జిఎస్టీ చెల్లింపుల్లో అక్రమాల గుర్తింపు
మాజీ సిఎస్ సోమేశ్ కుమార్‌పై కేసు నమోదు
హైదరాబాద్ : తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్‌లో భారీ కుంభకోణం జరిగిందని గుర్తించిన అధికారులు కేసు నమోదు చేసారు. కమర్షియల్ ట్యాక్స్ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపులో అక్రమాలు జరిగాయని గుర్తించిన అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో మాజీ సీఎస్ సోమేష్‌కుమార్‌తో పాటు పలువురు కీలక పాత్ర పోషించారని కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో వందకోట్ల వరకు అక్రమాలు జరిగినట్టు భావిస్తున్నారు. దాదాపు 75 కంపెనీలు ఇందులో భాగమై ఉన్నట్టు తేల్చారు. సాప్ట్‌వేర్ లో మార్పులు చేసి కుంభకోణానికి పాల్పడినట్టు ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలింది. ఇందులో తెలంగాణల బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉందని సమాచారం. ఇందతా అప్పట్లో సీఎస్‌గా ఉన్న సోమేష్‌కుమార్ సూచనలతోనే ట్యాక్స్ పేమెంట్ సాప్ట్‌వేర్‌లో మార్పులు ఇతర చర్యలు తీసుకున్నారని అధికారులు గుర్తించారు. అందుకే ఈ కేసులో సోమేష్‌కుమార్‌తోపాటు ఐఐటీ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, పిలాంటో టెక్నాలజీస్‌పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సోమేశ్‌కుమార్‌పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. పన్ను ఎగవేతదార్లకు వీరు సహకరించడం ద్వారా రూ.వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆశాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఒక్క తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారానే వాణిజ్యపన్నుల శాఖకు రూ.1,000కోట్లకుపైగా నష్టం వాటిల్లగా.. మరో 11 ప్రైవేటు సంస్థలు సుమారు రూ.400కోట్లు ఎగవేసినట్లు ప్రాథమికంగా వెల్లడైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల మేరకు.. మానవ వనరులను సరఫరా చేసే బిగ్‌లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పన్ను చెల్లించకుండానే రూ.25.51కోట్ల ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ తీసుకుని మోసానికి పాల్పడినట్లు తేలిన నేపథ్యంలో వాణిజ్యపన్నుల శాఖ అంతర్గతంగా విచారణ జరిపింది. వాణిజ్యపన్నులశాఖకు సాంకేతికతను అందించే సర్వీస్ ప్రొవైడర్‌గా ఐఐటీ హైదరాబాద్ వ్యవహరించింది. తెలంగాణలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్‌ల్లో అక్రమాలను గుర్తించడంతోపాటు డేటాను విశ్లేషించడం సర్వీస్‌ప్రొవైడర్ చేయాల్సిన పని. పన్నుచెల్లింపు దారుల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సర్వీస్ ప్రొవైడర్ రూపొందించిన ’స్కూట్రినీ మాడ్యూల్’ గుర్తించాల్సి ఉంటుంది. కానీ బిగ్‌లీప్ టెక్నాలజీస్ అక్రమాలకు పాల్పడినా ఈ మాడ్యూల్ గుర్తించలేదు. వాణిజ్య పన్నుల శాఖ అంతర్గత విచారణలో తీగ లాగితే డొంక కదిలింది.బిగ్‌లీప్ అక్రమాల నేపథ్యంలో వాణిజ్యపన్నుల శాఖ నియమించిన ఓ అధికారి గతేడాది డిసెంబరు 26న ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో విచారణ జరిపారు. అప్పటి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రెటరీతోపాటు ఎస్.వి.కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్‌ల మౌఖిక ఆదేశాల మేరకు అక్రమాలను గుర్తించకుండా సాప్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. ఐజీఎస్టీలో అక్రమాలను గుర్తించకుండా సాప్ట్‌వేర్‌లో మార్పులు చేసిన కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు వివరించారు. అలాగే ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలోని ప్లియాంటో టెక్నాలజీస్ సంస్థ వాణిజ్య పన్నుల శాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు నివేదికలో వెల్లడిరచారు. ఈ నివేదిక ఆధారంగా కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను వాణిజ్యపన్నుల శాఖ వివరణ కోరింది. సోమేశ్‌కుమార్ ఆదేశాలతోనే తాము సాప్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని సూచించినట్లు వారిద్దరు వివరణ ఇచ్చారు. వాణిజ్యపన్నుల శాఖకు సంబంధించి తామెలాంటి సాప్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయలేదని ప్లియాంటో టెక్నాలజీస్ సంస్థ వివరణ ఇచ్చింది. ఈనేపథ్యంలో తమ శాఖకు, ఐఐటీ హైదరాబాద్‌కు జరిగిన ఒప్పందం గురించి మరింత లోతుగా వివరాలు రాబట్టేందుకు జనవరి 25న స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌కు వాణిజ్యపన్నులశాఖ ఉన్నతాధికారులు లేఖ రాశారు. పలు లోపాలున్నట్లు ఆడిట్ డిపార్ట్‌మెంట్ నివేదిక ఇచ్చింది. డేటా అంతా ఐఐటీ హైదరాబాద్ నియంత్రణలోనే ఉన్నట్లు.. డేటాలో అవసరమైనప్పుడు మార్పులు చేసేందుకు అవకాశముందని వెల్లడిరచింది. మరోవైపు ఐఐటీ హైదరాబాద్ నిర్వహణలో ఉన్న డేటాబేస్, ఆడిట్ అప్లికేషన్ల గురించి సీడాక్ నుంచి సైతం వాణిజ్యపన్నుల శాఖ నివేదిక తెప్పించింది. ఈనేపథ్యంలో సీడాక్, ఐఐటీ హైదరాబాద్, వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారుల మధ్య జనవరి 30న ఒక సమావేశం జరిగింది. ’స్పెషల్ ఇనిషియేటివ్స్’ పేరిట ఏర్పాటైన వాట్సప్ గ్రూప్ నుంచి ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ ప్రొ.శోభన్‌బాబుకు తరచూ ఆదేశాలు వచ్చేవని ఆ సమావేశంలో వెల్లడైంది. ఆ గ్రూప్‌లో సోమేశ్‌కుమార్, కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్ సభ్యులుగా ఉన్నట్లు తేలింది. వాట్సప్ గ్రూప్ ఏర్పాటు వెనక ఉద్దేశం గురించి వాణిజ్యపన్నుల శాఖ మరోసారి కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్‌ల నుంచి వివరణ కోరింది. సోమేశ్‌కుమార్ పర్యవేక్షణలోనే ఏర్పాటైన ఆ గ్రూప్‌ను 2022 డిసెంబరులోనే నిలిపివేశామని వారిద్దరు సమాధానమిచ్చారు. అయితే 2024 ఫిబ్రవరి వరకు ఆ వాట్సప్ గ్రూప్‌లో కార్యకలాపాలు నడిచాయని తేలడంతో ఫొటోలు, వీడియోలతో కూడిన చాట్ హిస్టరీని సమర్పించాలని వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారులు వారిద్దరికి అత్యవసర మెమో జారీ చేశారు. ఐజీఎస్టీ నష్టాలకు సంబంధించిన పలు నివేదికలను వాటిలో గుర్తించారు. అలాగే జీఎస్టీ చెల్లింపుల్లో అక్రమాల కేసుల్లోనూ రిజిస్టేష్రన్లను రద్దు చేయొద్దనే ఆదేశాలున్నట్లు తేలింది. వారిద్దరి సెల్‌ఫోన్లను ఉన్నతాధికారులు జప్తు చేశారు. వారిద్దరు హైకోర్టును ఆశ్రయించగా వారి పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. మరోవైపు ఫోరెన్సిక్ ఆడిట్ సక్రమంగా జరిగేలా చూసేందుకు ప్రాజెక్టు ఇన్వెస్టిగేటర్‌ను మార్చాలని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్‌కు వాణిజ్యపన్నుల శాఖ లేఖ రాసింది. అలాగే అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎప్పటికప్పుడు ఇచ్చిన సూచనల మేరకే తాము నడుచుకున్నామని పేర్కొంటూ అందుకు సంబంధించిన కొన్ని ప్రతుల్ని వాణిజ్యపన్నుల శాఖకు ఐఐటీ హైదరాబాద్ పంపించింది. ఎస్‌జీఎస్టీ, సీజీఎస్టీలకు సంబంధించిన డ్రాప్ట్ నోటీసుల గురించి మాత్రమే ఆ ప్రతుల్లో ఉన్నట్లు తేలింది. కాశీవిశ్వేశ్వరరావు చెప్పినట్లు ఐజీఎస్టీకి సంబంధించి లేకపోవడం గమనార్హం. ఫోరెన్సిక్ ఆడిట్‌కు సంబంధించి సీడాక్ తుదినివేదిక ప్రకారం.. 75 మంది పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన కార్యకలాపాల్ని ఉద్దేశపూర్వకంగా ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేసినట్లు గుర్తించారు. పన్ను ఎగవేతకు సహకరించేందుకే ఇలా చేసినట్లు తేలింది. చివరకు కాశీవిశ్వేశ్వరరావుపై తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపణలు చేస్తూ వాణిజ్యపన్నుల శాఖకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరగగా అక్రమాలు వెలుగుచూశాయి.
