తెలంగాణ పల్లె జీవితాలకు అద్దం పట్టే ‘బర్కతి’ కథలు

సాహిత్యం హోమ్

ఆధునిక జీవనశైలి, మారుతున్న కాలంతో పోటీపడి, గ్రామీణ ప్రజల జీవన మాధుర్యానికి దూరం అవుతోంది. ఈ మార్పునకు ఎవరూ అతీతులు కారన్నది అంగీకరించదగిన సత్యం.

తెలంగాణ నేపథ్యం అంటేనే దానిదైన ప్రత్యేక యాస, భాష, ఆట-పాటలు, ఒగ్గు కథలు, జానపద గేయాలు, సంస్కృతి మరియు జీవన విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇది గ్రామీణ జీవనానికి నిజమైన ప్రతిబింబంగా నిలుస్తుంది. తెలంగాణ సాహిత్యం వివిధ రూపాలలో మనుషులలో మానవీయతను పెంపొందించడంలోనూ, సమాజ మార్పుకు దోహదం చేయడంలోనూ ప్రముఖ పాత్ర వహిస్తుంది. అందుకు డా. సాగర్ల సత్తయ్య వెలువరించిన ‘బర్కతి’ కథల సంపుటి ఒక చక్కటి ఉదాహరణ.
___________________

తెలంగాణ మాండలికంలో ‘బర్కతి’ లేదా ‘బరకత్’ అనే పదానికి అదృష్టం, శుభం, వృద్ధి లేదా సంపద అనే అర్థాలు ఉన్నాయి. సాధారణంగా ఈ పదాన్ని ఏదైనా పనిలో లేదా వస్తువులో వృద్ధి, లాభం, లేదా మేలు జరగడాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. దీనికి దేవుడి ఆశీర్వాదం వల్ల కలిగే సమృద్ధి అనే లోతైన అర్థం కూడా ఉంది.
____________________

ఈ కథల సంపుటిలో ఉన్న పదిహేను కథలలో, సగానికి పైగా కథలు వివిధ పోటీలలో బహుమతులు పొందినవే. అన్ని కథలలో తెలంగాణ వ్యవహారిక భాషను సుస్థిర పరచడంలో రచయిత పోషించిన పాత్ర అభినందనీయం. ఆచారాల పేరుతో మూఢనమ్మకాలను ప్రచారం చేస్తూ, సమాజాన్ని దోచుకునే వ్యక్తుల తీరును ఈ ఆధునిక కాలంలో కూడా ఈ కథలలో చూడవచ్చు.

పేద దంపతులైన నరసమ్మ-అంజయ్యల ఏకైక బిడ్డ సరిత. ఆమె తెలివైన పిల్ల, చదువుకోవాలనే ఆసక్తి కలది. పదవ తరగతి ఉత్తీర్ణత తర్వాత, ఆమెకు మైనర్‌గా ఉన్నప్పుడే, ఇష్టం లేకపోయినా లక్షల కట్నమిచ్చి పెళ్లి చేస్తారు. తాగుడుకు బానిసైన భర్త పెట్టే బాధలను రెండేళ్లు భరిస్తుంది. సరిత ఐదు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు, భర్త కడుపుపై కాలితో తన్నడంతో గర్భస్రావం అవుతుంది. భర్త పెట్టే బాధలు తట్టుకోలేక పుట్టింటికి వచ్చేస్తుంది సరిత. ఆ ఊరిలో ఉద్యోగం చేస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ప్రోత్సాహంతో, పెళ్లయ్యాక కూడా సరిత రహస్యంగా చదువు కొనసాగించి, ఇంటర్ ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధిస్తుంది. టీచర్ ఉద్యోగం కోసం టీటీసీ ఎంట్రన్స్‌లో మంచి ర్యాంకు సాధిస్తుంది. ఈ కథ మహిళా సాధికారతకు నాంది పలుకుతూ, తన కాళ్లపై తాను నిలబడటానికి దోహదం చేసే ప్రయత్నాలను కొనసాగించాలనే గొప్ప సందేశాన్నిస్తుంది.

తెలంగాణ పల్లెలంటే కల్లాకపటం లేని ప్రేమలు, కులమతాలకు అతీతంగా వరసలు పెట్టి పిలుచుకోవటాలు, పచ్చని పొలాలు, ఊరి చెరువు అందాలు. కానీ గ్రామ దేవతల విషయంలో మాత్రం, దేవత ఒకరే అయినప్పటికీ కులానికో గుడి కనిపిస్తుంది. బోనాల పండుగలో ఇంటింటికి ఒక బోనం ఉన్నప్పటికీ, బోనమెత్తే సమయంలో కూడా కులం పేరుతో తేడాలు కనిపిస్తాయి. ఈ ఆచారమేమిటని పట్నంలో చదువుకుంటూ పండుగకు అమ్మమ్మ ఇంటికొచ్చిన బాలుడు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరకని వైనాన్ని “ఊరు బోనాలు” కథలో చూస్తాము. ఈ కథలో కులవృత్తులు, చేతివృత్తులు మరుగున పడిపోతున్నా, పండుగల సమయంలో మాత్రం ఒక కులం వారు అనాదిగా ఆచారంగా చేస్తున్న పనికి రేటు కట్టి మరీ చేయిస్తున్న ఆచార వ్యవహారాల వైనాన్ని చూడవచ్చు.

‘బర్కతి’ (మేలు) కలుగుతుందని, ఎల్లమ్మ పండగ చేయాలని… మూఢనమ్మకాల పేరుతో అమాయకురాలైన మల్లమ్మను ఆసరా చేసుకొని, డబ్బులు దండుకునే మంత్రగాడు వీరయ్య సలహాతో ఎన్ని పండగలు చేసినా బర్కతి కలుగకపోగా, అధిక అప్పులతో మల్లమ్మ పడే బాధలను రచయిత వర్ణించిన తీరు పాఠకులను ఆశ్చర్యపరుస్తుంది.

సంచార జాతికి చెందిన పరశురాములు-నరసమ్మలకు ఇద్దరు పిల్లలు. వారి కుటుంబంలో మద్యం మత్తు పెట్టిన చిచ్చు, కోపంతో కొట్టిన దెబ్బలకు తల్లి నరసమ్మను ఇంటి బయట పెట్టడం, పంచాయతీ ‘తశ్వ’ (విచారణ) కోసం పెద్దమనుషుల వద్ద డిపాజిట్ పెట్టడానికి పుట్టని అప్పులు చేయడం, వెంకట్ రెడ్డి సలహాతో కుటుంబం ఏకం కావడం లాంటి సందర్భాలను రచయిత శక్తివంతంగా ఆవిష్కరించారు.

పదమూడేళ్ల శివానిని చదువుకు దూరం చేసిన కరోనా కాలంలో, మనస్సుకు అబ్బని ఆన్‌లైన్ చదువు, లేత రెక్కలకు పని చెప్పిన సంఘ బంధం అప్పు, బడులు పెట్టమని వరం ఇచ్చిన డీఈవో ఆదేశాలతో సంతోషాన్ని మోసుకొచ్చిన ఉపాధ్యాయుడు శ్యామ్ సుందర్… బడి మళ్లీ ప్రారంభం అనే వార్త విన్న శివాని కళ్ళలో కోటి దీపాల వెలుగులు నింపిన వైనాన్ని ఈ కథలో గమనిస్తాము.

పేద రైతు యాదగిరి పత్తి పంట సాగు కోసం చేసిన అప్పులు, ఎప్పటికప్పుడు కాలానుగుణంగా రూపం మార్చే వడ్డీ వ్యాపారి రఘునాథం లెక్కల చేతివాటం, పిల్ల పెళ్ళికి చాలని కష్టార్జితం… దుఃఖంతో గుండె పగిలిన రైతు జీవితం **’ఎన్నుగర్ర విరిగిన గుడిసె’**తో పోలుస్తూ, దేశానికి వెన్నెముక కూలిపోయిందనే సత్యాన్ని ఈ కథ ఆవిష్కరిస్తుంది.

కుమ్మరి లక్ష్మయ్య భార్య పార్వతమ్మ. కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తూ, తన చేతిలో రూపుదాల్చుకున్న కుండలు, పెళ్లి ‘ఆవిరెండ్ల సారె’ దగ్గర తమ రెక్కల కష్టానికి దక్కని ఫలితాన్ని చూసి బాధపడతారు. పీల గొంతుతో దీనంగా ఆర్జించిన కుమ్మరి చేతులకు జరిగే అన్యాయాన్ని ధిక్కరించిన పట్నం నుంచి వచ్చిన కొడుకు, అలా ఆర్జించి బతికే కులవృత్తిని విడిచి పెట్టమని చెబుతాడు. కానీ కన్న ఊరును, తనను పోషించిన కులవృత్తిని విడవని లక్ష్మయ్య తన దేహాన్ని సారెపై తల పెట్టి నమస్కరించి ఊపిరిని విడిచిపెట్టడాన్ని చిత్రించడం పాఠకులను ఆకర్షిస్తుంది.

గొర్లను కన్నబిడ్డల్లా సాదుకునే రాజమల్లు… గొర్లకు రోగం వచ్చిందని అనుమానపడి, పక్క ఊరికి వెళ్లి చెట్టు పసరు, లొట్టి కల్లు తెచ్చి మనసులో దేవుడిని తలుచుకుని, గొర్ల మీద చల్లి రోగం వచ్చిన గొర్లను ఆప్యాయంగా చూసుకోవడం అనేది భర్తృహరి సుభాషితంలోని, $శిశుర్వేత్తి పశుర్వేత్తి, వేత్తి సర్వజనం తథా$$ అనే శ్లోకాన్ని గుర్తుకు తెస్తుంది. గుట్టలో మేస్తున్న గొర్లపై నాలుగు తోడేళ్ళు ఒక్కసారిగా దాడి చేస్తే, గొర్రెలు బెదిరి చెదిరిపోయినప్పుడు, రాజమల్లు దుఃఖపడతాడు. వచ్చిన నాలుగు తోడేళ్లతో వీరోచితంగా కలబడి, తన ప్రాణాన్ని అడ్డుపెట్టి గొర్లను కాపాడుకున్న రాజమల్లు త్యాగాన్ని రచయిత గొప్పగా చిత్రించారు. గొర్ల కాపరుల జీవితాలలోని ఎత్తుపల్లాలను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ కథ కులవృత్తుల కథలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

తెలంగాణ మాండలిక పదజాలం

బర్కతి, బువ్వ కుండ, కూరటికె, గంజి పేర్పు, కూరాడు, ఒత్తు కుండ, నీళ్ళగోలెం, కాగులు, దొంతులు, కల్లుకంచుడు, బొడ్డు గురుగులు, పిందార, తశ్వ, ఎన్నుగర్ర, దంపెడు పేర్పు, కొంకన పోగు, జకముక సంచి, చిమ్మట, దేశిత్, ఏకాన, ఇగురం గల్లోడు లాంటి కనుమరుగు అవుతున్న తెలంగాణ గ్రామీణ వ్యవహారిక పదాలను డా. సత్తయ్య రచనలో చూడవచ్చు.

సమాజం మేలు కోరుకునే కథా రచయిత డా. సాగర్ల సత్తయ్య, తనదైన శైలిలో తెలంగాణ యాస, భాషని సాహితీ ప్రపంచానికి ‘బర్కతి’ కథల ద్వారా చూపించి తన ముద్రని పదిలపరుచుకున్నారు.

‘బర్కతి’ కథలు. రచన: డా. సాగర్ల సత్తయ్య
పేజీలు: 120, వెల: 130/-, ప్రతులకు: 7989117415.

-కొండేటి ప్రకాష్
79817 81086.