వారికి బుద్ది చెప్పాల్సిన సమయమిదే
ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పిలుపు
శ్రీనగర్ : జమ్మూలో మూడు కుటుంబాలు గాంధీ, ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా కుటుంబం హింసను ప్రేరేపించాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. కాబట్టి ఆ మూడు పార్టీల కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌లోని మెంధార్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈసందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికలు గాంధీ, ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా అనే మూడు కుటుంబాల పాలనను అంతం చేయబోతున్నాయని అమిత్ షా పేర్కొన్నారు. ఈ మూడు కుటుంబాలే ఎన్నోఏళ్లుగా జమ్మూలో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే, జమ్మూకశ్మీర్‌లో ఎప్పటికీ పంచాయతీ లేదా బ్లాక్ స్థాయి ఎన్నికలు జరిగేవి కావని అన్నారు. 1990ల్లో ల్లో ఇక్కడి సోదరులు ధైర్యసాహసాలతో బులెె్లట్లను ఎదుర్కొన్నారు. 1947 నుంచి పాకిస్థాన్‌తో జరుగుతున్న ప్రతీ యుద్ధంలో సైనికులు జమ్మూ సరిహద్దుల్లో ఉంటూ దేశాన్ని రక్షిస్తున్నారని అమిత్‌షా సైనికుల త్యాగాలను కీర్తించారు. కేందప్రభుత్వం ఇప్పుడు కశ్మీర్ యువత చేతుల నుంచి తుపాకులు, రాళ్లను తీసేసి, పెన్నులు, ల్యాప్‌టాప్‌లు పట్టుకునేలా చేస్తోందని ప్రశంసించారు. త్వరలో ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తామని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం సరిహద్దుల్లో మరిన్ని బంకర్లను ఏర్పాటుచేస్తామని హావిూ ఇచ్చారు. గతంలో ఇక్కడి పాలకులు పాకిస్థాన్‌ను చూసి భయపడేవారు. కానీ ఇప్పుడు మోదీని చూసి పాకిస్థాన్ భయపడుతోంది. భారత్ పైకి వస్తే ప్రధాని తగిన సమాధానం ఇస్తారని వారికి తెలుసు. అందుకే దేశ సరిహద్దుల్లో కాల్పులు తగ్గుముఖం పట్టాయని షా అన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 18న తొలివిడత పోలింగ్ నిర్వహించగా.. రెండో దశ సెప్టెంబరు 25న, చివరిదశ అక్టోబర్ 1న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలను అక్టోబర్ 8న వెల్లడిస్తారు. జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన ప్రధాని మోదీ తొలివిడత ఎన్నికల్లో భారీగా ఓటింగ్ శాతం నమోదవడంపై హర్షం వ్యక్తంచేశారు. ‘ఇప్పుడు జమ్మూకశ్మీర్ యువత నిస్సహాయులు కారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ఇప్పుడు కశ్మీర్ యువత రాళ్లను వదిలి పుస్తకాలు, పెన్నులు పట్టుకుంటున్నారు. వారికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అంతేకాదు. ఇక్కడి ప్రజలు ఎలాంటి భయం, బెరుకు లేకుండా తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. రెండో విడతలోనూ మరింత ఎక్కువమంది ఈ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొని సరికొత్త రికార్డులు సృష్టించాలని మోదీ పిలుపునిచ్చారు.