మగవాళ్ళకు అమ్మ తరువాత అధికంగా ప్రేమ ఉండేది కూతురుపైనే. మధ్యలో వచ్చే భార్య మీద ఉండదా అంటే ఉంటుంది. కానీ కూతురు మీద ఎనలేని మమకారం చూపించడం మగవారి రక్తంలో సమ్మిళితమైన అంశం. అమ్మ మీద ప్రేమ, అమ్మతో జ్ఞాపకాలు ఆజన్మాంతం ఉంటాయి. మధ్యలో తన అనురాగాన్ని, ప్రేమనీ తోడునీడయిన ప్రేయసి మీదనో, భార్య మీదనో చూపుతాడు. ఇక ఆడబిడ్డ పుట్టిందంటే ఆనందమే ఆనందం. ఆమె తోడిదే జీవితం, ఆమె కోసమే జీవితం, ఆమె లేనిదే జీవితం లేదనుకునే సున్నిత హృదయ మనస్కుడు నాన్న. అలాంటి నాన్న, కూతురుపై ప్రేమ చూపడమే కాదు బాధ్యతగా వ్యవహరించడం ఎంత అవసరమో జాలాది రత్నసుధీర్ చెబుతారు. తనని తాను సంపూర్ణంగా అర్పణ చేసుకునే నాన్నతో కూతురు బంధం ఎలా ఉంటే పరిమళిస్తుందో లలిత లలితంగా సృజించిన లేఖల సమాహారం ఈ పుస్తకం.
రత్నసుధీర్ ఇదివరలో మాతృమూర్తుల పాత్రని వివరించే ‘అమ్మ చెక్కిన శిల్పం’ పుస్తకం రచించారు. సమాజ నిర్మాణంలో, గొప్ప వ్యక్తుల మూర్తిమత్వంలో తల్లుల పాత్రని వివరించారు. ఇపుడు ఈ పుస్తకం ద్వారా తండ్రుల పాత్రని దృశ్యమానం చేశారు. కూతుళ్ళ జీవనంలో తండ్రి పాత్ర ఎంత ఉదాత్తంగా ఉండాలో చెప్పిన సంవిధానం ఈ పుస్తకం ప్రత్యేకత. కవి, కథకుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, అన్నిటికీ మించి లోకాన్ని, మనుషుల్ని సానుకూల దృష్టితో పరికించే స్వభావి రత్నసుధీర్. తన మాటల్లోనూ, రాతల్లోనూ అంతే లాలిత్యం, నెమ్మదితనం, ఆత్మీయరావం వినిపిస్తాయి. ఈ విషయాన్ని మరోసారి నిరూపించిన ఓ మంచి పుస్తకమిది.
కుమార్తెకు ప్రేమతో నాన్న రాసిన ఉత్తరాల గుచ్ఛం ఇది. ‘పుట్టని బిడ్డకు తల్లి ఉత్తరం’ అని ఓ నాలుగు దశాబ్దాల కిందట తెలుగులో ఓ పుస్తకం వచ్చింది. అది ఆ కాలపు స్థితికి ప్రతీక. కానీ ఇవాళ ఆడబిడ్డల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నది మగప్రపంచం. ఇంటా బయటా వివక్ష, పీడన, పెత్తందారీ పోకడలు ఎన్ని ఉన్నప్పటికీ ఆడపిల్ల పుట్టుకను తన జీవన సాఫల్యంగా, జీవితోత్సవంగా పరిగణించే నాన్నలు ఉన్నారు. కూతుళ్ళ కోసం తమ వృత్తి ఉద్యోగాలను మార్చుకునే వారు ఎందరో! భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం ఇవాళ సర్వసాధారణం. అలాంటప్పుడు పిల్లల పోషణ, పెంపకం బాధ్యతను కేవలం తల్లికే వదిలేయడం కుదరదు. దీనిని గుర్తించినందునే ఇంటిపని, వంటపని, పిల్లల పనిలో క్రియాశీలపాత్రను పోషించే నవతరం తండ్రుల కాలమిది. ఈ క్రమాన కూతుళ్ళ మీద మరింత శ్రద్ధాసక్తులు చూపుతున్నారు. ఉమ్మడి కుటుంబాల స్థానంలో వ్యష్టి కుటుంబాలు వచ్చాయి. ఇంట్లో అమ్మ, నాన్న, ఇద్దరో ముగ్గురో పిల్లలు. అంతే తప్ప అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలకు ఇంట్లో చోటు లేదు. మేనమామలు, బాబాయిలు, పిన్ని, మేనత్త వంటి వారు చాలా దూరపు బంధువులయ్యారు. వీళ్ళంతా ఒకప్పుడు కుటుంబంలో భాగం.సన్నిహిత బంధువులు. పిల్లలు అమ్మమ్మ, తాతయ్యలతో మంచీచెడు చెప్పుకునేవారు.కష్టం, సుఖం పంచుకునేవారు. బాబాయిలు, మేనమామలు, మేనత్తలను సన్నిహితులుగా భావించేవారు. మనసులోని మాటను చెప్పుకునే ఆత్మీయులుగా తలపోసేవారు. ఇవాళ మన కుటుంబాలలో ఆ దృశ్యం లేదు.
ఈ నేపథ్యంలోనే తండ్రి బాధ్యత పెరిగింది. పిల్లల పట్ల ఆపేక్ష, అభిమానం ఉండగానే సరిపోదు. బంధాన్ని బాధ్యతతో పటిష్టంగా మలుచుకోవాలి. ఇది బతుకంతా నిరంతర సాధన. అసంకల్పిత అనురాగ కలాపం. దీన్ని సరిగ్గా గుర్తించారు జాలాది రత్నసుధీర్. అందువలన పురుషుడు తండ్రిగా జన్మ ఎత్తాక తను చనిపోయేవరకు కూతురుకు అండదండగా, రక్షణగా, ఎలాంటి షరతుల్లేని అనురాగమూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తారు.
కూతురు జన్మించడంతోనే తండ్రి జీవితం మారిపోతుంది. అప్పటివరకు కొడుకుగా, భర్తగా పోషించిన పాత్రల కన్నా భిన్నమైంది నాన్న పాత్ర. తన చివరిక్షణం వరకు తల్లడిల్లే హృదయంతో నిర్వహించాల్సిన ఈ పాత్ర అతని సమస్త జీవితాన్ని మార్చేస్తుంది. ఈ మార్పు క్రమం ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో కూతురుకు రాసిన పది ఉత్తరాల్లో హృదయంగమంగా అభివ్యక్తం చేశారు రత్నసుధీర్.
____________
ఈ ఉత్తరాలు అనేకానేక అంశాలతో మిళితమై ఉన్నాయి. కూతుళ్ళ శైశవం, బాల్యం,కౌమారం,తొలి యవ్వనప్రాయం వంటి దశల్లో ఇంటా బయటా తండ్రుల, కూతుళ్ళు పాత్రని చర్చించారు. వాస్తవ జీవితంలోని అనేక పాత్రల్ని తన లేఖల్లో ప్రవేశపెట్టారు. వారి స్ఫూర్తిదాయకమైన జీవనరీతిని వివరించారు. ఆయా సందర్భాల్లో తండ్రులు, కూతుళ్ళు ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలిచిన వైనానికి చిత్రిక పట్టారు. ఈ చెప్పే క్రమంలో ఆర్ద్రత,ఆత్మీయత, అనురాగ భరితమైన వాక్యనిర్మాణం జాలాది రత్నసుధీర్ వచనరచనలోని ప్రత్యేక ఆకర్షణ. ఈ ఉత్తరాలు చదువుతుంటే చలం తన కూతురు సౌరిస్‌కు రాసిన లేఖలు, సౌరిస్ తండ్రి గురించి చెప్పిన మాటలు స్ఫురణకొచ్చాయి. వాక్యాలకు పరిమళాన్ని అద్దిన నాన్న గుండెల్లోని ప్రేమ పొంగుకు నిదర్శనంగా నిలిచే పుస్తకమిది.
____________
లెక్చరర్‌గా పనిచేస్తున్న ఓ తండ్రి ఐపిఎస్ శిక్షణలో ఉన్న కూతురుకు రాసినట్టుగా ఉన్న ఈ ఉత్తరాలు తెలుగులో లేఖాసాహిత్య పరిపుష్టతకు తోడ్పడతాయి. ఉత్తరాల ద్వారా మనుషుల హృదయాల్ని స్పర్శించడం ఎలానో తెలుస్తుంది ఈ పుస్తకం చదివితే. సంక్లిష్టం, సంక్షుభితమైన ఈ సమాజంలో తండ్రులకు కర్తవ్యాన్ని, కూతుళ్ళకు క్రమశిక్షణను చెప్పకనే చెప్పేందుకు రచయిత ఎంచుకున్న ఈలేఖారచన పద్ధతి ఫలవంతమైంది. బోధిస్తున్నట్టుగా కాక ఆత్మీయంగా, మనసును ఆకట్టుకునేలా సృజించడం ఈ ఉత్తరాల ప్రత్యేకత.
తండ్రీ కూతుళ్ళ సంబంధం ఎలా ఉండాలో మాత్రమే కాదు, కుటుంబంలో తండ్రి ఎంత బాధ్యతగా మెలగాలో చెప్పడం ఈ ఉత్తరాల వైశిష్ట్యం. కూతురు మీద ప్రేమ చూపగానే సరిపోదు. భర్తగా, కొడుకుగా కూడా తన పాత్రల్ని చక్కగా నిర్వహించాలి. కుటుంబంలో అందరినీ కలుపుకొని పోగలగాలి. కూతురు తండ్రి నడవడికను, మాటలనీ, రోజువారీ జీవనసరళినీ గమనిస్తుంటుంది. తనను ఎంతో ప్రేమగా చూసే తండ్రి భార్య పట్ల కటువుగా వుంటే ఆమె మనసు గాయపడుతుంది. భార్యాభర్తల మధ్య ఎడం వల్ల పిల్లలకు వివాహవ్యవస్థ మీద విశ్వాసం సన్నగిల్లుతుంది. స్త్రీ పురుష సంబంధాల పైన సరయిన అవగాహన లోపిస్తుంది. అందువలన కూతురు మీద ప్రేమ చూపే తండ్రి కుటుంబంలో మరింత బాధ్యతతో, ప్రేమతో సున్నితంగా వ్యవహరించాలి. అపుడే కుటుంబ జీవితం బాగుంటుంది. బతుకు మీద ప్రేమ ఇనుమడిస్తుంది. మమతానుబంధాలు వెల్లివిరుస్తాయి. ఒకరికోసం ఒకరం అనే భావన బలీయమవుతుంది. మరో ఇంటికి వెళ్ళే కూతురు బాధ్యతగా, ప్రేమగా వ్యవహరించడం నేర్చుకుంటుంది.
ఇవన్నీ సుబోధకంగా, మనసు మెచ్చేలా, నిజమే కదా ఇలా ఉండాలి కదా అనిపించేలా రాసిన తీరు ఈ లేఖలకు ప్రత్యేక అందాన్ని ఇచ్చింది. ఈ లోకంలోకి పిల్లల్ని ఆహ్వానించేవారు తప్పనిసరిగా ఈ పుస్తకం చదవాలి.
ఇదివరలో పెళ్ళయ్యే వారికి రెండు పుస్తకాలు బహుమతిగా ఇస్తే బాగుండేది అని తలపోసేవాడిని. ఒకటి చలం ‘స్త్రీ’, రెండు చలం ‘బిడ్డలశిక్షణ’. ఇపుడు మూడో పుస్తకంగా ‘కుమార్తెకు ప్రేమతో నాన్న’ అనే పుస్తకం బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నా. పెళ్ళిళ్ళ సమయంలోనూ, పిల్లల పుట్టినరోజుల వేడుకలోనూ ఈ పుస్తకాన్ని బహుమతిగా అందించండి. ప్రతి ఇంటా, ప్రతి దశలో ఉండాల్సిన పుస్తకమిది.
ఈ పుస్తకాన్ని ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి కూతురు, ప్రతి కొడుకు, ప్రతి భర్త చదవాలి. అంటే మన ఇంట ఉండవలసిన పుస్తకమిది. ప్రతి ఇల్లు అనురాగాల పొదరిల్లుగా పరిఢవిల్లడానికి ఉపకరించే ప్రేమైక ఉత్తరాల మాలిక ఈ పుస్తకం. తండ్రీకూతుళ్ళ బంధాన్ని ప్రతిఫలించడమే కాదు, కుటుంబ సంబంధాల ఉన్నతికి ఉపకరించే ఈ పుస్తకాన్ని రచించిన జాలాది రత్నసుధీర్‌కు అభినందనలు.
– గుడిపాటి
94900 99327
(నేడు ఇంటర్నేషనల్ డాటర్స్ డే)