విద్యార్థులు క్రమశిక్షణతో పరిశ్రమిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు

సాహిత్యం హోమ్

తెలుగు భాష మీద ఆసక్తితో చిన్నతనం నుండి తెలుగును అభ్యసించి, అనేక పురస్కారాలు పొంది, తిరుపతి శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ తెలుగు సహాయాచార్యులు, ఇన్‌-చార్జి శాఖాధ్యక్షులుగా ఉన్న వై.సుభాషిణి, తెలుగును నిరభ్యంతరంగా వృత్తివిద్యగా స్వీకరించవచ్చు అంటున్నారు. వారితో ఈనాటి కరచాలనం.

మీకు తెలుగు మీద ఆసక్తి కలగడానికి కారణం?
నా పూర్తిపేరు డా. యర్రదొడ్డి సుభాషిణి. పుట్టింది పీలేరు, చిత్తూరు జిల్లా. విద్యాభ్యాసం మొత్తం జన్మస్థలమైన పీలేరులోనూ, తిరుపతిలోనూ సాగింది. ఎమ్‌.ఏ.లో ఈనాడు గోల్డ్‌ మెడల్‌ అందుకొన్నాను. 2003 లో యు.జి.సి. నెట్‌ – జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ తో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి. పూర్తి చేశాను. ప్రస్తుతం అదే విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా పని చేస్తున్నాను. మా నాన్న నన్ను డాక్టర్ని చేయాలని కలలుగన్నారు. ఆ ఆలోచనతోనే నన్ను బైపీసీ లో చేర్పించారు. కానీ నాకు తెలుగు మీద ఉన్న ఇష్టం మిగిలిన సబ్జెక్ట్స్‌ మీద ఉండేది కాదు. నేను 9వ తరగతి చదివేటప్పుడు నాకు తెలుగు టీచర్‌ గా శకుంతలగారు ఉండేవారు. ఆవిడ పాఠంచెప్పే విధానం, పిల్లల్ని ఒక తల్లిగా మంచి చెడులను బోధిస్తూ వారిని దారిలో పెట్టడంచూసి నాకు చాలా ఇష్టమయ్యేది. తరువాత నేను శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో డిగ్రీ చదివేటప్పుడు డా. ప్రేమావతి గారు తెలుగును బోధించే విధానం నన్ను బాగా ఆకర్షించేది. ఆవిడ పిల్లల్ని ప్రోత్సహించడానికి పోటీలు పెట్టేవారు. తెలుగులో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి బహుమతులతో ప్రోత్సహించేవారు. అది నాకు ఆసక్తి కలగడానికి మరో కారణం.

మీరు గురువులుగా భావించేవారు?
చాలామంది ఉన్నారు. నా మొదటి గురువులు తల్లిదండ్రులు. ఓనమాలు దిద్దిన దగ్గరనుండి ఈరోజు నేను ఈస్థాయికి రావడానికి నాకు జ్ఞానాన్ని పంచిన ప్రతి ఒక్కరినీ నేను గురువులుగా భావిస్తున్నాను.

తెలుగులో మీరు చేసిన, చేస్తున్న కృషి… వివరాలు?
ఇప్పటివరకు నేను ఆరు పుస్తకాలు ప్రచురించాను. అన్నమయ్య సంకీర్తనలలో వివాహ సంబరాలు, అన్నమయ్య సంకీర్తనలు -వ్యాజస్తుతి, వ్యాజనింద అలంకార పరిశీలన, మఱ్ఱి చెన్నారెడ్డి, బాబు జగజ్జీవన్‌ రామ్‌ ల జీవిత చరిత్రలు, ఆకాంక్ష, అన్నమయ్యకు అక్షరాంజలి అనే పుస్తకాలను ప్రచురించాను. భాష (అంతర్జాతీయ పత్రిక) పత్రికకు ఒక సంపాదకురాలిగా ఉన్నాను. 62 పత్రాలు జాతీయ అంతర్జాతీయ పత్రికలలో ప్రచురించాను. అందులో సాహిత్యప్రస్థానంలో ప్రచురితమైన ‘‘ఎల్లి నవల – గిరిజన స్త్రీ జీవితం’’ అనే వ్యాసానికి కర్లపాలెం రుక్మిణమ్మ పురస్కారం పొందాను. దూర విద్యాకేంద్రం కోర్సు మెటీరియల్‌ రాస్తున్నాను. ఆకాశవాణిలో 14 ప్రసంగాలు చేశాను. వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో 116 పత్రాలను సమర్పించాను. 36 శిక్షణా శిబిరాలలో పాల్గొన్నాను. ‘‘తెలుగు సాహిత్యం – మహిళలు బాలల సమస్యలు’’, ‘’ఆధునిక తెలుగు సాహిత్యం – స్త్రీల హక్కులు’’, అదేవిధంగా మాలతీచందూర్‌ స్మారక ధర్మనిధి సదస్సు, శ్రీపోపూరి వేంకట సుబ్బారావు ధర్మనిధి సదస్సు, శ్రీకేకలతూరి కృష్ణయ్య ధర్మనిధి సదస్సు, రెవరెండ్‌ స్వర్గీయ డా. కటాక్షమ్మ పాల్‌ రాజ్‌ ధర్మనిధి సదస్సులు వంటివి 15దాకా నిర్వహించాను.

మీ విద్యాభ్యాసం నాటికి… ఈనాటికీ విద్యార్థుల్లో వచ్చిన మార్పులు?

చాలానే వచ్చాయి. నాడు పిల్లలకి ఏదైనా పని చెబితే చేసేవాళ్ళు. అది చదవడమైనా, ఇంకేదైనా. నేడు పిల్లల్లో ఆ కమిట్మెంట్‌ తక్కువ. కారణం నేడు ఉన్నంత సాంకేతిక పరిజ్ఞానం నాడు లేదు. కనుక చదువు మీద దృష్టి పెట్టేవాళ్ళు. పుస్తకాలను లైబ్రరీకి వెళ్లి చదివేవాళ్ళు, కానీ నేడు ఏ సమాచారం కావాలన్నా అరచేతుల్లో లభించడంవల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుతూ ఉంది. శ్రమించడం తగ్గింది. ప్రతిదీ సులభంగా లభించాలనుకునే స్వభావం నేటి తరానిది. కష్టపడే స్వభావం నాటి తరానిది.

విద్యార్థులు తెలుగు భాషను ఇష్టంగా చదవాలంటే ఎవరి పాత్ర ప్రధానం?

తల్లిదండ్రులు, టీచర్లు ఇద్దరూ ప్రధాన పాత్రదారులే. ఎందుకంటే ఇంట్లో మొదటి అడుగు వేయించాల్సింది తల్లిదండ్రులు. తర్వాత టీచర్లు. ఆంగ్లం నేర్చుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని కాకుండా తెలుగు బాగా నేర్చుకుంటే ఏ భాషైనా చక్కగా నేర్చుకోవచ్చనేది విద్యార్థులకు తెలియజేయాలి. దీనితోపాటు ప్రభుత్వంకూడా తెలుగు చదివిన వారికి ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పిస్తామనే నియమాన్ని కచ్చితంగా అమలుచేస్తే ఇష్టంగా చదివే అవకాశం ఉంది. ఇటీవల నేను చదువుకున్న పాఠశాలలో పదవతరగతిలో తెలుగు సబ్జక్టులో ఎక్కువ మార్కులు వచ్చినవారికి బంగారుపతకం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఒక లక్షరూపాయలు అందజేశాను. ఇలా ప్రతి ఒక్కరూ విద్యార్థులను ప్రోత్సహిస్తే వారు తెలుగును ఇష్టంగా చదివే అవకాశం ఉంటుంది.

వృత్తిపరంగా తెలుగు భాషను ఎంచుకోవడం వల్ల ఉద్యోగావకాశాలు ఉంటాయంటారా?

కచ్చితంగా ఉంటాయి. వాటిని మనం కల్పించుకోవాలి. కష్టపడితే ఏదైనా సాధించవచ్చునంటారు. అలాగే ఇది కూడా. నేడు నూతన విద్యావిధానం మాతృభాషలకు ప్రాధాన్యతనిచ్చింది. దానికి తోడు సాంకేతికతను అందిపుచ్చుకుంటే తెలుగులో ఎన్నో ఉద్యోగాలను పొందే అవకాశం ఉంది. ఇప్పుడు సి.ఎస్‌.టి.టి., న్యూఢల్లీివారు యంత్రానువాదం ద్వారా సాంకేతిక విద్యను ఆయా మాతృభాషల్లోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. దానికోసం ముందుగా కావలసిన కసరత్తు మాతృభాషీయులే చేయాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉద్యోగ అవకాశాలే ఉన్నాయి. అయితే తెలుగును ప్రొఫెషనల్‌ కోర్సులలో కూడా ఒక పేపర్‌ గా చదివిస్తే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

మహిళా విశ్వవిద్యాలయంలో మీ పాత్ర?

ప్రస్తుతం నేను తెలుగు అధ్యయన శాఖలో ఇన్చార్జ్‌ శాఖాధ్యక్షులుగా ఉన్నాను. నా పర్యవేక్షణలో ఇప్పటివరకు రెండు ఎమ్‌.ఫిల్‌ లు పూర్తయ్యాయి. ఒకరు పిహెచ్‌.డి. పట్టాను అందుకున్నారు. ఒకరు త్వరలో అందుకోబోతున్నారు. ప్రస్తుతం ఇద్దరు పరిశోధన చేస్తూ ఉన్నారు.

మీ భవిష్యత్‌ కార్యాచరణ ఎలా ఉండబోతున్నది?

నాకు కథలు రాయడం ఇష్టం. ప్రస్తుతం ఒక కథను రాశాను. భవిష్యత్తులో రాసే ప్రయత్నం చేస్తాను. కె. నాగభూషణ రావుగారు రాసిన ‘‘ఎ డిస్క్రిప్టివ్‌ అనాలిసిస్‌ ఆఫ్‌ నన్నయాస్‌ యూసేజ్‌’’ అనే గ్రంథాన్ని అనువాదం చేస్తున్నాను.

విద్యార్థులకు మీ సూచనలు… సలహాలు ఏవైనా?

విద్యార్థులు ఏ విషయాన్ని ఆషామాషీగా తీసుకోకూడదు. క్రమశిక్షణతో పరిశ్రమిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను అందిపుచ్చుకొని తెలుగు భాషను, సంస్క ృతిని నిలబెట్టవలసిన కర్తవ్యం విద్యార్థుల మీద ఉంది. తెలుగు చదవడంవల్ల ఉద్యోగ అవకాశాలు లేవని కాకుండా, వాటిని ఎలా పెంపొందించుకోవాలో ఒక ప్రణాళిక రచించుకోవాలి. దానికి తగిన కసరత్తు విద్యార్థులు చేయాలి.

– డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *