అంబేద్కర్ ఆశయాలు – విస్మరిస్తున్న పాలకులు..!

ఎడిటోరియల్ హోమ్

మన దేశానికి “రాజ్యాంగమే మూల స్తంభం.. నాడు రాజ్యాంగ సభలో ముసాయిదాపై ఉద్విగ్న భరితంగా రాజ్యాంగ అమలుపై సందేహాలే.. నేడు రూఢీ అవుతున్నాయి.. ఆధునిక సమాజం వారి సేవలు, రచనలు అధ్యయనం చేయాలి.. డాక్టర్ అంబేద్కర్ జయంతులు, వర్ధంతులు, ఎత్తైన విగ్రహాలు నిర్మిస్తూనే, రాజ్యాంగబద్ధ పాలనను విస్మరించడం శోచనీయం..

………………………………………………………………………

అంబేద్కర్ ముందు చూపు, దార్శనిక భావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు మారాలి. అంబేద్కర్ ఆలోచనలు, రాజ్యాంగ విలువలు కాపాడుతూ పాలన సాగితేనే పౌరహక్కులు రక్షించబడతాయి. స్వయం ప్రతిపత్తి గల సంస్థలు స్వేచ్ఛగా వ్యవహరిస్తాయి. ప్రశ్నించే స్వేచ్ఛ ఉన్నప్పుడే ఆర్దిక, సాంఘిక, సామాజిక, రాజకీయ సమానత్వం ఏర్పడి అంబేద్కర్ ఆశయాలు ఆశలు నెరవేరుతాయి. అదే పాలకులు, పాలితులు ఆ మహానీయుడికి ఇచ్చే నిజమైన నివాళులు.

…………………………………………………………………….

స్వతంత్ర భారతావనికి ప్రజాస్వామ్య పాలనా నిర్దేశానికి తోడ్పడేలా ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించడంలో మహాయజ్ఞంగా భావించి, తన మేధస్సునంతా ధారపోసి భావ సంఘర్షణకు సమయమిచ్చిన, ముందుచూపున్న మహానీయుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్. వీరు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని అమ్మవాడి అనే గ్రామంలో 1891 ఏప్రిల్ -14న జన్మించారు. అలాంటి గొప్ప వ్యక్తి ఆలోచనలు ఆశయాలు నాటి నేటి రేపటి పాలకులకు, పాలితులకు ఎంతో ఆచరణీయం అనుసరణీయం. తాను ప్రపంచ మేధావుల్లో ఒకరు కావడం భారతజాతికి గర్వకారణం, రాజ్యాంగ రచనలో ఆయన కృషి అనన్య సామాన్యం. మన దేశానికి “రాజ్యాంగమే మూల స్తంభం”. స్వాతంత్ర్య లక్ష్యాలు, ఫలాలు, రాజ్యాంగ ఆశయాలు, సంక్షేమ రాజ్య ఆకాంక్షలు నెరవేరి సుస్థిరాభివృద్ధి సాధించాలంటే?. రాజ్యాంగబద్ధంగా పాలన సాగాల్సి ఉంది. సంపద సమంగా పంచబడినప్పుడే ఆర్థిక అసమానతలు తొలగిపోయి, శ్రేయో రాజ్యంగా వర్ధిల్లుతుంది. కానీ నేడు భారత రాజ్యాంగం దాని మౌలిక విలువలకు తిలోదకాలిస్తున్న నేటి పాలకుల తీరు విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా భారతజాతి సామాజిక చైతన్యం, రాజ్యాంగ అధ్యయనం అన్ని వర్గాల ప్రజలకు అనివార్యమైన స్థితి ఏర్పడింది.

డాక్టర్ అంబేద్కర్ నాడు రాజ్యాంగ సభలో ముసాయిదా కమిటీపై ఉద్విగ్న భరిత కంఠ స్వరంతో మాట్లాడిన తీరు నేటి కాలమాన పరిస్థితులకు అద్దం పడుతోంది. తను రూపొందించిన రాజ్యాంగం అమలు చేయడంలో సందేహాలను వ్యక్తపరిచిన విధంగానే నేటి ప్రజాస్వామ్య పాలన ఇష్టారీతిగా సాగుతుంది.. నా దేశం తన స్వతంత్రతను పరిరక్షించుకుంటుందా! పరాభవం పాలవుతుందా? ఇది నన్ను వేధిస్తున్న మొదటి ప్రశ్న. తను రూపుదిద్దిన రాజ్యాంగం దీర్ఘకాలం నిలుస్తుందా? నా దేశ భవిష్యత్తు పట్ల కలవరం కలుగుతుంది. మన ప్రజల్లో కొందరు నమ్మకద్రోహులు చేసే కుట్రలు కుతంత్రాలు పునరావృతం కాకూడదని నా ఆందోళన. ప్రజాస్వామ్య పాలనలో మతవిశ్వాసాల కంటే దేశానికి ఉన్నత స్థానం ఇస్తారా! లేదంటే మత విశ్వాసాలను పెంచి పోషించే వారికి ప్రాధాన్యత పెరిగితే దేశం మళ్ళీ ప్రమాదంలో పడుతుంది. మనలోని చివరి రక్తం బొట్టును కూడా దేశ స్వాతంత్ర్య రక్షణకు ధారపోయడానికి సర్వ వేళలా దృఢ సంకల్పంతో అప్రమత్తంగా సిద్ధంగా ఉండాలన్నారు భారత జాతిని. మన స్వేచ్ఛను ఎంత గొప్పవాడైనా కానీ వాని కాళ్ళ ముందు తాకట్టు పెట్టరాదు అన్నాడు. దేశానికి జీవితాంతం సేవలందించే మహానుభావులకు కృతజ్ఞతగా ఉండడంలో తప్పులేదు. కానీ దానికి పరిమితులు ఉండాలన్నాడు. దేశంలో భక్తి మార్గం లేదా వ్యక్తి ఆరాధన మార్గం ఎప్పుడైతే తారా స్థాయిలోకి చేరుతుందో.. దాని మూలంగా అధఃపతనానికి, నియంతృత్వానికి దారితీస్తుంది అన్నారు. రాజకీయా(పార్టీ)లు ప్రజాస్వామ్యం మాటున స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం, సౌభ్రాతృత్వాలను తుంగలో తొక్కి రాజకీయాల్లో కొందరికి ఘనత, కొందరికి నీచత్వం, ఇంకొందరు అంతులేని సంపదలతో తులతూగుతుంటే?. ఎంతోమంది అష్ట దరిద్రంలో ఉండరాదని ఆయన ఆందోళనతో కూడిన సందేహాన్ని వ్యక్తపరిచారు. ఆనాడే అంబేద్కర్ రాజ్యాంగం దృష్టిలో దేశ ప్రజలంతా సమానం అందుకే ఒక మనిషికి ఒకే ఓటు ఒకే విలువ ఏర్పరిచారు. కానీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం సాధించడం రేపటి పాలకుల పాలనా విధానంలో ఉంటుందంన్నారు. అనాదిగా పీడనకు గురైన వర్గాలకు ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో ప్రత్యేక నియోజకవర్గాలను సాధించారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లపై పోరాడి మంత్రి పదవిని వదులుకున్నాడు. స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందకపోతే మనల్ని మనమే నిందించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పాలకులు మనవారే కాబట్టి?. శ్రేయో రాజ్యానికి అడ్డుపడే దుష్టశక్తులను గమనించి పాలన సాగించాలని ఉద్బోధించారు. ప్రజాస్వామ్య పాలనలో నాటి నుంచి నేటికీ దేశంలో కొంత మేరకు అభివృద్ధి జరిగినప్పటికీ, అంబేద్కర్ ఆలోచనలు ఆశయాలు నెరవేరలేదనేది విమర్శ లేని సత్యం. పాలకుల స్వార్థ ప్రయోజనాలు, అధికార దాష్టికాల నుండి పౌరులను రక్షించడం కోసం స్వయం ప్రతిపత్తిని, విశిష్ట అధికారాలను కొన్ని వ్యవస్థలకు రాజ్యాంగ ద్వారా అంబేద్కర్ కలపించారు. అవి 1.న్యాయవ్యవస్థ, 2.ఈడీ, సి.బి.ఐ 3. ఎన్నికల సంఘం 4.మీడియా లకు స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. నేటి పాలకులు చాప కింద నీరులా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీటిలోకి చేరి ప్రజల హక్కులను హరిస్తున్నారు. పాలకుల ప్రజా వ్యతిరేక చర్యలకు బాసటగా నిలబడిన న్యాయమూర్తులే(కొందరు) పదవులు ఆశించడం చూస్తిమి. మీడియా స్వేచ్ఛ కార్పోరేట్ శక్తుల చేతిలోకి వెళ్లడం, పాలక, ప్రతిపక్ష వర్గాలే పత్రికలు, ఎలక్ట్రానిక్ ఛానల్ పెట్టడం వారికి అనుకూలంగా బాకాలూదడం చూస్తుంటిమి. ఎన్నికల్లో “ధన ప్రవాహం” కట్టడి చేయలేక ఎన్నికల సంఘం ఉత్సవ విగ్రహంగా మారింది. రాజకీయాల్లో అవినీతి ఎక్కువైంది, అవినీతి వటావృక్షానికి తల్లి వేరు రాజకీయాలని తేలిపోయింది. ఇదంతా.. నల్లధనమే. రాజకీయాల్లో రోజు రోజుకు క్షీణిస్తున్న నైతిక విలువలు, ఆర్థిక అసమానతలతో దేశంలోని సంపద గుప్పెడు మంది చేతుల్లో కేంద్రీకృతం అవ్వడం జరుగుతోంది. దేశంలో ఇన్నాళ్ల ప్రజాపాలనలో కూడా నేటికీ సుమారు 40కోట్ల జనాభా ఆకలి కేకలతో అలమటించడం చూస్తుంటే? వారి సందేహాలు నిజమే అనిపిస్తుంది. ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చిన నాటి నుండి నిన్నటి వరకు నిధులను పాలకులు నీళ్లలా ఖర్చు చేస్తున్నా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందక దారి మళ్ళి పోతున్నాయి,ఈ తీరు మారాలి. దేశంలోని కొన్ని కుటుంబాల వారు మాత్రమే రాజకీయ(ఉన్నత) పదవులు అనుభవిస్తున్నారు. సంకుచితత్వం, ప్రాంతీయ, భాష, కుల, మతోన్మాదం, లింగవివక్ష, అవకాశవాద, నేరపూరిత రాజకీయాల వలన సమగ్రత, సమానత, సమసమాజ స్థాపన కోరుకున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు నేటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి.. మనదేశాన్ని ఈనాటి వరకు పాలించిన పాలకుల పాలనా విధానాల లోపమే దీని కంతటికీ కారణం.

దేశంలో ఆనాటి భిన్న భౌగోళిక పరిస్థితులు, జాతులు, కులాలు, మతాలు అంతర్గతంగా వైరుధ్యాలతో ఉద్విగ్న పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని ఒక్క తాటి పైకి తెచ్చి సుస్థిర పాలన చేయించేలా, దిశా నిర్దేశం చేసేలా రాజ్యాంగాన్ని రాయగలిగారు. అదేపనిగా 60 దేశాల రాజ్యాంగాలను తనే స్వయంగా చదివి మన రాజ్యాంగాన్ని రూపొందించడం, రాయడంలో రాత్రి పగలు నిద్ర లేకుండా పోవడంతో ఆరోగ్యం క్షీణించింది. కంటిచూపు, వెన్ను, మోకాళ్ల నొప్పులు రావడం, సమయానికి భోజనం చేయక నిద్రలేమితో మధుమేహం వచ్చి 1956 డిసెంబర్ 6న కన్నుమూశారు. ఆనాటి స్వాతంత్ర్య సమరయోధుల్లో చాలా మంది విదేశాల్లో బారిష్టరు చదివిన వారే కానీ వారంతా కలిసి అసమాన విద్యావంతుడు, రాజకీయ కోవిదుడు, న్యాయ శాస్త్రంలో దిట్ట, గొప్ప ఆర్థికవేత్తగా ఖ్యాతి గడించిన అంబేద్కర్ మేధస్సును గుర్తించి రాజ్యాంగ రచన బాధ్యతను అప్పగించారు. వారి సేవలు వెలకట్టలేనివి. నేటి ఆధునిక భారతం, సమాజం వీరి గురించి అధ్యయనం చేయాల్సి ఉంది. ఒకవైపు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతులు, వర్థంతులు ఘనంగా నిర్వహిస్తూ, వారి ఎత్తైన విగ్రహాలను నిర్మిస్తూనే, రాజ్యాంగ బద్దంగా పాలన సాగించని ద్వంద్వ విధానాలు చూస్తుంటే!.. “నొసటితో వెక్కిరిస్తూ-నోటితో మెచ్చుకున్నట్లున్నది” ఇది కడు శోచనీయం. ఇది ఇలా ఉంటే? మరోపక్క రాజ్యాంగ మౌళిక విలువలకు విఘాతం కలిగిస్తున్నారు. విద్య, వైద్యం అంగడి సరుకైంది. కార్పొరేట్ శక్తుల చేతుల్లో పాలకులు కీలుబొమ్మలుగా మారారు. దేశాన్ని, రాష్ట్రాలను వారి సొంత జాగీర్లుగా భావిస్తున్నారు. అంబేద్కర్ ముందు చూపు, దార్శనిక భావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు మారాలి. అంబేద్కర్ ఆలోచనలు, రాజ్యాంగ విలువలు కాపాడుతూ పాలన సాగితేనే పౌరహక్కులు రక్షించబడతాయి. స్వయం ప్రతిపత్తి గల సంస్థలు స్వేచ్ఛగా వ్యవహరిస్తాయి. ప్రశ్నించే స్వేచ్ఛ ఉన్నప్పుడే ఆర్దిక, సాంఘిక, సామాజిక, రాజకీయ సమానత్వం ఏర్పడి అంబేద్కర్ ఆశయాలు ఆశలు నెరవేరుతాయి. అదే పాలకులు, పాలితులు ఆ మహానీయుడికి ఇచ్చే నిజమైన నివాళులు.

 

  • మేకిరి దామోదర్
    సామాజిక విశ్లేషకులు, వరంగల్
    ఫోన్:9573666650.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *