కవిత్వ సృజన, చిత్రలేఖనంలో కళాత్మక సౌందర్యం ఒకవిశ్లేషణ

సాహిత్యం హోమ్

శ్రీలంకా వెంకటరమణ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. బహుముఖమైన కళా ప్రతిభను కలిగినవాడు. వృత్తిరీత్యా ఉత్తమ ఉపాధ్యాయుడు, ప్రవృత్తి రీత్యా చిత్రకారుడు, కళావిమర్శకుడు, కవి, రచయిత, కళాసాహిత్య అధ్యయనాలరీత్యా వ్యాసకర్త. వీటిన్నింటినీ మించి మంచి మనిషి. సహృదయుడు, రసహృదయుడు, సౌమ్యుడు, సంస్కారవంతుడు. కనుకనే కవిత్వం, చిత్రకళ రెండు ప్రక్రియలకు సంబంధించిన వివిధ వ్యాసాలు పరిశోధనాత్మక దృష్టితో రచించారు.
కవిత్వం,చిత్రకళ, రెండూ పరస్పరం ఎలా ప్రభావితమౌతూ వుంటాయి? ఎలా పరస్పర ప్రేరకాలు అవుతుంటాయి? ఉభయ ప్రక్రియల సృజనలో వున్న అంతస్సూత్రంగా ప్రవహించే కళాత్మక స్రవంతి ఏది? దాని స్వరూప స్వభావాలు ఏమిటి? ఇవి రెండూ పరస్పరాశ్రితాలై, కొన్ని సందర్భాల్లో కలగలసి సౌందర్య సృష్టి ఎలా ఆవిష్క ృరతమౌతున్నది? ఇలాంటి కళకు, కవిత్వకళకు సంబంధించిన ప్రాచ్య, పాశ్చాత్య భావనల్ని, విశ్లేషణల్ని ఎల్‌.ఆర్‌.వెంకటరమణగారు రసజ్ఞులకు అందంగా, ఆకర్షణీయంగా అందించారు.
ఇదివరకే రమణగారు కళాతత్త్వ శా సంబంధమైన వివేచనతో కూడిన రెండు గ్రంథాలు రచించివున్నారు. మొదటిది ‘‘సౌందర్య సృజన’’. రెండవది ‘‘కళా సౌందర్యం’’.
ఈ పుస్తకంలో రమణ గారు ప్రధానంగా లలితకళల్లోని (ఫైన్‌ ఆర్ట్స్‌) కవిత్వం, చిత్రకళ. శిల్పం ప్రక్రియల్ని గురించి విశ్లేషణ చేశారు.
కవిత్వ స్వరూప స్వభావాలు, వస్తురూపాలు, భాష శిల్పం.. చిత్రకళలోని రేఖలు వర్ణాలు, చిత్రకారుని భావనార్ణవం, అలాగే శిల్పం ధాతు వివేచన,శిల్ప నిర్మాణక్రమం, మొదలైన అంశాలను గురించిన వివరణాత్మక, కళాత్మక విశ్లేషణ చేశారు.
కళాతత్త్వ వివేచన (Aesthetic Analysis), సౌందర్య భావన (Concept of Beauty) కళా సిద్థాంతాలు (Principles of Art) సౌందర్యశాం (Aesthetics) కళా సౌందర్య శావేత్తలు, భారతీయ ఆలంకారికుల సౌందర్యభావనలు, లలితకళల ఆవిర్భావ, వికాస విశేషణలు, అభివ్యక్తి చర్చ,మొదలైన మౌకిక కళాంశాలు రమణ గారి చేత చర్చించబడినాయి.
ఇంకా కళ, కవిత్వం ఎలా పరస్పరం సృజన భూమికలో పరస్పర ప్రేరితాలుగా నిలుస్తాయి. పరస్పర పోషకాలుగా సంగమమౌతాయి, కళకు కావ్యత్వ సిద్ధి ఎలా చేకూరుతుంది, కావ్యంలో కళ ఎలా వర్ణరంజితమౌతుంది, కవి, కళాకారుల స్పందనలు, చేతనావర్తనాలు, (Levels of Artists Consciouness) శిల్పకళాకృతుల సౌందర్యం, కావ్య పదజాలంలో, కవిత్వ పరిభాషలో ఏ రీతిలో అభివ్యక్తమౌతుంది. పదచిత్రాలు, భావచిత్రాలు, ప్రతీకలు ఎలా రూపుదిద్దుకుంటాయి, మొదలైన కళాతత్త్వ సంబంధిత అంశాలు రమణగారి విశ్లేషణలో ప్రస్తావించబడినవి.
ఈ పుస్తకంలో రచయిత రమణగారు ఒక్కొక్క అంశాన్ని వింగడించి, అధ్యాయాలుగా, అధ్యయనాంశాలుగా అందంగా పొందుపరిచారు. ఆ సౌందర్యం పురివిప్పిన నెమలిలా అలరిస్తుంది. రసహృదయ పాఠకుల్ని. ఉదాహరణకు రచయిత వ్యాసాలకు ఉంచిన శీర్షికలలోనే రాయాలంటే కళ, కవితకు వారధి వర్ణపద చిత్రణ, కళకు కావ్యరూపం వర్ణపద చిత్రం, కవులు సృజించిన చిత్రకళా కవిత్వం, కవితలో కళాతత్త్వం. స్వప్న ప్రతీకలు లోపలి సరస్సులు, కూనలమ్మ పదాల వ్యంగ్యచిత్రాలు, కళ కవితగా మారేక్రమం, పికాసో గుయెర్నికా చిత్రం, తెలుగు కవితలలో పద చిత్రణ, కళాకవితల దృశ్య మానం శిలాకళలు కవితా చిత్ర యాత్రికుడు బషో మొదలైనవి.
వెంకటరమణ గారు స్వయంగా కవి, చిత్రకారుడు కావటం చేత పైన పేర్కొన్న కళ, కవిత్వాంశాలను గురించి లోతుగా అధ్యయనం చేసి, తత్సంబంధిత క్షేత్రాలలో నిష్ణాతులైన వారి అభిప్రాయాలను, పరిశోధనాంశాల్ని సందర్భోచితంగా ప్రస్తావిస్తూ, వ్యాఖ్యానిస్తూ విశ్లేషించినారు. ప్రతివ్యాసం కవిత్వం, కళ, శిల్ప, ప్రక్రియలకు సంబంధించి ఒక నిర్దిష్టాంశాన్ని పరిచయం చేస్తూ పరిశోధనాశంగా రూపుదిద్ది ప్రతిపాదించినట్లనిపిస్తుంది. వీటిలో నాకు ఇష్టమైన కొన్ని అంశాలను, భావనలను మరింత కాంతి ప్రసరణ కోసం వివరిస్తున్నాను.
‘‘కళకవితగా మారే క్రమం’’ అనే వ్యాసంలో వెంకటరమణగారు దిక్సూచి వంటి వాక్య సంచయాన్ని ప్రారంభంలో విషయంపై జిజ్ఞాసను రేకేత్తిస్తూ ఇలా ఆసక్తికరంగా చెప్పారు.
వెంకటరమణగారు చిత్రకారుడు, కవి, కనుక చిత్రం నుండి కవిత్వం ఎలా ఆవిర్భవిస్తుంది. దీన్నే ‘వర్ణపద చిత్రణ’ అని కూడ నిర్వచించాడు. ఒక చిత్రాన్ని చూసి స్పూర్తినిపొంది, అనుభూతిని పొంది, దానిని తనలోకి ఇంకించుకుని కవి మరలా దానిని ‘కవిత్వం’ లోకి తేవడం ‘వర్ణపదచిత్రణ’ అని వివరించారు.
ఈ గ్రంథంలో రమణ చేసిన మరొక కళాతత్త్వ విశ్లేషణకు సంబంధించిన వ్యాసం ‘‘కవులు సృజించిన చిత్రకళాకవిత్వం’’ రమణగారిలో కవి చిత్రకారుడు ఇరువురూ కలగలిసి ప్రవహించే కళాసౌందర్య వివేచన, అన్వేషణ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. రమణగారి కవిత్వంలో చిత్రలేఖనం, చిత్రలేఖనంలో కవిత్వం ప్రతిఫలిస్తూ వుంటాయ్‌. దీనికితోడు కళాతత్త్వవిమర్శ ఈ సృజన శీలునికి అదనపు అలంకారంగా దర్శనమిస్తుంది. అతని కళారూపంలో.
అనాదిగా కవులు, చిత్రకారులు తమ తమ సృజనలో రచనల్లో, పరస్పరం ప్రతిబింబిస్తూనే, కళా సౌందర్యాతిశయంతో ప్రతిఫలిస్తూనే వున్నారు. చిత్రకారులు రేఖాచిత్రాలు, వర్ణచిత్రాలు గీస్తారు. వాటిల్లో సహృదయులకు, రసహృదయులకు, ఎన్నో ఎన్నెన్నో భావచిత్రాలు, ఊహసౌందర్య విలసిత ఆకృతులు కనిపిస్తాయి. అలాగే కవులు కావ్యాల్లో, కవితల్లో, కథల్లో నవలల్లో ఎన్నో రేఖాచిత్రాలు, వర్ణచిత్రాలు పాఠకుల, రసజ్ఞుల హృదయాల్లో ముద్రిత మౌతాయి.
రమణగారు కవుల కవిత్వంలో చిత్రలేఖనం ఎలా ప్రతిబింబిస్తోందన్న అంశాన్ని శివారెడ్డి, డా॥ రామడుగు వెంకటేశ్వరరావు దర్భశయనం శ్రీనివాసాచార్య కల్పనారెంటాల కవితల్ని పేర్కొన్నారు.
కవిత్వం అభివ్యక్తి కళ. అభివ్యక్తికి అంటే కావ్య వస్తువులో అభివ్యక్తం చెయ్యటానికి రూపం, శిల్పం భాష, వ్యాకరణం ఇవన్నీ దోహదపడుతాయి.
చిత్రకళ చిత్రించదలచుకున్న ప్రకృతిని, లోకాన్ని, విశ్వాన్ని రేఖలు, రంగులు, కుంచె ద్వారా చిత్రిస్తుంది. బొమ్మలు గీయటంలో రేఖలు, వర్ణాలు ఉపయుక్తమైనట్లే కవిత్వంలో అక్షరాలు, పదాలు, వాక్యాలు రూపం, శిల్పం.
కవిత్వానుభూతికి, చిత్రకళా స్వాదనానుభూతికి పరస్పర సంబంధమున్నది. అది కళాత్మక సౌందర్య రసానుభూతి.
జీవితంలోను, కళలోనూ, కవిత్వంలోనూ, చిత్రకళలోనూ పరస్పర సంబంధాలు అనివార్యం. కవిత్వంలో చిత్రలేఖనం, చిత్రలేఖనంలో కవిత్వం అంతర్వాహినిగా ప్రవహిస్తువుంటాయి. రెండింటిలో కళాసౌందర్యమే జీవంమూలం. కవిత్వ నిర్మాణంలో భావచిత్రం, పదచిత్రం అని పిలువబడే కళాత్మక పరిభాషలో చిత్రలేఖన కళ మనకు స్పష్టంగా ద్యోతకమవుతున్నట్లుగానే చిత్రలేఖనంలో ఊహాశాలిత్వం, భావగాంభీర్యం, మొదలైన కళాత్మకాంశాలు, కవిత్వ పరిభాషకు సంబంధించినవే.
ఈ పుస్తకంలో అనేక కళాతత్త్వ సంబంధిత విమర్శను విపులంగా, వైవిద్యభరితంగా భిన్నవ్యాసాల రూపంలో కళారాధకులకు, కళాసాధకులకు, సహృదయులకు, రసహృదయులకు అత్యంత పఠనీయతతో, ఆసక్తికరమైన శైలీసంవిధాన చాతుర్యంతో రమణ గారు అందించినారు. ఇంతటి చక్కని గ్రంథాన్ని రచించి, కళాసౌందర్య క్షేత్రానికి తన వంతు కళాకాంతుల్ని సరస హృదయంతో సమకూర్చినందుకు కళాభినందనలు తెలియజేస్తూ ఈ గ్రంథం కవిత్వ, చిత్రకళా పరిశోధన రంగంలో, Aesthetic Educatin విభాగంలో తనదైన స్థానాన్ని పొందుతుందని ఆశిస్తున్నాను.
పరిణిత చిత్రకళావిమర్శకుడు, రచయిత, కవి చిత్రకారుడు, ఉపాధ్యాయుడు, భావుకుడు, సౌందర్యపిపాసి మా ఎల్‌.ఆర్‌.వెంకటరమణ. ఆయన బహుముఖీయ ప్రజ్ఞాపాటవాలను ప్రశంసిస్తూ, ఆయనకు హృదయ పూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను.


– మల్లెల నరసింహమూర్తి,
అనంతపురం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *