మట్టి మమకారానికి కవిత్వపు భాష్యం

సాహిత్యం

సీమ అస్తిత్వ పోరాటాన్నే తన రచనల్లో ప్రధానంగా ప్రతిఫలింపజేస్తూ, దశాబ్దాల కరువుకోరల్లో చిక్కుకొని సతమతమవుతున్న ‘అనంత’ దుఃఖంలోని వివిధ పార్శ్వాల్ని కవిత్వంగా మలిచి, ఆ సీమ సుభిక్షం కోసం తాను కన్న ‘జలస్వప్నం’ సాకారం కావాలని తపించే రాయలసీమ సీనియర్ కవి మల్లెల నరసింహమూర్తి.
_____________

ఈ కవి కవిత్వానికి ఎప్పుడూ మానవ జీవననాదమే ఆత్మ అయింది. అది మానవ జీవనపార్శ్వాల్ని బహుముఖంగా ఆవిష్కరించింది. అస్తవ్యస్త సామాజికత అనేక రుగ్మతలతో మనిషిలో రగిలించే వేదనల్నీ వినిపించింది. ప్రకృతితో మనిషి కోల్పోతున్న ప్రియత్వాన్నీ, మట్టితో మనిషి పోగొట్టుకుంటున్న మమతల్నీ వొడిసిపట్టుకొని వాటిని మళ్లీమళ్లీ హృదయాల్లోకి వొంపాలని ఈ కవి కవిత్వం తపిస్తుంది. ఆ కవిత్వమే తాజా సంకలనం ‘మట్టి తంబూర’గా మనకు వినిపించడానికి సిద్ధమైంది.
_____________

మనిషిని బహుముఖాలుగా పెనవేసుకున్న అనుబంధాల మకరందపు మాధుర్యాలను నిండుగా కురిపించింది ఈ కవిత్వం. కాలుష్యంతో కరడుగట్టిన హృదయాల్ని సైతం చెట్ల ఆత్మీయ పలుకులతో, పూల గుసగుసలతో అనుసంధానం చేస్తుంది. జీవన రసరేఖల వైపుకు పయనానికి దిశానిర్దేశం చేస్తుంది. మార్మికత్వపు వన్నెలలో పదాల వెన్నెలను కురిపించినా, విభిన్న జీవనపోరాటాల ధృఢత్వాన్నీ స్పృశించింది. మనిషిని విశ్వాససాయుధునిగా మలిచే మంత్రశక్తి లాంటి దుఃఖానికి ప్రాధాన్యతనిచ్చింది. గంధాలు ఇగిరిపోయిన మానవసంబంధాల కోసం తహతహలాడుతుంది. అందుకే ఏటి చెంపలకాంతుల నిమిరే పున్నమి వెన్నెల, ప్రపంచం గూటిలో వెలిగే ప్రేమదీపం, మట్టిపొరల మమకారపు అరలు, శ్రమజీవన సుగంధం, మనిషి మరమనిషై కూరుకుపోయిన యాంత్రిక మాయాజాలం, అనుబంధాల టిక్ టిక్ లతో అనుదినం అప్రమత్తం చేసే టవర్ క్లాక్, ఎండిన గుండెలోనూ నిండుగా ప్రవహించే పుట్టిన ఊరి ఆపేక్షల నీటిధారలు, విశ్వాసమే జీవన వేదమైన వీధికుక్క, ఆత్మీయానుభూతుల్ని పంచే కట్లపొయ్యి, ప్రతి పుస్తకం ప్రాచీన దేవాలయంలా, ప్రతి పదం శిల్పంలా కనిపించే పాత పుస్తకాల దుకాణం… ఇవన్నీ కవికి కవితావస్తువులయ్యాయి.

