బాలరాముడి నుదిటిపై సూర్య తిలకం
దేశవిదేశాల నుంచి పోటెత్తిన భక్తులు
అయోధ్య : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయంలో ఈసారి శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై కన్పించిన ’సూర్య తిలకం తో భక్తజనం పరవశించిపోయింది. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడి లోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలే 58 మిల్లీవిూటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి. మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపులోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కన్పించింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్టోఫ్రిజిక్స్(ఐఐఏ) శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ(సీబీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ప్రతి శ్రీరామ నవమి రోజున శ్రీరాముడి విగ్రహంపై ఈ తిలకం దిద్దేలా ఏర్పాట్లు చేశారు. అయితే, ఏటా సూర్యకిరణాలు అక్కడే ఎలా పడతాయి? వాతావరణంలో మార్పులు వస్తుంటాయి కదా? గ్రహాల పరిభ్రమణం, సమయం ఒకేలా ఉంటుందా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ సమస్యను అధిగమించేందుకు గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేర్ టీత్ మెకానిజం వినియోగించారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరం ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ నవమి రోజు వారు అనుకున్న చోటుకు తీసుకొస్తుంది. అంతకుముందే ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకన్లతో సహా లెక్కలు వేశారు. ఈ లెక్కల సాయంతో సూర్యకిరణాలు ప్రసరింపజేసే పరికరాలు, వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ 19 ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇకపోతే శ్రీరామనవమి వేడుకలతో ఆధ్యాత్మిక శోభతో అయోధ్య పరవశించింది. రామ్ లల్లా సూర్య తిలకం కార్యక్రమానికి ముందు ఆలయ అర్చకులు బాల రాముడికి దివ్య అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. రామనవమి సందర్భంగా తెల్లవారుజామునే ఆలయం తెలిచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. భక్తులు పోటెత్తడంతో అర్థరాత్రి వరకు ఆలయం తెరిచే ఉంటుందని, మొత్తం 19 గంటల పాటు దర్శన ఏర్పాట్లు కల్పిస్తామని ఆలయ పూజారులు తెలిపారు. ఈ క్రమంలో తెల్లవారు జామున నిర్వహించిన అభిషేకం కార్యక్రమం వేద మంత్రోఛ్చరణల నడుమ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఆలయ అధికారులు ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరోవైపు.. రామనవమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఐదు శతాబ్దాల నిరీక్షణ ఫలించి రామ మందిరంలో బాల రాముడిని పూజించే భాగ్యం లభించిందని ప్రధాని చెప్పారు. ఈ శుభ సందర్భంలో నా హృదయం భావోద్వేగం, కృతజ్ఞతతో నిండిపోయాయన్నారు. ఈ ఏడాది నేనూ, లక్షలాది మంది నా దేశ ప్రజలు అయోధ్యలో రామ్ మందిరాన్ని దర్శించుకున్నాం. ఈ జ్ఞాపకాలు ఇప్పటికీ నాలో శక్తిని నింపుతాయి అని ప్రధాని ట్వీట్ చేశారు.