‘‘వాస్తవిక జీవితాన్ని గూర్చిన కాల్పనిక కథ” నవలగా చెబుతారు సాహితీ విశ్లేషకులు. జీవితమే నవల కాదు. జీవితం నవలకు ముడిసరకు మాత్రమే. తన ముడిసరుకుకు నవలాకారులంతా దగ్గరగా ఉండే కళాకారుడు మరొకడు ఉండడంటారు వల్లంపాటివారు. సాధారణంగా జీవితం సంక్లిష్టంగా ఉంటుంది. మానవ జీవితం ఇట్లా ఉంటుంది.. అట్లా ఉంటుందని సూత్రీకరించలేం. ఏ స్థిరమైన సూత్రాలకు లొంగనిది జీవితం. జీవితంలోని గజిబిజికి సంక్లిష్టతకు ఒక రూపం ఉండదు. అటువంటి జీవితంలో నుంచి జీవితానికి అర్థం చెప్పే సూత్రాలను గుర్తుపట్టి వర్ణించడమే నవలాకారుని కర్తవ్యం అని చెప్పేది కూడా వల్లంపాటి వారే.
_______
ఒక నవలా రచయిత తనెందుకు ‘వస్తువు’కనుగుణంగా ‘శిల్పరీతిని తదనుగుణంగా ‘రస’ నిర్ణయం చేసుకుంటాడు. ‘రచన’కు సంపూర్ణమైన హక్కుదారుడు రచయిత. ప్రధానంగా హాస్య, బీభత్స, శాంత ప్రధాన రసాలతో అద్భుతమైన నవలలు తెలుగులో రెండు (1900-1920) మూడు (1920-1942) దశలలో వచ్చాయి. ఈ కాలంలో వచ్చిన రచనలన్నీ కథా వస్తువును సామాజికాంశాలకు జతచేసి తామనుకున్న ‘శైలి’ రీతులలో పూర్తి చేశారు. అటువంటి వస్తువుకు అనుగుణంగా రచన నడిచే విధానం సృజియించుకున్నారు.
_______
ఇక్కడో గమనించదగ్గ అంశముంది. చారిత్రక, పౌరాణిక, సామాజిక సమస్యల నేపథ్యంలోనే ఎక్కువ రచనలు వచ్చాయి. మూడవ దశలో తెలుగు నవల ఒక మలుపు తిరిగి అంశాలను ప్రధాన వస్తువుగా చేసుకొని నవలా సృజన ఈ దశలోనే తనదైన శైలిలో తెలుగులోనే పూర్తి హాస్యనవలగా ముద్రింపబడినది మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి ‘బారిష్టర్ పార్వతీశం’.
తెలుగు నవలా సాహిత్యంలో హాస్య రచనలు కాస్త తక్కువే. ఆ తరహా రచనలు చేసిన వారిని వ్రేళ్ళ మీద లెక్కించవచ్చు. హాస్యం ద్వారా ‘వ్యంగ్యం’ చెప్పేవారున్నారు. నిజానికి రెండూ వేరు వేరు జానర్స్, ఎన్.ఆర్.నంది, పతంజలి, ఆదివిష్ణు, డి.వి.నరసరాజు, ఎర్రంశెట్టి సాయి, జంధ్యాల తదితరులు ఉన్నారు. ముళ్లపూడి వెంకటరమణ, శ్రీరమణలను ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ‘రాజకీయ భేతాళ పంచ వింశతిక’ , ‘నవ్వులో శివుడున్నాడురా’ వంటి రచనలు నేటికీ ‘వాస్తవ దృశ్యాలు’గా నిలిచి ఉన్నాయంటే కారణం ‘హాస్యం’ (వ్యంగ్యం) ప్రపంచంలో అన్ని భాషల్లో ఉన్నాయి. ఆంగ్ల సాహిత్య ప్రభావం తెలుగులో రచయితలపైన అధికమనే చెప్పాలి. హాస్య రచయితలపైన కూడా ఉంది. పీ.జి.వొడ్‌హౌస్, హెన్రీ ఫీల్డింగ్, మార్క్ ట్వైన్, జాన్ కెన్నడీ టూల్ తదితరులు ఆరోగ్యవంతమైన హాస్యమును సృష్టించారు. మల్లాది, ముళ్ళపూడి, ఎర్రంశెట్టి సాయి తదితరులపైన వీరి ప్రభావం ఉందనవచ్చు. మొక్కపాటి ‘బారిష్టర్ పార్వతీశం’ నవలకు ప్రేరణ ‘డాన్ క్విక్సోటో’ అనేవారున్నారు. ఏతావాత చెప్పొచ్చేదేంటంటే తెలుగువారి ముఖాల్లో ‘విషాదం’(?) ,‘చిరాకు’, ‘కోపం’ తొంగి చూసినంత తొందరగా ‘హాస్యం’ (సంతోషం, ఆనందాలు) తొంగి చూడకపోవటం. నవ్వే వాడు భోగి, నవ్వనివాడు యోగి, నవ్వలేని వాడు రోగి అని ఈమధ్య ఓ కొత్త చమత్కారం సమాజంలో వాట్సాప్ లో చక్కర్లు కొడుతుంది.
అందుకే ‘చక్కెర’ వ్యాధిగ్రస్తులు, డాక్టర్ల వద్ద ‘క్యూ’లు పెరుగుతున్నాయనిపిస్తుంది. 1924లో ‘హాస్యం’ కోసం శ్రమించిన వారు శ్రీ మొక్కపాటివారు. ‘బారిష్టర్ పార్వతీశం’ రచయిత అంటే కాని గుర్తుపట్టలేనంతగా నరసింహ శాస్త్రి అనే పేరు సాహితీ లోకంలో స్థిరపడిపోయిందంటే శతాబ్ద కాలంలో (1924-2024) ఆ నవలకున్న ‘ప్రజాదరణ’ హాస్యానికున్న ‘ప్రాముఖ్యత’ అర్థమవుతుంది.
ఏముంది ‘బారిష్టర్ పార్వతీశం’ నవలలో అనే సందేహం ఉన్నవారు బహుశా తెలుగు లోకంలో తక్కువనే నా భావన. ఇది మూడు భాగాల రచన. మొదటి భాగంలో ఉన్న శతశాతం హాస్యం రెండు మూడు భాగాలలో క్రమంగా తగ్గిందనే భావన ఉంది. ఇందుకు కారణం రచయిత ‘హాస్యం జీవితంలో అన్ని దశల్లోనూ సమానంగా ఉండకపోవచ్చు’ అని సర్ది చెప్పారు. వాస్తవం కూడా అంతే కదా.
ఈ రచనలో ప్రధాన పాత్ర పార్వతీశం. ఇతను నరసాపురం దగ్గర మొగల్తూరు గ్రామవాసి. పడవ ప్రయాణం అతని నిత్య వ్యవహారం. అతను చదువు కోసం చెన్నై వెళ్లాడు. అక్కడి నుంచి ఇంగ్లాండ్ వెళ్లి బారిష్టర్ చదువుకొని వచ్చాడు. ఇదీ వరుసగా ఆ కుర్రాడు జీవితంలో ‘వివిధ వికాస దశలు’. అయినా అతనికి ‘ఆంగ్లేయ విద్యతో పాటు అబ్బవలసిన అనేక రకాలైన సుగుణాలు అతనిలో కొరతపడ్డాయి. నేటి నాగరికతంతా అతనికి కొత్త. ఎన్నడూ రైలెక్కి కూడా తెలియని వ్యక్తి’ అని శాస్త్రిగారే తన ముందుమాటలో చెబుతారు. అటువంటి వ్యక్తి ఇంగ్లాండు వరకు వెళ్లి బారిష్టర్ చదివి వచ్చాడంటే నమ్మవలసిందే. పార్వతీశం చేసే ప్రతీపనిలో చదువరికి హాస్యం ‘కనిపిస్తుంది’. రైలులో అతడు నడిచిన నడత, మద్రాసులోనూ అతడు పడిన అవస్థలు, కొత్త ప్రదేశాలలో అతడు పడిన ఇబ్బందులు, స్టీమర్ లో అతను పడిన చిక్కులు వ్రాయ సాధ్యం కావు. (అవన్నీ చెప్పటం ఈ పత్ర ఉద్దేశ్యం కాదు).
రచన చదువుతున్నంత సేపు ఒక ఘట్టానికి మించి మరొక ఘట్టం చదవాలని కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తుంది. చక్కని, ఆరోగ్యవంతమైన హాస్యాన్ని రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి గారు ఈ రచనలో స్పృశించారు.
‘బారిష్టర్ పార్వతీశం’ చిరంజీవిగా నిలిచిపోవడానికి కారణం` ప్రధాన వస్తువులోని సునిశితమైన ‘సన్నివేశపరమైన హాస్యం’ దానికి సరిజోడైన ‘సంభాషణ పరమైన’ హాస్యం ఒక కారణం కాగా` కొత్త ప్రాంతాలకు పోయినప్పుడు అక్కడ ఆచార వ్యవహారాలు, వస్తువులు ‘మనం’ చూసినప్పుడు వాటిని ఎలా అనుసరించాలో తెలియక ‘అయోమయానికి’ గురవుతాం. ‘ఫోర్క్’, చెంచాలతో ‘దోశ’ను తినటం ఎలానో నాకిప్పటికీ తెలియద’ని ప్రముఖ సినీ హాస్య రచయిత, దర్శకుడు జంధ్యాల అంటారు. అటువంటిది మొగల్తూరులోని అమాయకమైన (సమాజం మూర్ఖుడు అంటుంది) కుర్రాడు చెన్నై, ఇంగ్లాండ్లకు వెళితే…!? ‘‘పొరపాటు మరో పొరపాటుకి మూలమై వికృతులు ఒకదానికొకటి గుది గ్రుచ్చినట్లు పెనవేసుకున్నట్లు చూపించి, ఊహకందని వంపులోకి కథను ఈడ్చితే..’’ ఊహించండి ఇది అతనికి ఆవేదన.. చదువరులకు ‘ఆనందం’.
అయితే పార్వతీశం స్వభావతః మూర్ఖుడు కాదు. పరిస్థితులతనిని మూర్ఖునిగా చేసి వెక్కిరిస్తాయి. పార్వతీశానికి మించి ఎప్పుడో ఒకప్పుడు నవ్వుల పాలైన అవస్థలు మనకు కూడా జీవితంలో ఎదుర్కొనే ఉంటాం. అందుకే ‘పార్వతీశం’ మనందరివాడు. తెలుగు హాస్యంలో ‘పార్వతీశం’ నిలవగలిగాడంటే అతని వ్యక్తిత్వంలోని నిజాయితీ అని చెప్పాలి. ఇందుకు కారకులైన ‘మొక్కపాటి’ వారికి తెలుగు సాహితీ లోకం రుణపడి ఉంది.
‘పార్వతీశం’ రచనలో అతడు ఆడవాళ్ళ టోపీ కొన్నప్పుడు, భోజనశాల దగ్గర, ఫ్రాన్స్ లో తివాచీ మీద నడవకూడదేమోనని అనుకునే వైనం, నునుపు మీదనున్న చెక్కల మీద నడిచి పడిపోయిన సన్నివేశం పాత్ర ‘చేతకానితనం’ విపరీతమైన హాస్యంను చిత్రించే దృశ్యాలే. కానీ.. ఆ పరిస్థితుల్లో ‘మనం’ ఉంటే అనే ఆత్మ పరిశీలన చేసుకుంటే నవ్వు రాదు కదా. ‘ప్రతీ హాస్యం వెనుక ఓ విషాదం ఉంటుందనే’ చార్లీ చాప్లిన్ వ్యాఖ్యానం ఈ రచనంతటా కనిపిస్తుంది. మానవుడు చాలా విషయాల్లో అజ్ఞానుడు. అతనిలో అజ్ఞాన జనితమైన అపచారాలు చాలా ఉంటాయి. ఇటువంటివి కొన్ని చేర్చి ఒక వ్యక్తిలో చూపించటం కొంతవరకు అతిశయోక్తిలా కనిపించినా తప్పక హాస్యజనకంగా ఉంటుందంటారు రచయిత.
‘హాస్యం’ను ఆస్వాదించేవారు ఎంతమంది ఉంటారో, విమర్శించేవారు అంతకుమించి ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రదేశంలో ‘ఇది కాపీ రచన’ అని ‘వీడి బొంద ఇంతగా హాస్యం రాయడం మన వాళ్లకు.. అబ్బే’ అనే వారున్నారు. ఈ విషయమైనా రచయిత తన ముందుమాటలో ‘‘ప్రతీ ఆంధ్రుడికి ఒక గట్టి నమ్మకం. ఏమంటే బుద్ధి కుశలత కలిగిన ఏ పనిగాని ఆంధ్రుడు చేయలేడని. అందుకని అటువంటి అపురూపమైన రచన ఏదైనా కనబడితే ఇది ఎక్కడో చేతి దెబ్బ కొట్టాడని’ అనుకొని మనవాళ్లు తృప్తి పడతారు’ అలా అనుకోకపోతే పాపం వారికి ఆ పూట భోజనం చేసినట్లుండదు..’ అని రాసుకున్నారు. ఇది నాటికి (1924) నేటికి (2024) ఏనాటికి (యుగాంతం వరకు) వాస్తవమే కావచ్చు.
ఈ రచన చాలామంది ‘అపహాస్యపు’ భ్రమగా అనిపించిందని రచయిత చెబుతూ ఆయన వాక్యాలలోనే ముగింపు పలుకుతాను ‘‘ఎవరైనా నాకు నవ్వు ఎప్పుడూ రాదు అంటే అతని శరీరతత్వంలో ఏదో జబ్బు ఉన్నదన్న మాట. లేదూ ఏమైనా సరే నేను నవ్వనని ఎవరైనా భీష్మించుకుని కూర్చుంటే అతనికి కొంచెం దూరంలో ఉండటం మంచిదన్నారు’’ (ఇది కూడా ఓ ఆంగ్ల రచయిత చెప్పినదే సుమండి. నేను గొప్ప ఆంధ్రున్ని మరి)
- భమిడిపాటి గౌరీ శంకర్
శ్రీకాకుళం ,9492 858395