ఈ నవల జపాన్ దేశపు పురాతన, ఆధునిక సంధి కాలంలో సోసెకి నట్సు మే (1867 – 1916) అనే ప్రఖ్యాత జపనీస్ రచయిత తను మధ్య వయసు నుండి వృద్ధాప్యానికి పరివర్తనం చెందే సంధి వయసులో 1914లో తన మరణానికి రెండు సంవత్సరాల ముందు వ్రాశాడు. ఆయన మరణించిన ఇరవై ఏడు ఏండ్ల తరువాత 1941లో మొట్ట మొదటిసారిగా ఆంగ్లభాషలోకి అనువాదమైన ఈ నవల, తరువాత 1957 మరియు 2020 లో పునర్ముద్రణ కొచ్చింది. అదేవిధంగా 1955లోను 1973లోనూ సినిమాగా కూడా వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రేక్షకులను ఏడ్పించింది.
ఇక మన తెలుగు విషయానికొస్తే 1957లోనే ఆదర్శ గ్రంథమండలివారి కోసం శ్రీనివాస చక్రవర్తి గారు మొట్టమొదటిసారిగా తెలుగులోకి అనువాదం చేశారు. ఆ తరువాత చాలా కాలానికి అంటే 2014లో ‘పీకాక్ క్లాసిక్స్ పబ్లికేషన్స్’ వారు రెండోసారి ప్రచురించగా ఇప్పుడు 2025లో ‘అనిల్ బత్తుల పబ్లికషన్స్’ వారు క్రౌన్ సైజ్ లో మంచి క్వాలిటీతో అందంగా తీసుకొచ్చారు.
__________________
‘కొండ మిరపకాయ చూడడానికి కొంచమే వున్నప్పటికీ, కొరికి చూస్తే తెలుస్తుంది దాని పవర్ ఏమిటో?!’ అన్నట్టుగా ‘కోకొరో’ నవల చూడడానికి చిన్నగానే వున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అటు పాఠకులను ఇటు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అలరించింది.
_____________________
ఈ నవల దాదాపుగా ఉత్తమ పురుష మరియు అలగరి కథన పద్ధతిలో నడుస్తుంది. నవల ఎత్తుగడ నుండి ముగింపు వరకు పాఠకుణ్ణి పంక్తుల వెంట పరుగులు పెట్టిస్తుంది. ప్రధాన పాత్రలు నాలుగే నాలుగు. అందులోనూ ప్రధానమైనది సెన్సే పాత్ర. ఇతనే ఈ నవలకు నాయకుడు. ఎటువంటి నాయకుడంటే మన తెలుగు సినిమా ‘గుడిగంటల్లో’ ఎన్టీఆర్ తరహాలాంటి నాయకుడన్న మాట. కాకపోతే తెలుగు సినిమా ఫార్ములా పరిధి మేరకు ఎన్టీఆర్ పాత్రను మల్చినట్టుగా మలవకుండా నవలా వస్తువు కోరిన విధంగానే ముగింపు నిచ్చిన రచయిత ‘సొసెకి నట్సు మే’ నవలను విషాదాంత ముగింపుతో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో పాఠకులు ఊహించనంత ఎత్తున నవలను, అందులోని పాత్రల తీరుతెన్నులను అద్భుతంగా మలచి, ఓ మరపురాని, మరువలేని గొప్ప క్లాసిక్ గా ప్రపంచ పాఠకుల ముందు నిలిపాడు.
ఓ యువకుడు తన మిత్రునితో గడిపేందుకు ‘కమలారా’ అనే పట్టణానికొస్తాడు. ఇతను వచ్చిన మరునాడే ఆ మిత్రుని తండ్రికి బాగోలేని కారణంగా వెంటనే ఇంటికి రావాల్సిందిగా సమాచారం రావడంతో తను వెళ్ళిపోయినా కొత్త యువకుడు మాత్రం ఆ గదిలోనే వుండిపోతాడు.
సముద్రతీరంలో అతనికి సెన్సే అనే వ్యక్తితో అనుకోకుండా పరిచయం ఏర్పడుతుంది. తరువాత కొద్దిరోజులకే సెన్సే కమలారా నుండి టోక్యో వెళ్ళిపోతాడు. ఆ తరువాత మరికొద్ది రోజులకు ఆ యువకుడు కూడా టోక్యో వెళ్ళిన తరువాత వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఒకనాడు సెన్సే ఇంటికి వెళతాడు. సెన్సే భార్య “తను ప్రతి నెలా ఇదే రోజున జోషిగాయాలోని ఓ సమాధిని సందర్శించడానికి వెళతాడు. ఈరోజు కూడా అలాగే వెళ్లాడని చెబుతుంది. ఆ విషయం విన్న యువకుడు తిన్నగా జోషిగాయా వెళ్ళిపోతాడు.
ఆ యువకుడు పితృవనంలో సెన్సేను కలుస్తాడు. ఆసమయంలో అతని మొహంలో విచిత్రమైన విషాద ఛాయలు ఇట్టే కన్పించి అట్టే మాయమౌతాయి. అదెందుకో ఆ యువకుడికి అర్ధంకాదు. మాటల సందర్భంలో సెన్సే ఆ యువకునితో “ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న మా దంపతులం ‘ఎంతో సుఖపడుతున్నాము’. అనాల్సినదానికి బదులుగా ‘సుఖపడాల్సివుంది’ అంటాడు. ఆ మాటల్లోని భావార్దాన్ని పట్టుకున్న యువకుడు, సెన్సే దంపతుల మధ్య సఖ్యత లేదన్న సందేహానికి లోనౌతాడు. అంతేకాదు వాళ్ళ వివాహం వెనుక ఏదో భయంకరమైన విషాధగాధ, ఏదో రమణీయమైన శృంగారగాథ కూడా వున్నాయని భావిస్తాడు.
ఆ విషయంలో స్పష్టతకోసం సెన్సే భార్యతో కూడా విషయాన్ని ప్రస్తావిస్తాడా యువకుడు. కానీ, ఆవిడకూడా ఎక్కడా బయటపడదు. ఇంతలో ఆ యువకుడికి ఇంటి దగ్గర తండ్రి ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో ఇంటికెళ్ళిపోతాడు. వెళ్ళిన వాడు కాస్తా అక్కడి పరిస్థితుల కారణంగా చాలా రోజులు అక్కడే వుండి పోతాడు. అనుకోకుండా ఒకరోజు ఆ యువకుడికి సెన్సే దగ్గర్నుండి ఓ పెద్ద ఉత్తరం వస్తుంది.
ఆ ఉత్తరాన్ని విప్పగానే “ఈ ఉత్తరం నీ చేతికి అందేసరికి నేనీ లోకంలో లేకుండా పోతున్నాను. నేనీ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో పూర్తి వివరాలు రాస్తున్నాను. చదివిన వెంటనే నా భార్యకు కూడా తెలియనివ్వకుండా దీన్ని చింపేయ్. నేను ప్రతినెలా ఏ సమాధి దగ్గరికి వెళుతున్నానో? ఆ సమాధికి, నా జీవితానికి, నా భార్య జీవితానికి కూడా ముడిపడి వున్న సంబంధమేమిటో నీకు తెలిసిపోతుంది. ప్రతిమనిషీ ఒక బలహీన క్షణంలో తెలిసో, తెలియకో తిరిగి తీసుకోలేనంత పెద్ద తప్పు చేస్తాడు. ఆ తప్పు ఒక్కోసారి ఎదుటి మనిషి ప్రాణాలను కూడా బలికోరుతుంది.
ఒకనాడు నేను చేసిన ఒకానొక పనివల్ల ఎంతో మంచి మనిషి, మేధావి, స్నేహశీలి, ఆధ్యాత్మిక వేత్త అయిన నా ప్రాణ మిత్రుడు కనుమరుగైపోయాడు. ఆ పశ్చాత్తాపంతోనే ఇప్పుడు నేనూ వెళ్లిపోతున్నాను” అంటూ రాసిపెట్టి వుంటుంది.
సెన్సే జీవితంలో మరుగున పడిన అనేక సంఘటనల తాలూకు వివరాలు ఆ ఉత్తరం చదివిన తరువాతనే పాఠకులకు నవలా సారాంశం పూర్తిగా అవగతమౌతుంది. పాఠకులు తప్పకుండా ఆ మిత్రుల మృతికి రెండు అశ్రు బిందువులను చిందిస్తారని భావిస్తున్నాను.
అనిల్ బత్తుల ప్రారంభించిన ‘అనిల్ బత్తుల పబ్లికేషన్స్’ ద్వారా ఇటీవలే వెలువరించిన ‘సైకిల్ దొంగ’ నవల తరువాత వెలువరించిన మరో నవల బహుశః ఇదేనేమో? ముందు ముందు కూడా ఈ సంస్థ నుండి మరిన్ని విలువైన పుస్తకాలు వెలువడుతాయని, పాఠకులను అలరిస్తాయని ఆశిద్దాం.
పబ్లికేషన్స్ : అనిల్ బత్తుల పబ్లికేషన్స్, పుస్తకం కోసం: 81792 73971 సంప్రదించవచ్చు. పేజీలు:110, వెల.రూ.120/- లు.
-శిరంశెట్టి కాంతారావు
98498 90322.
