ఒలింపిక్స్‌లో స్పెయిన్‌పై గెలుపొందిన భారత్ జట్టు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్‌పై గెలుపొందింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (30వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ఈ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. తొలి క్వార్టర్స్‌లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్ ఆరంభంలో (18వ నిమిషం) స్పెయిన్ ఆటగాడు మార్క్ మిరల్లెస్ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మార్చాడు. దీంతో ఆ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. 29వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. దానిని హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలిచేందుకు ప్రయత్నించినా స్పెయిన్ గోల్‌కీపర్ అడ్డుకున్నాడు. వెంటనే మరో పెనాల్టీ కార్నర్ లభించగా భారత్ దానిని సద్వినియోగం చేసుకుంది. ఈ సారి హర్మన్‌ప్రీత్ ఎలాంటి పొరపాటు చేయకుండా బంతి గోల్ పోస్ట్‌లోకి పంపి స్కోరును 1-1తో సమం చేశాడు. మూడో క్వార్టర్ మొదలైన కాసేపటికే పెనాల్టీ కార్నర్‌తో హర్మన్‌ప్రీత్ మరో గోల్ చేశాడు. దీంతో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత మూడు పెనాల్టీ కార్నర్‌లు సాధించిన ఇండియా వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది. మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా స్పెయిన్‌కు ఓ పెనాల్టీ కార్నర్ లభించింది. భారత గోల్ కీపర్ శ్రీజేశ్ దానిని అద్భుతంగా అడ్డుకున్నాడు. 60వ నిమిషంలో ప్రత్యర్థికి మరో పెనాల్టీ కార్నర్ రాగా.. సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఒలింపిక్స్‌లో భారత్ 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు కాంస్య పతకాలు దక్కించుకుంది. 2020 టోక్యో ఒలిపిక్స్‌లోనూ భారత్ కాంస్యం గెలిచింది. అంతకుమందు 1968, 1972లో టీమ్‌ఇండియా కంచు మోగించింది.
ఉద్వేగానికి గురైన శ్రీజేశ్
ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన శ్రీజేశ్ భారత్ గెలిచిన అనంతరం ఉద్వేగానికి గురయ్యాడు. ఆనందంతో గోల్ పోస్టు ఎక్కి సంబరాలు చేసుకున్నాడు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అతడిని తన భుజాలపై ఎత్తుకుని మైదానమంతా కలియ తిరిగాడు. ఇతర ఆటగాళ్లు కూడా శ్రీజేశ్‌ను అభినందించారు.
రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రశంసలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ముర్ము సహా పలువురు రాజకీయ నేతలు హాకీ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు. వారికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ‘తరాలపాటు నిలిచిపోయే ప్రతిష్ఠాత్మక విజయం ఇది. వరుసగా రెండో ఒలింపిక్స్ పతకం సాధించడం మరింత ప్రత్యేకం. నైపుణ్యం, పట్టుదల, బృంద స్ఫూర్తి భారత విజయానికి కారణం. ప్రతి భారతీయుడు హాకీతో భావోద్వేగ అనుబంధం కలిగి ఉంటాడు. ఈ గెలుపు మన యువతలో హాకీని మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తుంది’ అని మోదీ అన్నారు. ‘ఐదు దశాబ్దాల తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో వరుసగా పతకాలు సాధించింది. భారత హాకీ పునరుజ్జీవానికి ఈ టీమ్ చేసిన కృషి ప్రశంసనీయం. నిలకడ, నైపుణ్యం, సమన్వయం, పోరాటం ద్వారా క్రీడాకారులు చూపిన ప్రదర్శన యువతకు స్ఫూర్తిదాయకం’ అని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ‘విశేషమైన టీమ్ వర్క్, అద్భుతమైన నైపుణ్యాలు, గొప్ప విజయాన్ని కట్టబెట్టాయి’ అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘జట్టు ప్రదర్శన, క్రీడాస్ఫూర్తి క్రీడల పట్ల కొత్త అభిరుచిని రేకెత్తిస్తున్నాయి. మీ విజయం గర్వకారణం’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ‘అంకితభావం, అచంచలమైన కృషితో భారత జట్టు సాధించిన అసాధారణ విజయం పట్ల దేశం గర్విస్తోంది’ అని పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ అన్నారు.
