సామాజిక స్పృహ, మానసిక వికాసం, గాఢమైన అభివ్యక్తికి చిరునామా సి.నా.రా కవిత్వం

సాహిత్యం

సామాజికత, అభ్యుదయ కాంక్ష, ప్రాసంగికత వెరసి చిన్ని నారాయణ రావు(సి.నా.రా) కవిత్వపు చిరునామా.వీరు గత మూడు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నారు. వీరి వయసు ఇప్పుడు ఇరవై రెండూ ఇంటూ మూడు.అయినా ఇరవై రెండేళ్ల నవ యవ్వనుడి ఆలోచనలు. ప్రభుత్వాల నిర్ణయాలు ప్రజా సంక్షేమానికి ఉపయోగపడనప్పుడు, తన స్పందనను తక్షణమే అక్షర రూపంలో అభివ్యక్తీకరించడం వీరి అలవాటు.తన గురువులపట్ల అమితమైన భక్తి పారవశ్యం. అది,సత్యవేటి శ్రీకాంత్ గారైనా, అద్దేపల్లి రామమోహన్ రావు గారైనా, నాగభైరవ కోటేశ్వరరావు గారైనా. గురువులను ప్రేమించేతత్త్వం చిన్నతనం నుండే అలవాటుగా మారిందని చెబుతారు.

ఎదుటివాళ్ళు ఎలా మాట్లాడాలో, మాట్లాడే తీరులో దేహభాష ఎలా ఉండాలో ఎంతోమందిని గమనించాక ‘మాట’ వస్తువుగా అద్భుతమైన దీర్ఘ కవిత రాసి వెలువరించడమే గాక,దానిని ఆంగ్లంలోకి అనువాదం చేయించి భారత ఉప రాష్ట్రపతి గౌ.ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిచే, న్యూఢిల్లీలోని,వారి కార్యాలయంలో ఆవిష్కరించిన ఘనత వీరిది.

మానవుల బలహీనతలను కవితాస్త్రంగా ఎక్కుపెట్టి,తన గుండెల్లో బడబాగ్నిలా రగులుతున్న ఆలోచనల రూపం ‘దాహం..దాహం’ దీర్ఘ కవితగా వెలువడింది.

సి.నా.రా గారి కవితాప్రస్థానం మొదలై మూడు దశాబ్దాలు దాటినా తన కవిత్వంలో ఇప్పటికి అదే పదును,అదే ప్రచ్ఛన్న కలంబలంతో కూడి ఆలోచనాత్మకం. తన వచన కవిత్వం అయినా,దీర్ఘ కవిత్వం అయినా,సాహిత్య పరిచయమైనా..మానవ సంబంధాలలో ఉండే ఆత్మీయతలు, అనుబంధాలు, లోకం పోకడలు,మనుషుల మనస్తత్వాలను చిత్రిస్తూ.. వాస్తవికత, కళాత్మకతతో ఉట్టి పడుతుంటాయి. ఈ ప్రముఖ కవితో విల్సన్ రావు కొమ్మవరపు ముఖాముఖి సృజనక్రాంతి పాఠకులకు ప్రత్యేకం.

1. ఆడిటర్‌ (Income tax practitioner)గా మీ జిల్లాలో మీకు మంచి పేరుంది. మీరు ఆర్ధిక సలహాదారుగా ఉన్న రెండు మూడు పెద్ద కంపెనీల గురించి, మీ సలహాల వలన కంపెనీ అభివృద్ధి పథంలో నడచిన సందర్భాలు చెబుతారా?

ఆడిటర్‌ గా నా క్లయింట్స్‌ ఎక్కువ టాక్సులు పెనాల్టీలు చెల్లించాల్సి వచ్చినప్పుడు చాలా బాధపడడం సహజం. వారికంత పెనాల్టీలు, టాక్సులు పడకుండా చట్టానికి లోబడి అనేక చర్యలు తీసుకొన్న సందర్భాల్లో ఎంతో తృప్తి మిగుల్తుంది. వృత్తిపరమైన ఆ సంతృప్తికి కొలమానం ఉండదు.

ఈమధ్యనే ఓ గ్రానైట్‌ కంపెనీ జి ఎస్‌ టి చెల్లింపు 45 కోట్లు వరకు తేలింది. కొందరు తగ్గించడానికి ప్రయత్నించారు కూడా. కానీ విఫలమయ్యారు. దాన్నొక ఛాలెంజ్‌ గా తీసుకొని కోటి రూపాయలతోనే ముగించాం. డీలరు పేరు చెప్పడం భావ్యం కాదు కాబట్టి చెప్పలేకపోతున్నా.

అలాగే ఓ ఇన్‌ కంటాక్స్‌ కేసులో ఓ అసెస్సీకి 50 లక్షలు సెక్షను 50(సి) క్రింద చెల్లించాల్సి వచ్చింది. అది కూడా చాకచక్యంగా ఇన్‌ కంటాక్స్‌ వార్డు మార్చి ఆ అధికారిని అంగీకరింపజేసి అసెస్సీని ఒకట్రెండు లక్షలతో కాపాడగలిగాం.

ఓసారి ఓ పేదరాలు నాకు తెల్సిన వాళ్ళను తీసుకొని ఆఫీసుకొచ్చింది. ఆమెకు ఉండే నాలుగు ఎకరాలు 60 లక్షలకు అమ్మి బ్యాంకులో వేసి అప్పుల వాళ్ళకు పంచిందట. ఆ సమయంలో ఉన్న ఆస్తంతా అప్పులకే సరిపోతే కూలీకి పోవడం మొదలుపెట్టారు భార్యాభర్తలు. ఆ స్థల అమ్మకంపై వచ్చిన లాభంపై 20% క్యాపిటల్‌ గెయిన్‌ కట్టాలి. విషయమంతా ఇన్‌ కంటాక్స్‌ ఆఫీసర్‌ కు చెప్పాను. ఆయన వారి దీన స్థితికి చలించి తన డిమాండును తొలగించడమనే మానవతా వాదం సాహిత్యంలో నుంచి ఉద్భవించిందే. నేను ఖర్చులకు కూడా తీసుకోలేదు. ఆమె దీనావస్థ చూసి సాహితీకారుడిగా నాకెంతో తృప్తినిచ్చిన సంఘటన అది. ఎప్పటికీ గుర్తుకొస్తూనే ఉంటుంది. ఆ సంతృప్తికి కొలమానం లేదుగా.

2. మీరు సలహాదారుగా ఉన్న కంపెనీలకు నోటీసులు వచ్చినప్పుడు, టాక్స్‌ చెల్లింపులలో దానికి సమాధానం ఇచ్చే ప్రాసెస్‌ వివరిస్తారా?

వచ్చిన నోటీసును బట్టి క్లయింట్‌ ఫైల్‌ చేసిన రిటర్నును అనుసరించి ఇన్‌ కంటాక్స్‌ లేక జి ఎస్‌ టి చట్టంలో ఉన్న అనేకాంశాలను పరిశీలించి దానికి తగిన విధంగా నడుచుకోవాల్సి ఉంటుంది! ఈమధ్య ఓ జి ఎస్‌ టి ఆఫీసరు, బ్యాంకు లెక్కలు చూపించి బెదిరింపులు చేస్తున్నాడు. నేను వెళ్ళి అవి క్యాష్‌ ట్రాన్స్‌ ఫర్లు కదా ఎలా చెల్లుతాయి అని చెప్పడంతో చల్లబడ్డాడు.

3. మీరు బి.ఎల్‌. పట్టా కూడా పొందారు. లాయర్‌గా సెటిల్‌ అవకుండా ఆడిటర్‌గా ఉండటంలో మీ ఆలోచన పంచుకుంటారా?

బి.యల్ తోపాటు, సి.ఏ కూడా చదివి ఉండడంతో అకౌంట్స్‌ పట్ల, ఇన్‌ కంటాక్స్‌ పట్ల ఆసక్తి, అనురక్తి మెండు కావడంతో ఆడిటర్‌ ప్రొఫెషన్‌ వైపు మొగ్గాను. అదీకాక మా అబ్బాయి, మా అన్న, మా అక్క వాళ్ళ కుటుంబంలోనూ సి.ఏలు ఉండడంతో ఆ ప్రొఫెషన్‌ పట్ల ఎంతో ఆసక్తితో ఆడిటర్ గానే కొనసాగుతున్నాను. మా కుటుంబంలో నేను డిగ్రీ చదువుకొనే రోజుల్నుంచే సి.ఏ వాతావరణం వెల్లివిరుస్తుండేది.

4. మీరు, మీ అబ్బాయి ఒకే వృత్తిలో ఉన్నట్టున్నారు. ప్రత్యేకమైన కారణమేమైనా ఉందా?

నేను ఆడిటరుగా ప్రాక్టీసు చేస్తున్నాను కాబట్టి మా అబ్బాయిని సి.ఏ చేయించడం, ఆ ఫైళ్ళు అలాగే మరింత ప్రొఫెషనలిజమ్‌ పొందేలా తీర్చిదిద్దడానికి అవకాశం ఉండేలా ఇద్దరమూ ఒకే ప్రొఫెషన్ ను ఎంచుకొన్నాము.అంతకు మించిన ప్రత్యేకమైన కారణమంటూ ఏమీ లేదు

5. జి యస్‌ టి అనేది మన దేశ ప్రధాన ఆర్ధిక వనరుగా ఉంది కదా. అలాంటప్పుడు దీనివలన చాలా కంపెనీలు దివాళా తీసాయనేది మీ కవిత్వంలో కనిపిస్తోంది. ఇది ఎలా? వివరిస్తారా!

జి.ఎస్‌.టి అనేది ఓ జలగ. ప్రభుత్వం ఆదాయవనరుగా మలుచుకోవడం కోసం మనం కొన్న కొన్ని వస్తువులపై 28% వరకూ వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నది. 28% అంటే ఎంత పెద్ద మొత్తమో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. జి ఎస్‌ టిని వినియోగదారుల నుంచి వసూలు చేసి చెల్లింపుల్లో ఎలాంటి అలసత్వం జరిగినా 100% నుంచి 200% పెనాల్టీలు విధిస్తున్నారు. కనీసం మొదటి తప్పుకు క్షమార్పణ కూడా లేకపోవడం ప్రభుత్వం పోకడకు అద్ధంపడుతోంది. భారీ పెనాల్టీలు విధించడం వ్యాపారస్తుని నడ్డి విరవడమే అవుతుంది.

అట్లాగే ఇన్‌ కంటాక్స్‌ యాక్ట్‌ 1965 ప్రకారం ఉన్న చట్టాల్ని మార్చి ‘ఫేస్‌లెస్‌ స్క్రూటినీ’ విధానాన్ని ప్రవేశపెట్టడం ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదం. ఇన్‌ కంటాక్స్‌ చట్టాలు 20,000/- దాటితే అన్నీ చెక్కు ద్వారా చేయాలంటాయి. కానీ మనది వ్యవసాయ దేశం కదా. ఎక్కువగా పల్లెలు, నిరక్షరాస్యులున్న దేశంలో బ్యాంకింగ్‌ పట్ల అవగాహన లేని దేశంలో ఇలా ఫేస్‌ లెస్‌ స్క్రూటినీ ప్రవేశపెట్టి వేలు, లక్షల్లో టాక్స్ కట్టాలని డిమాండ్‌ చేయడం ఎంతవరకు సబబు? అందుకే ‘ఫేస్‌ లెస్‌’ అనే కవిత రాయడం జరిగింది. వ్యక్తులకు సంబంధం లేకుండా వ్యక్తుల వాదనలు వినకుండా కేవలం చట్టాన్ని అనుసరించి వేసే పెనాల్టీల పుణ్యమా అని కోట్ల కొద్దీ వసూళ్ళు ఆగిపోయాయి. ఇలాంటి కట్టని పన్నుల వలన ప్రయోజనం ఏమిటి? ప్రభుత్వం చేస్తున్న పని ఏమిటి? అదే వ్యక్తిగత సంబంధాలతో పన్నులు వేస్తే, అవి మధ్యేమార్గంలో పోతే వసూళ్ళు పెరుగుతాయన్న ఆలోచన ప్రభుత్వాలకు లేకపోవడం దురదృష్టకరం. కొద్ది సంవత్సరాల్లో ఈ నగ్న సత్యం తలకెక్కడంతో మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే పునరాలోచనలో పడినట్టుగా తోస్తున్నది.

6. మీరు యుక్త వయసులో ఫార్మా కంపెనీ పెట్టారా? ఏమా కథ.

అవును ఫార్మా కంపెనీ పెట్టడం, తెలియని దాంట్లో రంగప్రవేశం చేయడం 20 ఏళ్ళ జీవితం వృధా అయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నాను. నా ప్రధాన వృత్తిలోకి ప్రవేశించి విజయం సాధించగలిగాను. అదో విచిత్రానుభవం.

7. మీ వృత్తిని, ప్రవృత్తిని ఏ విధంగా బ్యాలెన్స్‌ చేస్తున్నారు?

వృత్తిలో నుంచి ప్రవృత్తికి కావల్సిన సామాగ్రిని ఎంచుకొని, ఆ వస్తువులతో రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరైనా వారి వారి వృత్తుల్లో తీరికలేని సమయాలుంటే ప్రవృత్తుల్లో కూడా రాణించగల్గుతారని నా ఉద్దేశ్యం. నేను ఆడిటరుగా ఎంతో బిజీగా ఉన్నప్పుడు సాహిత్యానికి కూడా టైం కేటాయించగల్గుతాను. అదే ఆఫీసులో పని లేకపోతే ప్రవృత్తి కూడా అంతంత మాత్రమే సాగుతుంది. అందుకే వృత్తిలో బిజీగా ఉంటూ ప్రవృత్తిలో కూడా రాణించాలనేది, రాణించగలమనేది నా సిద్ధాంతం. ఆ విధంగానే నేను రెండిటికీ న్యాయం చేయగల్గుతున్నాను. పనిలోనే విశ్రాంతి, పనితోనే ప్రవృత్తి.. ఇదే నేననుసరిస్తున్న నా సిద్ధాంతం.

8. మీ సాహిత్య గురువు గారి గురించి వివరిస్తారా?

నా సాహిత్య గురువు కీ॥శే॥ సత్యవేటి శ్రీకాంత్‌ గారు. ఆయన పరిచయమే నన్ను కవిత్వం పట్ల మొగ్గేలా చేసింది. ఆయన గొప్ప అధ్యయన శీలి. నవలాకారులు, కవి, వ్యాసకర్త. ఏం రాసినా తక్కువే. ఆయనదో ప్రత్యేకశైలి. తక్కువ పరిచయంలోనే డా॥ సి.నారాయణరెడ్డి గారిని ఆకర్షింపజేసుకొన్న గొప్ప రచయిత. ఆయన సాంగత్యంలో కొంత తెలుసుకోగల్గాను. కవిత్వానికి కావల్సిన సామాగ్రిని ఆయన వద్దే, ఆయన శిష్యరికంలోనే నేర్చుకొన్నాను. ఆ తర్వాత కాస్త పుస్తక పఠనం ద్వారా మెరుగు పరుచుకొన్నాను. అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నట్లు కవులు, కళాకారులు నిత్య విద్యార్థులే తప్ప సంపూర్ణత ఎక్కడుంటుంది. ఈ సిద్ధాంతాన్ని నమ్మేవాణ్ణి నేను.

9. కవిత్వం, సమీక్షా వ్యాసాలు కాకుండా ఇతర ప్రక్రియల జోలికి వెళ్లినట్టుగా లేరు. కారణం తెలుసుకోవచ్చా?

కవిత్వం మీదే నాకు మొదటి నుంచి శ్రద్ధ ఏర్పడింది. అలాగే సాహితీ వ్యాసాలు కూడా రాశాను, సినిమా సమీక్షలూ చేశాను.ఇప్పుడు అధ్యయనం కోసం పుస్తక సమీక్షలు ఎన్నుకొన్నాను. సమీక్ష రాయాలంటే తప్పక పుస్తకం అంతా చదువుతాం. ఆ విధంగా మనం నేర్చుకొనేదానికి అవకాశం ఎక్కువ ఉంటుందనేది నా అభిప్రాయం. నెల్లూరు నుంచి వెలువడే ‘లాయర్‌’ వారపత్రికలో నా సాహిత్య వ్యాసాలు, సమీక్షలు ‘నవమల్లెతీగ’లో పుస్తక సమీక్షలు ప్రచురితమయ్యాయి. ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా సాహిత్య వ్యాసాలు అచ్చయ్యాయి.

కథల జోలికి వెళ్ళలేదు. దానికి కారణం కథా సాహిత్యానికి ఎక్కువ సమయం అవసరముంటుంది. నా వృత్తిరీత్యా అంత సమయం కేటాయించే వీలు లేక ఇంకా కథల జోలికి వెళ్ళలేదు. ముందు ముందు కథా సాహిత్యంలోకి ప్రవేశించాలనే ఉత్సాహమైతే ఉంది.

10. ఎప్పటి నుండి కవిత్వం రాస్తున్నారు. ఇప్పటిదాకా ఎన్ని కవితలు రాశారు, ఎన్ని సంపుటులు వెలువరించారు?

దాదాపు 30 ఏళ్ళ నుంచి కవిత్వం రాస్తున్నాను. తొమ్మిది కవితా సంపుటాలు వెలువడ్డాయి. కవితలు ఎన్నో లెక్కించలేదు. త్వరలో మరో కవితా సంపుటిని తీసుకురావడానికి సిద్ధం అవుతున్నాను.

11. మీ మొదటి కవితా సంపుటి 1999లో వచ్చినట్టుంది. దానికి నాగభైరవ కోటేశ్వరరావు గారు ముందు మాట కూడా రాశారు. నాగభైరవ గారితో మీ పరిచయం గురించి.

నేను నాగభైరవ కోటేశ్వరరావు గారిని గురువుగా స్వీకరించాను. నా కవితా సంపుటి ‘అంతర్ముఖం’ ముందుమాటలో కూడా ఇదే విషయం వారు రాశారు. నన్ను బాగా ప్రభావితం చేసిన మరోవ్యక్తి శ్రీకాంత్‌ గారి తర్వాత నాగభైరవ గారే. ఆయనే నా తొలి కవితా సంపుటికి ‘జీవితం ఓ విజయం’గా గొప్ప నామకరణం చేసి వారి చేతులమీదుగా నెల్లూరులో గొప్ప సాహిత్య సభలో ఆవిష్కరించడం నాకు మధుర జ్ఞాపకం.

12. డా. నాగభైరవ కోటేశ్వరరావు గారు చాలాకాలం వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో యువ సంతకాలు శీర్షిక నిర్వహించారు. అందులో మీ కవిత్వం గురించి కూడా రాశారు. ఆ శీర్షికలో వచ్చిన పరిచయాలు ఒక సంపుటిగా తీసుకురావచ్చుగా?

నాగభైరవ కోటేశ్వరరావు గారు చాలాకాలం వార్త దినపత్రికలో కవుల్ని పరిచయం చేయడం మనకు తెలిసిందే! అయితే, ఆ పరిచయ పరిమళాలు మనకు లభ్యం కావడం దుర్లభం. ఎందుకంటే అవి ఆయన కూడా క్రోడీకరించినట్లు లేదు. వాళ్ళ కుటుంబసభ్యుల వద్ద కూడా లేవు. అవి దొరికితే, తప్పక పుస్తకం తీసుకొస్తాను.

13. మీ మొదటి కవితా సంపుటిలో ‘వర్తమాన గీతం’ కవితలో ‘అభిమానం రాసులుగా అమ్మబడుతుంది / అనురాగం అందంగా అమ్ముడుపోతుంది’’ అని రాశారు. ఇది ఈ కాలానికీ నిలిచే వాక్యం. ఈ వాక్యం రాయడంలో అప్పటి మీ అనుభవం.

పేదోడి అభిమానం అమ్మబడే విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి సమాజంలో. ‘వరే, తరే’ అంటూ మర్యాద, మన్నన లేని ప్రపంచం ఇది. ఇక్కడ అనురాగాలు, ఆప్యాయతలు అన్నీ ఆర్ధిక సంబంధాలే. మనిషి మనిషికీ మధ్య ఏ ప్రేమలు, అభిమానాలు ఉండవు. అన్నీ నోట్ల కట్టలతో ముడిపడి ఉంటాయి. ఎన్ని తప్పులనైనా కరెన్సీ ‘కాల్చి’ బూడిద చేస్తుంది. జ్యుడీషియరీ కూడా ప్రభుత్వాల చేతిలో, మనీ చేతిలో కీలుబొమ్మగా ఎగరటాన్ని చూస్తూనే ఉన్నాం. అందుకే ఆ సందర్భంలో వదలిన వాక్యాలివి.

14. ‘బ్లడీ బాస్టర్డ్‌’ కవితకు ఈ టైటిల్‌ పెట్టడమే ఒక సాహసం. ఈ కవితలో ఒకచోట ‘సామాన్యుడి బ్రతుకులో క్షామం ఇక క్షేమం’ అనే ఒక అధిక్షేపణ వాక్యం వాడారు. ఇదే కాదు, కొన్ని కవితలలో ఇలాంటి అధిక్షేప వాక్యాలు వాడినట్లుగా నేను గమనించాను. దీనివలన మీరు ఆశించే ప్రయోజనమేమిటి?

లంచాల అమేధ్యాన్ని అవలీలగా మేసేస్తూ, భరతమాత కన్నీటి చారికలకు కారకులైన వ్యక్తులపై నాకు అసహ్యం, పట్టరాని కోపం. నా వృత్తిలో తారసపడే అలాంటి వ్యక్తులపై ఓర్చుకోలేనితనం అలాంటి నామకరణం చేయించింది. వ్యంగ్య రచన చేయడం కొంచెం ఇష్టపడతాను. దాహం..దాహం అంతా వ్యంగ్య రచనే కదా? సామాన్యుని బ్రతుకులో క్షామం ఇక క్షేమం అనే వాక్యం భగ్గుమన్న కడుపు మంటలో నుంచి ఉద్భవించింది. లంచగొండితనం, దురాశ, అమానుషం ప్రభవించి వర్ధిల్లితే సామాన్యుని బ్రతుకులో క్షామం క్షేమంగానే ఉంటుంది కదా.

లంచావతారాల మీద నేను మరో కవిత కూడా రాసాను. చంద్రుడు ఏమి పొంది మనకు వెల్గునిస్తున్నాడు, సూర్యుడు ఏమి తీసుకొని మనకు కాంతినిస్తున్నాడనేది దాని సారాంశం. ఇలా లంచగొండితనాన్ని నిరసిస్తూ చాలా కవితలు రాశాను.

15. ‘గుండె దీపం’ కవిత్వ సంపుటిలో… ‘పాంట్రీ వాలా, పుస్తకం, దుప్పటి నా నేస్తం, రైలు కబేళా’ కవితల్లో మీకు బాగా ఇష్టమైన కవిత ఏది? ఎందుకు? ఆ కవిత రాయడానికి మీకు ఎంత సమయం పట్టింది?

నేను రాసిన ‘ప్యాంట్రీవాలా, దుప్పటి నా నేస్తం, రైలు కబేళా’.. అన్నీ కొత్త వస్తువును తీసుకొని రాసినవే. ప్యాంట్రీవాలా కవితను చాలామంది ప్రశంసించారు. ముఖ్యంగా మా కళాశాల ప్రిన్సిపాల్‌ డా॥ కాళిదాసు పురుషోత్తం గారు ఇప్పటికీ అప్పుడప్పుడూ గుర్తు చేస్తుంటారు. అది బాగా రాసావోయ్‌ అంటుంటారు.

‘దుప్పటి నా నేస్తం’ కవిత నది మాసపత్రికలో అచ్చయింది. డా॥ నాగభైరవ కోటేశ్వరరావు గారు అస్వస్థతతో బెడ్‌ మీద ఉండీ దాన్ని ప్రశంసించడం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రైలు కబేళా కూడా ఎవ్వరూ టచ్‌ చేయని సబ్జెక్ట్‌.మొన్నటికి మొన్న ‘ఫోటో స్మృతి’ కవిత రాసాను. ఫోటోలకు విలువలేకుండా పోయిన ఘటనను (సెల్‌ ఫోన్‌ లో కెమెరా రావడంతో) తీసుకొని రాసిన సందర్భాన్ని కూడా మిత్రులు అభినందించారు. కొత్త వస్తువుల కోసం అన్వేషిస్తూ రాయడం కోసం చూస్తుంటాను. అది నా నైజం.

16. ‘మాట’ వస్తువుగా దీర్ఘకవిత రాశారు. అది చాలా పాపులర్‌ అయి సాహితీవేత్తలు ఎంతోమంది మెచ్చుకున్నారు. పైగా తెలుగులో ‘మాట’ వస్తువుగా వచ్చిన మొదటి దీర్ఘ కవితగా విశేష ఆదరణ పొందింది. దీనిని రాయడానికి ప్రేరణ ఏమిటి? ఎవరు?

‘మాట’ నా మనసులో నుంచి పుట్టిన వస్తువు. ఎవరూ దానికి ప్రేరణ కాదు. పదేళ్ళ క్రితం రాసింది. ఎదుటివాళ్ళు మాట్లాడే తీరును గమనిస్తూ ఉండేవాణ్ణి. మెడికల్‌ మ్యాన్యుఫాక్చరర్‌గా ఉన్నప్పుడు మెడికల్‌ రెప్రజెంటేటివ్స్‌ డాక్టర్లను ఒప్పించి ప్రోడక్ట్స్‌ రాయించే పద్ధతుల్ని అలవరచుకోమని చెప్పే వాళ్ళం. అక్కడ ఎలా మాట్లాడాలో తర్ఫీదు ఇచ్చేవాళ్ళం. బహుశా ఆ క్రమంలో మాట ప్రాముఖ్యతను బట్టి మాట సమాజానికి ఎంత అవసరమో చెప్పాలన్పించి ‘మాట’ను కవితా వస్తువుగా తీసుకొన్నట్టన్పిస్తుంది. ఇలా నా మనసులో తిరుగుతున్న మాటను మీరు బయటకు లాగిన వ్యక్తి. మహత్తర శక్తి మీరే!

17. ‘దాహం… దాహం’ దీర్ఘ కవిత కూడా సాహిత్యకారులలో ఆలోచన రేకెత్తించింది. అంతేకాక ఇదొక నిరసన కావ్యంగా కూడా చెబుతున్నారు.

‘దాహం దాహం’ నా గుండెల్లో దావానలాన్ని బయటకు తీసిన దీర్ఘకవిత. నేను తొలుత దాహం.. దాహం కవితను రాశాను. దాన్ని చదివిన ప్రముఖ సాహితీవేత్త శ్రీరామకవచం సాగర్‌ గారు దీన్ని దీర్ఘకవితగా మలచమని సలహా ఇచ్చారు. ఇక ప్రముఖ కవి ఏటూరు నాగేంద్ర రావు గారు బలపరచడం మీకు తెలిసిందేగా. అలా ఆలోచించుకొంటూ సాగిపోయే క్రమంలో మానవుల దాహాలు ఒకదాని వెంట మరొకటి మనసులోకి చొచ్చుకొని ప్రవహించాయి. దీనికి ప్రేరకులు సాగర్‌ గారు, నాగేంద్ర గారే! మానవ బలహీనతలే దాహాలుగా ఎక్కుపెట్టి రాసిన దీర్ఘకవిత ఇది. శ్రీమతి ఫణి మాధవి కన్నోజు, శ్రీ సుంకర గోపాల్‌, శ్రీ అవ్వారు శ్రీధరబాబు,శ్రీ రమణ వెలమకన్ని,శ్రీ దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి లాంటి కవులు రచయితలు ప్రశంసించడం నా అదృష్టంగా భావిస్తాను.

18. దీర్ఘ కవితకు, దీర్ఘ కావ్యానికి లక్షణాలలో తేడాలు వివరిస్తారా?

భిన్న భావాలను గొప్ప విస్తీర్ణంతో చేప్తే అది కావ్యం అవుతుంది. కావ్యంతో సందేశం ఇస్తేనే అది మహాకావ్యం అవుతుంది. కావ్యంలో ఒక వస్తువుతో రాస్తే అది దీర్ఘకవిత అవుతుంది. భిన్న భావాలని ఒకే విషయంతో చెప్తే అది దీర్ఘకావ్యం అవుతుంది.

19. పాశ్చాత్య సాహిత్యం చదువుతున్నారా? ఎవరి సాహిత్యం ఎక్కువ ఇష్టం. ఎందువలన?

పాశ్చాత్య సాహిత్యం పెద్దగా చదవలేదు. అది చదివే అవకాశం రాలేదు. కళాశాల రోజుల్లో చదివిన మిల్టన్‌, షేక్స్పియర్‌లు తప్ప పెద్దగా చదవలేదు.

20. శ్రీరామకవచం సాగర్‌ గారి సాహిత్యం ఎక్కువగా చదువుతారని తెలిసింది. వారి సాహిత్యం గురించి చెబుతారా?

శ్రీరామకవచం సాగర్‌ గారు విజ్ఞాన ఖని. పాశ్చాత్య సాహిత్యాన్ని, పద్య సాహిత్యాన్ని, ఆధునిక సాహిత్యాన్ని ఔపోసన పట్టిన భావుకులు ఆయన. ఆయన ఏది రాసినా ఆయన సాహిత్యంలో లోతైన అధ్యయనం మనకు అవగతమవుతూ ఉంటుంది. కొన్ని కొన్ని పద్ధతులు, నియమాలు వారి సంభాషణల్లోంచి, వారి సాహిత్యం నుంచి నేర్చుకొనగలిగాను.వారు అలవోకగా తెనిగించిన కొన్నింటిని అభినందన పత్రాలు రూపొందించి ఆయన ప్రశంసలు చూరగొన్న సందర్భాలూ ఉన్నాయి.

21. శ్రీరామకవచం సాగర్‌ గారి ‘ప్రచ్చన్న వస్తు శిల్పాలు’ చదివారా? ఆ గ్రంథంపై మీ విస్పష్ట అభిప్రాయం తెలుసుకోవచ్చా?

కవిత్వం ఎలా రాయాలో, ఎలా రాయగూడదో చెప్పిన గొప్ప ప్రక్రియ ఇది. మేధావుల స్పందన ఈ కావ్యంపై అంతంత మాత్రంగా ఉంది. స్పందించాల్సిన గొప్ప సిద్ధాంతం ఇది.

22. నాగభైరవ పురస్కార కమిటీ కార్యదర్శిగా చాలాకాలం పని చేశారు. ఈ కాలంలో మీ అనుభవాలను పంచుకుంటారా?

నాగభైరవ పురస్కార కమిటీని నేను, నా మిత్రులు సినీ కవి వెన్నెలకంటి గారు ప్రారంభించాం. అందుచేత ఆ పురస్కార కమిటీ ప్రారంభం నుంచి కర్త కర్మ క్రియగా నేను వ్యవహరించడం అందరికీ తెలిసిందే. వెన్నెలకంటి బ్రతికున్న రోజుల్లో నాగభైరవ వీరాభిమాని భూసురుపల్లి వారు వెన్నెలకంటికి నాగభైరవ పేర అవార్డు ఇస్తామని అడిగారట. దానికి వెన్నెలకంటి గారు స్పందించి నాకు కాదు సత్కారం చేయవలసింది నాగభైరవ కమిటీ భారాన్ని మోస్తున్న చిన్ని నారాయణరావుకు అనడంతో భూసురుపల్లి వారు నన్ను ఎంతో ఆదరంతో పిలిచి సత్కరించారు. 10 ఏళ్ళు సంవత్సరానికొక పండుగలా చేయగల్గాం. దానికి వెన్నెలకంటి గారి ప్రోత్సాహక సహకారాలూ లభించాయి. నిష్ణాతులైన వ్యక్తులకు సత్కారాలతో బాటు, యువతను ప్రోత్సహించడానికి స్ఫూర్తి పురస్కారాలు, సాహితీ పోటీలు ఇలా ఒకటేంటి నెల్లూరులో నాగభైరవ అవార్డు పండుగను వైభవంగా జరిపాం. కీ॥శే॥ ఎం.ఎస్‌.రెడ్డి, శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య, శ్రీ రసరాజు, కీ॥శే॥ అద్దేపల్లి, శ్రీ తనికెళ్ళ భరణి, శ్రీ రావి రంగారావు, కీ॥శే॥ సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీ గుడిపాటి, కీ॥శే॥ గొల్లపూడి మారుతీరావులకు నాగభైరవ అవార్డును అందజేశాం. అలా నాగభైరవ గారి స్మృతిని పదిమందికీ పంచిన మేము అధ్యక్షుని మరణంతో ఆగినా, ఆ సభలు వివిధ ప్రదేశాల్లో జరిగేలా ప్రాతిపదికలేయగలిగాం.

23. ఇప్పుడు మీ పేరుతో ఒక సాహితీ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము సాహితీవేత్తలకు పురస్కారాలు ఇస్తున్నారు కదా? ఈ ఫౌండేషన్‌ ఉద్దేశ్యాలు ఏమిటి?

కేవలం సాహితీ సృజనే కాకుండా సాహితీ సేవ కూడా చేయాలనే తపన నాకు ఎక్కువ. నాగభైరవ అవార్డు కరోనా, ఇతర కారణాల వల్ల ఆగిపోయిన తర్వాత శ్రీ శ్రీరామకవచం సాగర్‌, శ్రీ ఏటూరి నాగేంద్రరావుల ప్రోత్సాహంతో గత సంవత్సరం చిన్ని నారాయణరావు సాహితీ ఫౌండేషన్‌ ను ఏర్పాటు చేశాను. అంతకు ముందే ఫౌండేషన్ తరఫున నవమల్లెతీగ పత్రికలో కథల పోటీ నిర్వహించాను కూడా. ఇప్పుడు కవులను, సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరము రెండు అవార్డులు ఇవ్వడం, అంతే కాక నన్ను తీర్చిదిద్దిన ముగ్గురు వ్యక్తులు కీ॥శే॥ సత్యవేటి శ్రీకాంత్‌, తుంగా రాజగోపాల్‌రెడ్డి, నాగభైరవ కోటేశ్వరరావుల పేరు మీద పురస్కారాలు ఇవ్వదలచాను. అలా సాహితీ సేవలో ముందుకుపోతున్నాను.

24. చాలామందికి వివిధ సందర్భాలలో పురస్కారాలు ఇచ్చేటప్పుడు సన్మానపత్రాలు రాస్తారట కదా.. ముఖ్యమైన వారి సన్మానపత్రాల గురించి…

వివిధ సందర్భాలలో పురస్కారాలు ఇచ్చేటప్పుడు నెల్లూరులో అభినందన పత్రాలు రాసే కళలో కొంత ప్రావీణ్యం సంపాదించాను. దానికి మా గురువు సత్యవేటి గారు నేర్పిన అక్షర తపస్సే కారణం. అలాగే ‘లాయర్‌’ పత్రికాధిపతి శ్రీ తుంగా శివప్రభాత్‌రెడ్డి ప్రోత్సాహమే మరో కారణం.

నటశేఖర కృష్ణతో ప్రారంభించి ఎంతోమంది ఉద్ధండులైన సాహితీ రాజకీయ నాయకులకు రాయడం వారి అభినందనలు అందుకోవడం జరిగింది. కీ॥శే॥ కొణిజేటి రోశయ్య గారికి ఆయన ఆర్ధికమంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నరుగా సన్మానపత్రాలు సమర్పించే భాగ్యం నాకు కల్గింది. అలాగే కీ॥శే॥ తుర్లపాటి కుటుంబరావుకు, శ్రీ మేడసాని మోహన్‌ గారికి, శ్రీమతి ఉషా వెంకయ్యనాయుడు గారికి, ఎంతో మందికి అక్షర హారతిని అందించగలిగిన భాగ్యం నాది.

25. సినిమా సమీక్షలు ఎన్ని రాశారు. వాటిని గ్రంథస్థం చేసే ఆలోచన ఉందా?

సినిమా సమీక్షల పరంగా తీసుకుంటే, నా తొలి అడుగు సినిమా సమీక్షలతోనే. నెల్లూరు నుంచి వెలువడే పత్రికలు జమీన్‌ రైతు, లాయర్‌ దిన వారపత్రికల్లో ఎంతోకాలం సినిమా సమీక్షలు రాశాను. ఆ సినిమా సమీక్షలకు ‘లాయర్‌’ వారపత్రిక అధినేత శ్రీ తుంగా రాజగోపాలరెడ్డి ‘లాయర్‌ అవార్డు’ ఇచ్చి సత్కరించారు.

ఆరోజుల్లో నెల్లూరులో సినిమా సమీక్షల్లో నాకు, కీ॥శే॥ గ్రిద్దలూరి గోపాలరావుకు పోటీ నడిచేది. నాగభైరవ కోటేశ్వరరావు గారు ఈ సినిమా సమీక్షలను ప్రశంసించిన సందర్భమూ ఉంది. వాటిని గ్రంథస్తం చేసే ఆలోచన లేదు. కారణం.. అవి కాలానికి నిలబడవు కాబట్టి.

26. మీ సాహిత్య సృజనకు దక్కిన అరుదైన సత్కారాల గురించి.

నా ‘మాట’ దీర్ఘ కవిత ఇంగ్లీషు అనువాద పుస్తకాన్ని మాన్యులు మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ వెంకయ్యనాయుడు గారు చదివి ఆవిష్కరించిన సందర్భం.గొప్ప అవకాశం ఢల్లీ ఉపరాష్ట్రపతి భవన్‌ లో జరిగిన ఆ కార్యక్రమం మహత్తర సత్కారంగానే సాగింది.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉగాది పురస్కారం, తెలుగు యూనివర్శిటీ కీర్తి పురస్కారం. అంతేగాక, సాహితీ పత్రికలు చినుకు, నవ మల్లెతీగ, విశాలాక్షి అందించిన సాహిత్య పురస్కారాలు, ఎక్స్‌ రే ఉత్తమ కవితా పురస్కారం లాంటివీ ఉన్నాయి. చేరా గారి జడ్జిమెంటుతో ఎక్స్‌రే పురస్కారం అందుకోవడం చిరకాలం గుర్తుండిపోయే సంఘటన.

27. ఇప్పటిదాకా వెలువరించిన గ్రంథాల వివరాలు.

‘జీవితం ఓ విజయం, అంతర్ముఖం, గుండె దీపం, మాట, గంపకూడు, మాట ద్వితీయ ముద్రణలో మరిన్ని కవితలు కలిపి ‘మాట-2’గా ప్రచురించాను. దాహం.. దాహం దీర్ఘకవిత, బ్రతుకొక ఉత్సవం కవితా సంపుటి నేను ఇప్పటిదాకా వెలువరించాను. ‘మాట’ దీర్ఘ కవిత్వం ‘THE WORD’ శీర్షికతో ఆంగ్లంలోకి అనువాదమైనది. అద్దేపల్లి గారు ఎంతో ఇష్టంగా ఈ దీర్ఘ కవితను రామతీర్ధ,జగద్ధాత్రి గార్లతో అద్భుతంగా ఆంగ్లంలోకి అనువాదం చేయించారు. ఈ ఆంగ్లానువాద గ్రంథాన్ని గౌరవ మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు న్యూ ఢిల్లీ లోని తమ కార్యాలయంలో ఆవిష్కరణ చేయడం నేను మరిచిపోలేని ఒక తీయని అనుభూతి.

అద్దేపల్లి రామమోహన్ రావు గారు, తుర్లపాటి కుటుంబరావు గారు,కె.శివారెడ్డి గారు పేర్కొన్నట్లు తెలుగు సాహిత్యంలో ‘మాట’ వస్తువుగా ఇంత పెద్ద కవిత రాయడం ఇదే ప్రథమం అని ప్రశంసించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాక శివారెడ్డి గారు అన్నట్టుగా తెలుగులోనే కాదు ఏ భాషలోనూ ‘మాట’ పై ఇంతగా రాసిన వాళ్ళు బహుశా ఎవరూ లేరనడం, ‘మాట’ విశిష్టత.మరొక కవితా సంపుటి త్వరలో రాబోతోంది

కొ.వి.రా: ధన్యవాదాలు సి.నా.రా గారు.నేను అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు, వివరణలు ఇచ్చినందుకు.

సి.నా.రా: మీకు కృతజ్ఞతలు రావు గారు. మొత్తం మీద నన్ను మళ్ళీ కదిలించి,కవ్వించి ప్రశ్నలు అడిగి, నేను నా సాహిత్యంపై,నా జీవితంపై వెనక్కి తిరిగి చేసుకునేలా చేశారు. మీకు,మీ సంపాదకులకు కృతజ్ఞతలు.

(ఈ సాహితీవేత్తతో మాట్లాడాలంటే ఫోన్ నంబర్: 94402 02942 లో సంప్రదించి స్పందనను పంచుకోవచ్చు.

ఇంటర్వ్యూ: విల్సన్ రావు కొమ్మవరపు

సృజనక్రాంతి సాహితీ సంపాదకులు

89854 3115

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *