కూటమికి పొంచివున్న విద్యుత్ గండం

ఆంధ్రప్రదేశ్ హోమ్

(యం.వి.రామారావు, ప్రత్యేక ప్రతినిధి)
ఏపీలోని కూటమి ప్రభుత్వానికి విద్యుత్ గండం పొంచి ఉంది.అసలే నిధుల సమీకరణలో కుంటి నడక నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి ఈ గండం నుంచి బయటపడే మార్గం ఉందా అనేది ఒకటి రెండురోజుల్లో తేలనుంది. 2022-23 సంవత్సరం ఇంధన,విద్యుత్ కొనుగోలు సర్దుబాటు చార్జీలు రూ.8114 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ విద్యుత్ నియంత్రణమండలికి డిస్కమ్ లు ప్రతిపాదించడం తెలిసిందే. కాగా డిస్కమ్ లు మరో ప్రతిపాదన చేయడం విశేషం.75 శాతం ప్రభుత్వం భరించాలని పేర్కొనడం గమనార్హం. చంద్రబాబు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచమని,వీలయితే 30శాతం తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కాని ఇప్పుడు ఏపీఈఆర్సీ కి రూ.6072 కోట్లకు అనుమతి ప్రభుత్వం ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది మోసమని, ప్రభుత్వమే ఈ భారాన్ని భరించాలని వినియోగదారులు, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. నవంబర్ నెల నుంచి యూనిట్ రూ.1.58 అదనపు భారం వినియోగదారులపై పడనుందని తెలుస్తున్నది. ఇది గత వైసీపీ ప్రభుత్వం పాపమని కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్నది. అసలే ధరలు పెరిగి సామాన్యుడు సంక్షోభంలో ఉంటే విద్యుత్ చార్జీలు పెంచడం దొంగదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు విద్యుత్ చార్జీల పెరుగుదల విధానం పారదర్శకంగా లేదని విమర్శలున్నాయి. ఈ పెంపు మాది కాదని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుడు విధానమే ఈ భారమని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాని వామపక్షాలు మాత్రం ఇప్పటికే ఈ భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేసాయి.

కూటమి వర్గాలు కూడా ఈ నిర్ణయం ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచే అవకాశం ఉంది.ఇప్పటికే అవకాశం కోసం ఎదురు చూస్తున్న వైసీపీ నాయకులు ఇది చంద్రబాబు చేసిన మోసంగా ఆరోపిస్తున్నారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసిన విద్యుత్ భారం ఇప్పటి కూటమి ప్రభుత్వానికి చేరుకోలేని షాక్ గా మారింది. భరించాలంటే పెద్ద భారం,పోనీ ప్రజలపై వేస్తే తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.అసలే సూపర్ సిక్స్ అమలు కే మీనమేషాలు లెక్కిస్తున్న కూటమి ప్రభుత్వం మళ్లీ విద్యుత్ భారం భరించాలంటే కష్టమే అవుతుంది. ఫలితంగా విద్యుత్ భారం పై నిర్ణయం తీసుకోలేకున్నది ప్రభుత్వం. కాని రూ.1.58 చొప్పున యూనిట్ భారం మధ్యతరగతి కుటుంబానికి కనీసం 200 యూనిట్లయినా 300రూపాయలకు పైగా పడుతుంది. బీదవారికీ కనీసం 50 నుంచి 60 యూనిట్లు నమోదవుతాయి. వారికి దాదాపు 100 రూపాయల భారం పడుతుంది. ఇక 300పైన యూనిట్లకు పైగా నమోదయ్యే ఇళ్లకు భారం భారీగానే పడనుంది.మద్యం మినహా అన్నీ ప్రియమేనని సామాన్యుడు ఆక్రోశిస్తున్నాడు. ఈ సమయంలో చంద్రబాబు తెలివైన నిర్ణయం తీసుకుని తమను కాపాడాలని సామాన్యుడు ఎదురు చూస్తున్నాడు.ఇప్పటికే నాలుగు నెలల పాలనలో 47వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన చంద్రబాబు మరింత అప్పు చేసి భారం తగ్గిస్తాడు లేదా ప్రజలపై భారం వేసి చేతులు దులుపుకుంటారని వైసీపీ వర్గాలు ఎగతాళి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ప్రజలపై అదనపు భారం వేయడం పై పునరాలోచన చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం హాయాంలో చేసిన కొనుగోళ్లు కూటమి మెడకు చుట్టుకుంటున్నాయి.ఇలాంటి షాక్ లు ముందు ముందు మరిన్ని తగిలే అవకాశం ఉంది. తప్పదు మరి పాత ప్రభుత్వం చేసిన మంచిచెడూ రెండూ భరించడమే కొత్త ప్రభుత్వం విధి. ఆ పాపం ఎవరిదైనా చివరికి భరించేది ప్రజలే.వాటిని ఎన్నుకున్న “పాపం” ఆ రూపంలో భవిష్యత్తులో భారంగా మారుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *