వెంకయ్య నాయుడు
రొమ్ము క్యాన్సర్‌పై యూట్యూబ్ వేదికగా నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో వీక్షించిన నేపథ్యంలో కిమ్ ఆస్పత్రి రొమ్ము క్యాన్సర్ వైద్య నిపుణులు రఘురాం గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించారు. ఈ సందర్భంగా ఆయనను మాజీ ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు అభినందించారు. కిమ్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్య హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రశంస పత్రాన్ని రఘురాం అందుకున్నారు. రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడంలో కిమ్ ఆస్పత్రి వైద్యులు చేస్తున్న కషి అభినందనీయమని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. తొలి దశలోనే ఈ క్యాన్సర్‌ను గుర్తిస్తే అధునాతన వైద్య పద్ధతులను అనుసరించి నయం చేయవచ్చు. అందుకోసం ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరం. ఏకకాలంలో వందలాది మందికి అవగాహన కల్పించడంలో రఘురాం పాత్ర గొప్పది. ప్రస్తుత సమాజంలో వినోదానికే వాడుతున్న సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కల్పించడం శుభ పరిణామం. మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్న అభిరుచి కలిగి ఉండడం దేశానికి శ్రేయస్కరం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఆరోగ్యం కాపాడుకోవాలంటే శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత, ఆహార అలవాట్లను నియంత్రణలో ఉంచుకోవాలి. అప్పడే వ్యాధుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. భారత ప్రజలు మాతభాషకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది’’ అని వెంకయ్యనాయుడు అన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడంపై డాక్టర్ రఘురాం ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మౌంట్ అబూలో బ్రహ్మకుమారిలతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా దాన్ని 11,000 మంది యూట్యూబ్ వేదికగా చూశారని తెలిపారు. ఉషా లక్ష్మి రొమ్ము క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలి దశలోనే ఈ వ్యాధిని గుర్తిస్తే క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడొచ్చని అన్నారు. 40 ఏళ్లు దాటిన మహిళలంతా రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే స్క్రీనింగ్ చేసుకోవాలని సూచించారు. తన తల్లి కూడా ఈ వ్యాధితో బాధ పడినట్లు తెలిపారు. ఆమె స్ఫూర్తితోనే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తన వంతుగా కషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిమ్ ఆసుపత్రుల ఎండీ భాస్కర్ రావు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, వరల్డ్ రికార్డు ప్రతినిధి రిషి నాథ్ తదితరులు పాల్గొన్నారు.
