కవిత్వాన్ని కప్పుకునే వస్తువు

సాహిత్యం

కవులు స్మృతుల్లో తిరగాడుతుండడం కొత్త కాదు. అసలు కవిత్వానికి ఆరంభ బిందువే స్మృతి. అది వ్యక్తుల స్పూర్తి కావచ్చు, ప్రాంతాల స్మృతి కావచ్చు. బాల్య స్మృతి మీద కవిత్వం రాయని సాహిత్యకారుడు ఏ భాషలోనూ ఉండడు. ఆ మాటకొస్తే ప్రతి ఆధునిక తెలుగు కవి తమ ఊరిని గురించి, తమ బాల్యం గురించి రాశారు. ప్రత్యేకంగా తమ ఊరి గురించి ఒక కావ్యం రాసిన వాళ్లు కూడా ఉన్నారు. అలా రాసిన వాళ్ళల్లో ఎన్ గోపి, ఆ తర్వాత గోపగాని రవీందర్ ఎన్నదగినవారు. మా ఊరొక మహాకావ్యం తర్వాత ఎన్నదగ్గది మా ఊరొక కావ్యం. గోపగాని రవీందర్ మా ఊరొక కావ్యంలో ఉన్న 36 కవితలూ వస్తురీత్యా వారి ఊరి స్మృతులే.

కావడానికి అది తిమ్మాపూర్ హవేలీ కానీ అందులో ప్రతి ఒక్కరూ తమ ఊరిని దర్శించుకోగలగడం ఈ కవి తీసుకు రాగలిగిన సార్వత్రికత. సిగ్మాండ్ ఫ్రాయిడ్ బాల్యాన్ని భవిష్యత్తు జీవితమనబడే రోజుకు ప్రభాతం లాంటిదంటాడు. నిజానికి వెనక్కి తిరిగి చూసినప్పుడే తీపి కానీ, ప్రతి వర్తమాన బాల్యమూ తీపిగానే ఎందుకుంటుంది? మ్యాగ్జిమ్ గోర్కి తండ్రి మరణించాక తల్లితో పాటు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరు, ఆ ఇల్లు తమర్ని అక్కున జేర్చుకుంటుందని అనుకుంటాడు. కానీ తొందరలోనే భంగపడతాడు. భారతీయ పురాణాలు కూడా ఇందుకు భిన్నమైన బాల్యాలను ఏమీ చిత్రించలేదు. హిరణ్య కశ్యపుడి కొడుకు ప్రహ్లాదుని బాల్యం ఎలా గడిచింది? కృష్ణుడి జనన కాలపు స్థితిగతులేమిటి? అయితే ఒక వ్యక్తి వ్యక్తిత్వం, ఔన్నత్యం స్థిరపడ్డాక అతని బాల్యం చర్చకు వస్తుంది, ప్రేమపూర్వకంగానే. అందుకే ప్రతి వ్యక్తి తన బాల్యాన్ని తన ఊరిని స్మరించినప్పుడు మహాద్భుత రసవత్ కావ్యం లానే ఉంటుంది, కవులకు మరీ ప్రత్యేకంగా. అందుకే గోపగాని రవీందర్ ఊరిని personify చేస్తూ ఒకచోట అంటాడు.

‘నీ అంతరంగాన్ని అందుకోవాలనే
పాదచారినై సంచరిస్తున్న
అందని ద్రాక్షవు మాత్రం
ఎన్నటికీ కావు… కానీయను
నిన్ను మరిచిన జ్ఞాపకమే లేదు
నాకు ఇంతవరకు…!’

అని తిమ్మాపూర్ అడుగుజాడలను నెమరు వేసుకుంటాడు. ‘మట్టి పొత్తిళ్లలో’ అనే కవితలో ఊరి సావడిగడ్డని తలపోస్తాడు. ‘నా తత్వం నీ దేహమే’ అనే కవితలో ఊరిలో గడిచిన బాల్యాన్ని కవిత్వం చేస్తాడు. ‘అమృత ధారలలో’ కూడా చిన్నతనమే వస్తువు అయింది. ‘కాలగర్భంలో’ అనే కవితలో కుమ్మరి వాళ్ళ పనితనం గురించి చెబుతూ ఊరి సమస్త అవసరాలను తీర్చిన మట్టి పని గురించి ఇలా రాసాడు.

‘పెళ్ళికొడుకు చేతిలో
గరిగబుడ్డి కావాలన్నా
కూరలు వండేందుకు
కంచులు కావాలన్నా
బువ్వ తినే చిప్పలు కావాలన్నా
చివరాఖరికి చావుకాడికి
కుండ కావాలన్నా
ఊళ్లోనే కుమ్మరింటికి పోవుడే’

ఒక కవిత కచ్చితంగా ఈ పరిమితుల్లో ఉంటుందని చెప్పడానికి అవకాశం లేని శీర్షికలు ఈ సంపుటి నిండా ఉన్నాయి. చాలా శీర్షికల్లో వస్తువు ఒకదాని నుండి ఒకదానికి ఓవర్ లాప్ అవ్వడానికి అవకాశం ఉన్న కావ్యమిది. ‘జమ్మి చెట్టు… పాలపిట్ట’ అనే కవితలో దసరా పండుగ గురించి, కోలాటాల గురించి రాస్తే, ‘అక్షర యోధులు’ కవితలో కూడా మాటలుగా కథలుగా కన్నీళ్లుగా చిత్రాలుగా వ్యాసాలుగా సందేశాలుగా వ్యాఖ్యానాలుగా మనతో కరచాలనం చేస్తాయని మనుషుల వ్యక్తిత్వాలను గురించి చెబుతారు. ఇంకొక చోట తొలకరి జల్లుతో పులకరించిన అడవి అంతా పచ్చదనాన్ని సంతరించుకొని పరవశిస్తున్న సంగతి చెబుతాడు. ఇదంతా ఒక వస్తువు కాదని చెప్పడానికి అవకాశం లేని పరిస్థితిని సూచిస్తుంది.
________
నిజానికి నోస్టాల్జియా ఒక ఒడవని ముచ్చట, ఎడతెగని ప్రేమ ధార. అలివర్ గోల్డ్ స్మిత్ తన ఊరిలో ఒక మొండి గోడ మీద రాసుకున్న తన పేరును చూసి పులకించినప్పుడు రాసిన కావ్యమే డిజర్టెడ్ విలేజ్ గా సాహితీ లోకంలో ప్రసిద్ధి చెందింది. అందుకు కారణం నాస్టాల్జియాలో ఉన్న భావ తీవ్రత. ఆ తీవ్రత స్థాయిని బట్టి ఉన్నప్పటికీ, గాయాన్నిబట్టి ఉన్నప్పటికీ ప్రతి కవికి అదొక శక్తివంతమైన ఆయుధంగానే బయటపడుతుంది. గోపగాని రవీందర్ కూడా ఒక దీర్ఘ కావ్యం రాయాల్సిన వస్తువును దీర్ఘకావ్యంగా కాకుండా ఖండకావ్య సంపుటిగా రాసి పాఠకుడిని ఒకింత విరామంతో, వ్యవధానంతో చదువుకోగలిగే విధంగా రాయడం లక్ష్యంగా సృజించాడని అర్థమవుతుంది.
________
ఆయన తన కావ్యానికి శీర్షికగా ఉంచిన మా ఊరొక కవితలో:

‘చూడముచ్చటైన
రమ్యమైన దృశ్యాలు
తోచినకొద్దీ చలమలో నీళ్లూరినట్లుగా
చెప్పినకొద్దీ రాసిన కొద్దీ
ఒడవనివి మా ఊరి గూర్చిన ముచ్చట్లు’

అని సంతృప్తి చెందడంతోనే సరిపోదని ఈ కవికి తెలుసు. అందుకే ఊరు ఎలాంటి చరిత్రను దాటి వచ్చిందో కూడా చెబుతాడు.

‘నిర్బంధాలను తట్టుకొని
నిలబడింది ఊరు
అధిపత్యాల తాకిడితో
రాటుదేలింది ఊరు
నిటారుగా ఎదగడానికి
ఊపిరినిచ్చింది ఊరు
సామూహిక జీవనానికి
ప్రతీకైంది ఊరు
కట్టు తప్పనిది మడమతిప్పనిది ఊరు
తంగేడు పువ్వుల నవ్వులతో
మోదుగు పూల పులకరింతలతో
నాకెప్పటికీ మా ఊరు
ఒక కావ్యంలా
దృశ్యమానమవుతూ హత్తుకుంటున్నది…!’ అంటాడు.

ఒక సగటు పల్లెటూరిలోని ఆటపాటలు, సాంస్కృతిక జ్ఞాపికలు, వ్యక్తుల మధ్య ప్రేమలు, ఆదాన ప్రదానాలు, వేదనలు, ఆవేశకావేషాలు తిమ్మాపూర్ హవేలీ ద్వారా పాఠకుల కళ్ళకు కట్టాడు కవి. అయితే ఇవన్నీ అన్ని ఊర్లకు వర్తిస్తాయి. సమానంగా వర్తించకపోయినా ఈ సారమే ఉంటుంది.
ఊరు, బాల్యం, వర్షం, ప్రేమ అమ్మ, నాన్న లాంటి సార్వజనీన సార్వకాలీన విషయాల మీద రాసిన ఏ కవిత టచింగ్ లేకుండా ఉండదు. ఆ రకంగా ఈ విషయం మీద రాయడం కవికి కలిసొచ్చే అంశం. గోపగాని రవీందర్ కు కూడా మా ఊరు ఒక కావ్యం ద్వారా తన అంతరంగంలోని కవిత్వ దాహాన్ని తీర్చుకోవడానికి అవకాశం దొరికింది.

 

 

– ఏనుగు నరసింహారెడ్డి
89788 69183

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *