ఆకాశంలోని నక్షత్ర సమూహాల వెలుగు చాలదని, అక్షరాలే కాగడాలై, కారణజన్ముడు, డా.హెచ్.నరసింహయ్యకు హారతుల వేడుక ఘనంగా నిర్వహించిన సందర్భంలో, ఆయన పుట్టిన ఊరు ‘హెూసూరు’ మట్టికణాల మహాత్యానికి, ఆ జన్మకు, జన్మనిచ్చిన హనుమంతప్ప, వెంకటమ్మ పుణ్యదంపతులకు మొదట సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. “పోరాట పథం” ఆత్మకథను నా పఠనంలో ఒక తపస్సులా అధ్యయనం చేస్తున్నప్పుడు,నా రక్తంలో మూడవ రక్తకణంగా ఈ గ్రంథంలోని భావసంపద యథేచ్ఛగా నాలో ప్రవహించడాన్ని గుర్తించిన కాలం, నేరుగా సాక్షి సంతకాలు పెడుతోంది.
నేను వెళ్లి ఆయన నివసించిన భవనం అరుగుమీద కూర్చున్నాను. నేరుగా నరసింహయ్యగారే వచ్చి, నా భుజంమీద చేయ్యేసి తన ఆత్మకథను చెప్పటం ప్రారంభించారు. శ్రోతగా నేనా కథను వినలేదు. తరగతి గదిలో విద్యార్థిగా ఆ పాఠాన్ని కళ్లకద్దుకున్నాను. మంత్రసాని అవసరం లేకుండానే జన్మించిన నరసింహయ్య,బాల్యంలో తాను పెరిగిన ఇంటి గోడలు,పైకప్పు అంతా మట్టే. అందులోనే పశువులు,అందులోనే వంట, అందులోనే సమస్తం. రాత్రుళ్లు నిద్రవస్తే ఆ మట్టిమీదే నిద్ర. పేదరికానికి నిత్యం అక్కడ మట్టితోనే పట్టాభిషేకం. ఆ మట్టి పరిమళం నుంచి పుట్టిన శ్వాసే ఆయన్ని పట్టభద్రుడ్ని చేయడమే కాదు, ఏకంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి స్థాయికి తాను ఎదిగేలా చేసింది. చిన్న గాంధి గారంటూ లోకం యావత్తు ఆయన నిరాడంబరతకు నిలువెత్తు మంగళతోరణాలు నిర్మించింది. అంతటితో ఆ ప్రవాహం ఆగక,భారత ప్రభుత్వ పద్మభూషణ్ పురస్కార గ్రహీతగా ఒక చరిత్రను సృష్టించేలా చేసింది.
విద్యార్థిగా ఏకంగా విజ్ఞాన గనుల్ని వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తారంగా తన మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకున్న మహామేధావి ఆయన.మనుషుల్లో వర్ణాల సృష్టి అనేది గుణము,వృత్తి మీద మాత్రమే అవలంభించాలి కాని, పుట్టుకతో ఎంతమాత్రం కాదని బాల్యంలోనే వాదిస్తూ, హేతువాద వారసత్వానికి తన సమ్మతిని బహిరంగంగానే ప్రకటించి,దేవుడు, దెయ్యాలు,పూనకాలు,శకునాలు,అపశకునాలు… ఇలా జాతిని వేధించే అష్టదరిద్రాల మూఢనమ్మకాలను దిగ్బంధం చేయటానికి, స్థాయిర్యాన్ని, ధైర్యాన్ని తన ఆయుధాలుగా మార్చుకున్న అతీత మానవశక్తి సమూహం ఆయన.
_____________
బాల్యంలో ప్రయాణానికి డబ్బులు లేక హెూసూరు నుండి బెంగళూరు వెళ్లటానికి 53 మైళ్ల దూరాన్ని కాలినడకతో పూర్తి చేసిన ఆ లేత పాదముద్రలు భవిష్యత్తులో భావితరాలకు మార్గదర్శక రహదారులను నిర్మించబోయే చరిత్రకు నేపథ్యాన్ని సిద్ధం చేసుకున్నాయి. ప్రముఖ శాస్త్రవేత్తగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ప్రొఫెసర్ గా పని చేసిన డా. ఎ.ఆర్. వాసుదేవమూర్తి, ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త డా. హెచ్.ఎన్. కృష్ణమూర్తి అయ్యంగార్ లతో కలిసి, విద్యార్థి దశలో స్టూడెంట్ హెూంలో గడిపిన, ఈ గడుసరి ఉద్యమ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు తీసికెళ్లినప్పుడు, లాఠీచార్జి జరిగినప్పుడు తాను ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలతో వాదించిన ఆయన కళ్లల్లోని తీవ్రత, ఆ తరువాత మరిన్ని ఉద్యమాలలో తనదైన శైలి ప్రదర్శనకు తలుపులను తెరిచింది.
___________
విద్యార్థిగా ప్రతి దశలోనూ ఉన్నతమైన మార్కులు ఆయన ఖాతాలో చేరటం అతిసాధారణంగా ఆయనతో సహవాసం చేసిన విషయమయినా, నేషనల్ కాలేజీలో అధ్యాపకుడిగా నియామకం కావడానికి కారణమైన అంశాలకు అది పునాదిగా మిగిలిపోయింది. అధ్యాపకుడిగా వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్ తలరాతలకు విధాతగా వాసికెక్కిన ఆయన గురుత్వం, గురుత్వాకర్షణ శక్తికంటే బలంగా విద్యార్థులలో నాటుకుపోయింది. తరగతి గదుల్లో తాను విద్యార్థులకు పాఠాలు చెప్పుతూనే, నిత్య విద్యార్థిగా తాను మరింత జ్ఞానసంపద కోసం అమెరికా ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఉన్నత విద్య ఆర్జనలో అఖండమైన విజయపతాకాన్ని ఎగురవేసి, తాను పనిచేసిన కాలేజీలో మొట్టమొదటి డాక్టరేట్ పొందిన అధ్యాపకుడిగా నరసింహయ్య అత్యంత నాణ్యమైన చరిత్రకు వారసుడయ్యాడు. అదే కాలేజీకి ప్రిన్సిపాల్ గా ఏకగ్రీవంగా తాను ఎన్నికయిన క్షణాలు, అక్షింతలై తనమీద రాలినప్పుడు వినిపించిన కరతాళ ధ్వనుల తరంగాలు అందించిన అనుభూతులు అప్పటికి అదొక క్రొత్త చరిత్ర. నడుస్తున్న ఆ చరిత్ర మరికొంత ఎత్తుకు కొనసాగుతూ 1972 డిసెంబరు నెలలో డా.నరసింహయ్యను బెంగళూరు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమించారు. ఆ పదవి గౌరవాన్ని పదింతలు పెంచిన వ్యక్తిగా జాతీయస్థాయిలో ఢంకాలా మారుమ్రోగిపోయిన పేరు ఆయనిది. రాబోయే ఇబ్బందులను రాడార్ లా కనిపెట్టగల అపర మేథావి ఆయన. సత్యసాయిబాబా పరమ భక్తుడు విశ్వవిద్యాలయాల కులపతిగా రావటంతో, బాబా మాయా మంత్రాలను తీవ్రంగా వ్యతిరేకించే తనకు సంకట పరిస్థితులు తప్పవని తెలుసుకొని ఐచ్ఛికంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి పదవికి రాజీనామ సమర్పించి, రాజీపడని తన తత్వానికి కానుకగా సగౌరవంగా బయటికి వచ్చారు. ఒకానొక సందర్భంలో సత్యసాయిబాబా సమక్షంలో,చుట్టూ అనేకమంది శాస్త్రవేత్తలు బాబా భజనలు చేస్తున్న సందర్భంలో ప్రయోగశాలలో హేతువాది అయిన వైజ్ఞానికుడు నిజజీవితంలో హేతువును పూర్తిగా మరచిపోతున్నాడు. అపారమైన జ్ఞానం కలిగిన శాస్త్రవేత్తలు సైతం జ్యోతిష్యం మీద, హస్తసాముద్రికం మీద అపారమైన నమ్మకంతో పాటు, అతీంద్రీయశక్తులు ఉన్నాయని చెప్పుకునే వారిని గుడ్డిగా అనాగరికంగా అనుసరిస్తున్నారంటూ.. ధాటిగా, ధీటుగా చేసిన ఆయన ప్రసంగం ఒక సంచలనమై ఆ వాతావరణాన్ని ఆలోచింపచేసే దిశగా నడిపించటం బాబా భక్తులకు మాత్రం చేదు మాత్రగా మిగిలిపోయింది.
కర్ణాటక శాసనమండలి సభ్యత్వాన్ని ఆయన కోరి తెచ్చుకున్నది కాదు. అవకాశమే అతని తలుపులు తట్టి మరీ ఆహ్వానించింది. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని, కాంగ్రెస్ వారు తన పేరును సిఫారసు చేసినా, తానుమాత్రం స్వతంత్ర అభ్యర్థిగానే మండలిలో వ్యవహరిస్తానని, ఏ ఒత్తిడులకు లొంగకుండా నిటారుగా తన నిర్ణయాన్ని నిలబెట్టుకున్న ధీశాలి నరసింహయ్య.
మండలిలో సైతం హేతువాద సిద్ధాంతాన్ని ఆయుధంగా చేసుకుని దయ్యాలు, భూతాలు,చేతబడులు, బాణామతి ఇత్యాది వెర్రితలల సంహారానికి శంఖాన్ని పూరించిన ఓటమి ఎరుగని వీరుడు ఆయన. శాసనమండలి ప్రతి సమావేశంలోనూ నరసింహయ్య గారి వాక్కు గురిచూసి వదిలిన బాణంలా వుండేది. ఆయన మాటలకు మండలి మొత్తం గౌరవ మర్యాదలతో ఆ వాగ్ధాటికి అభిషేకం చేసేవారు. పదవి తనకు కాదు, పదవికే తానొక అలంకారంగా భాసిల్లిన, మరకలేని గొప్ప చరిత్ర ఆయనిది.
ఇది కేవలం జీవిత చరిత్ర కాదు. శాశ్వతంగా ప్రవహించే ఒక జీవనది కదలిక. నది ప్రవహించే పరివాహక ప్రాతం ఎలా సస్యశ్యామలమవుతుందో, నరసింహయ్య గారి జీవిత ప్రవాహంతో అతని చుట్టూ పెనవేసుకున్న సమస్త వాతావరణం, వెన్నెల్లో వికసించిన మల్లెపూలలా ఎన్నో జీవితాల ఎదుగదలకు చేయూత ఇచ్చిన చరిత్ర ఆయనిది. నరసింహయ్య కారణజన్ముడు. అందుకు సాక్ష్యాలను దీపాలుగా వెలిగించిన సందర్భాలు ఈ గ్రంథం నిండా రాసులు, రాసులుగా కనిపిస్తున్నాయి. పేదరికం వొడిలో పెరిగిన ఆయనకు కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఇబ్బందులు అన్నీ ఆయనతో సహవాసం చేసిన అంశాలే.ఆకాశం విరిగి తన అరచేతిలో పడినా,ఆ ముక్కల్ని అతినేర్పుగా మరో అద్భుత ఆకారంలోకి మార్చగల మహా మేథావి నరసింహయ్య.
‘పోరాట పథం’ ఆత్మ కథలో విస్తారమైన ఆయన వ్యక్తిగతమైన విషయాలతో పాటు, కాలంతోపాటు కలిసి నడిచిన చరిత్ర పాదముద్రల సారం కూడా ఒక సంపదగా ఇందులో అందుతోంది. వేలాది సన్నివేశాల విస్తృతమైన సమాచారం జ్ఞానసంపద దీపికలై ఈ పుస్తకంలో వెలగటం ఒక ప్రత్యేకత. ఈ గ్రంథాన్ని అందరూ జీర్ణించుకోవడానికే ఇష్టపడుతారు. పాఠకుల కంటిచూపులు తాకిన ప్రతి అక్షరం,క్షయంకాని జ్ఞాపకంగా మది గదుల్లో మిగిలిపోవటం రచయిత అభివ్యక్తీకరణకు కొలతబద్దగా నిలుస్తున్న అంశం.
‘పోరాట పథం’ నవలను కన్నడమాతృక నుండి తెలుగులోకి అనువాదం చేసిన కోడీహళ్లి మురళీమోహన్ ఈ జన్మకు సరిపడ్డ సంతృప్తిని తన ఖాతాలో జమచేసుకోవటం, తన సాహిత్య క్షేత్ర ఫలాల దిగుబడి ప్రదర్శనాశాలలో పాఠకుల ప్రవేశానికి తివాచీలు పరచినట్లుగా వుంది. తెలుగు నేలకు అందించిన ఓ మహనీయుడి జీవితచరిత్ర గ్రంథ అనువాద శైలి, సాధారణ పరిధిలు దాటి అసాధారణ నైపుణ్య మైదానాల మీద, మూలంలోని ప్రతి సారాన్ని, సారవంతమైన ధారలుగా ప్రవహింపజేసిన చతురతకు అక్షరాలు తమ తలకట్టులను తలపాగాలుగా మార్చి అనువాదకుడి సత్కారానికి ఆహ్వానపత్రాలు అందిస్తున్నాయి. మరళీమోహన్ గట్టి సాహిత్యాన్ని రాయగలిగిన రచయిత. సంపాదకుడుగా సంపాదించుకున్న కీర్తి కాగడాలా ఒక ప్రక్క వెలుగుతూ, అదే స్థాయిలో మరెన్నో పుస్తకాలను ప్రచురించిన అనుభవాల రహదారుల్లో నిలకడగా నడక సాగిస్తున్న సాహిత్య సేవకుడు ఆయన. తెలుగు విస్తరిలో కన్నడ వంటకాన్ని వడ్డించిన తీరుకు కాపలా కాస్తున్న కాలం చప్పట్లు కొడుతోంది. రెండుభాషల సాహిత్య ఆలింగనాలతో సరికొత్త రాగాలకు సరిగమలు సిద్ధపడుతున్న సందర్భాన్ని అతి సమీపంగా నేను నిలబడి వీక్షిస్తున్నాను. 460 పేజీలకు మించిన ఈ అనువాద గ్రంథం, సాహిత్య పరిమళాలతో శాశ్వతంగా తెలుగు నేలమీద ప్రవహిస్తూ, పాఠకులను పరవశించిపోయేలా చేస్తూ, ఘనంగా ఆ నడక సాగిపోవాలని మనసారా కోరుకుంటున్నాను.
-డాక్టర్ కె.జి. వేణు,
98480 70084