శిల్పం అనేపదం సంస్కృతంలోని శిలధాతువునుంచి ఏర్పడింది.శీలం అనే పదానికి స్వభావం అని అర్థం.కవిత్వ ముఖంగా కవిత్వం చెబుతున్న సంవిధానం యొక్క స్వభావమే శిల్పం. ఇది కవితా రూపం,వాక్య రూపం, భాషా రూపం, రూపకాత్మక భాష. ఇవన్నీ ఒక కవి రచనకు గల శిల్పాన్ని పరిపుష్టం చేస్తాయి.వస్తువుయొక్క సమగ్రభావనే శిల్పం.వస్తువును నిర్వహించడానికి ఎంత సమగ్రంగా వస్తుసంబంధ అంశాలను ప్రోదిచేస్తున్నాడు, వాటన్నిటి మధ్య ఏక సూత్రత ఎలా కవిత్వంలో ఉంది, వీటన్నిటితో పాటు వస్తువుపట్ల తానేమి అనుభవించాడో.. ఆభావనను, అనుభవాన్ని పాఠకుడికి కూడా కలిగించడం శిల్పానికుండే ప్రధాన లక్షణాలు.తన చాకచక్యాన్ని తీర్చిదిద్దే విషయం వస్తువుకు అనేక ప్రయోజనాలను చేకూర్చే విషయంలో కవులందరిలోనూ వైయ్యక్తికంగా, సార్వత్రికంగా కొన్ని లక్షణాలుంటాయి. అస్తిత్వవాదపు కాలంలో వీటిని సామూహికంగానూ గుర్తించే అవకాశం ఉంది.వయ్యక్తిక లక్షణాలలో శైలిని, సామూహిక లక్షణాలలో శిల్పాన్ని గుర్తించవచ్చు.ప్రాతిపదికంగా వస్తువు, శిల్పం వేరుకాదు.వస్తువును సమగ్రంగా నిర్వహించడం.దానిని పాఠకులకు అనుభూతిమయంగా ఆనుభవికంగా అందించడం శిల్పంయొక్క లక్షణం.
______________
శిల్పం అన్నపదం భారతీయ సాహిత్య చింతనలోనే ప్రధానంగా కనిపిస్తుంది. సోవియట్ సాహిత్యంలోని ఇల్యా ఎహ్రెన్ బర్గ్ పుస్తకానికి తుమ్మల వెంకట్రామయ్య “రచయితా శిల్పం”అన్న పేరు పెడతారు. కాని ఆంగ్ల సాహిత్యంలో శిల్పానికి సమాంతరంగా ఒక పదం కనిపించదు. ఈస్తటిక్స్ (Aesthetics) ఆర్ట్ (Art) స్టయిల్(Style) అనే పదాలకు సౌందర్యం, కళ,శైలి అనే పదాలను వాడుతున్నాం.ఒకరంగా ఇవన్నీ శిల్పానికి సంబంధించినవే కానీ ఇవి శిల్పం అన్నపదాన్ని పూరించవు.ఎహ్రెన్ బర్గ్ రచనలోనూ “రచయిత పరిశీలన వల్లే శిల్పం ఆకర్షిస్తుందని చెప్పారు.
______________
సాధారణంగా వస్తువు.. శిల్పం లేకుండా ఉండదు.కాని అది ముడి రూపంలో ఉంటుంది.దానిని ఆ రచయిత అనుభవం మరింత పరిపుష్టం చేస్తుంది. దీనికి ప్రాచీన ఆలంకారికులు బాహ్య ప్రయత్నం, అంతర ప్రయత్నం అని రెండు భాగాలుగా చెప్పారు.వస్తువును గురించి లోతుగా ఆలోచించడం అంతర ప్రయత్నం. దానిని కావలసిన పదాలు,వాక్యాలు,రూపకాత్మక భాష మొదలైనవాటిని సంధానంచేస్తూ చెప్పడం వ్యక్తం చేయడం బాహ్య ప్రయత్నం. వస్తువులను సజీవంగా చిత్రించడమే శిల్పం.ఎహ్రెన్ బర్గ్ “రచయిత గమనించిన జీవితానికి, ఊహించిన జీవితానికి,చిత్రించిన జీవితానికి మధ్య అంతరం ఉండకూడదని” అది మంచి శిల్పలక్షణమని అంటారు.
శిల్పానికి, శైలికి మధ్య విభజన రేఖలను గీయడానికి సాధారణంగా కవిత్వాన్ని చెప్పడంలో మూడు ఉపయోగాలను గమనించవచ్చు. 1.సాధారణ ఉపయోగం: వివిధ రకాల శిల్ప పరికరాలు,ఆలంకారిక సామగ్రి మొదలైనవి ఉపయోగించడం.ఇలాంటి పనిని సాధారణంగా అందరు కవులూ చేస్తారు.భారతీయ అలంకార సామగ్రిని వాడుకుని కవిత్వాన్ని చెప్పడం. పాశ్చాత్యులకు సంబంధించిన సౌందర్యం, రూపకాత్మక భాష మొదలైనవి వాడుకుని చెప్పడం లాంటివి ఈ సాధారణ శిల్ప లక్షణంలో కనిపిస్తుంది.ఇవి కనీస ప్రాతిపదికలు శిల్పంలో.
2.వైయ్యక్తిక ఉపయోగాలు: వాక్యాన్ని తీర్చి దిద్దడం,భాషాసరళి,భాష ముద్ర. కవిత్వాన్ని చెప్పే పద్ధతి.అందులోనూ కథనాత్మకత,నాటకీయత,సరళరేఖా పద్ధతి,ద్విరేఖా పద్ధతి ఇలాంటివన్నీ వైయ్యక్తిక ధర్మం మీద ఆధారపడతాయి. శైలి లక్షణాలను గమనించడానికి ఇలాంటివి ప్రాతిపదికంగా కనిపిస్తాయి. ఉదా: శివారెడ్డి కవిత్వంలో స్టయిల్ ఆఫ్ వర్డ్ టయింగ్ ఉంటుంది.చేరా రక్తస్పర్శ కవుల్లో ప్రతీకీకరణ ఉందని చెప్పారు. కొందరిలో రెండువాక్యాలు చెప్పేలక్షణం. ఇంకొందరిలో ప్రశ్నావాక్యాలు చెప్పే లక్షణం. ఇలాంటివన్నీ ఈ ఉపయోగంలో కనిపిస్తాయి.
3.సార్వత్రిక ఉపయోగం: ఒకకాలంలో ఒక గుంపు కవిత్వం చెప్పడానికి ఉపయోగించే లక్షణం. అభ్యుదయవాదం వచ్చినపుడు అందులో చాలామందిలో ఒక సార్వత్రిక లక్షణం కనిపిస్తుంది.అది కొన్ని ప్రతీకలు,ఉపమానాలు,పదాలు పదబంధాలు వాటికి సంబంధించిన ఛాయలు ఉపయోగంలో ఉంటాయి. అందువల్ల వీటిని గమనించవచ్చు. ఎత్తినపిడికిలి,ఉదయించిన సూర్యుడు, శంఖం,కాగడా ఇలాంటివి అభ్యుదయం అనే అర్థక్షేత్రానికి దగ్గరగా కవిత్వభాష తయారుచేసుకుంది.ఇవి భాషలోని సాధారణ సంకేతానికి భిన్నమైనవి.
_____________
వస్తువు, శిల్పం ఈరెండిటి సంబంధంగా కవులకు వయ్యక్తికమూ, సామూహికమూ అయిన లక్షణాలుంటాయి.వస్తువు ఏదైనా దానికి సమకాలీనతకన్నా, సిద్ధాంతాన్ని దీప్తివంతం చేసే కవిత్వం, సమకాలీనతను,సందర్భాన్ని,సంఘటనను నేరుగా వ్యక్తం చేసే కవిత్వం ఇలా అనేకరకాలుగా కనిపిస్తాయి.కవి ఏ కాలంలో మొదలయ్యాడు, ఏ కాలంలో నిలబడి రాస్తున్నాడు అనే అంశాన్ని బట్టి ఆ కవి సిద్ధాంతాన్ని అంచనా కట్టవచ్చు. అందులోని పై మూడు భాగాలను విడదీసి చూడవచ్చు.
_______________
ఒక కవి శిల్పంలో ఆ కవి నమ్మిన సిద్ధాంత ప్రాతిపదిక,సమకాలీన పరిస్థితులు,సమకాలీన భాషా ముద్రనుంచి తానుగా నిర్ణయించుకున్న భాషా శైలి,సంకేతాల ఉపయోగం ఇవన్నీ ప్రధాన భూమిక వహిస్తాయి.వస్తువుకు లేదా ఇతివృత్తానికి సంబంధించిన సిద్ధాంత భూమిక శిల్పభావనను అదుపుచేస్తుంది.శివారెడ్డి కొన్ని పదుల సంవత్సరాలుగా కవిత్వం రాస్తున్నారు. ఆయన కవిగా ప్రారంభమయ్యేనాటికి మార్క్సిస్టు పంథా.. సాహిత్యంలోకి అడుగుపెట్టింది.దిగంబర కవిత్వం, తిరగబడు కవులు, విరసం ఆవిర్భావం తరువాత అత్యధిక కవిత్వం.. మార్క్సిస్టు భావజాలం సిద్ధాంత భావనతో కనిపిస్తుంది.శివారెడ్డి కవిత్వమూ అందుకు మినహాయింపు కాదు. ఉరామరికగా శివారెడ్డి కవిత్వానికి శిల్పభావనలను అంచనా వేయవచ్చు.
తెలుగు విమర్శలో సవిమర్శక వాస్తవికత,సామ్యవాద వాస్తవికత అని రెండు పదాలను ఉపయోగిస్తారు.వీటిలో సామ్యవాద వాస్తవికతను రాజ్యంలో సామాజిక స్పృహను పెంపొందించడానికి, సాహిత్యం, కళల ద్వారా సందేశాన్నిచ్చేందుకు ప్రేరేపించేందుకు రూపొందిన మార్క్సిస్టు సౌందర్య శాస్త్రంగా మారియమ్స్ వెబ్స్టర్ లాంటి నిఘంటువులు చెబుతున్నాయి.
సవిమర్శక వాస్తవికతలా కేవలం సమస్యను గుర్తించడం మాత్రమే కాకుండా దాని పరిష్కారానికి మార్క్సిస్టు తత్త్వశాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకుని మార్గాలను వెదుకుతుంది.శివారెడ్డి కవిత ఈ పనిని చేస్తుంది.సిద్ధాంతభూమికగా ఆయన కవిత్వానికి వస్తువుకన్నా దాని వెనుక దాగి ఉన్న చైతన్యం ప్రధానం. అసలు ఎవరి కవిత్వానికైనా వస్తువు కేవలం ముసుగు మాత్రమే.దాని వెనుక ఉన్న చైతన్యమే ప్రధానం.ఆ చైతన్యం వెనుక ఉన్న సిద్ధాంతమే ప్రధానం.
శివారెడ్డి కవితలో వస్తువు ప్రధానంగా వ్యక్తం కాదు.దాని ఛాయ (Shade) మాత్రమే కనిపిస్తుంది. కాని దాని తాలూకు మూలవస్తువు (original object) ధ్వనిస్తూనే ఉంటుంది. కవిత్వ ప్రయోజనం (Purpose of poetry) సిద్ధాంతాన్ని పెనవేసుకుని నడుస్తూనే ఉంటుంది.
వస్తువు వెనుక విషయం, విషయాన్ని ఆనుకుని సందర్భం ఉంటాయి.కవితకు సందర్భం ప్రేరేపించవచ్చు.కాని అది సార్వకాలికం అవడం వల్ల చెరిగి పోతుంది. శివారెడ్డి కవితలో రూపకాలు, మెటాఫర్లు,ఉపమానాలులాంటి రూపకాత్మకభాష(Figurative language) కు సంబంధించిన అనేక అంశాలుంటాయి.కాని కవిత్వ రచనలో ఆయనకు సంబంధించిన కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి.పదసమ్మేళనం(Style of ord tying) వాక్యంలో ఒకపదం లేదా దాని తాలూకు ధ్వని శబ్దముఖంగా పునరుక్తి అవుతూ ఒక లయను సృష్టిస్తుంది.శివారెడ్డి గారికి ఒక అలవాటు ఉంటుంది.కవితా శీర్షికలన్నీ కవిత్వంలో చివరిపాదంలోనో,మొదటిపాదంలోనో ఉన్న పదాలై ఉండడం.ఇవి కాక వేరేపదాన్ని శీర్షికగా ఉంచినవి లేవని కాదు.అత్యధికంగా ఈ లక్షణమే ఉంటుంది. “పొసగనివన్నీ”అన్న సంపుటిలో కవితలను ఈ దృష్టితో పరిశీలించవచ్చు.
నీరు – చూసిచూసి నీరైపోవడం (చివరి), చిన్న చిన్న వస్తువులు-స్పల్పంగా అల్పంగా కనబడే వస్తువులన్నీ (మొదటి), సృజించు-సృజించు నిరాటంకంగా నిర్భయంగా (చి), విరిగిపోకుండా -విరిగిపోకుండా (మొ), నగర జీవనాన్ని- నగరజీవనాన్ని(మొ),ఏదో ఒక మొక్క -ఏదో ఒక మొక్క (మొ), ఒక నది పాడుతూ -ఒకపాట పాడుకుంది(చి).ఇలా మరికొన్ని గమనించవచ్చు.ఇలాంటి కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని శిల్పాన్ని విశ్లేషించుకోవచ్చు.
1.చీకటివాసన గాలిని మేసేస్తే/ రాత్రిలాగా శీతలమెక్కిపోదూ మనసు
2.కళ్ళు దృశ్యాల్ని వడకట్టినట్టు/ ఊపిరిని కూడా వడబోసుకోవాలి
3.వెలుగువేళ్ళకి ఎక్కడన్నా /చీకటి మరకలున్నాయేమో చూసుకోవాలి
4.శబ్దాన్నిగూడా పుటంపెట్టి పరిరక్షించుకోవాలి
5.నీకు పనికిరాని గతం నిన్ను వెంటాడుతుంది/కాచుకోవాలి
6.మన భ్రమలు మనను మైమరపింపజూస్తాయి/గిల్లుకోవాలి.
7.ఆవుపొదుగులాంటి మేఘాలను/ ఆకాశం దాచుకున్నట్లు/నిత్య సమరశీల జీవితాన్నిగూడా పరిరక్షించుకోవాలి
8.ఎలానో బతకడం వేరు/వెలుగుతూ బతకడం వేరు/వెలుగు ఎలుగెత్తి బతుకే బతుకు/కటకటాల వెనుక కూడా/కాఠిన్యం కోల్పోని బతుకులు వజ్రసంగీతం
(వజ్ర సంగీతం: నేత్ర ధనుస్సు. 15.11.1977)
మన ఉనికిని, స్వేచ్చను కాపాడు కోవడంవల్ల విప్లవించడానికి కావలసిన స్వేచ్చౌతుంటుందని అందుకోసం ఎప్పటికప్పుడు మనను మనం తరచి చూసుకోవాలన్న విషయమని చెబుతూ చైతన్యవంతంగా బతకడాన్ని గురించి ఈ కవిత చెబుతుంది.సమకాలీన పరిస్థితులకు లోంగిపోకుండా రాజకీయ బానిసత్త్వానికి లోంగిపొకుండా నిలబడాలన్న అంశాన్ని ఈ కవిత చెబుతుంది.
ఇందులో:చీకటి,రాత్రి,భ్రమలు మొదలైన పదాలన్నీ ‘బానిసత్వానికి’ ప్రతీకలు.
ఊపిరి,గాలి,శబ్దం,సమరశీల జీవితం, వెలుగు ఇవన్నీ ‘చైతన్యానికి ‘ప్రతీకలు.
మొదటివాటి నుంచి తప్పించుకోడానికి వడకట్టుకోవడం, పరిరక్షించుకోవడం, కాచుకోవడం మొదలైనవి చేయడం ద్వారా చైతన్యాన్ని కాపాడుకోవాలి. పోరాడేందుకు సిద్ధపడే సమరశీల చైతన్యానికి దగ్గరగా ఉండాలి. వీటన్నిటిలో వాక్యాంతాలలో “కోవాలి”అనేపదం పునరుక్తి అవుతూ వచ్చింది.ఇది కవిలోని వాక్యానికుండే పదసమ్మేళనం అనే లక్షణం.వజ్రసంగీతం అన్న శీర్షిక కూడా మొత్తం కవితలోని చివరి పదబంధం.ఆవుపొదుగులాంటి మేఘాలను/ఆకాశం దాచుకున్నట్లు/నిత్య సమరశీల జీవితాన్నిగూడా పరిరక్షించుకోవాలి.
ఆవు పొదుగులాంటి మేఘాలు -మేఘాలను ఆకాశం దాచుకున్నట్లు-సమరశీల జీవితాన్ని మనిషి దాచుకోవాలి.
ఇందులో రెండు ఆలంకారిక శ్రేణులున్నాయి.మొదటిది ఒక ధర్మాన్ని ఆశ్రయించి ఒక పోలికను సాకరం చేస్తుంది.రెండవది ప్రస్తుత వస్తువులోని భావనకు సమన్వయం చేస్తుంది. మొదటి వాక్యంలో ఒక దృశ్యం ఉంది.అందువల్ల అది భావ చిత్రంగా కనిపిస్తుంది.మేఘాలు ఆవుపొదుగులతో సమానంగా కనిపిస్తున్నాయి.ఇది తులనాత్మకత లేదా పోలిక రూపానికి సంబంధించింది కాదు. ఇతరులకోసం త్యాగం చేయడం లేదా వర్షించడం అనే తాత్త్విక ధర్మాన్ని చెప్పేవి.అలాగే ప్రజాప్రయోజనం కోసం సమరశీలజీవితం కూడా చైతన్యాన్ని, ఎదిరించే తత్త్వాన్ని అందుకోసం ఏదైనా చేయగలిగే తెగింపును త్యాగాన్ని వర్షించాలి.ఇలాంటి పద్ధతిని ప్రతీకీకరణ(nesting)అంటారు.భాషా శాస్త్రంలో ఈ ప్రతీకీకరణను ఒక భాషాగతమైన భావాంశాన్ని మరో దానికి జత చేయడానికి వాడుతారు. Nesting (n.) A term used in linguistics to refer to the insertion of one or more linguistic units. David crystal. A Dictionary of linguistics and phonetics-1. page.324)వీటిలోనూ రెండు భాగాలున్నాయి. అవి అంతఃకేంద్రిత నిర్మాణం(endocentric) బాహిఃకేంద్రిత నిర్మాణం (exocentric) వాక్యాల్లో ఒకే రకమైన భాషా ప్రవృత్తి ఉంటే అది అంతః కేంద్రితం. కాకుంటే బాహిఃకేంద్రితం. పై వాక్యాల్లో అంతః కేంద్రిత వాక్య నిర్మాణమే కనిపిస్తుంది.నిజానికి కవిత మొత్తం అదే పనిని చేసింది.కాని ఆలంకారిక ప్రవృత్తితో చేసిన పని ఈ వాక్యంలో కనిపిస్తుంది.
చీకటి,రాత్రి,భ్రమలు మొదలైన పదాలన్నీ ‘బానిసత్వానికి’ ప్రతీకలు. ఊపిరి,గాలి,శబ్దం,సమరశీల జీవితం, వెలుగు ఇవన్నీ ‘చైతన్యానికి ‘ప్రతీకలు అన్న ఎరుకలోని ప్రతీకల సంయోజనం కళా శిల్పాన్ని ఆలంకారిక శిల్పాన్ని చెబుతుంది.ప్రతీక ఒక ఉపమానంకన్నా ఎక్కువ విలువలు కలిగి ఉంది. ఉపమానానికి సమానధర్మం అనే విలువ ఉంది అనేది తెలిసిన విషయమే.ప్రతీక దాని స్థానంలో ప్రాతినిధ్యం, సంబంధం, తత్త్వ దర్శనం, సంకేతికార్థం కాదు. సామ్యసిద్ధి తర్కగతమైంది కాదు. నిర్దిష్టమైన లక్ష్యం లేకుండా అర్థపరమైన స్పష్టతను కొంత గూఢతను కలిగి ఉండటం,పదం ఇస్తున్న నిర్దిష్టార్థం కాదు,మొదలైన విలువలు ఉంటాయి.
శివారెడ్డి పై కవితలో ఉపయోగించిన ప్రతీకల్లో మొదట ఉపయోగించిన చీకటి,రాత్రి,భ్రమ మొదలైనవన్నీ సిద్ధప్రతీకలు (proved symbols) గతంలో తెలియనితనం, అజ్ఞానం మొదలైన వాటిని చూడలేనితనం అనే తత్త్వార్థంలో వాడారు. గతంలోని వాళ్ళు వాడారు కనుక ఇవి సిద్ధ ప్రతీకలు.చీకటి ఏమీ కనిపించనితనాన్ని చెబుతుంది. భ్రమ చూడలేనితనం అనే అంశాన్ని ప్రస్తావిస్తుంది. వీటన్నిటి సారాంశం ఒకటే. ఇవి అభ్యుదయ కవిత్వపుకాలంనుంచి కవిత్వంలో ఉన్నాయి.కాని వీటినుంచి బయల్పడడానికి రాత్రికి బదులుగా పగలును,చీకటికి బదులుగా వెలుగును ప్రతిపాదించాలి కాని వీటికి బదులుగా ఊపిరి,గాలి,శబ్దం,సమరశీల జీవితం అనే అంశాలను వ్యతిరేకార్థంలో ప్రయోగించారు. ఊపిరి, గాలి, బంధనాలనుంచి బయటపడే స్వేచ్చని తత్త్వార్థంగా ప్రతిపాదిస్తాయి. శబ్దం గొంతువిప్పి నినదించడాన్ని ధిక్కరించడాన్ని ప్రతిపాదిస్తుంది. సమరశీల జీవితం పోరాటాన్ని ప్రతిపాదిస్తుంది.అందువల్ల ఇవి కవి తానుగా తాననుకున్న సిద్ధాంత భూమికను ప్రదర్శించడానికి ఏర్పాటుచేసుకున్న ప్రతీకలు.
ఇలా శిల్పంలో ప్రతీకలను, ఉపమానాలను,భాషను,శైలిని నిర్మాణ భావనలను అన్నీటినీ గమనించి విశ్లేషించవచ్చు. ప్రధానంగా గుర్తు పెట్టుకోవలసింది మాత్రం వస్తువు దాని వెనుక ఉన్న సామాజిక సాహిత్య చైతన్యాలు శిల్పంపై ప్రభావాన్ని చూపిస్తాయి.
(సేవ సాహితీ సంస్థ వారు నిర్వహించిన శివారెడ్ది సాహితీ సప్తాహంలో చేసిన ప్రసంగంలోని కొంతభాగం)
-ఎం.నారాయణ శర్మ
98483 48502