ఊహకు రంగుంటుందా? ఊహది గోధుమ రంగా? ఎందుకు ఎలా?
జేమ్స్ జాయిస్ డబ్లినర్స్ పాత్రల అంతస్సంఘర్షణకు వేదికగా పరుచుకున్న డబ్లిన్ వీధుల, భవనాల రంగు గోధుమ. విలియం ఫాల్క్నర్ సవుండ్ అండ్ ఫ్యూరీలో కాంప్సన్ కుటుంబం నలుగుతున్న విలువల పతనం ప్రతిబింబమై కనపడే వర్ణం గోధుమ. విలియం వర్డ్స్ వర్త్ కవిత ‘టింటర్న్ ఎబే’ లో పదబంధాలైన పురాస్మృతుల రంగు గోధుమ. టోనీ మోరిసన్ ‘బిలవుడ్’ లో సేథే తన బానిస బతుకును లోకంతో ముడిపెట్టుకునేది గోధుమ ఛాయ ఊతంతోనే. థామస్ హార్డీ నవల ‘టెస్ ఆఫ్ ది డర్బ్ వెల్లిస్’ లో పాత్రలకు నేలతో ఉండే అనుబంధానికి సూచికగా పదే పదే కనపడేది గోధుమ వర్ణమే. త్రిపుర కథల్లో అలక్ నిరంజన్ కూ పాముకూ మానసిక అవకరాల మారుపేరుగా వినపడేది కూడా గోధుమ ఛాయే. ఇప్పుడిక్కడ మన వంశీకృష్ణ కథల్లో అనుబంధాలుగా పెరిగి సందేహాలుగా నలిగి మరణంగా వెంటాడి చివరికి జీవితాన్ని కబళించేది కూడా గోధుమ రంగు ఊహే. కనుక ఊహకు రంగుంటుంది. ఊహది గోధుమ రంగు అని వంశీకృష్ణ ఊహ.
_____________
గోధుమరంగుకు సాహిత్యంలో, చిత్రకళలో చాలా అర్ధాలున్నాయి. గోధుమ అంటే మట్టి. గోధుమ అంటే బతుకు. గోధుమ అంటే ప్రకృతి. గోధుమ అంటే జ్ఞాపకం. గోధుమ అంటే విషాదం. గోధుమ అంటే సందేహం. గోధుమ అంటే తటస్థత. గోధుమ అంటే సమతూకం. గోధుమ అంటే ఆధ్యాత్మికత. గోధుమ అంటే అస్పష్టత. గోధుమ అంటే అనుబంధాలు. గోధుమ వర్ణం అంటే ఇంకా చాలా చాలా. లెక్కలేనన్ని లోతులు అంతుచిక్కని అర్దాలు. ఈ అర్దాలు,లోతులు అన్నీ వంశీ కథల్లో ఉన్నాయి. అందుకేనేమో పద్నాలుగు కథల్లో ఒక కథ టైటిల్ అయినప్పటికీ పుస్తకానికే ఏకంగా ఆ శీర్షిక ఇచ్చేసాడు. ఒక గోధుమ రంగు ఊహ అన్నాడు. ఊహ అన్నాడు కానీ నిజానికి గోధుమ రంగే ఈ కథల సారం. గోధుమ రంగులోపలి భావోద్వేగాలన్నీ ఒక్కటైన సారం. గోధుమ రంగు టింట్ మీద అనేక రంగులను ఎంబోజ్ చేసిన సారం.
_____________
మరైతే సారానికీ రంగులుంటాయా. అనుభూతులకూ, ఉద్వేగాలకూ కూడా రంగులుంటాయా. ఉంటాయనే అంటున్నాడు వంశీ. ఉంటాయనే వంశీ కథలంటున్నాయి. మరణం రంగు గోధుమ అంటున్నాడు. ఆలోచనల రంగు పసుపు అంటున్నాడు. కలల రంగు ఆకుపచ్చ అంటున్నాడు. మొత్తంగా దీన్నొక పద్నాలుగు రంగుల డబుల్ ఇంద్రధనుస్సు చేసి మనకందిస్తున్నాడు వంశీ.
ఒక రాజునూ, ఆ రాజు దురహంకార నైపుణ్యాన్నీ అడవిలోకి బదిలీ చేసి అడవి ఎలా అంటుకుంటుందో చెప్పాడు.అనుభవాల ఎత్తుపల్లాలలో కుదుపు లేకుండా సాగే ప్రయాణం వెచ్చదనం ఒక పసుపుపచ్చ సాయంకాలం ఎలా అయిందో చెప్పాడు. సామాజిక మాధ్యమం జిలుగు తెరమీద అబద్దాల వెలుగులు ఎంత ప్రకాశిస్తాయో ఎదురైన దృశ్యంలో చెప్పాడు. ఒంటి నిండా సిల్వర్ పులుముకుని బిగుసుకుపోయిన పసితనం గాంధీయిజం కాలేని విషాదం గురించి దుఖ్కంగానే చెప్పాడు. కుల అచైతన్యంలో బటర్ ఫ్లై ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఆట ముగిసాక ఒకే డబ్బాలోకి చేరిన రాజూ బంటుల చెవిలో గుసగుసగా చెప్పాడు. మతమూ స్నేహమూ కలిసీ కలవని ఒకటొకటే అని ఉస్మాన్ తో చెప్పించాడు. ఆమె దేహం మీది పొట్టి దుస్తుల పొడుగు వేదన కుటుంబం నెత్తిన పిడుగై ఎలా కూలుతుందో దుస్తులతోనే చెప్పించాడు. జీవితం పొడవునా వెంటాడిన రంగు.. మృత్యువేనని గోధుమరంగు ఊహలో చెప్పించాడు. రెండు మౌనాల మధ్య ఘర్షణ ఎంత ధ్వని చేస్తుందో మౌనతో చెప్పించాడు. ఒక పుట్టుకకూ ఒక మరణానికి మధ్య ఉండే మరణ జనన సంయోగ క్రియ తీవ్రతను శ్యామకల్యాణిలో చూపించాడు. రోహిత్ తో సెలవు చెప్పించే వీడ్కోలు వేడుకోలు కన్నీళ్ల లేఖను గద్గదంగా చదివి వినిపించాడు. నమో దౌష్ట్యాన్నీ, భూమి గుండె
తొలచడాన్నీ అద్దంలో అమరేంద్ర అనే మార్మికతతో కొండమీదకు ఎక్కించి మాంత్రిక వాస్తవికతను ప్రదర్శించాడు.
నేనేదో చిక్కటి కచ్చిత పోలిక కోసం జాయిస్ నూ ఫాల్క్నర్ నూ ఉటంకించి ఉండవచ్చు. కానీ వంశీ కథలు ఎక్కడినుంచో ఊడి పడవు. అవి మన మధ్య తచ్చాడే మన అనుభవాలే. వంశీ పాత్రలు అమూర్తాలూ, అపురూపాలూ కావు. అవి మన ఊళ్లో, మన వీధిలో, మన లివింగ్ రూమ్ లో మనతో గొడవకు దిగే మన ఆలోచనలే. మనకు కనపడుతూ మనం చూడని, మన అమాయత్వం మాటున కనమరుగయే, మనం ఉద్దేశ్యపూర్వకంగా విననట్టు చెవుడు నటించే అనేక సందర్బాలలోకి మనల్ని పునర్ ప్రయాణం చేయిస్తాడు వంశీ. ఈ కథాయాత్రలో ఓ పసుపు పచ్చని సాయంకాలం పూర్ణ చేయిగా మనం మన జీవన సహచరి చేతిని చేతిలోకి తీసుకున్నట్టుగానే ఉంటుంది. కరుణాకర్ కు ఎదురైన దృశ్యం నిలువెత్తు అబద్దం అని నిజంగా గ్రహించినట్టుంటుంది. గోలి రామాంజనేయులు తన కొడుకు చావును కూడా సొమ్ములుగా మార్చుకుంటున్నాడా అని బాధేస్తుంది. ఆటముగిసాక రామ్ రావును చూస్తే జాలేస్తుంది. చెప్పని కథలో ఉష్మాన్ చివరి వాక్యం ఏం రాసాడో రకరకాలుగా ఊహించుకుని రాసేసుకోవాలనిపిస్తుంది. కొడుకు మరణం తరువాత కూడా చంద్రకళ అదే దుస్తులతో రెడీ ఫర్ ది షో అనడాన్ని జీర్ణించుకోవడం గర్వంగానే ఉంటుంది. ఈ పాత్రలు, ఈ సందర్బాలూ ఏవీ మనకు తెలియనివీ, మన అనుభవంలో లేనివీ కావు. వాటిని కొత్త అర్ధంతో మన ముందుంచుతాడు వంశీ. వంశీ మధ్యతరగతి కథకుడు. వంశీ సామాన్య పాఠకుల కథకుడు.
మన కథకులలో చాలా మందికి కథను అనవసరంగా పొడిగించే దుర్గుణం ఉంది. ఇంకొందరిలో అవసరానికి మించి సంక్షిప్తీకరించే గుణం ఉంది. ఇంకొందరిలో అర్ధాంతరంగా హాఫ్ ఎండెడ్ గా ముగించే గుణం ఉంది. ఉద్దేశ్యపూర్వకంగా సంక్లిష్టం చేసే గుణం కూడా కొందరిలో ఉంది. వంశీలో ఇవేవీ లేవు. కొలతలు కొలిచినట్టు కథను అటూ ఇటూ సర్ది కచ్చితమైన ఫ్రేంలో బిగించేస్తాడు. ఎక్కువా కాదు, తక్కువా కాదు. ఫ్రేం దాటి కథ హద్దులు మీరుతోందనుకున్నపుడు అద్దంలో అమరేంద్ర లాగానో కొండమీద లాగానో ఉస్మాన్ చెప్పని కథలో లాగానో ముగింపును పాఠకుడి ఊహకు వదిలేస్తాడు. పారదర్శక వెలుగులోకి వేలుపట్టి నడిపించి ఉన్నట్టుండి లైట్సాఫ్ అని పాకప్ చెప్పి అదే పారదర్శక చీకటిలోకి నెట్టి వేలు వదిలేస్తాడు. అలా చేయడానికీ వంశీకో కారణం ఉంది. వంశీది ఒక అన్వేషణ. ఒక వెతుకులాట. తన చుట్టూ ఉన్న మనుషులను పాత్రలు చేసి తనకెదురైన దృశ్యాలను సంఘటనలు చేసి వాటిని కథలు అని మనకు సమర్పిస్తాడు. కానీ నిజానికి అవి అనేక సందేహాలను తీర్చే పరిష్కారాలు. ఎందుకంటే వంశీకి.. జీవితానికి సంబంధించిన సందేహాలు జాస్తి. ప్రేమంటే ఏమిటి అని ప్రశ్నిస్తాడు. హ్యాపీ అంటే ఏమిటి అని నిలదీస్తాడు. ఈ ప్రశ్నలకు సమాధానాల్లో మానవ సంబంధాలను దేవులాడుకుంటాడు. వాటిని మరింత ఆత్మీయం చేయడం ఎలా అనే ఆలోచనలోనే కథలను అల్లుతాడు. ముఖ్యంగా వంశీకి భార్యభర్తల మానసిక సాన్నిహిత్యాల పట్ల విశ్వాసమూ, సందేహమూ ఏకకాలంలో బలంగా ఉంటాయి. దుఖ్కపడాల్సి రావడమూ కన్నీళ్లను దాచుకోవల్సి రావడము ఏకకాలంలో సంభవించినట్టన్నమాట. మానవ సంబంధాలు భవిష్యత్తులో బలపడాల్సిన వేళ వర్తమానంలో బలహీనపడిపోవడం గురించి ఆందోళన పడతాడు. ఇక్కడే హ్యాపీనెస్ కి తనదైన అర్దం చెపుతాడు. ప్రేమకూ తనదైన నిర్వచనం ఇస్తాడు. తెగ్గొట్టలేని అనుబంధాలను కలిపి జోడించే సమాధానాలతో సమాధానపడతాడు. ‘విరిగిపోవడం కంటే అతుకులతోనైనా ఒక్కటిగా ఉండడమే కలను అల్లుకోవడం కాదూ’ అనే తాత్వికతను చదువరికి నేర్పుతాడు. ఆ క్రమంలోనే సారం మీదే నా దృష్టంతా, నిర్మాణం నాకు తెలియదు అంటాడు. కానీ అది అబద్దం. లోతుగా చూస్తే వంశీకి తనదైన నిర్మాణం ఉంది. సారానికి పరమ విధేయంగా ఉండే నిర్మాణం ఉంది. ‘అడవి అంటుకుంది’లో యానిమల్
ఫాం లాంటి ఇంపర్సనైజేషన్ ఉంది. అద్దంలో అమరేంద్ర, కొండమీదలాంటి కథల్లో పలచటి మాజికల్ రియలిజం ఉంది. ఈ పరిణామంలోనూ ఓ గమ్మత్తు ఉంది. అప్పటికప్పుడు కొడవటిగంటిలా అనిపించి అదాటున కాశీభట్లగా మారినట్టనిపిస్తుంది. ఈ ఖెమీలియన్ బదలాయింపే పాఠకుడికి నచ్చేది. ఒక జానర్ కు పరిమితం కావడం కూడా వంశీకి ఇష్టం ఉండదు. మోదీనీ, కేసీఆర్ ను రాజ్యంగా మాత్రమే చూసి పరిహసిస్తాడొక చోట. కులమతాల లోతులను హృదయంతో స్పర్శిస్తాడు. ఇంకోచోట ఆలుమగల అనుబంధంలోని వెలుగునీడల మీద మెదడులాంటి గుండెతో దృష్టి పెడతాడు మరింకోచోట. స్వతహాగా కవి కావడంతో కొన్ని చోట్ల ఆ కవి రచయితను సగౌరవంగా కబ్జా చేసేస్తాడు. మౌన, గోధుమరంగు ఊహ, ఒక పసుప్పచ్చ సాయంకాలం కథల నిండా కవిత్వం పరుచుకుని పరిమళిస్తుంటుంది. ఆమె నడకను హృదయమనే పుస్తకంలో ఒక జ్జాపకాన్ని ఉల్లేఖించడంతో పోల్చడం కవి తప్ప ఎవరు చేయగలరు.అందుకే చాలా చోట్ల కథల్లో హృదయ ప్రేరక శక్తికీ ఆలోచనా ప్రేరక శక్తికీ మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడుతుంది. అయితే దాన్ని బాలన్స్ చేయడంలో అంతిమ విజయం వంశీదే. బహుశా ఉస్మాన్ కథను అన్ ఎండెడ్ గా ముగించడం ఆ నేపథ్యంలోనే జరిగి ఉండవచ్చు.
జేమ్స్ జాయిస్ ను ప్రస్తావించి దాన్ని కేవలం ఉటంకింపు అని తేల్చేసినప్పటికీ వంశీ కథలు ఖమ్మం చుట్టుపక్కల తచ్చాడుతుండడం కచ్చితంగా జేమ్స్ జాయిస్ డబ్లిన్ వీథుల్లో తిరుగాడడం లాంటిదే. మరీ ముఖ్యంగా ది డెడ్ లో లా. దాంతో పాటు వంశీ కథల్లో ఒక పరంపర కూడా కనపడుతోంది. ఉష్మాన్ చెప్పని కథలో పుట్టుక, సెలవులో చదువు, ఒక పసుపు పచ్చని సాయంకాలంలో దాంపత్యం, ఎదురైన దృశ్యంలో ప్రేమించిన అమ్మాయి చివరిచూపుకోసం తపన,పైసా వసూల్ లో ఉద్యోగం, విధి నిర్వహణలో వక్రతలు, ఆట ముగిసాక లో కులం మోసుకొచ్చే సామాజిక ఘర్షణ, అడవి అంటుకుందిలో అద్దంలో అమరేంద్రలో రాజ్యం పట్ల నిరసన, కొండమీదలో పర్యావరణ విధ్వంసం గురించిన వేదన, చివరాఖరుకి గోధుమ రంగు ఊహలో, శ్యామ కల్యాణిలో మృత్యువు …ఇదొక వరుస, ఇదొక జీవితానుభవాల కథామాలిక. ఈ వరుసలో కథల్లో ఇతివృత్తాల భిన్నత్వం మాత్రమే కాక ఒక జీవనయానాన్ని చూడొచ్చు.
కథ అంతా రాసాక దాని మొదలూ తుదీ తీసేయాలి అంటాడు చమత్కారంగా చెహోవ్. బుచ్చిబాబేమో కథ కెరటంలా కనపడాలి. దాని వెనుక సముద్ర హోరు వినపడాలి అంటాడు. ఆదీ అంతం పరిపూర్ణంగా ఉండి సముద్ర హోరును మోసుకొచ్చే కెరటాలు వంశీ కథలు. భావోద్వేగాల ఇంద్రధనువులు వంశీ కథలు.
(ఫిబ్రవరి 2వ తేదీన ఖమ్మంలో ఈ కథా సంపుటి ఆవిష్కరణ సందర్భంగా)
-ప్రసేన్
70133 58154