విమర్శనా రంగంలో అడుగు పెట్టాలంటే తీవ్రమైన అధ్యయనంతోపాటు, అవగాహన, దృక్పథం, రచనను అంచనా కట్టడం తెలిసి ఉండాలి. సహృదయ విమర్శకుడుగా గుణదోషాలను నిర్ధారించాలి. గత రెండు దశాబ్దాలుగా విమర్శనా రంగంలో మంచి కృషి చేస్తున్న డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు ‘అవగాహన’ ,’లోపలికి’, ‘ఒలుపు’, ‘వెలుతురు’ అనే నాలుగు సాహిత్య వ్యాసాల సంపుటాలను వెలువరించారు.
_______________
ఈ సంపుటులలోని వ్యాసాలలో రెంటాల వారి దృష్టి సునిశితం. పరిశీలన ప్రామాణికం. ఉపరితల వాక్యాలు ఉండవు. తన ముందు విమర్శకులను, సమకాలీన రచనలను, ప్రాచీన సాహిత్యాన్ని, ఆ రచనలలో ఉన్న సారాన్ని వాటిలోని గుణదోషాలను మూల్యాంకనం చేయడం వారి వ్యాసాలలోని లక్ష్యంగా కనిపిస్తుంది. వీరు..ఒక రచనను గురించి వేసే అంచనా మనల్ని అన్వేషణ వైపు తీసుకెళ్తుంది. ఆలోచింపజేయడంతోపాటు,విశ్లేషణ హాయిగా సాగుతుంది. వీరి రచనా శైలి.. కంటిని, హృదయాన్ని చివరి వాక్యాల దగ్గర నిలుపుతుంది. మెదడును చురుగ్గా ఉంచుతుంది. సంయమనం కోల్పోవడం, పెన్ను జారడం ఉండదు.
_______________
‘సాహిత్యం ఎందుకు?’ అనే వ్యాసం చదివితే వీరి అధ్యయనం విలువ, అనుభవాల ఖాతా కలసి చేసిన ప్రతిపాదనలు మనల్ని లోలోపలికి ఆలోచింపజేసేలా ఉంటాయి. సాహిత్యం మనిషి మానసిక అవసరాల్లో ఒకటని సాహిత్యం ఎందుకు అంటే.. ‘ఇప్పటికీ మనిషి ఇంకా సరిగా గుర్తించని సాహిత్య మూల్యాలు మరి కొన్నింటి కోసం కూడా’ అనడం ద్వారా సాహిత్య విమర్శలో తను ఏం ఆశిస్తున్నారో అవగతం అవుతుంది. ఏ రచన అయినా మనల్ని మెరుగుపరచాలి. అట్లాంటి మెరుగుపరిచే వాక్యాలు రెంటాల వ్యాసాల్లో అనేకం.
‘లోపలికి’ సాహిత్య వ్యాస సంపుటిలో 17 వ్యాసాలు ఉన్నాయి. అందులో ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, సమీక్షలు, ముందుమాటలు, హైకూ, ఉపన్యాసం అలాగే రెండు నవలలు మీద సమీక్షా వ్యాసాలు ఉన్నాయి. పురాణం సూరి శాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు, శేషేంద్ర,చేకూరి రామారావుల విమర్శలపై రాసిన వ్యాసాలలో వారి ఆలోచనా ధోరణి పాఠకులని ఆలోచింపజేస్తుంది. కుటుంబరావు బొత్తిగా సమకాలికుడు. ‘శేషేంద్రది రాజసిక కవిత్వం.వస్తువు మాత్రమే కవిత్వమై రాజ్యమేలుతున్న కాలంలో దానిమీద శిల్పం చేసిన తిరుగుబాటు శేషేంద్ర విమర్శ’ అంటారు. చే.రా.ని అంచనా వేస్తూనే వారి విమర్శలోని కొన్ని సందేహాలను తెలియజేస్తారు.
ఆముక్త మాల్యద గురించి చెబుతూ ‘మనం పెద్దవాళ్లమయ్యాక దాచి ఉంచబడ్డ పెద్ద పుస్తకం’ అని చమత్కరిస్తారు. నామిని రాసిన మా అమ్మ చెప్పిన కథలు, ఇస్కూలు పిలకాయల కథ,చదువులా? చావులా? ఈ మూడు పుస్తకాలు పిల్లల కోసం, పిల్లలు ఉన్న పెద్దల కోసం అంటూనే ‘నామిని లో మౌలికత, హిపోక్రసి రాహిత్యం, సంవేదనాశీలత, హాస్య ప్రవృత్తి, క్లుప్తత వంటి లక్షణాలెన్నో వాస్తవికత వెనక దాక్కుని దాన్ని కళగా మలిచాయి’ అని అంచనా వేస్తారు.
ఇందులో తిలక్ కవితాతత్త్వం, దృక్పథం అనేది చాలా పెద్ద వ్యాసం. ఈ వ్యాసంలో తిలక్ కవిత్వాన్ని గొప్పగా ఆవిష్కరించారు. కానీ అది తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థుల కోసం రాసిన పాఠ్యాంశం, అందులో ప్రశ్నలు కూడా యధాతధంగా వ్యాసంలో ఇవ్వడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది.
అన్ని వ్యాసాలలోను వారి శైలి ఆత్మీయంగా ఉంటుంది. వ్యాసం మొత్తాన్ని చదివించగలగడం వారి అక్షరాలకున్న శక్తి. రెంటాల.. కథ, కవిత్వం, నవల, నాటకం, హైకూ,గజల్, రుబాయీ,ఉపన్యాసం, అనువాదం ఇట్లా అన్ని ప్రక్రియలలోని రచనల మీద వ్యాసాలు రాశారు.
‘ఒలుపు’ వ్యాస సంపుటిలో ‘తెగిపడ్డ శరీర భాగంలా ఒకానొక విరిగిన నాగలి’ అంటూ గంటేడ గౌరునాయుడు రైతు కవిత్వంపై రెంటాల రాసిన విశ్లేషణ చాలా బాగుంది. బి.వి.వి ప్రసాద్ ‘ఆకాశం’ కవితా సంపుటిని మౌలిక ప్రపంచం గురించి మొదటి కవిత్వం అని చెబుతారు. తెలుగులో ఇంతవరకు ఇట్లాంటి ఆధ్యాత్మిక కవితా సంపుటి రాలేదని నిర్ధారించారు. అంతేకాకుండా ఆధునిక సాహిత్య విమర్శకులలో మొదటివాడు స్వామినీన ముద్దునరసింహ అని ప్రకటించారు. ఆధునిక తెలుగు సాహిత్యంపై కన్యాశుల్కం ప్రభావాన్ని రుజువులతో సహా నిరూపించారు. ప్రాచీన సాహిత్యం మీద మాట్లాడినా, ఆధునిక సాహిత్యం మీద వ్యాసం రాసినా రెంటాల వారి అధ్యయన శక్తి మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.
రెంటాల..ఒక రచనలోని లోపాలను చెప్పి,ఆ లోపాలను సరైన సమాధానాలతో పూరిస్తారు. వివరణ ఇస్తారు. మన జ్ఞానాన్ని విస్తరిస్తారు. కృష్ణశాస్త్రిని అంచనా వేయడంలో ఎక్కడా తడబడలేదు. వ్యాసం చదువుతున్నంతసేపు కృష్ణశాస్త్రి తన విమర్శ గురించి చెబుతున్నట్లు ఉంటుంది. కృష్ణ శాస్త్రిని, కట్టమంచిని కలుపుతూ వాళ్ళిద్దరికీ ఒక పోలికను గమ్మత్తుగా చూపిస్తారు. “వాళ్ళిద్దరూ రొమాంటిక్ యుగపు ఆవరణలో నిలిచి విమర్శ రాసిన వాళ్లే. తేడా ఏమిటంటే కట్టమంచి-ఆ యుగపు మేధ,కృష్ణశాస్త్రి-ఆ యుగపు హృదయం” అంటారు .
వేమన పద్య శిల్పాన్ని, దాశరథి పద్యంలోని ఉద్వేగాన్ని విలువ కట్టడంలో వీరిది కొత్తదారి. తిలక్ కవిత్వం పట్ల, పద్యం పట్ల వీరికి ప్రత్యేకమైన అభిమానం ఉన్నట్లు తెలుస్తుంది. తిలక్ పద్య కవిత్వాన్ని విశ్లేషిస్తూ “తిలక్ వచన కవిత్వం రాయకుండా, పద్య కవిత్వం మాత్రమే రాసి ఉంటే..తిలక్ పద్యం గురించి ఇంతకంటే ఎక్కువగా మాట్లాడుకుని ఉండేది సాహిత్య లోకం. బహుశా అచ్చమైన భావకవుల్లో చిట్ట చివరివాడుగా లెక్క వేసి ఉండేది చరిత్ర.
రెంటాల.. వ్యాసాలలో చేసే వ్యాఖ్యలు పక్కా సాక్ష్యాలతోనే చేస్తారు. సీతారాం ‘అదే పుట’ గురించి వేసిన అంచనా అలా ప్రత్యేకమైనది.
శిఖామణి కవిత్వంలో పోలికలు, రూపకాలు, ఊహలు, దృష్టాంతాలను చూపిస్తూ రాసిన వ్యాసం పాఠకులను ఆకర్షిస్తుంది. “మళ్లీ భావ కవిత్వం గురించి ఎందుకంటే” అంటూ రాసిన వ్యాసంలో రెంటాల ప్రతిపాదనలు కొత్తగా ఉన్నాయి. ఈ ప్రతిపాదనలు చదివాక భావ కవిత్వంపై ఉన్న అపోహలు, అనుమానాలు తొలగిపోతాయి.
సింగిల్ పన్నా కవిత్వంగా తీసివేయబడ్డ భావ కవితాయుగం..ఆ తరవాత ఉద్యమాలకు ఇచ్చిన ఊతాన్ని చెప్పారు. సాహిత్యంలో భావ కవిత్వం ఏ ఏ భావాలను, ఆలోచనలను, స్పందనలను ప్రతిక్షేపించిందో చూపగలిగారు. ప్రాచీన కవిత్వంలోని ‘రసం’ స్థానంలో ‘అనుభూతి’ అనే కొత్త మాటను భావ కవిత్వం తెచ్చింది. అట్లాగే ‘నీతి’ స్థానాన్ని ‘సౌందర్యం’ ఆక్రమించింది. ‘ఉపన్యాసం’ అనే ప్రక్రియను భావ కవిత్వమే తీసుకువచ్చింది అంటారు.
కవిత్వం అంటే ఏమిటి? అని అడిగితే చదువు రాని సామాన్యుడు కూడా.. చందమామ, వెన్నెల, ప్రేయసి, ఆనందం, అందం, కోకిల అని చెప్తాడు. ఇదంతా భావ కవిత్వ ముద్ర అని చెప్తారు. పి.విజయ్ కుమార్ రచించిన ‘తెలుగు గజల్ స్వరూప స్వభావాలు’ అనే పుస్తకానికి రెంటాల రాసిన ముందుమాట చాలా విలువైంది. స్వస్థానం నుండి తెలుగులో అడుగు పెట్టిన గజల్ ఇక్కడ ఎట్లాంటి మార్పులు చెందిందో స్పష్టంగా చెప్పారు. రెంటాల హైకూ గురించి మాట్లాడినా, రుబాయి గురించి మాట్లాడినా, గజల్ గురించి మాట్లాడినా చాలా సాధికారికంగా మాట్లాడారు.
శోధన, సాధన, ప్రతిపాదన రెంటాల విమర్శలో గమనించవచ్చు. ఒక పుస్తకానికి ముందుమాట రాయవలసి వచ్చినప్పుడు ఆ పుస్తకంలో ఏవో నాలుగు ప్రతిపాదనలను తీసుకొని రాసేయొచ్చు. కానీ రెంటాల దారి వేరు, ఆలోచన వేరు. ఆ పుస్తకంలో తనకు ఏదైనా లోపం అనిపించినా, ఈ అంశాలను కూడా చేర్చితే బాగుండు అని అనిపించినా నిర్మొహమాటంగా ముందుమాటలో చర్చిస్తారు. ఈ విషయం బొల్లోజు బాబా ‘కవిత్వభాష’ పుస్తకానికి రాసిన ముందుమాటలోనూ,పి.విజయ కుమార్ ‘గజల్ స్వరూప స్వభావాలు’ పుస్తకంలోను ఇట్లాంటి సూచనలు చేశారు.
_________________
‘వర్ధమాన కథలు-కొన్ని సామాజిక విశేషాలు’ అనే వ్యాసం రాయడానికి ఆయన ఏడు నెలలపాటు తెలుగులో వచ్చిన వివిధ వార పత్రికలను పరిశీలించి, చదివి ఆ కథలను విశ్లేషించిన తీరు బాగుంది. వీటిలో విశ్లేషించిన సామాజిక అంశాలు దార్శనికతతో ఉన్నాయి. రెంటాల..ఏ ప్రక్రియ గురించి వ్యాసం రాయదలుచుకున్నా, విమర్శ చేయదలచుకున్నా లోతుగా అధ్యయనం చేసి మాట్లాడారు. విమర్శకుడిగా పాఠకుల్ని నిర్లక్ష్యంగా చూడడు.
________________
‘ఫౌంటెన్ హెడ్’ కి తెలుగు అనువాదం చేస్తూ ఒకచోట “సాధారణంగా ఎదుటి వాళ్లు చెప్పిన దానికన్నా మనం అర్థం చేసుకునేది ఎక్కువగా ఉంటుంది. అందుకనే కదా కొద్దిపాటి పరిచయంతోనే మనుషుల్ని మనం అంచనా వేయగలుగుతాం. పాఠకులు నేను చెప్పిన దానికన్నా ఎక్కువగా మూలాన్ని అర్థం చేసుకోగలరని నా ధీమా” అంటారు. ఇట్లాంటి వ్యాఖ్యానాలు ఆయనలోని వినమ్రతను, ఎవరినీ తక్కువ చేయని వ్యక్తిత్వాన్ని తెలుపుతాయి.
వీరి ‘విమర్శ ఎందుకు?’ అనే వ్యాసం విమర్శ అవసరాన్ని, విమర్శకుడి లక్షణాలని సూక్ష్మ దృష్టితో తన ఆలోచనలను పాఠకులతో పంచుకున్నారు.
‘సృజన, విమర్శల మేలు కలయికే మంచి సాహిత్యం. విమర్శకి, సృజనకి మధ్య అంతర్గతంగా అవిభాజ్యత ఉంటుంది, జీవితం పట్ల అవగాహన లేకపోయినా, కళా స్వభావం తెలియకపోయినా విమర్శకులు విఫలమవుతారు. మంచి సాహిత్య విమర్శ చదివినప్పుడల్లా మన సాహిత్య అవగాహనతోపాటు, మన సంస్కారం, మన లోకపుటెరుక ఒక మెట్టు ఎక్కుతాయి. ఆ ఎరుక సాహిత్యాన్ని బతికిస్తుంది’ అంటారు.
అయితే ఈ నాలుగు సాహిత్య వ్యాసాల సంపుటులలోనూ వీరు..కొన్ని వ్యాసాలను సరాసరి ప్రారంభించడం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది. వ్యాసాలకు పెట్టిన శీర్షికలు చాలా బాగున్నాయి. బ్రాకెట్లలో చెప్పే విషయాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి.
తెలుగు విమర్శనా రంగంలో రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు విస్మరింపదగిన విమర్శకుడు కాదు. రెంటాలను చదవడం అంటే మనల్ని మనం ఒక మెట్టు కాదు కొన్ని మెట్లు ఎక్కడమే. అయితే ఎక్కడా ఆయన ఇవి విమర్శనా వ్యాసాలు అని చెప్పుకోలేదు. ఈ వ్యాసాలు అన్నిటినీ చదివాక రెంటాల.. మంచి విమర్శకుడు అని మనమే అంటాం. పాఠకుల్ని బతికించే, సంతోషపెట్టే రచనలు రావాలంటే రెంటాల వ్యాసాలు చదవాలి.సాహితీక్షేత్రంలో రెంటాల విమర్శ ఒక కాంతి సూచిక. వెలుగు దారి.
-డాక్టర్ సుంకర గోపాలయ్య
94926 38547