పెట్టుబడుల ఆకర్షణకు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన

తెలంగాణ

ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనకు బయలుదేరుతున్నారు. సోమవారం ఉదయం మేడారం లో పునర్నిర్మించిన సమ్మక్క సారలమ్మ గద్దెలకు పూజలు చేసి.. మహా జాతరను సీఎం ప్రారంభిస్తారు. ఉదయం 8 గంటలకు అక్కడినుంచి హెలికాప్టర్ లో బయల్దేరి హైదరాబాద్ చేరుకుంటారు. ఉదయం 9.30 కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి దావోస్ కు బయల్దేరుతారు. ముఖ్యమంత్రి వెంట సీఎంఓ అధికారులు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటనకు వెళుతున్నారు. జనవరి 20 నుంచి నాలుగు రోజులపాటు దావోస్ లో జరిగే సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్తృత స్థాయి భేటీలు నిర్వహించనున్నారు. దావోస్‌లో తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, సేల్స్‌ఫోర్స్, యూనిలీవర్, హనీవెల్, ఎల్‌ఓరియల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డీపి వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ సంస్థల అధినేతలతో సీఎం విడివిడిగా భేటీ అవుతారు. పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, తయారీ రంగాల్లో పెట్టుబడులపై ప్రధానంగా చర్చలు జరుపుతారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ను, రాష్ట్రం లో వివిధ రంగాల అభివృద్ధి కి ఉన్న అనుకూలతలను దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణను ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.