1870కి ముందు, ముందుగా ఈస్టిండియా కంపెనీ, తదనంతరం బ్రిటన్ రాచరికం చేతుల్లో మనదేశ ప్రజల మీద ముఖ్యంగా దళితుల (మాల, మాదిగ) మీద జరిగినంత శారీరక, మానసిక హింస ప్రపంచంలో ఎక్కడ, ఎన్నడు, కనీ వినీ ఎరుగనిదన్న నిష్ఠుర సత్యాన్ని మూల రచయిత జయమోహన్ అనేక స్థూల పరిశోధనల ద్వారా నిర్ధారణ చేసుకున్నదాని ఫలితంగ, తన గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖపు బరువును ఇకెంత మాత్రమూ మోయలేక కలం చేతబట్టి, అక్షరాలతో దానికో బహుకృత ఛిద్రాకృతినిచ్చి, వేలాదిమంది పాఠకులతో పంచుకోవడం ద్వారా తన గుండెలోని భారాన్ని కొంతైనా దించుకున్నాడేమో అన్పిస్తుంది ‘తెల్ల ఏనుగు’ నవల చదివిన పాఠకులకు.
నవలా నాయకుడు ఏడెన్ ఓ పోలీస్ ఉన్నతాధికారిగా ఉద్యోగం రీత్యా మనదేశంలోని మద్రాస్ ప్రావిన్స్ కొస్తాడు. అప్పటికి ఆ ప్రాంతమంతటా దారుణమైన కరువు విలయతాండవం చేస్తుంటుంది.
వాస్తవానికి ఆ కరువు ప్రకృతి విపర్యల కారణంగా వచ్చింది కాదు. నాటి బ్రిటిష్ ప్రభుత్వము, దానితో చేతులు కలిపిన కొందరు అగ్రకుల దళారీలు కుమ్మక్కై సృష్టించిన కృత్రిమ కరువు మాత్రమే.
ఏవిధంగానంటే? తేనెటీగలు తమ లేత రెక్కలతో అలసటకు తావివ్వకుండా దూర ప్రాంతాలకేగి, పువ్వు పువ్వునా వాలి, వాటి కేసరాల్లోని మకరందపు రేణువులను ముక్కున కూర్చుకొని తెచ్చి తేనెతుట్టెను పెడతాయి.
ఆ తెట్టెలోని తేనెను తస్కరించేందుకొచ్చే ముష్కరులు, ముందుగా తెట్టెను దివిటీలతో తగలబెడతారు. ఆ మంటకు తెట్టె మీదున్న తేనెటీగల్లో తొంభై శాతం ఈగలు మల మల మాడి నేల రాలిపోతాయి. తక్షణమే దుండగులు ఆ చిన్ని ప్రాణుల శ్రమ ఫలితమైన తేనెను దోచుకుకుపోతారు. అటువంటి కల్పిత కరువు దెబ్బకు రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలు ముఖ్యంగా దళితులు కుప్పతెప్పలుగా చనిపోతున్నా పట్టించుకున్న నాధుడే లేకుండా పోయాడు.
అటువంటి సమయంలో అక్కడికి కొత్తగా వచ్చిన ఏడెన్ ఆ సమాచారమంతా తెలుసుకుని ప్రధానమైన కరువు ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించడానికి టాంగా మీద బయలుదేరి వెళతాడు.
_______________
అప్పటివరకూ స్థానిక అగ్రవర్ణ దళారీలతోపాటు, ఇంగ్లాండ్ నుండి ఉద్యోగాల నిమిత్తం సాధారణ కుటుంబాల నేపధ్యం నుండొచ్చిన బ్రిటిష్ అధికారులూ కుమ్మక్కై విపరీతంగా సంపాదించుకొని, స్వదేశం వెళ్ళిపోయి అక్కడ కొన్ని తరాలకు సరిపోయే ఆస్తుల్ని కూడబెట్టుకునే వారికి భిన్నంగా, ఏడెన్ బాధితుల వాస్తవ పరిస్థితులను పరిశీలించడానికి బయలుదేరడం వెనుక ఒక చారిత్రక నేపధ్యమున్నది.
_________________
ఏడెన్ జన్మస్థానం, ఇంగ్లాండ్ లో విలీనమైన ఐర్లాండ్. రెండు దేశాలు ఏకమైనప్పటికీ ఇంగ్లాండ్ ప్రజలు ఐరిష్ వాళ్ళను, చిన్నచూపు చూస్తుంటారు. వివక్షకు గురిచేస్తుంటారు. ఆవిధంగా వివక్షత కరుకుతనమేమీటో అతనికి చిన్నతనంలోనే అనుభవంలోకొచ్చుంది. వాళ్ళదో సాధారణ రైతుకుటుంబం. బాగా చదువుకొని ఉద్యోగిగా భారతదేశం వెళ్ళి, బాగా సంపాదించుకొని తిరిగి తన దేశం వెళ్లిపోవాలన్న భావనతో అందరి మాదిరిగానే మనదేశానికొస్తాడు.
తానొకటి తలిస్తే, దైవమొకటి తలిచినట్టు అతను మద్రాస్ ప్రెసిడెన్సీలో అధికారిగా బాధ్యత చేపట్టేనాటికే అక్కడ లక్షలాది ప్రజలు తినడాకి గుప్పెడు మెతుకులు లేక, ఆకలితో నల్లుల్లా ఎక్కడివాళ్ళక్కడ కుప్పలు కుప్పలుగా పడి చచ్చిపోతుంటారు.
ఏడెన్ ఆ వార్తలన్నిటినీ తెలుసుకుంటూ ఓమనిషిగా చలించిపోతుంటాడు. వివక్షతా కత్తివాదర పదును తన దేశంలోనే చవిచూసినవాడు కావడంతో, ఏడెన్ ఇక్కడి ప్రజల దయనీయతకు మానసికంగా అనుసంధానమై పోతాడు.
వాళ్ళదేశంలో జాతి వివక్షతకే నొచ్చుకున్న ఏడెన్ కి ఇక్కడి కుల వివక్షత మరింత దుఃఖకారణమవుతుంది. దాంతో ఆ వ్యవస్థపట్ల అతనిలో కోపం, కుంపట్లో నిప్పులా నివురుకప్పుకొని రగులుతుంటుంది. అటువంటి స్థితిలో ఓరోజు అతనికి అనుకోకుండా ఓ అనూహ్యమైన ఘటన ఎదురవుతుంది.
అసలు కథ ఇక్కణ్ణుండే ఆరంభమవుతుంది. అది కూడా ఓ అమెరికన్ ఐస్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఇద్ధరు దళిత దంపతుల విషయం కారణంగ.
ఒకరోజు ఏడెన్, గుర్రం మీద వెళుతుండగా పొట్ట వెన్నుకంటుకుపోయి, బొక్కలు తేలి, ఐసు గడ్డల మీద పనిచేస్తుండడంతో వాళ్ళ అరికాళ్ళ, అర చేతుల చర్మం తెల్లగా పాచిపోయి, చూడడానికే అసహ్యంగా కన్పిస్తుంటాయి. వాళ్ళను ఆ కంపెనీ మేస్త్రీ ‘నీలమేఘం’ అనేవాడు కొరడాతో పశువుల్ని బాదినట్టు బాదుతుండడం గమనించిన ఏడెన్ ఆగి విషయం తెలుసుకుంటాడు.
‘వాళ్ళిద్దరూ ఐస్ ఫ్యాక్టరీలో పని ఎగవేసి తిరుగుతుంటే కొంచం భయం చెప్పడానికి కొడుతున్నాను. పనిదొంగలను ఇలాగే కొట్టాలి. వీళ్ళను చూసిచూడనట్టు వదిలేస్తే, వీళ్ళనుచూసి మరికొందరు ఇలాగే తయారవుతారం’టాడు నీలమేఘం.
“వాళ్ళు తప్పుచేస్తే రూల్ ప్రకారం చర్యతీసుకోవాలి గాని, అంత అమానవీయంగా కొట్టే హక్కు మీకెక్కడిది?” అంటూ నీలమేఘాన్ని, ఐస్ ఫ్యాక్టరీ మేనేజర్ ఫార్మర్ ని నిలదీస్తాడు.
మరునాడు పొద్దున్నే గుర్తుతెలియని వాళ్లెవరో ఆకూలీ దంపతులిద్దర్నీ చంపి నీళ్ళల్లో పడేసి వెళ్ళిపోయారని తెలిసి ఏడెన్ విచలితుడైపోతాడు. ఆ పని ఐస్ ఫ్యాక్టరీ వాళ్ళే చేయించుంటారని, ఆ కంపెనీవాళ్ళ దురాగతాలను తెలుసుకుని, వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు ఏడెన్.
మరునాడు ఏడెన్ న్ని కార్తవరాయన్ అనే ఆంగ్లం మాట్లాడగల దళితుడు కలిసి మాట్లాడుతాడు. చెన్నుడు తన రధం మీద సిద్ధార్ధుడిని నగర పర్యటనకు తీసుకెళ్లినట్టు కార్తవరాయన్ ఏడెన్ని దళిత కూలీలు నివశిస్తున్న తావుకి తీసుకుపోయి తిప్పి చూపిస్తాడు. పాతిపెట్టడానికికూడా నోచుకోని శవాల కుప్పలు, ఆ కుప్పల మీద పడి, తమలో తాము కాట్లాడుకుంటూ శవాలను చీల్చుకుతింటున్న వందలాది కుక్కల్ని, రాబందుల్నీ చూసి తట్టుకోలేక భయంతో చలించిపోతూ నిజంగానే సిద్ధార్దుడి మాదిరిగా వెనుదిరుగుతాడు.
ఈ దేశంలో బలహీన కులం వాళ్ళ మీద, పైన ఏడు కింద ఏడు తంతెలుగా కూర్చబడిన కులాల మధ్య నలిగిపోతున్న వైనాన్ని విని ఏడెన్ విస్తుబోతాడు. హృదయమున్న మనిషిగా తన ఉద్యోగం పోయినా ఫర్వాలేదు గానీ ఐస్ ఫ్యాక్టరీలో జరుగుతున్న అమానవీయ ఘటనలను బయటపెట్టాలన్న ఆవేశంతో కదిలిపోతుంటాడు.
అతని ప్రయత్నాలను అడ్డుకుంటున్న ఐస్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఉన్నత కులాలకు చెందిన మురహరి అయ్యంగార్ లాంటి వాళ్ళ జోలికెళితే తమ బ్రిటీష్ ఉన్నతాధికారులే తనకు సహకరించరన్న నిజాన్ని కూడా తెలుసుకుంటాడు ఏడెన్.
ఆ మానసిక వత్తిడిలో తనకు అంతకు ముందే పరిచయమున్న ఓ ఆంగ్లో ఇండియన్ యువవేశ్య ఇంటిని వెతుక్కుంటూ వెళతాడు ఏడెన్. ఆ అమ్మాయి కూడా నువ్వు ఎప్పుడైతే బగ్గిలో నుండి కిందికి దిగేటప్పుడు మా దళితుడి వీపు మీద కాలుపెట్టి కిందికి దిగావో, అప్పుడే నీపట్ల నాకు ఏహ్యభావం కలిగింది. నువ్వు నేరుగా నా ఇంటికొచ్చి నన్ను పెండ్లి చేసుకుంటానన్నా నేను నీతో రాను వెళ్లిపొమ్మటుంది.
ఒకమనిషిగా ఏడెన్ చేసే ప్రతి పనీలోనూ అపజయాన్ని, అవహేళననూ ఎదుర్కొంటూ ఉద్యోగం చేసే దానికన్నా రాజీనామాచేసి, తనదేశానికి వెళ్ళిపోయి తండ్రి మాదిరిగానే వ్యవసాయం చేసుకుని బతకాలనుకుంటాడు.
అయితే, ఒక ఉద్యోగిగా అతని నిబద్ధతను, ఒక మనిషిగా తోటిమనుషుల పట్ల అతను చూపించిన ధర్మాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు అతనికి పదోన్నతినిచ్చి వేరే ప్రాంతానికి పంపించడంతో కథ ముగుస్తుంది.
_______________
నవలంతటా బ్రిటిష్ అధికారులకు, హిందూ సమాజంలోని ఉన్నత వర్గాల వ్యాపారులకు, దళారులకూ మధ్యగల పరిచయాలను పురస్కరించుకొని ఒకరి ఆర్ధిక ప్రయోజనాలకు మరొకరు ఏవిధంగా సహాయపడుతుంటారో? వాళ్ళ అభివృద్ధికోసం అణగారిన జాతుల ప్రజలను పశువులకన్నా హీనంగా ఏ విధంగా వాడుకుంటారో?గమనించవచ్చు.
_________________
అణగారిన ప్రజలంతా కార్తవరాయన్ నేతృత్వంలో మొట్టమొదటిసారిగా మనదేశంలో నామమాత్రంగానైనా ఐస్ ఫ్యాక్టరీలో ఏ విధంగా సమ్మెకు దిగారో? ఏ ఏ బాధితులు, ఏ ఏ విధంగా స్పందించారో? ఎంత వీరోచితంగా మాట్లాడారో? పోట్లాడారో నవల పొడవునా ఎంతో ఉత్కంఠ భరితంగా చెప్పుకొచ్చిన మూల రచయిత జయమోహన్ స్థాయికి తగ్గట్టుగానే, తెలుగులోకి అనువాదం చేసిన రచయితలు కుమార్. ఎస్ మరియు అవినేని భాస్కర్ గార్లు కూడా అంతే స్థాయిలో అనువదించడం పాఠకులకు గొప్ప సంతృప్తినిచ్చేవిషయం.
అయితే, ఎనిమిదవ అధ్యాయంలో ఒకటవ పేజీ నుండి పదహారవ పేజీ వరకు విషయాన్ని కావాలని సాగదీసినట్టుగా అన్పిస్తుంది.
ముగింపులో ఏడెన్ ప్రమోషన్ మీద వెళ్ళిపోయే సందర్భంలో బ్రిటిష్ ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక వ్యాపారులు ఇస్తున్న ఫెర్ వెల్ పార్టీలో పాత్రల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. వాళ్ళ మాటల్లోని అంతరార్ధమేమిటో అర్ధంకాక పాఠకులు కొంత అసౌకర్యానికి గురవుతారు.
ఇటువంటి ఒకటి రెండు లోపాలున్నప్పటికీ మనదేశంలో జరిగిన కొన్ని చారిత్రక అంశాల క్రమాన్ని, అనాదిగా మనదేశంలో నెలకొన్న నిచ్చెనమెట్ల కులవ్యవస్థ కారణంగా నిమ్నవర్ణాలవారు పడిన బాధమయ జీవితాల నగ్నస్వరూపాన్ని, బ్రిటీష్ వారి రాక కారణంగా దేశంలో నూతనంగా ఏర్పడిన వివిధ ఫ్యాక్టరీలు, వాటిల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రత, ఆరోగ్యం, జీతాల పెంపు వంటి కొత్త సమస్యలు ఉత్పన్నం కావడంతో ఒక చారిత్రక అవసరంగా మనదేశంలో రూపుదిద్దుకున్న కార్మికోద్యమ స్వరూప స్వభావాలను ఆసక్తికరంగా అందించడం అభినందనీయంగావుంది.
చివరిగా “ఎంతో పెద్దది, అత్యంత బలమైనది, తెలివైనదీ అయిన ఏనుగు ముందు ఎందుకూ కొరగాని మావటివాడు చిన్న అంకుశాన్ని పట్టుకుని లొంగదీసుకుంటాడు. తనకు కావాల్సిన విధంగా సేవలు చేయించుకుంటుంటాడు. అదే ఏనుగు తిరగబడితే మావటివాడి పరిస్థితి ఏమిటి?
అట్లా మన దేశాన్ని గురించి ఏడెన్ ఆలోచించే ప్రతిసారీ అతని మనసులో “భారతీయులంతా కలిసి మేల్కొన్ననాడు తెల్లవాడనే మావటి వాడు ఎందుకూ కొరగానివాడవుతాడు” అనుకుంటుంటాడు. ఈ నవల సారాంశం కూడా అదే.
ప్రచురణ: ఛాయ పబ్లికేషన్స్ (ప్రై) లిమిటెడ్, హైదరాబాద్,పేజీలు: 355, ధర: రూ.425/- లు. పుస్తకం కోసం సంప్రదించాల్సిన సెల్.నెం.70931 65151.

-శిరంశెట్టి కాంతారావు,
98498 90322.
