బుకర్ ప్రైజ్’ గెలుచుకుంది. ఇప్పుడీ నోబెల్ బహుమతి.

హాన్ కాంగ్ ‘ది వెజిటేరియన్’ నవల వేళ్ళు కొరియన్ సంస్కృతిలో వున్నాయి. మాంసాహారం ప్రధానమైన పితృస్వామిక వ్యవస్థ అది. ఆ వ్యవస్థలో యోన్గ్ -హై (yeong -hey ) అనే ఒక మహిళ శాఖాహారిగా మారాలని నిర్ణయించుకోవడం, ఆ నిర్ణయం ఎలాంటి దారుణమైన పరిస్థితులకు దారితీసిందో అత్యద్భుతంగా చిత్రీకరించింది హాన్. నిజానికి ఈ కథ ‘యోన్గ్ -హై’ ది అయినప్పటికీ ఆమె ఎక్కడా తన కథను తాను చెప్పదు. మొదటి భాగం ‘ది వెజిటేరియన్’ అంతా హై భర్త చాన్గ్ (cheong) వివరిస్తాడు. రెండవ భాగం మంగోలియన్ మార్క్ ను హై చెల్లెలి భర్త yeong -ho వివరిస్తాడు. ఒక భాగం ఫస్ట్ పర్సన్ నేరేషన్ అయితే మరొక భాగం థర్డ్ పెర్సన్ నేరేషన్. ఒక్కొక్క పొరా విప్పుకుంటూ పోతే కానీ నవల అర్ధం కాదు.

‘ది విజిటేరియన్’ నవలా నాయకి Yeong-Hye దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో నివసిస్తూ ఉంటుంది. మంచి ఒద్దికైన భార్య. సాంప్రదాయకంగా ఉండే మామూలు మహిళ. పెద్దగా బాధలు, బాధ్యతలు లేని జీవితం. ఆమె ఉన్నట్టుండి ఒకరోజు ‘నేను ఈ రోజునుండి మాసం తినను’ అని భోజనాల బల్ల దగ్గర ప్రకటిస్తుంది. ఆమె మాటకు అంతా విస్తుపోయి చూస్తారు. కొరియా సంస్కృతిలో మాంసాహారం ఒక భాగం. ఎందుకు అని అడిగితే రాత్రి నాకు ఒక కల వచ్చింది అని చెపుతుంది. అప్పుడా మాటను కుటుంబ సభ్యులు అందరూ చాలా తేలికగా తీసుకుంటారు. కానీ ఆమె సీరియస్ గానే అన్నది అన్న విషయం రెండు రోజులలో వాళ్లకు అనుభవంలోకి వస్తుంది. ఇంట్లో వాళ్లకి కూడా మాంసాహారం వండి పెట్టను కూడా పెట్టను అంటుంది. ఆ మాటతో ఇంట్లో చిన్నగా గొడవలు మొదలు అవుతాయి.

ఆ రాత్రి వేళ భర్త ఆమెను దగ్గరకు తీసుకుంటే ఆమె నిరాకరిస్తుంది. అతడు గట్టిగా ఒత్తిడి చేస్తే “నీ దగ్గర మాంసం వాసన వస్తుంది! వద్దు” అంటుంది. ఆ మాటతో భర్త చాంగ్ అసహన పడతాడు. తన భార్యకు ఏమయిందో అర్ధం కాదు. మరికొన్ని సంఘటనల తరువాత ఈ గొడవను Yeong-Hye పుట్టింటి వాళ్ళ మధ్య పెడతాడు. కొన్ని మాటలు, మరి కొన్ని సంప్రదింపులు జరుగుతాయి. అయినా Yeong-Hye పట్టు వీడదు. భోజనాల బల్ల దగ్గర తండ్రి బలవంతం చేసి ఆమె నోట్లోకి మాసం ముక్కలు రెండు బలవంతంగా నెట్టేస్తాడు. అప్పుడు ఎవరూ ఊహించనంత వేగంగా ఆమె కదిలి కూరగాయలు కోసుకునే చాకుతో తన చేతిమీద గాయం చేసుకుంటుంది. రక్తం బుసబుసమని పొంగుతుంది. అందరూ కలిసి ఆమెను హాస్పిటల్ కి తీసుకుని వెళతారు. హాస్పిటల్ లో చేర్పించినప్పుడు చాంగ్ ఆమె మానసిక స్థితి సరిగాలేదని తనను తాను అనునయించుకుంటాడు. Yeong-Hye హాస్పిటల్ లో నుండి బయటకు వస్తూ మూసుకుని ఉన్న తన గుప్పిట తెరుస్తుంది. ఆమె అరచేతిలో గాయపడిన నెత్తుటి పావురం. ఆ పావురాన్ని చూపిస్తూ “నేనేమైనా తప్పు చేసానా?” అని అడగడంతో మొదటి భాగం పూర్తి అవుతుంది.

రెండవభాగం మంగోలియన్ మార్క్. Yeong-Hye చెల్లెలి భర్త yeong -ho ఒక వీడియో గ్రాఫర్.Yeong-Hye ని హాస్పిటల్ లో చేర్చడంలో అతడిదే ప్రధాన పాత్ర.ఆమెను చేతులమీద తీసుకుని వెళుతున్నప్పుడు yeong- ho దుస్తులమీద ఆమె నెత్తుటి మరకలు అంటుతాయి. ఆ మరకలు అతడిలో Yeong-Hye అంటే అబ్సెషన్ కలిగేలా చేస్తాయి. అతడికి బోలెడన్ని సెక్సువల్ ఫాంటసీస్ ఉంటాయి. వాటికి దృశ్యరూపం ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. Yeong-Hye పృష్ఠ భాగం మీద ఒక నీలిరంగు పుట్టుమచ్చ వున్నదని భార్య చెప్పింది విని తాను ఊహించిన ఒక దృశ్యానికి మోడల్ గా ఉండమని Yeong-Hyeని అడుగుతాడు. Yeong-Hye నగ్న శరీరం మీద పువ్వులు, లతలు ఆ నీలి రంగు పుట్టుమచ్చ నుండి బయలు దేరినట్టు పెయింట్ చేయాలని అనుకుంటాడు అతడు. Yeong-Hye ఒకానొక ఇంటెన్స్ ఫీలింగ్ తో ఒప్పుకుంటుంది. ఆమె శరీరం మీద అన్నీ లతలు, పువ్వులు పెయింట్ చేస్తాడు. మరొక సహ ఆర్టిస్ట్ శరీరం మీద కూడా అలాగే పువ్వులు, లతలు పెయింట్ చేయించి వాళ్ళిద్దరినీ సెక్స్ మేకింగ్ చేయమని అడిగితే ఆ సహ ఆర్టిస్ట్ కాదని వెళ్ళిపోతాడు. తన శరీరం మీదనే పెయింట్ వేయించుకుని Yeong-hyeతో తన కోరిక తీర్చుకుంటాడు.

దాన్ని వీడియో తీస్తే ఆ వీడియో చూసిన Yeong-hye చెల్లెలు వాళ్ళిద్దరి మానసిక స్థితి సరిగాలేదని భావించి ఎమర్జెన్సీ సర్వీసెస్ కి కాల్ చేస్తుంది, ho పరుగెత్తికెళ్లి బాల్కనీ మీదనుండి దూకేస్తాడు. దీనితో రెండవభాగం ముగుస్తుంది.

మూడవ భాగం ఫ్లెమింగ్ ట్రీస్. ఈ భాగంలో Yeong-hye చెల్లెలు భర్త నుండి విడిపోతుంది. Yeong-hyeని మానసిక చికిత్సాలయంలో చేర్చి anorexia nervosa ( ఈటింగ్ డిజార్డర్ ) schizophreniaకి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. అయినా ఫలితం ఉండదు. Yeong-hye ప్రవర్తనలో మానవ లక్షణాలు క్రమేపీ క్షీణిస్తూ ఉంటాయి. ఒక రోజు Yeong-hye హాస్పిటల్ నుండి అడవికిలోకి పారిపోతుంది. వానకు తడిచి, ఎండకు ఎండే మొక్కలాగా అలా నిలబడిపోతుంది. చెల్లెలు మళ్ళీ Yeong-hyeని హాస్పిటల్ కి తీసుకుని వచ్చి బలవంతంగా ఆహారం ఇవ్వాలని చూస్తే ఆమె చేతిని బలంగా కొరికేస్తుంది. నువ్వెందుకు తినటం లేదు అంటే నేను త్వరలో ఒక చెట్టుగా మారిపోతాను అని చెప్తుంది. అక్క స్థితికి మొదట జాలిపడినా ఒక చిన్న ఆలోచన, అవగహన ఏదో చెల్లెలిలో కనపడుతుంది.
_______________

ఒక మనిషి గురించి మనకు నిజంగా ఏదీ తెలియదు. ఒకవేళ తెలుసు అని అనుకున్నా అది అర్ధసత్యం మాత్రమే. కొన్ని సంవత్సరాల పాటు కలిసి జీవించినా ఒక భర్త ఒక భార్యకు అపరిచితుడిగానే మిగలొచ్చు. ఒక్కొక్క సారి మనకు మనమే అపరిచితులంగా తోచవచ్చు . Yeong-Hye భర్త దృష్టిలో మాంసం తినను అనేంతవరకు ఒక unremarkable wife. తరువాత ?
_______________

ఎంత జాగ్రత్తగా జీవితాన్ని మలచుకున్నా చివరకు ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు? “time was a wave, almost cruel in its relentlessness as it whisked her life downstream, a life she had to constantly strain to keep from breaking apart. Even as a child, In-hye had possessed the innate strength of character necessary to make one’s own way in life. As a daughter, as an older sister, as a wife and as a mother, as the owner of a shop, even as an underground passenger on the briefest of journeys, she had always done her best. Through the sheer inertia of a live lived in this way, she would have been able to conquer everything, even time.” అని హాన్ చేసిన వ్యాఖ్య yeong -hye జీవితానికే కాదు మానవులందరి జీవితాలకు వర్తిస్తుందని నమ్ముతాను.

మరణానికి చేరువ అవుతున్న Yeong-hyeతో చెల్లెలు, మెల్లగా .. ” బహుశా ఇదంతా ఒక రకమైన కల కావచ్చు. నాక్కూడా కొన్ని కలలు ఉన్నాయి. ఆ కలల్లో నన్ను నేను సంలీనం చేసుకున్నాను. కలలు నన్ను తమలోకి తీసుకోవడానికి అనుమతించాను. కానీ కల ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు, ఏదో ఒక సమయంలో మనం మేల్కొనాలి. మనం మేల్కొని తీరాలి” అని చెపుతుంది.

ఇంతా చేసి ‘ద వెజిటేరియన్’ లో హాన్ ఏమి చెపుతుంది. Yeong-hye చెల్లెలు కిటికీలో నుండి కనిపించే చెట్ల వైపు కళ్ళను విప్పార్చుకుని చూస్తూ ఉండగా నవల ముగుస్తుంది. నిజానికి Yeong-hye వెజిటేరియన్ కావడం గురించి మాత్రమే కాదు ఈ కథ. సత్యం, మానవత్వం, అస్తిత్వాల గురించిన అన్వేషణ ఇది. చెట్లు కూలుతున్న దృశ్యాన్ని తెలుగు కవి అజంతా ఊహించినట్టుగానే చెట్లు జ్వలించడాన్ని హాన్ ఊహించింది. ఆ జ్వాల ఇప్పటికిప్పుడు అవసరమైనది. మనిషి లోపల పేరుకునిపోయిన చీకటి భావనలను దహించివేయడానికి.

2024వ సంవత్సరపు నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత హాన్ కాంగ్ కు శుభాకాంక్షలు.

 

 

-వంశీకృష్ణ
95734 27422

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *