తనలాగే చెల్లిని ఆదరించాలని రాహుల్ పిలుపు
కార్యక్రమంలో పాల్గొన్న సోనియా, ఖర్గే, రేవంత్, భట్టి
తిరువనంతపురం : వయనాడ్ ప్రజలు తన కుటుంబ సభ్యులతో సమానమని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. వయనాడ్ ఉప ఎన్నిక నేథ్యంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రియాంక గాంధీ బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించిన ప్రియాంక గాంధీ, అనంతరం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. తన కొత్త ప్రయాణాన్ని వయనాడ్‌లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తాను రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని, ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం వయనాడ్ వచ్చినట్లు తెలిపారు. రాజకీయానికంటే ఈ దేశం ముఖ్యమన్నారు. సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరిగారని, ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు, వారి సమస్యలను తెలుసు కునేందుకు దేశ వ్యాప్తంగా పర్యటించినట్లు చెప్పారు. వయనాడ్ ప్రజలకు అండగా ఉండేందకు తాను ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. ఇక్కడి ప్రజలతో కలిసి పోరాడేందుకు, వారి సమస్యల పరిష్కారానికి వయనాడ్‌కు వచ్చినట్లు తెలిపారు. వయనాడ్ ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఇక్కడకు వచ్చానన్నారు.
రాహుల్ మాట్లాడుతూ..తనకులాగే వయనాడ్ నుంచి తన సోదరి ప్రియాంకగాంధీని ఆశీర్వదించాలన్నారు. వయనాడ్ నుంచి అధికారికంగా ఒకరు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తే.. మరొకరు అనధికారికంగా వయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తామన్నారు. ఇక్కడి ప్రజల కోసం తాను ఎప్పటికీ పోరాడుతూనే ఉంటానన్నారు. తన తల్లి ఇక్కడ ఉన్నారని, తండ్రి చనిపోయిన తర్వాత తన సోదరి ప్రియాంక గాంధీ అమ్మను చూసుకుంటున్నార్నారు. ప్రియాంక 17 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పో యిందని, అయినప్పటికీ తమ తల్లికి తోడుగా నిలిచిందని రాహుల్ తెలిపారు. ప్రియాంకగాంధీ కుటుంబం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు. వయనాడ్ ప్రజలే ప్రియాంక కుటుంబమన్నారు. ఆ కుటుంబం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు. వయనాడ్ ప్రజలకు తన సోదరిని అప్పగిస్తున్నానని, ప్రియాంక గాంధీని ఇక్కడి ప్రజలే రక్షించుకోవాలన్నారు. అనధికార ఎంపీగా తాను కూడా తరచూ వయనాడ్‌కు వస్తుంటానని రాహుల్ గాంధీ తెలిపారు. వయనాడ్ సభలో సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
వయనాడ్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తుండగా.. లెప్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) నుంచి సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీ నుంచి నవ్య హరిదాస్ పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ తన రాజకీయ అనుభవం ఆధారంగా ప్రియాంక గాంధీకి సవాలు విసిరారు. సింగపూర్, నెదర్లాండ్స్‌లో పనిచేసిన నవ్య కోజికోడ్ కౌన్సిలర్‌గా ఉన్నారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేయడానికి ముందు వయనాడ్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొనగా.. ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ ప్రియాంక, రాహుల్ ముందుకుసాగారు. కాంగ్రెస్ పాలిత రాష్టాల్ర సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ర్యాలీలో రాహుల్, ప్రియాంక ఉత్సాహంగా కనిపించారు. మధ్యలో కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ ప్లయింగ్ కిస్ ఇచ్చారు. అలాగే రాహుల్, ప్రియాంక తన ర్యాలీ దృశ్యాలను స్వయంగా ఫోన్‌లో చిత్రీకరించారు. ర్యాలీకి ముందు పార్టీ నాయకుల సమక్షంలో ప్రియాంక గాంధీ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.
ర్యాలీ తర్వాత పార్టీ కార్యకర్తలు, అభిమానుల ను ఉద్దేశించి ప్రియాంక గాంధీ ప్రసంగించారు. వయనాడ్ ప్రజలకు సేవ చేసేందుకు తాను ఇక్కడి నుంచి పోటీచేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రచారం జరిగినా ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం మాత్రమే నిర్వహించారు. వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో ఆమె ఇక్కడి నుంచి పోటీచేస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయబరేలీ స్థానాల నుంచి పోటీచేయగా.. రెండు చోట్ల విజయం సాధించారు. దీంతో వయనాడ్ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్13న ఇక్కడ పోలింగ్ జరగనుంది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి ప్రియాంక గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రియాంక గాంధీ ఎంపీగా గెలిస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక కలిసి పార్లమెంటులో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి అవుతుంది.