సృష్టి…తయారు చేయడం చతుశ్శష్టి కళలుగా చెప్పబడుతున్న సృజనాత్మక క్రియలన్నీ సృష్టిని సూచిస్తాయి. మరి మనిషితో సహా ఈ చరాచర సృష్టిని ఎవరు పుట్టించారు? స్టీఫెన్ హాకింగ్ చెప్పే పేరు లేని, రూపం లేని ఒక పరమాద్భుత సంయమన సూత్రం కాదా!
ప్రపంచమంతా శబ్దాల హోరులో మైమరచిపోతుంటే కవి బి.వి.వి.ప్రసాద్ ఆలోచనల నడుమ విరామం యొక్క రూపాన్ని కళ్ళారా దర్శించారు. కన్నీళ్లు, కేరింతల నడుమ అభావస్థితిని అనుభవించినట్టున్నారు.
____________________
సృజనతో పాటు అనువాదం కూడా చేయగల కృత్రిమ మేధ కుప్పిగంతులు వేస్తూ, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని ప్రస్తుత సందిగ్ధంలో మనసు పలికే మౌనరాగాన్ని ఈ కవి శ్రద్ధగా ఆలకించారు. ఇప్పటికే ‘హైకూ’ల కవిగా,తాత్వికునిగా పేరొందిన, బి.వి.వి.ప్రసాద్ సరికొత్త కవిత్వ పుస్తకం ‘సృష్టి’ ని పరిశీలిద్దాం.
___________________
ఏవి మృదువుగా ఉంటాయో, ఏవి, ‘సృష్టి కన్నా బరువైనవో, ఊహ కంటే తేలికైనవో’ (పే.70) వాటిని తన కలం కరంతో ఈ సంకలనంలో స్పృశించారు.
మానవుని ప్రమేయం లేని విశ్వం అపారం, సువిశాలం. అందులో కాంతి తరంగాలు, సముద్ర జలాలు, గాలి, నేల, రోదసి అన్నీ ఉన్నాయి. బుధ్ధి జీవియైన మనిషి సహజమైన ఉత్సుకతతో సశాస్త్రీయంగా ఆ అన్నిటి భౌతిక, రసాయన రహస్యాలు ఛేదించాడు. ధృవ ప్రాంతాల నుంచి మహా సముద్ర గర్భం వరకూ అన్నిటా పాదం మోపాడు. ‘మరి నేనో’ అంటూ కొత్తగా ఏదైనా సృష్టించాలంటే మానవుడు ఏం చేయాలి?? ఈ ప్రశ్నకు కవి తనదైన ముద్రతో ఇలా చెబుతున్నారు….‘ఖాళీ మనసులో’ రంగులు ఒంపి, గీతలు గీసి ఉద్వేగాలతో కలగలిపితే వచ్చేదే బతుకు’ అంటారు(పే.11)
ఇదెలా అని ఆశ్చర్య పోనక్కరలేదు.
‘తెలియక పోవటంలోని హాయి’ అనేది ఒకటి ఉందని తెలుసుకుంటే చాలు, పూర్తి ఎరుకతో మళ్లీ బాల్యావస్థలోకి చేరుకోగలం! అపుడే నిర్మలంగా, ఫలాపేక్ష లేకుండా ఉంటాం (పే.16) అంటారు.
… ‘జీవితానికి లొంగి’, లోబడి ఉండటంలోని అనునాదం ఏమిటో అనుభవంలోకి వస్తే చేసే పనులకు కేవలం కర్తగా మిగిలిపోక, ఆ పనుల ఫలితం లాభమైతే పొంగిపోయి, నష్టమైతే కుంగిపోయే యజమానిలా కాక స్థిరంగా ఉండగల ధైర్యం వస్తుంది.(పే.29)
కొన్నాళ్లు జీవించాక ఇంతకూ ఈ పుట్టుకకు అర్థం ఏమిటి? అనే ప్రశ్న పుడుతుంది. అది అమాంతం ఎదిగి పోతుంది. అప్పటికి తెలుస్తుంది…అరెరే, కేవలం బతకడం గురించే ఆలోచిస్తున్నామే గానీ నిజానికి, మనం మరణం వైపు నిత్యం ప్రయాణిస్తూనే ఉన్నామని, అది తప్పదని.
అలాటప్పుడు ‘’ప్రేమించడానికి మాత్రమే వచ్చాం మరే పని పెట్టుకున్నా నిరర్ధకం’ అని కూడా తెలుస్తుంది అంటారు బి.వి.వి.
బతకడానికి జీతం రాళ్ల కోసం చేసే ఉద్యోగపు అనుదిన యాంత్రికతలో… ‘తమలోకి తాము మునిగి శాంతి పొందే నిద్ర కోసం మరొక రాత్రిలోకి ముడుచుకుంటాం’ అని మన గురించి మనకు స్పష్టంగా వివరిస్తారు(పే.44).
మరోచోట ఆందోళనల గాలికి రెపరెపలాడే మనసును… ‘సహజంగా సరళంగా/జీవితం కోనేటిలో/నీ బిందువులోని ఆకాశాన్ని/ కరిగించటం ఎలానో/నీకు ఎప్పటికీ చాత కాలేదు’ (పే.137) అంటూ హెచ్చరిస్తారు. పై వాక్యాల్లో ఆకాశం ఎంత విస్తృత శూన్యమైనా సరే ఒక బిందువులో పట్టేంత ‘కాసింతే’ అని, ఆ ఉదాసీనతను హాయిగా బతుకు కోనేటిలో వదిలేస్తే చాలంటారు. అలా అభేదం సాధించినపుడు నీటి బుగ్గ ‘ఈకో సిస్టం’ లో మనం ఓ కీటకంలానో, నీటిపిట్టలానో హాయిగా నిండిపోగలం అని అనునయిస్తారు.
‘ప్రేమ ఉంటే’ అనే కవితలో:
“దూర రేఖపై వాలే సూర్యకాంతి
జీవితం ఎంత అందమైనదో
ఇవాళైనా అర్థమైందా” అని దయగా లాలనగా అడుగుతుంది అని చెప్తారు.(పే.166)
‘ఒంటి రెక్కతో ఎగిరే దుఃఖ పక్షులకు’ బివివి మరల మరల వినబడే సాంత్వన గీతం(పే.198). ‘ఇచ్చిపుచ్చుకునే గుంపుల్లో ఉక్కపోస్తుంది సుమా!’ అంటూ హెచ్చరించే పెద్దరికం ఆయన కవిత్వం(పే.218).
ఎవరికివారు తమ ‘మౌనంతో సంభాషణ ఎలా ముగిస్తారు’ అన్నదే ముఖ్యం అంటారీ కవి(పే.226).
“ఎండుటాకుల శబ్దంలో సైతం
అసలు సిసలు
జీవన చైతన్యం దాగి ఉందని,
ఆ ఆకుల గుట్ట మరో పంటకు సారం అందిస్తుంద”ని చెబుతారు.
నేను అపుడపుడూ తత్వ గ్రంధాలు చదువుకుంటూ పొద్దుపుచ్చుతాను. సుమారు 20 ఏళ్ల క్రితం ఒకసారి ఇలా చదివాను… “బుద్ధుడు, కబీరు, జీసస్, వివేకానంద స్వామి, రమణులు అరబిందుడు..వీరంతా జీవన్ముక్తులైనప్పటికీ తాము ఆస్వాదించిన శాశ్వత సత్య మాధుర్యాన్ని తమలోనే అట్టే పెట్టుకోకుండా మానవాళిపై అపార కృపతో మనతోనే ఉంటూ, అనుగ్రహ సంభాషణ దయచేసారు” అని.
బీవివి ప్రసాద్ గారు కూడా అంతే లోతుగా, చిక్కగా ఉన్న భావనలను కవితా పంక్తులుగా వ్రాసి “ఇదిగోనర్రా” అంటూ పుస్తకంలో పెట్టి మనకు అందిస్తారు.
ఈయన అలసిన మనుషుల సేదతీర్చే తమాల తరుఛాయ. విషాద గేయాలు అల్లుకునే బాధాతప్త సున్నిత మనస్కుల గాయాలకు ఓదార్పు లేపనమయ్యే ‘పసుపు’. కంచు మోగినట్టు మోగని కనకం.
_________________
అక్కడ తణుకులో తన ఇంట్లో ఉంటూ, ఈ కవి సముద్రాలకు అటూ ఇటూ కొట్టుమిట్టాడుతున్న ప్రజకు, తాత్వికత – పోస్టుమాడర్నిజం నడుమ జీవన తాత్త్వికత ఉందని గుర్తు చేశారు. తన కవితా పంక్తులలో పడుగు-పేకలా నిజ జీవిత సంఘటనలు – అందలి నిగూఢ సత్యాలు పేని, ఒక అందమైన కవితా సంపుటిని సాహితీ శాలువాగా అందిస్తారు.
_____________________
కలత నిదురలో కలల గజిబిజిలో పాఠకులు ఈ కవితలు చదువుకుని దూరమైన అమ్మానాన్నలని, దూరంగా ఉన్న బిడ్డల్ని పక్కనే ఉన్నట్టు అనుభూతించి, వెచ్చగా నిద్రించే నిండారు శాంతిని పొందవచ్చు. విజయం కోసం పరుగులు తీస్తూ అలసిన స్నేహితులకు ఈ ‘సృష్టి’ అనే కవిత్వ పుస్తకం కానుకగా ఇవ్వొచ్చు. కబీరు ‘దైవం గొప్పతనం చెప్పడం ఎలా??? మూగవాని నోటిలో బెల్లం ఉన్న స్థితి అది’ అంటాడు. బీవివి గారు అంతటి తీపిని, దాన్ని ఆరగించి ఎన్నాళ్ళైనా సరే యధాతధంగా పదాల్లోకి ఒంపి మానవాళికి మానసిక ఆరోగ్యాన్ని అందించే దినుసుగా చేస్తారు. ఇది ఆయన ‘సృష్టి’.

-డా.కాళ్లకూరి శైలజ
98854 01882