కవిత్వం మనిషిని ముందుకు నడిపించే మహత్తర సాధనంగా ఈ కవి భావిస్తాడు. పదాల పూరేకులతో ఆ కవిత్వానికి పట్టాభిషేకం చేస్తాడు. ‘బతుకుపై బలమైన నమ్మకమేదో/ పదిలంగా పరుచుకున్నట్టు/ఒక జీవనది జీవనాదంతో/ మానవ హృదయం ప్రవహిస్తున్నట్టు/ ప్రపంచమంతా నీలో/ఒక జ్ఞానప్రసూనమై పరిమళించినట్టు/ ప్రేమదీపమై వెలుగులు పంచుతున్నట్టు/ రాత్రి చంద్రునితో వెన్నెల బాషలో మాట్లాడినట్టు (కవితో మాట్లాడడమంటే..) అంటూ కవిత్వ పరమావధిని వివరిస్తాడు. ‘అలలపై మనిషి కలల్ని/తన భావాల మిసిమి పూలరెక్కల పడవలపై/ఆవలితీరాలకు లీలగా చేర్చే’ కవి ఇక్కడ కన్నీటి నది అయిపోయాడు. అందుకే కవిత్వం ఇక్కడ బతుకు తండ్లాటలోని పోరు ఊపిరిని ప్రతి మనిషి ఎదలో నాటే దీపాంకురమైపోయింది. ఈ కవికి ఎంతో ప్రియమైన వస్తువైపోయిన నది.. ఎప్పుడూ మనిషి జీవితంతో సంలీనమైపోతూనే వుంటుంది. ‘నువ్వు నడిస్తే నీ నడకే ఒక నది/నువ్వు నడవటమంటే/నది ప్రవహించడమే’ (నువ్వు నడుస్తూనేవుండాలి) అంటూ ఈ కవిత్వం మనిషిలోని జాగరూకతను తట్టిలేపుతుంది. నడవటం చైతన్యవాహినిలో ఎలా భాగమవుతుందో మాట్లాడటమూ అంతే భాగమవుతుంది. అందుకే ‘భూమి పేరుతో/భౌగోళిక సరిహద్దుల పేరుతో/రాజకీయం పేరుతో/ విభజించబడ్డ మనుషులు, గుండె గొంతుకలతో/ పాడుకునేంత వరకూ మాట్లాడుతూనే వుండాలి’ (మాట్లాడాలి) అంటూ మనుషుల హద్దుల్నీ, మనసుల హద్దుల్నీ చెరిపేసేంత వరకూ మాట్లాడిమాట్లాడి వసుధైక సౌందర్యాన్ని సృష్టించే సమయం కోసం తపిస్తుంది.

మనిషితో మమేకమయ్యే మట్టి మమకారం కోసం, ఆ మమకారంలో వికసించే మానవీయ విలువల కోసం అన్వేషిస్తుంది ఈ కవిత్వం. మట్టి తంబూరలో వినిపించే స్వరాలలో మనిషి మూలాలను వెదుకుతుంది. ‘మట్టిని తట్టిచూడు/ నేలపొరల్లో దట్టంగా అల్లుకున్న వేర్ల తంత్రులేవో/మ్రోగుతాయి/మట్టి తంబూరలో దాగివున్న/అనాది ఆదిమ స్వరాలివి’ అంటూ కవి మట్టిలోంచి మానవ జీవన నాదాల్ని వినిపిస్తాడు. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఈ కవిత్వం బహుపార్శ్వాల్లో స్పృశించింది.

‘సకల శ్రామిక వేదిక బహుజనవేదిక’ అంటూ అమరావతిని స్తుతిస్తుంది. ‘అతడు ఒక మట్టి రేణువు/నిశ్శబ్దాన్ని పాటగా మలిచిన వేణువు/ చెమట బిందువు/సృష్టి సౌందర్య సింధువు/ నదుల్ని ఒడిసిపట్టి, పొలాల్లోకి మళ్లించి ధాన్యస్వర్ణం పండించేవాడు/పైరు చెక్కిళ్లకు ఆకుపచ్చ అందం గంధంగా పూసే హరిత స్వర్ణకారుడు’(అతడే సృష్టికర్త) అంటూ బహు సామర్థ్యాల రైతుకు నీరాజనాలర్పిస్తూ అతడిని విశ్వశ్రామికుడిగా కీర్తిస్తుంది.

వలసజీవుల వేదనల్నీ వినిపిస్తూ వారిని నడిచే సముద్రాలుగా అభివర్ణిస్తుంది. ‘ప్రకృతిలో పచ్చగా/చిగురించనంతకాలం/ పక్షుల్లా ఒగ్గొట్టుగా/కలిసి ఎగరనంతకాలం/ వినాశనం అనివార్యం/ప్రకృతి మనిషి కలిసి వికసించాలి’(కలిసి వికసించాలి) అంటూ సామూహిక చైతన్యం ఆవశ్యకతనూ, పర్యావరణ పరిరక్షణనూ చాటిచెబుతుంది.

ప్రపంచీకరణ ప్రభావంతో మారుతున్న సమకాలీన సామాజిక పరిస్థితులు మనిషి తన ఉనికినే కోల్పోయేంతగా అతనిని ఎలా మార్చివేస్తున్నాయో ఆ పరిస్థితుల్ని ఈ కవి కవిత్వం చేస్తాడిలా…. ‘సువిశాల శూన్యసామ్రాజ్యంలో/యాంత్రిక మాయాజాలంలో/మరమనుషులై/పరాయి దేశానికి/కిరాయి మనుషులై/డాలర్ చెప్పుచేతల్లో/కట్టు బానిసలై/గానుగెద్దులై/ బతుకు పచ్చితనం, పచ్చదనం/ అంతస్సారం లేని ఎండుమొద్దులై’ (మరమనుషులు)… డాలర్ గాలంలో చిక్కుకుని విలవిలలాడే బతుకుల దుర్భర స్థితిగతుల్ని తేటతెల్లం చేస్తాయీ కవితాపాదాలు.

‘మనిషి చేతిలో తాను పెంచుకున్న పెంపుడు పిల్లి మతం/ఇప్పుడు పెద్దపులిగా తనమీదికే దూకుతున్న వైనం/తాను ముద్దుగా పెంచుకున్న పంచవన్నెల రామచిలుక మతం/ఇప్పుడు రాబందై పొడుచుకు తింటున్నది’(హంస ఎగిరిపోయింది) అంటూ మనిషే సృష్టించుకున్న మతం ఒక సామాజిక రుగ్మతై మనిషిని ఎంతగా కృంగదీస్తుందో వెల్లడిస్తుంది ఈ కవిత్వం. ఈ కవికి తారసపడిన పలు సందర్భాలూ విలక్షణ పదచిత్రాలై పోయాయి. ‘పాప వాళ్ల అమ్మ రోజూ తన గుండెజోలెలో/పదిలంగా తీసుకొచ్చి/ తరగతి గది అలలపై/పచ్చటి దోనెపై/ పడుకోబెట్టి పోతుంది/పాప నది వీచే ప్రతి అలను ఓ పాఠంగా పాడుకుంటుంది(శిల్ప తరంగిణి)… ఈ కవి ఉపాధ్యాయుడిగా తాను పాఠం చెప్పే క్లాసురూములోకి ఒక తల్లి తన దివ్యాంగ చిన్నారిని రోజూ తీసుకువచ్చే దృశ్యం ఇక్కడ కవిత్వమైపోయింది. కదలలేని శిల్పం లాంటి ఆ చిన్నారిలో నదీప్రవాహాన్ని దర్శిస్తాడు కవి.

_____________

తన ఊరి జ్ఞాపకాలతో కూడిన ఈ కవి నోస్టాల్జియా కవిత్వమూ గమ్మత్తుగా సాగి మన మనసుల్లోకి గత వైభవాల్ని వొంపుతుంది. ‘తొంబైతొమ్మిదేళ్ల ముసలివాణ్ణయినా/మా ఊరి పిలగాణ్ణి/ అక్కడ గాసిన/వెదురులోంచి మలచబడ్డ పిల్లంగోవిని’(మా ఊరి పిలగాణ్ణి) అని ముసిరిపోతాడొకచోట. ‘మా ఊరి పిల్లలు/పిల్లప్పటినుంచి/పెద్ద గడియారమ్మ కొంగు పట్టుకు తిరుగుతూ తిరుగుతూ/ పెరుగుతారు(పెద్ద గడియారం) అంటూ మరొకచోట తన ఊరి టవర్ క్లాక్ ను గుర్తుకుతెచ్చుకుంటాడు. ‘మర్రిచెట్టు లాంటి ఊరు/జ్ఞాపకాల ఊడలలో ఊయలలూగమంటుంది….తెల్లగన్నేరు పువ్వువంటి/బతుకు సారాంశపు నవ్వును/దానం చేసేది వూరు/నా పుట్టుకకు పురిటివేరు’(పురిటివేరు) అంటూ తాను పుట్టినప్పటి తల్లి బొడ్డుపేగుతో ఆ మర్రిచెట్టు వేరును సంలీనం చేస్తాడు.
_____________

‘బతకటం కల అయినప్పుడు/బతకటమే కళ..సూర్యాస్తమమవుతున్నప్పుడు/సూర్యోదయాన్ని/ ఆకాశం కాన్వాసుపై/అందంగా చిత్రించడమే ఆశావాదం’(బతుకు)… ‘ప్రేమబోధివృక్షం నీడలో/మానవ హృదయం/ ధ్యానపుష్పమై వికసించాలి/జ్ఞానపరిమళం వెదజల్లాలి’(ప్రపంచం గూటిలో ప్రేమదీపం) అంటూ ఈ కవిత్వం మనిషికి మార్గనిర్దేశం చేస్తుంది. ‘మీ ఊరి ఆడపిల్లలు/తెరిచిన పుస్తకాల తోటల్లో/సీతాకోకచిలుకలై ఎగరటం చూస్తున్నాను మీ ఊరిలో ఆడవాళ్లు నవ్వటం నిషేధించారు/నవ్వటం నిషేధించవచ్చేమో/మీ గుండెతోటల్లో పుష్పించే ఆలోచనల పువ్వుల్ని ఎలా నిషేధిస్తారు’(మలాలా మౌనఖడ్గమాలా) అంటూ నోబెల్ శాంతిబహుమతి గ్రహీత. స్త్రీచైతన్యాన్నీ, అకుంఠిత ఆత్మవిశ్వాసాన్నీ నిలువెల్లా నింపుకున్న బాలిక మలాలాకు నీరాజనాలర్పిస్తూ సమకాలీనతకు ప్రాధాన్యతనిచ్చింది.

మనిషి జీవితంతో పెనవేసుకుపోయిన పదహారణాల చెట్టును పలువిధాలుగా కీర్తిస్తుంది ఈ కవిత్వం. ‘చెట్టు మహాకవి/చెట్టు మహాజ్ఞాని/ఎన్ని పాటలైనా పాడగలదు/ఎన్ని పాఠాలైనా చెప్పగలదు’ (పర్ణశాల).. ‘చెట్ల నీడల్లో కలలు పరుచుకుంటూ/నడచివచ్చే మనుషులు కూడా దేవతలే’(చెట్టు దయామయి) అంటూ చెట్టు కారుణ్యానికి జేజేలు పలుకుతుంది. ‘ఆకాశం వెన్నెలపూలు పూసినవేళ/ఊడల జడలు వ్రేలాడుతుంటే/గట్టుపైన మర్రిచెట్టు/ తలారబోసుకొని/చెరువుఅద్దంలో సొగసు చూసుకొనువేళ’(ఆకాశం ఫ్రేములో అమ్మ ఫోటో), ‘రైతు నమ్మకానికి/ ప్రతిరూపమై/ పసిపాపనవ్వులా/ప్రవహిస్తున్న నదీప్రవాహం’ (అంటరాని పువ్వులు) వంటి విలక్షణ పదచిత్రాలు మనల్ని ముప్పిరిగొంటాయి.

ఈ కవి పక్షిని దర్శించిన తీరు కూడా విలక్షణంగా కనిపిస్తుంది. పక్షిలేని తనాన్ని అమ్మచేతి స్పర్శకు నోచుకోని పసిపాప ఊయలతో పోలుస్తాడు. పక్షి గుండె చప్పుళ్లు వివిధ పార్శ్వాల్లో వినిపిస్తాయి. ‘ప్రకృతిలో పక్షి కూడా పరిపూర్ణ శిల్పి/ముక్కు ఉలితో చెక్కిన శిల్పం పక్షిగూడు’….‘పిట్టరెక్కల చప్పుడు ప్రకృతి గుండె చప్పుడు /పక్షిపాట ప్రకృతి ఆత్మగానం’…, ‘నీ చిరురెక్కల నీడలో విశాలవిశ్వం దాగున్నది/నువ్వొక దేవతవు పరమాత్మవు’…వంటి ఖండికల్లో పక్షి జీవనసౌరభాలు మన హృదయాల్ని హత్తుకుంటాయి. మనిషిలో మమతానురాగాలను నిండుగా నింపడానికి మానవజీవితంలోని బహు పార్శ్వాల్ని మల్లెల కవిత్వం అలవోకగా నింపుకొని వెన్నెల పదాలుగా ఆవిష్కరించింది. పూలసరాగాలుగా వినిపించింది. తాత్త్విక బోధనలై జాలువారింది. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి జీవననాదాలను శ్రతిశుద్ధం చేస్తుంది ‘మట్టి తంబూర’.

మట్టి తంబూర(మల్లెల నరసింహమూర్తి కవిత్వం),పేజీలు:164, వెల రూ.200/-

కవి మొబైల్: 77801 97294

 

 

– డాక్టర్ కొత్వాలు అమరేంద్ర,
91777 32414

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *