‘నిరీక్షించడం నా విధేయత
రావడం నీ బాధ్యత
జీవితమా మర్చిపోకు
కవిత్వం నాకు ఒక నమ్మకం’ అంటూ ‘నా విధేయత’ కవిత ద్వారా స్పష్టంగా తన నిర్ణయాన్ని ప్రకటించడమే కాకుండా తు.చ. తప్పకుండా పాటిస్తున్న మానవీయ కవి ఆశారాజు. ఆయన కవిత్వంలో గంభీరమైన పదజాలాలు కనిపించవు. పొడుగు పొడుగు వాక్యాలుండవు. అనవసరమైన ఉపమానాలుండవు. సందర్భానుసారమైన సుస్వరాల కవితాశైలితో ఆకట్టుకొనే కవితా నిర్మాణం ఆయనది. జీవితం పట్ల అమితమైన ప్రేమను చూపించడం మాత్రమే ఆయనకు తెలిసిన మర్మకళ. సామాన్య ప్రజల ఇక్కట్లను కవిత్వాక్షరాల్లో సహజాతి సహజంగా వ్యక్తీకరిస్తుంటారు. ఆలోచనాత్మకమైన 153 కవితలతో ‘ఒక దినం ప్రతి దినం’ కవితా సంపుటిని ఇటీవల వెలువరించారు.
________________
కవిత్వం అందరూ రాయగలరు. అందరూ చెప్పగలరు. కవిత్వం గురించి అందరూ వివరించగలరు. కవిత్వాన్ని కొందరు మాత్రమే పూర్తిగా ప్రేమించగలరు. కొందరు మాత్రమే దానితో ముచ్చటించగలరు. కొందరు మాత్రమే దాన్ని తమ వశం చేసుకోగలరు. ఆధునిక తెలుగు కవిత్వంలో నిత్యం కవిత్వమై వర్షించే అరుదైన కవుల్లో ఆశారాజు ఒకరు. ఇష్టమైన స్నేహితుడు మనతో మాట్లాడుతున్నట్లుగా ఆయన కవిత్వముంటుంది. మన భుజం మీద చేతులు వేసి భరోసానిస్తున్నట్లుగా ఉంటుంది.
________________
ఈ సంపుటిలోని ‘చందమామ నా కన్నా ముందే నిద్రపోతుంది’ కవితను చదువుతుంటే.. ‘వట్టి మాటలతో కాదు ఆచరణలతో జీవించడమే ముఖ్యం. అవసరమైన పనులతో జీవించడమే ముఖ్యం. ఆత్మగౌరవంతో జీవించడం మరింత ముఖ్యం..అని మనకనిపిస్తుంది.
అందుకే జిందగీ గురించి ఆయన కవితా వాక్యాలు జీవనోత్సాహాన్ని పెంచుతాయి. విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొనే ధైర్యాన్నిస్తాయి.
‘జిందగీ ఓ జిందగీ
నిన్ను పుస్తకాలల్లో చూడలేదు
కష్టాలల్లో చూశాను
కన్నీళ్లు నవ్వుతుంటే చూశాను’
మన జీవన గమనం ముందుకు సాగాలంటే ఒక సందడుండాలి. స్వేచ్ఛగా మాట్లాడే మనుషులుండాలి. భావజాలాన్ని విస్తరించుకునే హక్కులుండాలి. కనీస అవసరాలు అయిన కూడు, గూడు, గుడ్డతో పాటు నిర్భయంగా జీవించే రాజ్యముండాలి. నిరంకుశత్వమైన పాలకుల నిర్ణయాలను ఎదిరించే పోరాటాలుండాలి. కుల మతాల గొడవలు లేని జీవనం కావాలని కవి కోరుకుంటున్నారు. నగరంలో జన సంచారం లేకపోతే కర్ఫ్యూ వుందేమోనని అనుకుంటూ ‘ఊహలు ఖర్చయిపోయిన కళ్లు’ కవితలోని ఈ వాక్యాల ద్వారా ఆవేదన చెందుతున్నారు కవి.
‘జీవించడానికి డబ్బు,ఆహారం
వొంటినిండా దుస్తులే కాదు
చుట్టూ సందడి ఉండాలి
మనుషులు కలుసుకోని రోజు
నగరంలో కర్ఫ్యూ వుందేమోనని
చిన్నగా భయమేస్తుంది’
నిర్విరామంగా పరిగెడుతున్న కాలంతో మనిషి కూడా పోటీపడాల్సిందే. ఎవరికోసమో ఈ క్షణము ఆగదు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలంటే కాలంతో పాటు పయనించక తప్పదు. అన్ని క్షణాలు అన్ని రోజులు ఒకే రకంగా ఉండకపోవచ్చు. కాలం పెట్టే పరీక్షలో ఒక్కొక్కసారి క్షణం గడవడమే కష్టమవుతుంది. సుఖదుఃఖాల సమన్వయమే జీవనం కాబట్టి ప్రయోజనాత్మకంగా గడపాలని కవి కోరుకుంటున్నారు.
పనితోనే మనిషితనం మెరుగవుతుందని ‘ఇప్పుడు నాతో నాకే పని పడింది’ కవితలోని వాక్యాలు నిరూపిస్తున్నాయి. ‘మనిషికి అప్పుడప్పుడు/పొద్దుగూకడమే కష్టం అవుతుంది/కానీ, సంవత్సరాలు మాత్రం/ ఆలస్యం చేయకుండా గడిచిపోతుంటాయి/ నీడలోనో, మేడలోనో కూర్చుంటే/ఉయ్యాల ఊగినట్టు బాగానే ఉంటుంది/ తుఫాన్లతో పోరాడితేనే జీవించినట్లుంటుంది’.
మనందరికున్నది ఒకే ఒక జీవితం. నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకోవడంలో ఓడిపోయినా, గెలిచినా స్వీకరించాల్సిందే. గడిచిన సమయం తిరిగి రాదు. ధైర్యంతో, నమ్మకంతో, విశ్వాసంతో ఆశయాల సాధనకు ముందడుగులు వేయాలి. బతికే చివరి క్షణాల వరకు వాటిమీద భరోసాను కోల్పోవద్దని ‘ఎగిరిపోతే మళ్ళీ కనిపించవు’ అనే కవిత ద్వారా ఆశారాజు గారు హెచ్చరిస్తున్నారు.
సమయం,విశ్వాసం, నమ్మకం, ధైర్యం
సీతాకోక చిలుకల లాంటివి
పూల మీద ఉంటాయి
వెలుతురు మీద వాలుతాయి
వాటిని చెదరగొట్టొద్దు
ఎగిరిపోతే మళ్లీ కనిపించవు’
జీవితమంటేనే ఒక ఘర్షణ. కుటుంబపరంగా, సమాజపరంగా, తనకు తానుగా ఎదుర్కొంటున్న అనేక అనుభవాల కలబోతనే కవిత్వం. ఏడు దశాబ్దాల తన జీవితం నేర్పిన అనేక పాఠాల అనుభవాలతో రాసిన ప్రతి వాక్యం మనల్ని వెంటాడుతుంది. మనుషుల గురించిన తండ్లాటనే ఆశారాజు గారి కవిత్వం నిండా పరుచుకున్నది.
కరిగిపోయిన కాలానికి గుర్తుగా జ్ఞాపకాలు మన మదిలో గూడు కట్టుకుంటాయి. అవి కదిలినప్పుడల్లా మన మనసు మెత్తగా మారిపోతుంది. ఆ బాధను అక్షరాల్లో చిత్రీకరిస్తే ఎట్లా ఉంటుందో ‘తడి తడి ఎడారి’ కవితలో దృశ్యమానం చేశాడు కవి. మీరు ఈ కవితా పాదాలను చదివితే నాతో ఏకీభవించకుండా ఉండలేరు. ‘గొంతు ఎండిపోయినప్పుడు/నాలుకను చప్పరించడం/నిద్ర రానప్పుడు/ రాత్రంతా పక్కకు ఒత్తిగిల్లడం/ఎక్కడో గుండె వొలికి/ కళ్ళు చెమ్మగిల్లడం/ఏదైనా పాట విన్నప్పుడు/ మనసు మెత్తగా కోసుకోవడం/దీన్నే జ్ఞాపకం అంటారు/తెలుగులో బతికించే బాధ అంటారు’
___________________
నగరంలోని దారుల వెంట ఒంటరిగా నడుస్తున్న సమయంలో కావచ్చు, సమూహంగా నడుస్తున్న సమయంలో కావచ్చు, హరించుకుపోతున్న స్వేచ్ఛా జీవనాన్ని గురించే రాస్తానని వాగ్దానం చేస్తున్నాడు కవి. కళ్ళ ముందు గాయాలు కనిపిస్తుంటే, ఎడతెగని దుఃఖాలు వినిపిస్తుంటే, రాజ్యం అణచివేత మితిమీరి పోతుంటే కవి ఊరుకుంటాడా? కలంతో కవాతులను నేర్పిస్తాడు. వెనక్కి తిరగని పాదాలను మేలుకొలుపుతాడు. అందుకే ఆశారాజు గారు అనధికార శాసనకర్త
___________________
అని చెప్పడానికి ‘నిద్ర లేపే గాయం’ కవితలోని ఈ వాక్యాలే నిదర్శనం.
‘నేను కవిని
మనిషి తెలిసిన మనిషిని
కాలం చెప్పిందే రాస్తున్నాను
ఒక వైపు సమాజం
మరొకవైపు జీవితం
చుట్టుముట్టిన రాజ్యం
అడుగేస్తే జారుకుంటూ
అడుగు తీసి సంభాళించుకొంటూ
అడుగుల్లో స్వేచ్ఛను వెతుక్కుంటున్నాను’
ఆలోచనలు భిన్న రకాలు. విభిన్నమైన భావజాలాలు ఉన్నట్లుగానే అందరూ ఒకే సిద్ధాంతానికి కట్టుబడి ఉండలేరు. ఎవరి దారి వారిదే. మనం చెప్పినట్లుగానే వినాలనే మొండి పట్టుదలలు మనుషులను దూరం చేస్తాయి. సమసమాజ నిర్మాణంలో కావచ్చు లేదా సభ్య సమాజ నిర్మాణంలో కావచ్చు. కాలానికి అనుగుణంగా ఆలోచనలు మారకపోతే ఒంటరితనమే మిగులుతుందని ‘కాలం ఒక వాగ్దానం’ కవిత ద్వారా బోధిస్తున్నారు కవి. ‘ఎదుటి వాళ్లు/నీలాగే ఉండాలని మొండికేస్తే/నడిచే బాట ఖాళీ అయిపోతుంది/ ఎడారిలాంటి దారిలో/నీవు ఒక్కడివే మిగిలిపోతావ్/గడుస్తున్న కాలం ఒక వాగ్దానం/దానిని నిలుపుకోలేకపోతే పాదరసంలా జారిపోతుంది’.
మార్కెట్ మాయాజాలంలో మనుషులందరూ పరాయి వాళ్ళు అయిపోయారు. తమ గురించి తామే గొప్పలు చెప్పుకోవడం తప్ప సామాజిక చైతన్యానికి దూరమవుతున్నారనే వాస్తవ పరిస్థితులను తలుచుకొని కవి దుఃఖభరితులవుతున్నారు. ప్రపంచీకరణ ప్రభావంతో మానవుల జీవితాలు అతలాకుతులమవుతున్నాయి. రాజ్యమేలుతున్న స్వార్ధ రాజకీయాలు సామాన్య మానవుల పాలిట గుదిబండలవుతున్నాయి. ఒకప్పటి ఉద్యమ చైతన్యమిప్పుడు లేదని కవి దిగులు చెందుతున్నారు. మనుషుల్లోని మార్పులను పసిగట్టి కలవరపాటుకు గురవుతున్నారు. ఆ ఆలోచనలను ‘నిద్రపోనివ్వవు’ కవితా చరణాల ద్వారా వెల్లడించారు.
రాత్రుళ్లు నిద్రపోని వాళ్లంతా
ప్రేమికులు కారు
కలలు కనే వాళ్లంతా విప్లవకారులు కారు
మనుషులు ప్రేమలు మరిచిపోయారు
రానురాను పొలిమేరలు దాటి
ఉద్యమాలకు దూరమయ్యారు
తనవైన, పరాయివైన
బాధలు బాధ్యతలు ఎంతకూ నిద్రపోనివ్వవు’
జీవితంలోని స్వప్నాలను, త్యాగాలను, అనుభూతి రాగాలను, కొత్త మరియు పాత పరిచయాలను పదిలపరుచుకుంటూ అవిశ్రాంతంగా కవిత్వ యానం చేస్తున్న ఆశారాజు గారి కవిత్వం మనందరికీ తెలిసిందే. ‘నేను మనిషి గురించే రాస్తాను’ అంటూ సగర్వంగా ప్రకటించుకున్న మన కాలపు గొప్ప కవి ఆశారాజు. ‘ఒక దినం ప్రతి దినం’ కవితా సంపుటిలోని కవితలు మానవీయతకు చిరునామాగా నిలిచాయి. మనకొక అపూర్వమైన కానుకగా తన 22వ కవితా సంపుటిని అందించిన ఆశారాజు గారికి శుభాకాంక్షలు.

-గోపగాని రవీందర్
94409 79882
