సమస్యల పరిష్కరించడంలో సివిల్ సర్వీస్ అధికారులు సానుకూల దృక్ఫథం కలిగి ఉండాలి

తెలంగాణ

సమస్యలను పరిష్కరించడంలో సివిల్ సర్వీస్ అధికారులు ప్రజలకు ఉపయోగపడే విధంగా సానుకూల దృక్ఫథం కలిగి ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు సహాయం చేయాలన్న ఆలోచన ఉన్న అధికారులు ప్రజల మనసుల్లో ఎక్కువ కాలం గుర్తుంటారని చెప్పారు.ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం. గోపాలకృష్ణ రాసిన ‘లైఫ్ ఆఫ్ ఏ కర్మ యోగి’ (Life of a Karma Yogi) పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…

“గతంలో ఐఏఎస్ అధికారులు నిత్యం ప్రజల్లో ఉండేవారు. ఆ కారణంగానే రాజకీయ నాయకుల కంటే అధికారులనే ప్రజలు ఎక్కువగా గుర్తుంచుకునే వారు. ముఖ్యంగా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించడం వల్ల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ కొందరు కలెక్టర్లు ఏసీ రూములను వదిలి బయటకు వెళ్లడం లేదు. కలెక్టర్లు, ఎస్పీలకు జిల్లా స్థాయిలో గడించే అనుభవమే కీలకమవుతుంది. అధికారుల్లో మార్పు రావలసిన అవసరం ఉంది. నిబద్ధత కలిగిన అధికారులకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. రాజకీయ నాయకులు నిర్ణయాలు చేసినప్పుడు వాటిలోని అంశాలను విశ్లేషించి వివరించాల్సిన బాధ్యత సివిల్ సర్వీసెస్ అధికారులదే. బిజినెస్ రూల్స్ వివరించాలి. కొందరు వాటిని విస్మరిస్తున్నారు. అది సమాజానికి మంచిది కాదు. అధికారుల ఆలోచనా విధానాల్లో మార్పు రావాలి.
ఎంతో నిబద్ధతతో పనిచేసిన గొప్ప అధికారి శంకరన్, పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి శేషన్, దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ లాంటి వారి అనుభవాల నుంచి కొత్తగా సర్వీసులో చేరుతున్న సివిల్ సర్వెంట్స్ ఎంతో నేర్చుకోవాల్సి ఉంది.
ఆరు దశాబ్దాల అనుభవాన్ని ఈ పుస్తకంలో నిక్షిప్తం చేశారు. మనం ఏదైనా కొనొచ్చు. కానీ అనుభవాన్ని కొనలేం. సివిల్ సర్వెంట్స్ అందరికీ గోపాలకృష్ణ పుస్తకం వెలకట్టలేనిది. అందరికీ ఒక దిక్సూచిగా ఉంటుంది.

తొలి ప్రధానమంత్రి నెహ్రూ కాలం నుంచి నేటి ప్రధాని మోదీ వరకు అనుభవం కలిగిన గోపాలకృష్ణ .. క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ వరకు దేశంలో మార్పులకు ప్రత్యక్ష సాక్షి. భవిష్యత్తును కూడా వారు విజువలైజ్ చేయగలుగుతున్నారు” అని వివరించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , అసోసియేషన్ వైస్-ప్రెసిడెంట్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావుతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *