(ఆగస్టు 30న జమున జయంతి సందర్బంగా )
గోదారి గట్టుంది.. గట్టుమీద చెట్టుంది..
చెట్టుకొమ్మన పిట్టుంది.. పిట్ట మనసులో ఏముంది.. అంటూ తెలుగు సినీ లోకాన్ని ఉర్రూతలూగించిన గొప్ప నటి ఆమె..
ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగ ప్రయాణం ఆమెది…
రామారావు, అక్కినేని, జగ్గయ్య వంటి అలనాటి మేటి హీరోల సరసన నాయికగా నటించి ఆ పాత్రలకే వన్నె తెచ్చిందామె..
ఎన్నో పాత్రలు చేసినా, ఆమెకు బాగా పేరు తెచ్చిన పాత్ర సత్యభామ పాత్రే..
అలా వందలాది సినిమాల్లో వైవిధ్యమైన అనేక పాత్రలు చేసి ప్రేక్షకులను ఒప్పించి, మెప్పించిన సహజ నటి జమున.
వెండి తెర సత్యభామగా పేర్గాంచిన ఆమె పౌరాణికమైనా, జానపదమైనా, సాంఘికమైనా తనకు ఇచ్చిన పాత్రలో ఇట్టే ఒదిగిపోయి నటించారు. మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ తెలుగు నేలపై ఆమె ఎదిగి, సినీ పరిశ్రమలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు .
1936 ఆగస్టు 30న హంపీలో జమున జన్మించారు. ఆమె తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేశి.
జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనీయంలలో శిక్షణ ఇప్పించారు. గుమ్మడి .. జగ్గయ్యలాంటి వారు ప్రదర్శించే నాటకాల్లో, తన వయసుకి తగిన పాత్రలను పోషించేవారు. అలా ఆమె మా భూమి నాటకంలో ఒక పాత్ర పోషించగా, ఆమె అభినయం నచ్చి దర్శకుడు గరికపాటి రాజారావు ఆమెను చూశారు. తన సినిమాలో ఆమెకి కథానాయికగా అవకాశం ఇచ్చారు. అలా ‘పుట్టిల్లు’ సినిమాతో కథానాయికగా జమున సినీరంగ ప్రవేశం చేశారు.
తెలుగు తెరపై అందానికీ .. అందమైన అభినయానికి చిరునామా జమున. అలనాటి కథానాయికలలో నాజూకుదనానికి , నవరస నటనాపటిమకు నమూన ఆమె. అప్పట్లో ఆమె కుర్రాళ్ల కలల రాణి .. ఊహల్లో ఉపవాసాలు చేయించిన ఆరాధ్య దేవత. బాలీవుడ్ డ్రీమ్ గాళ్ గా హేమమాలిని మనసులను దోస్తే, ఆంధ్రా డ్రీమ్ గాళ్ గా జమున ఇక్కడి వారి హృదయాలను ఆక్రమించారు.
‘పుట్టిల్లు’ సినిమా నుంచి జమున వెనుదిరిగి చూసుకోలేదు. సావిత్రి రాకతో తెలుగు తెరకి నిండుదనం వచ్చిందనుకున్న ప్రేక్షకులు, జమున రాకతో పండుగదనం వచ్చినట్టుగా భావించారు. ఆమె చేసిన ‘దొంగరాముడు’ .. ‘ఇల్లరికం’ .. మిస్సమ్మ’ .. ‘గుండమ్మకథ’ .. ‘అప్పుచేసి పప్పుకూడు’ సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ సినిమాల్లో అవకాశాలు .. సావిత్రితో సమానమైన పాత్రలు ఆమెకు దక్కాయి. ‘మూగమనసులు’ సినిమా లో ఆమె చేసిన ‘గౌరి’ పాత్ర ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో పదిలంగా ఉంది. అలాగే, ఎన్టీఆర్ తో చేసిన ‘గులేబకావళి కథ’లో ఆమె చేసిన పాత్ర అందం వర్ణనాతీతం. అలా కెరియర్ పరంగా ఒక తారాజువ్వలా దూసుకుపోయి, అశేష ప్రేక్షకుల మనసులను ఆక్రమించేశారు. తన కెరియర్ కి ఇక ఢోకా లేదని జమున తేలికగా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే ఆమెకి ఒక అనూహ్యమైన సంఘటన ఎదురైంది. ఒక కారణంగా ఆమె ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లతో మూడేళ్ల పాటు సినిమాలు చేయలేకపోయారు. వారి సినిమాల నుంచి ఆఫర్లు లేకపోయినా జమున కంగారుపడిపోలేదు. ఆత్మవిశ్వాసంతో ఆమె ఆ పరిణామాలను ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే ఆమె చలం .. హరనాథ్ .. జగ్గయ్యలతో సినిమాలు చేస్తూ వెళ్లారు. అవి కూడా ఆమెకు విజయాలను అందించాయి. ఆ తరువాత ఆమె ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లతో కలిసి నటించడమనేది ‘గుండమ్మకథ’ సినిమాతో మొదలైంది. ‘మూగమనసులు’లో గౌరి పాత్ర తరువాత జమునకు ఆ స్థాయి పేరు తీసుకొచ్చిన పాత్రగా ‘పండంటి కాపురం’ సినిమాలోని ‘రాణి మాలినీదేవి’ పాత్ర కనిపిస్తుంది.
సాంఘిక చిత్రాలతో పాటు జానపద .. చారిత్రక .. పౌరాణిక చిత్రాలలోనూ జమున మెరిశారు. పౌరాణికాలలో పోషించిన ‘సత్యభామ’ పాత్ర ఆమె కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే గుర్తింపును తెచ్చిపెట్టింది. సత్యభామ పాత్రను ఆ స్థాయిలో పోషించిన వారెవరూ లేరు .. ఆ పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోవడం కూడా కష్టమేననే స్థాయిలో ఆమె అభినందనలు అందుకున్నారు. ఇలా జమున సుదీర్ఘమైన తన కెరియర్లో ప్రతిపాత్రపై తనదైన ముద్ర వేశారు. తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో కలుపుకుని 195 సినిమాలు చేశారు.
తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థను నెలకొల్పి ఆమె 25 సంవత్సరాలకు పైగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. రాజకీయం గా ఆమె ప్రజలకు విశేష సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీలో 1980 లో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయాల నుంచి తప్పుకున్నా 1991 సంవత్సరం లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న జూలూరి రమణ రావు ను 1965 లో వివాహం చేసుకున్నారు. 2018 సంవత్సరంలో ఆయన గుండెపోటుతో మరణించారు. ఆ దంపతులకు కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి ఉన్నారు.
తన విశేషమైన ప్రతిభా పాఠవాలతో ప్రేక్షకుల గుండెలను కొల్లగొట్టిన జమున జనవరి 27 శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె లేని లోటు చిత్రసీమకు ఎన్నటికీ తీర్చలేనిది.
… దాసరి దుర్గా ప్రసాద్