నేడు వాడుకలో వున్న రైల్వే రిజర్వేషన్ రూపకల్పనలో ముఖ్యభూమిక వహించిన ముకుంద రామారావు .. బహుళ జాతీయ సాఫ్ట్వేర్ వ్యవస్థలలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. అనువాద రంగంలో వీరి కృషి అనితరసాధ్యం. ‘అదేగాలి, అదే ఆకాశం, అదే నేల, అదే కాంతి, అదే నీరు’… కవిత్వాన్ని పాంచభౌతిక పదార్థంగా నిర్వచించి దేశ విదేశాల కవిత్వాన్ని స్వయంగా అనుభవించి తెలుగువారు ఆస్వాదించడానికి బృహత్ గ్రంథాలు వెలువరించారు. “శతాబ్దాల సూఫీ కవిత్వం” ద్వారా సూఫీ తత్త్వసారాన్ని తెలుగులోకి వడగట్టి అందించారు. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన కవుల విశిష్ట కవితలను “నోబెల్ కవిత్వం”గా తెలుగులోకి అనువదించి ప్రకటించారు. ఒరియా కవితాస్రష్ట, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ సీతాకాంత మహాపాత్ర గారి సుప్రసిద్ధ కావ్యం “భరతవర్షం” ఆంధ్రీకరించారు. అనేక భాషల ప్రధమ కావ్యంగా గుర్తింపు పొందిన పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాన్ని “చర్యాపదాలు” పేరుతో అనువదించి మహాయాన బౌద్ధ సిద్ధాచార్యుల ఉపదేశాన్ని తెలుగు సాహిత్యానికి అందజేశారు. ఎనభై మంది బౌల్ కవుల 170 కవితలను ‘బెంగాలీ బౌల్ కవిత్వం’ పేరిట గ్రంథస్తం చేశారు. అస్సామీ మియా కవిత్వాన్ని తెలుగువారికి పరిచయం చేశారు. కవిత్వ పరుసవేది విద్య సహజంగా అలవరుచుకున్న ముకుంద రామారావుగారు స్వీయ కవితలను కూడా ఎనిమిది సంపుటాలుగా వెలువరించారు. ముకుంద రామారావు గారు బహుభాషావేత్త, నిరంతరాధ్యయనశీలి. భారతీయ భాషా కవిత్వాలతోపాటు, ప్రపంచ సాహిత్యంలో కవిత్వాన్ని తెలుగువారికి అనితరసాధ్యంగా పరిచయం చేస్తున్న అపురూప సాహితీవేత్త. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, భాషా పురస్కారంతోపాటు అనేక విశిష్ట సంస్థల పురస్కారాలు వీరిని వరించాయి. అజో- విభొ-కందాళం పౌండేషన్ వారు విశాఖపట్నంలో నిర్వహించుకునే వారి 31వ వార్షిక సభలలో ఈ రోజు ‘ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం’ ను అందుకోబోతున్న సందర్భంగా సృజన సాహిత్యం తరపున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రత్యేక వ్యాసం.
_____________________________________________________________________________________________________________________________________________
సాహిత్యానికి సృజన మరియు అనువాదం రెండూ కూడా రెండు కళ్లు. ప్రపంచంలో ఎన్నో భాషలు, సంస్కృతులు, నాగరికతలు, జీవన విధానాలు నడుస్తున్నాయి. వాటిపట్ల సంపూర్ణ అవగాహన, పరిచయం కేవలం అనువాద సాహిత్యం ద్వారానే సాధ్యమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సాహిత్యంలో నిరంతరం సాగుతున్న ప్రక్రియ అనువాదం. ఈ అనువాద రంగంలో ఒక విశిష్టమైన స్థానం యల్లపు ముకుంద రామారావుది. ప్రఖ్యాత భారతీయ సాహితీవేత్తలన్నట్లు ముకుంద రామారావు గారు ఉత్తమ అనువాదకుడు. ఆ కోణంలో ఆయన కృషి ఎంతో విస్తారమైనది, వైవిధ్యమైనది, విశిష్టమైనది.
పంచభూతాల్లా భావించి, ఆయన విడుదల చేసిన ‘అదే ఆకాశం’, ‘అదే గాలి’, ‘అదే నేల’, ‘అదే కాంతి’, ‘అదే నీరు’ అనువాద గ్రంథాల ద్వారా సుప్రసిద్ధులయ్యారు. ఈ ఐదు గ్రంథాలలో ప్రపంచ వ్యాప్తంగా వున్న దాదాపు 5363 మంది కవులను తెలుగు వారికి పరిచయం చేస్తూ, ప్రపంచ భాషల్లో వెలువడిన 3172 కవితలను తెలుగులోకి అనువాదం చేసి, ఎంతో అమూల్యమైన అనువాద సాహిత్య సంపదను తెలుగు నేలకు కానుకగా అందించారు. ఆయన అనువాద గ్రంథాలలో ప్రతి కవిత దేనికదే ప్రత్యేకంగా ఉన్నత ప్రమాణాల రహదారుల్లో నడుస్తూ, సాహిత్యానికి హారతులు పడుతున్నట్లుగా వుంటుంది. ప్రపంచంలోని ఇన్ని భాషల కవిత్వాల అనువాదం ఆయనకు ఎలా సాధ్యమయిందంటే… ప్రపంచ భాషల భావ్యం తెలిసిన మనిషి ఆయన. ప్రపంచంలో కవిత్వం కోసం ఏ కవి, ఏ మూల స్పందించినా, ఆ స్పందనలోని తరంగ ధైర్ఘ్యాల కొలతలను సరిగ్గా కొలవగలిగిన సాహిత్య భౌతిక శాస్త్రవేత్త ముకుంద రామారావుగారు. ఖండం ఏదయినా, దేశం ఏదయినా, భాష ఏదయినా, వెలువడిన ఆ కవిత్వంతో మనసారా కరచాలనం చేసి, అంటిన ఆ తడిని అనువాద ప్రక్రియతో తెలుగు అక్షరాల తలకట్టులకు తలపాగాలుగా మార్చగల సాహిత్య నేర్పరి యల్లపు ముకుంద రామారావు.
ఆయన అనువాదం సాధారణ విధానంలో సాగలేదు. మొదటి దశలో మూల భాషలోని సౌందర్యాన్ని, చమత్కారాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను సంపూర్ణంగా ఆకళింపు చేసుకున్నారు. రెండవ దశలో తాను అనువాదానికి నిర్ణయించుకున్న కవిత, ఏ కవితా శాఖకు సంబంధించిందో గ్రహించుకున్నారు. మూడవ దశలో మూల రచనలోని పదాలు, పదబంధాలు మొదలైన వాటికి లక్ష్య భాషలో సమానార్థకాలను నిర్ణయించుకున్నారు. ఇతర భాషల్లో పదసృష్టికి అనుసరించిన విధానాలను తెలుసుకుని, తన అనువాదంలో తగిన పదాలను సృష్టి చేయటంలో రామారావుది ఒక విశిష్టమైన ఒరవడి. ప్రపంచ వ్యాప్తంగా సుప్రసిద్ధులైన మూల కవుల రచనకు సంపూర్ణ న్యాయం జరిగేలా ఆయన అనువాదం కొనసాగింది. లక్ష్య భాషలోని పదప్రయోగ ఔచిత్యం యొక్క విశిష్టతను చాలా ప్రామాణికంగా తన అనువాదంలో ప్రవేశపెట్టి తన ప్రజ్ఞాపాటవాల జెండాను గగనాన ఎగురవేసిన సాహితీవేత్త ‘ముకుంద రామారావు’.
ఆయన అనువదించిన కవితలలో ఎన్నో విశేషాలు మనతో కరచాలనం చేస్తున్నాయి. నడుస్తున్న కాలం దశాబ్దాలనుంచి, శతాబ్దాలు దాటినా మనుష్యుల మనస్తత్వం మారలేదన్న సత్యాన్ని చాలా ఆలోచనాత్మకంగా తన కవితలో వ్యక్తీకరించిన పోలాండ్ కవయిత్రి ‘విస్లావా సింబోర్కా’. తన కవితల్లో మానవ మనోభావాల చిత్రాలను ఆవిష్కరించిన విధానం అందర్నీ ఆలోచింప చేస్తోంది. చిలీలో పుట్టి స్పానిష్ కవిగా సుప్రసిద్ధుడైన ‘నికనోర్ పారా’… ‘నీకు నచ్చిన శైలిలో / నీకెలా తోస్తే అలా రాయి / ఒకే మార్గం సరైందని నమ్మిస్తూ / వంతెన కింద చాలా రక్తం పారింది / అనుమతులు అన్నింటికీ ఉన్నాయి కవిత్వంలో / ఒకే ఒక్క షరతు తెల్లకాగితాన్ని బాగుపరిస్తే చాలు..’ అంటూ… కవులందరూ గమనించవలసిన గొప్ప మాటను తన కవితలో సెలవిచ్చిన సందర్భం చాలా గొప్పగా వుంది. అమెరికా దేశపు ప్రముఖకవి ‘బిల్లీ కోలిన్స్’… ‘కవిత్వంలో చిక్కేమిటంటే / అది మరింత ఎక్కువ కవిత్వం రాయటానికి ప్రోత్సహిస్తుంది / కవిత్వం నన్ను ఆనందంతో నింపుతుంది…’ అంటూ కవిత్వం మీద పరిపూర్ణమైన ఇష్టాన్ని, ప్రేమను ప్రకటిస్తూ ‘బిల్లీ కోలిన్స్’ రాసిన కవితలు, ఎందరో సాహితీవేత్తలకు గొప్ప స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. ‘ఆత్మకి, ధూళికి మధ్య జరిగే ఒక సంభాషణే – మరణం…’ అంటూ మరణానికి విశేషమైన నిర్వచనాన్ని అందించిన ప్రముఖ అమెరికన్ కవయిత్రి ‘ఎమిలీ డికిన్సన్’, అందించిన కవితలలోని విశేషాలు చాలా ఆకట్టుకుంటున్నాయి.
మణిపురి భాషలో కవితలు రాస్తూ, ఉక్కు మహిళగా పేరొందిన ‘ఇరోం చనూ శర్మిలా’.. ‘జననం’ పేరిట 1000 చరణాల ఒక దీర్ఘ కవితను అందించిన ఈమె, ‘శాంతి పరిమళం’ కవితలో తాను మరణించాక కూడా ఈ లోకానికి శాశ్వతంగా తాను ఎలా ఉపయోగపడాలో వెల్లడించిన భావన చాలా ప్రత్యేకంగా వుంది. ‘నా మాతృభాష అమ్మ నోటిలోనే ఖైదీ అయిపోయింది…’ అంటూ, ‘మాతృభాష దానికదే మరణించలేదు / అది చంపివేయబడుతోంది…’ అంటూ ఆదివాసీ కవయిత్రి ‘జసింత కెరెకెట్టా’ అందించిన కవిత దేశంలోని ప్రతి ఒక్కరిని తీవ్రంగా ఆలోచింప జేస్తోంది. మనుష్య పుథిరిన్ గా పేరుపొందిన తమిళ కవి మానవ జీవిత సత్యాలను, వాటి మూలాలను సాహిత్య పరంగా వెలికి తీయటంలో అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ అందించిన కవితలలో మన కుటుంబ చిత్రపటాలను అందులో స్పష్టంగా ఆవిష్కరించ బడుతున్నాయి. ‘ప్రభాగాణోర్కర్’ ప్రముఖ మరాఠీ కవయిత్రి, విమర్శకురాలు. ఒక మూగజీవి హృదయాన్ని, దాని అమాయకత్వాన్ని ప్రేమగా స్పృసిస్తూ రాసిన ‘యజ్ఞం-మేక’ కవిత, మనచేత కంటతడి పెట్టిస్తోంది.
2011లో సాహిత్యానికి నోబెల్ బహుమతికి అర్హుల జాబితాలో చేర్చిన పేరు కె. సచ్చిదానందన్. యుద్ధంలో పనిచేస్తున్న ఒక సైనికుడి నుండి తన తల్లికి చేరిన వుత్తరంలోని సంగతులను ఒక కవితలో ఆయన అందించిన తీరు, ఆయన కలం ఏకంగా సూర్యకాంతిని జయించిందా? అనిపించేలా వుంటుంది.
హిందీ, పంజాబీ భాషల్లో కవితలు అందించిన గుల్జార్, ఒక నిజమైన దేశభక్తుడి ఛాయా చిత్రాన్ని ఘనంగా చిత్రీకరించిన కవితలో..ఒక గొప్ప దృశ్యం మనతో మాట్లాడి, మనల్ని ఎంతగానో ఆలోచింప చేస్తుంది. అరబ్బీ కవి ‘ఖలీల్ జీబ్రాన్ ‘ కవిత్వం గురించి తన భావాలను వ్యక్తపరుస్తూ… ‘కవిత్వమంటే అభిప్రాయ ప్రకటన కాదు / రక్తం స్రవించే గాయంనుంచి / వెలువడే ఒక పాట…’ అంటారు. కవిత్వాన్ని గురించి ఇంత గొప్పగా చెప్పిన ప్రపంచ కవి మరొకరు లేరేమోననిపిస్తుంది.
జపాన్ కవి ‘షుంతారో తనికవ’, తన కవితలో కుక్కను కథానాయకుడ్ని చేసి, కుక్కలోని ఒక మహోత్తరమైన గుణాన్ని, ఆ గుణాన్ని మానవజాతి అలవరచుకోవలసిన అవసరాన్ని మర్మగర్భంగా తన కవితలో చెప్పిన విధానం ఒక పాఠంలా మనకు నిత్యం వినిపిస్తూనే వుంటుంది. ఒక స్త్రీ కన్నీళ్లను మన కళ్లముందు ఆవిష్కరిస్తున్న టర్కీ దేశపు కవయిత్రి ‘ముయెస్సెర్ యెనీయ్’. తరతరాల స్త్రీల శోకాన్ని తన కవితలో ప్రవహింపచేసిన భావవ్యక్తీకరణ చాలాకాలం పాఠకులకు గుర్తుండిపోతుంది.
20వ శతాబ్దపు అత్యంత ప్రతిభావంతుడైన కవి ‘కవాఫీ’, మానవ జీవితంలో కిటికీ అవసరాన్ని కవిత్వంలో అందంగా బంధించిన ఆయన శైలి, కవిత్వం రాసే విధానానికి ఒక శాసనంలా నిలిచిపోతోంది. ‘అడోనిస్’ గా పిలువబడే అలీ అహ్మద్ సయీద్ అసబర్, మరణానికి సంబంధించిన ఒక రహస్యాన్ని గురించి ఇలా చెబుతారు… ‘మృత్యువు మనల్ని కౌగిలించుకొని / నిరాడంబరంగా నిశ్చితంగా / దాని రహస్యాలతో రహస్యంగా మనల్ని రవాణా చేస్తుంది / మన అనేకత్వం నుండి ఏకత్వాన్ని తయారు చేస్తుంది…’ అంటూ ఈ కవిత ముగిస్తుంది. తూకం వేయటానికి సాధ్యంకాని తాత్వికతను కవిత్వపరంగా లోకానికి అందించిన గొప్ప కవి ఈయన.
ఇలా వేలాది కవితలు అత్యున్నత ప్రమాణాలతో ఒక జీవనది ప్రవాహంలా ముకుంద రామారావు అందించిన పుస్తకాలలో ప్రవహిస్తూనే వున్నాయి. ప్రపంచంలోని ఇన్ని భాషల కవిత్వాన్ని తన మాతృభాష తెలుగులోకి అత్యంత సమర్థనీయంగా, మాతృక కవిత అస్తిత్వానికి, ఆ హృదయ సౌందర్యానికి, ఆ భాషా సొగసులకు, ఏమాత్రం భంగం కలగని మహెూత్తరమైన రీతిలో ఈ అనువాద ప్రక్రియను వీరు దిగ్విజయంగా నిర్వహించారు.
అత్యంత విలువైన ప్రపంచ దేశాల కవిత్వాన్ని చదివి ఆస్వాదించే అవకాశాన్ని, అదృష్టాన్ని ఈ తరానికే కాదు, రాబోయే తరాలకు సైతం కల్పించిన సాహితీమూర్తి ముకుంద రామారావు. అజో- విభొ-కందాళం పౌండేషన్ వారి ద్వారా అనువాద సాహిత్యానికి అందుతున్న అరుదైన గొప్ప గౌరవం ఇది.
-డాక్టర్ కె.జి. వేణు,
98480 70084
