పరోపకారం కోసం బతికిన దధీచీ మహర్షి

ఆధ్యాత్మికం సాహిత్యం హోమ్

మన దేశం ఇంత సుభిక్షితంగా తేజోమయంగా ఉంది అంటే దానికి కారణం ఎంతో మంది మహర్షులు ఈ గడ్డపై జన్మించటమే అని చెప్పాలి. వాళ్ళు చేసిన యాగాలు, వారు ధారపోసిన తపస్సుల ఫలితమే మనమీరోజు ఇలా ఉండటానికి కారణం.

భూమి మీద ఆధ్యాత్మికత ఇంకా వెల్లివిరిస్తోంది అంటే ఇంకా ఇలాంటి మహర్షుల ఆశీర్వాదాలు మన మీద ఉండబట్టే అనటంలో సందేహం లేదు.ఇలాంటి మహర్షుల చరిత్రను మనం తెలుసుకోవటం మన ధర్మం. దధీచి మహర్షి అథర్వణ ఋషికి, చితికి కలిగిన సంతానం. చిన్నతనం నుంచే ఆయనకు భగవంతుని పట్ల అపారమైన భక్తీప్రపత్తులు కలిగి ఉండటం వల్ల సరస్వతి నది ఒడ్డున ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. విష్ణువుని ప్రసన్నం చేసుకుని తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే చనిపోయే వరాన్ని పొందుతాడు దధీచి.

సర్వశాస్త్ర కోవిదుడైన దధీచికి ఇంద్రుడు బ్రహ్మవిధ్యని నేర్పి ఇది మరెవరికైనా చెపితే తల నరికేస్తాను అని హెచ్చరిస్తాడు.
అశ్విని దేవతలు దధీచి దగ్గరకు వచ్చి ఆ బ్రహ్మవిధ్యను వాళ్ళకి నేర్పమని అడుగుతారు. ఇంద్రుడి హెచ్చరికను విని వాళ్ళు దధీచి తలను తీసి భద్రపరిచి ఒక గుర్రం తలను ఆయనకి అతికిస్తారు.

దధీచి మహర్షి ద్వారా బ్రహ్మవిద్యను పొందుతారు వారు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు కోపంతో అక్కడికి చేరి దధీచి తలను నరికి వెళ్ళిపోతాడు.*
అపుడు అశ్విని దేవతలు భద్రంగా దాచిన దధీచి తలను తెచ్చి మరల అతికిస్తారు.

ఇలా తన శ్రేయస్సు గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ఎదుటివారి కోరికలను ఎప్పుడూ తీర్చేవారు దధీచి.
ఒకసారి రాక్షసులు వృత్తాసురుడి నేతృత్వంలో ఇంద్రుడి పైకి యుద్దానికి వెళతారు. దేవతల దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలను దోచుకోవాలని వారి ఉద్దేశం. అయితే వృత్తాసురుడిని ఎదుర్కొనే బలం లేక దేవతలు స్వర్గం నుంచి బయటకి పరుగులు తీసి దధీచి దగ్గరకు వచ్చి వాటిని జాగ్రత్తగా దాయమని ఇచ్చి వాళ్ళు మళ్ళీ పరుగులు తీస్తారు.దధీచి దగ్గరకు వచ్చి ఆయన తేజస్సుని ఎదుర్కొనే ధైర్యం లేక రాక్షసులు వెనక్కి వెళ్ళిపోతారు.

ఎంతో కాలం దేవతల కోసం ఎదురుచూసిన దధీచి మహర్షి ఇంకా వాళ్ళు రాకపోవటంతో ఆ అస్త్రశస్త్రాలను తన కమండలంలో కరిగించి వాటిని ఆయనే తాగేస్తారు.
ఇంద్రుడు, దేవతలు వృత్తాసురుడి బారి నుండి తమను రక్షించమని శ్రీ మహావిష్ణువుని కోరుతారు.
దానికి విష్ణుమూర్తి దధీచి మహర్షి శరీరంలో ఉన్న ఎముకలను ఆయుధంగా మార్చి దానితో సంహరిస్తే వృత్తాసురుడు మరణిస్తాడని చెపుతారు.
దానితో దేవతలందరూ దధీచి దగ్గరకు వెళ్లి వాళ్ళ కోరికను విన్నవించుకుంటారు.

దధీచి తన వల్ల ఎంతో మందికి మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతో వాళ్ళ కోరికను నెరవేరుస్తానని మాట ఇస్తాడు. అయితే చనిపోయే ముందుతనకి భూమి మీద ఉన్న అన్ని నదులలో స్నానం చేయాలనీ ఉందని ఇంద్రుడికి చెప్తాడు.
అప్పుడు ఇంద్రుడు నైమిశారణ్యంలో తగిన ఏర్పాట్లు చేసి దధీచి కోరికను తీరుస్తాడు. ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించే వరమున్నందువల్ల దధీచి తన ప్రాణాలని విడిచిపెడతాడు.
అప్పుడు కామదేనువైన ఆవు వచ్చి దధీచి శరీరాన్ని తన నోటితో రాస్తూ మాంసాన్ని మొత్తం తీసి ఎముకలని బయటకు తీస్తుంది.
అలా వచ్చిన ఎముకులతో వజ్రాయుధాన్ని తయారు చేసి దానితో వృత్తాసురుడిని చంపుతాడు ఇంద్రుడు.

దధీచి భార్య పేరు సువర్చల, కొడుకు పేరు పిప్పలాది. కొడుకు కూడా గొప్ప తపస్వి. ఇలా తన కోసం ఎప్పుడూ ఆలోచించకుండా కేవలం లోకం కోసం ఆలోచించే దధీచి లాంటి సమహర్షులు ఎంతమంది ఉంటారో ఆలోచించండి.

——–యమ్వీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *