ఉత్కంఠభరితమైన కథ

సాహిత్యం

జీవిత గమనంలోని ఒక పార్శ్వాన్ని కథ చిత్రిస్తే, మొత్తం జీవితాన్ని నవల చిత్రిస్తుంది. తెలుగు నవలకు నూరేళ్ళకు పైగానే వయసొచ్చింది. వేయి పేజీల వేయి పడగలు నుంచి నూరు పుటలూ దాటని మునెమ్మ దాకా నిడివితో సంబంధం లేకుండా ఎన్నో నవలలు విజయవంతమయ్యాయి. వంద నవలలు రాసి మనకు గుర్తుండని వాళ్ళూ ఉన్నారు తెలుగులో. ఒక్క నవలతో మనల్ని నిలువనియ్యని ఆలోచనల్లో ముంచినవారూ ఉన్నారు. సామాజిక వస్తువుతో పాటు చారిత్రక నవలలు, డిటెక్టివ్ లు, సైన్స్ ఫిక్షన్ లు తదితరాలతో పాటు ఇంకా మనం నిర్వచించలేని విభాగాలు కూడా కొన్ని ఉన్నాయి. విజయ్ అప్పల్ల నవల ‘అర్జున్ సన్నాఫ్ సుజాతరావు’ అలాంటిదే.

రచయితే చెప్పుకున్నట్లు ‘ఇది ఒక తల్లి పట్టుదల వలన కొడుకు ఏమి అయ్యాడు’ అనేది ఇందులోని ముఖ్య కథ. సుజాత, సుబ్బారావులకు సంతానలేమి పెద్ద లోటుగా మారినప్పుడు డా. ప్రకాశ్ రాజ్ గారి ఫెర్టిలిటీ సెంటర్ ను ఆశ్రయిస్తారు. డా. ప్రకాశ్ వైద్యంలో సుజాత గర్భం దాల్చడం, డెలివరీ టైంకు డాక్టర్ ఢిల్లీకి వెళ్ళిపోవడంతో డా. మురళీకృష్ణ వైద్యంలో సుజాత డెలివరీ జరుగుతుంది. సుజాత కొడుకు అర్జున్ లో ప్రత్యేక లక్షణాలుంటాయి. దెబ్బ తగిలినా నొప్పిపెట్టదు. ఇస్త్రీ పెట్టెకు తగిలినా కాలినా, నొప్పి తెలియదు. పరీక్షలు చేయిస్తే అర్జున్ కు ‘కాంజెనిటల్ ఇన్ సెన్సిటివిటీ టు పెయిన్’ అని తెలుస్తుంది. అందువల్ల బయటికి నొప్పితెలియని అర్జున్ కు శృతిమించిన దెబ్బ తగిలితే సడెన్ గా ప్రాణాలకు ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందని డా. మురళీకృష్ణ హెచ్చరిస్తారు. ఈ హెచ్చరికను సుజాత ఛాలెంజ్ గా తీసుకొంటుంది. ఫ్యామిలీని వైజాగ్ నుంచి మియాపూరుకు షిఫ్టు చేస్తుంది. ఒక్క సంవత్సరం నిండని వాడికి స్విమ్మింగ్ నేర్పిస్తుంది. కరాటే, జిమ్నాస్టిక్స్, సంగీతం శిక్షణ కూడా ఇప్పిస్తుంది. స్కూలు చదువులో ఆటల్లో ఎనలేని ఎనర్జీతో నెంబర్ వన్ గా ఉంటాడు. బంటీతో స్నేహం, కరుణ్ శతృత్వం, పూజతో ప్రేమలో కాలేజీ చదువు ముగుస్తుంది. ఒక సందర్భంలో అర్జున్ కడుపులో అపెండిక్స్ చితికిపోతుంది. కానీ సుజాత తీసుకునే శ్రద్ధ, రెగ్యులర్ చెకప్స్ వల్ల ప్రాణాపాయం తప్పుతుంది. ఇలా ప్రతి సందర్భంలో కేర్ తీసుకోవడంతో సడెన్ డెత్ నుంచి నిరోధించబడతాడు అర్జున్. అర్జున్ లాగానే ప్రకాశ్ రాజ్ వైద్యం వల్ల పుట్టిన పిల్లలు అందరూ డిఫరెంట్ గా ఉంటారు. వాళ్ళు చాలా ‘పవర్’తో ఉంటారు. వివేక్, కరుణ్, ఇటలీ గాయత్రి, శృతి, కృతి, ప్రతాప్, వినోద్ తదితరులు పవర్ ఉన్న పిల్లలు. వీళ్ళంతా ముగింపులోగా కలుస్తారు.

వీళ్ళలో ఒక్కొక్కరిది ఒక్కో స్పెషాలిటీ. వీరిలో ఒక వ్యక్తి వినోద్. ఇతడు కూడా ఒక పవర్ లో ఉంటాడు. అందరికీ కోవిడ్ వ్యాపింప చేస్తుంటాడు. ఈ నవలలో ప్రధానమైన విషయం డా. ప్రకాశ్ వైద్యం వల్ల వచ్చిన ‘పవర్’. ఈ పవర్ తో పుట్టిన పిల్లల జీవితం ఎలా ఉంది అనేదే ఇందులో ప్రధాన వస్తువు. అసలు ఈ పవర్ ఎలా వచ్చిందనే దాన్ని డాక్టర్ ప్రకాశ్ రాజ్ ఇలా చెబుతాడు అర్జున్ తో.

“ఫెర్టిలిటీలో మాస్టర్ అయిన నేను నా నెక్స్ట్ అండ్ బెస్ట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ మీద రిసెర్చి చేస్తున్నా. ఆ పిల్స్ వాళ్ళ సక్సెస్ అయిన ఫీటస్ బ్రెయిన్ ని వేగంగా డెవలప్ చేయడానికి, అలానే వాళ్ళ ఆలోచనలను వేగం చేయడానికి నేను నా రిసెర్చ్ యూజ్ చేసి ఇంకొన్ని మెథడ్స్ ఆడ్ చేసాను. దానితో పుట్టబోయే బిడ్డకు మంచి పవర్స్ వస్తాయి అని ట్రై చేసాను. కానీ ఏ పవర్ వస్తుందో, ఏది స్ట్రాంగ్గా ఉంటుందో నాకు తెలియదు. ఇట్ డిపెండ్స్… నీకు పెయిన్ తెలియదు.” ఇలా పుట్టిన పిల్లలకు స్పెషల్ పవర్ ఉంటుందని డాక్టర్ ఊహించాడు. కానీ ఆ పవర్ ఎలా ఉంటుంది, సమాజానికి నెగటివ్ గా ఉపయోగపడుతుందా, పాజిటివ్ గా ఉపయోగపడుతుందా అనేది తనకు తెలియదు. తన ఫెర్టిలిటీ నాలెడ్జ్ నుండి పుట్టిన 13 మంది ఒక్కొక్కరు ఒకోలా ఆ పవర్ ను ఉ పయోగించుకున్నారు, పాజిటివ్ గానూ, నెగెటివ్ గానూ. కొందరికి మధ్యలో పవర్స్ పోయినట్లుగానూ చిత్రించారు రచయిత.

అర్జున్ మాత్రం జ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపమోగించాలన్న భావంతో ‘బుర్ర బాగుంటే బుర్రలేని వాళ్ళకు సహాయం చేయాలి రా’ అంటాడు. సైన్స్ ఫిక్షన్ కు, డిటెక్టివ్ నేచరుకు మధ్యగా నడుస్తూ ఉంటుందీ నవల. రీడబులిటీ ఉండడం రచయిత విజయంగా చెప్పవచ్చు. నవల పేరు వెరయిటీగా, ఆకర్షణీయంగా ఉంది. కథన శిల్పం బాగుంది. ఇది నవల మొదటి భాగంగా విడుదలవుతుంది.

అర్జున్ యాత్ర రెండవ భాగంలో ఇంకెన్ని మలుపులు తిరగనుందో! నవలలో కరోనా సృష్టి చైనా పనే అనే అర్థం వచ్చే సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయి. అయితే దానికి శాస్త్రీయ ఆధారాలైతే ఏమీ లేవు మరి. సినిమాటిక్ కథనం ఉంది కానీ, పాత్రలను పాఠకుడు గుర్తుపెట్టుకునేంత వైవిధ్యభరితంగా, ప్రత్యేక లక్షణాలతో చిత్రించి ఉంటే ఇంకా బాగుండేది. అప్పల్ల విజయ్ తన తొలి రచనను ఇంత సమర్థవంతగా రాయడం ఆశ్చర్యకరం, అభినందించవలసిన విషయం.

-డా.ఏనుగు నరసింహారెడ్డి
89788 69183

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *