ఊరుమ్మడి బతుకులు పుదిచ్చుకునే పెద్ద పనిముట్టు ‘దాతి’. ఊరంతటి వ్యవసాయానికి చెమటల పంటకాలువ, ఊటపర్రె దాతి. వడ్లదాతి నుంచే నాగలి, కమ్మరిదాతి నుంచి కర్రు, కొటేరేసుకుని రైతు పొలం తొవ్వకు పోతడు. ప్రతి ఊరును స్వయం సమృద్ధం చేసే సహజీవన సంస్కృతికి నాటిన బొడ్రాయి దాతి. దాతి కంసాలికి, కంచరికి కూడా వుంటుంది. దాతి ‘డాకలి’ నిలిపే మొద్దు. డాకలి సకల వ్యవసాయం పనిముట్లకు ఉత్పత్తి సాధనం. ఊరందరి బతుకుతెరువుకు ఉత్పత్తి పరికరాలనిచ్చే కేంద్రం డాకలి.ఊర్లు తెర్లాయె. ‘కమ్మరికొలిమల తుమ్మలు మొలిచె. పెద్దబాడిశెలు మొద్దుబారినయి’. పెట్టుబడిదారి సమాజం ‘ఎకో ఫ్రెండ్లీ, హస్తకళల కార్ఖానా’ పల్లెను కన్నీరు పెట్టించింది. చేతివృత్తులు చిత్తు చిత్తైపోయినయి. మిగిలినోల్లు మిగులంగ ఊర్ల నుంచి వలసలే. బతుకుతెరువు పోయి, రోకులేని బతుకులైనయి. పనివాండ్లను మరిచిపోతున్నది దేశం. పల్లెను మరిచిపోయింది. చరిత్రకు మొదలు ఈ పనివాండ్లే. వీళ్ళ చేతుల్లో తయారైన అసువావులే.
‘The dust will gather on beaten forge
which crafted hardened steel.
Even hardest blade it gorged,
but all forget the Blacksmith.
Rooted deep in township’s yore
with a trade of kings and conquest.
Upon him once relied your lore,
but all forget the Blacksmith’.(The
Blacksmith-Alexander Constantine)
_____
ప్రపంచమంతటా వ్యవసాయం వుంది. అనేక వృత్తులున్నాయి. అన్ని దేశాల్లో జీవించే ప్రజలందరి మౌలిక జీవనంలో పనివాండ్లున్నారు.వాండ్ల పనితనాలున్నాయి. ఆర్థికస్థితిగతులు, నమ్మకాలు, ఆచారాలు, బతికేతీరు వేర్వేరే కావచ్చు. ఉత్పత్తిసాధనాల తయారీలో వృత్తులు, వృత్తిదారులుంటరు. సామాజిక వాస్తవికత ఇదే. వస్తువులు, వాటి సంస్కృతి వాస్తవం. మనదేశంలో వాటినంటివుండేవి కులం, మతం, మానవ సంబంధాలు. కాలం మారుతున్న కొద్ది ఉత్పత్తుల్లో, ఉత్పత్తిసాధనాల్లో పరిణామాలొచ్చాయి. వాటిని తయారుచేసే, వినియోగించే మనుషుల స్వభావ, శీలాల్లో మార్పులొచ్చాయి.
_____
భారతదేశంలో నిచ్చెనమెట్ల సమాజముంది. ఈ సమాజ స్వభావంలో వర్ణ వివక్ష నుంచి కులాధిక్యత, కుల వ్యత్యాసాలున్నాయి. చాలా చాలా ఆధిక్యతలు పెరిగాయి. సబ్బండవర్ణాలకు అవసరమైన వృత్తులవారిని, కులాలుగా చూసి, అవసరాలకు మాత్రమే వాడుకుంటు, సామాజికంగా తక్కువ చేయడం ఆనవాయితీ, సంప్రదాయం, ఆచారం, మత సంవిధానంగా చూడడం ఎక్కడి ఇలవరుసో? చెప్పులు కుట్టేవాండ్లుండాలి, తోలు పనిచేసేవాండ్లుండాలి. కాని, అంటరానితనం? చాకిరికి చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్ల, కంచరి, బంటు, మాల….అందరు కావాల్సిందే.
భోగమెవరిది? ఉత్పత్తిలో పెద్దకుప్పలెవరివి? అధికారాలెవరిపాలు? అగచాట్లు ఎవరికి? మారింది, మారిందనుకున్న సమాజంలో వృత్తులు పెరిగాయి. ఉత్పత్తి సాధనాలు మారాయి. ఉత్పత్తిదారులు పెట్టుబడిదారులు. ఉత్పత్తి కారకులైన శ్రామికులు ఎక్కడున్నా, ఏ రూపంలోవున్నా పొట్టకూటికి బతికేవారే. ఈ రివాజు ఆగిందా? వృత్తిదారులు, వివిధ కులాలవాండ్ల జీవితాలు చరిత్రలో చేరిపోతున్నాయి.
ముఖ్యంగా కమ్మరి దాతి చరిత్ర మానవ పరిణామమంత పెద్దది. క్రీ.పూ.2300 సం.ల కింద తయారుచేసిన ఇనుప వస్తువులు హైద్రాబాదులోని కేంద్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని సమాధుల్లో దొరికినాయి. అప్పటి నుంచి ఉన్నదే కదా కమ్మరిదాతి. 4వేల యేండ్లనాడే ఇనుము తయారీ చేసిన అసురులు, అగారీలు, కమ్మరులు ఈ దేశానికి ఇక్కడ నుంచే ఉక్కు పంపినారు. విదేశాలలో డమాస్కస్ వంటి దేశంలో తయారైన ఉక్కు కత్తికి ఉక్కుముద్దలిక్కడివే. ఇక్కడ బట్టీలలో నుంచి వచ్చిన ఉక్కు, ఇనుములే. ఇక్కడ దాతి, డాకలి మీద కొట్టిన ఉక్కుముద్దలే. దాతిది రాతియుగాల చివర పుట్టిన చరిత్ర.
మనుషులకు ఇన్నియుగాలుగా బువ్వపెట్టిన వ్యవసాయ పరికరాల కర్మాగారం కొలిమి దాతి. దాతి ప్రజల జీవనదాత. దాతి మానవ జీవన సంస్కృతి ప్రదాత. ఉత్త చేతులలో యంత్రాలను పెట్టింది దాతి. కొడవలి, గొడ్డలి, సుత్తె, కత్తి, గంటె, సూది, మేకు,గిన్నె.. ఒకటేమిటి నాగలి కర్రు నుంచి శస్త్రచికిత్సా పరికరాల దాక దాతే కదా మూలకం. నాగలిదుంపకు తలాపు దాతి. మెడలో హారాలకు దాతి. తినే తలెకు దాతి. చెక్కే శిల్పాలకు దాపు దాతి. దాతి లేకుంట బతుకు లేదు.
‘నాగలిదుంప
పెద్ద బాడిశె జోరు
ఊరు పుద్దిచ్చిన
తల్లిలాంటి దాతి మొద్దుకు
పుట్టెడు బల్గం’
దాతి కవితలో దాతి వడ్లోల్ల దాతి.
‘శాగవారిన మానులను వొంచి
ముగ్గువోసే మూలవాసం
తొలి మలిసిన దాతి ఇప్పుడు
చెక్క పొల్లయి పేళ్ళూడుతుంది’
పెద్దబాడిశెతోని రోజులు, రోజులు చెక్కి ఇండ్లకప్పుకు మూలవాసాలు, పెద్దదూలాలు, చూరు వాసాలు, ఎనగర్రలు అమరించే దాతి ఇప్పుడు ఆ పనులు లేక ఎండి చెక్క‘పొల్లు’ అయింది. వృత్తిపనులు ఎపుడో పారిశ్రామీకరణలో పొల్లు పొల్లయి పోయినయి.
కవయిత్రి దాసోజు లలిత సొంతబతుకు అనుభవాలని ఈ కవితలో బొమ్మకట్టి చెప్పింది. మొగురాలు, పరుదచెక్కలు, గుర్రం మూతులు, ఆరాం కుర్చీలు, కట్లమంచం, సంగడిపట్టిన దివాను, బిర్రుపిడికిండ్లు, రథాలు, పల్లకీలు, కాడి, సిర్రలు, బండిగిర్రలు, బండిబుడ్లు, డోల్పు(దొలుపు), గడకొయ్యలు, గందెవాట్లు, చెక్కబేడం, ముక్కాలిపీటలు, దంట(జంట)పీటలు…ఎన్నని, ఎన్ని వస్తువులని, ఎన్ని పనిముట్లని అన్నీ పోయినయి. కులవృత్తి పాయె. పెట్టుబడిదారుల ‘ఐకియా’ వచ్చె. అందుకని లలితక్క వృత్తి కళాకారుల రాజ్యం కొరకు వాళ్ళ పక్షాన కొట్లాడేతందుకు ‘లోగో’ కావాలంటున్నది. దాతి కంటె పెద్ద లోగో ఏముంటది?
పనితనపు ఆదరువు పనిముట్టు చేసేందుకు ‘సాత్ దారిచ్చే’ మూలకం కావాలె. కమ్మరోల్లకు డాకలికి, వడ్లోల్లకు దాతిమొద్దుకు, అవుసులోల్లకు డాకలికి, కంచరోల్లకు డాకలికి, ‘సాటు’కు, కాసె(శిల్పుల)లకు పనిముట్ల తయారీకి దాతే పెద్దదిక్కు. దాతి లేకుంటే ఎవరి పనికూడా నడువదు. దాతి పేరుతోని ఈ కవితా సంకలనం సాంప్రదాయిక చేతివృత్తుల ఎజెండా. దాతి విరిగిన వృత్తుల చేతుల జెండా.
____
దాసోజు లలిత ‘తాను బతికిన తమ బతుకుకోసం, తమలాంటి వాళ్ళకోసం రాయడం ఒక బాధ్యత’గా ఈ కవిత్వాన్ని రచించింది. ఒక జీవన పోరాటానికిది అక్షరరూపం. వృత్తి గ్రామీణం. భాష స్థానికం. గ్రామీణ జీవితంలో అక్కరకొచ్చిన అసువావులు, వాటి తయారీ ఈ కవిత్వం వస్తువు. ఇది శ్రామిక కవిత్వం. ఇది ప్రజా సాహిత్యం.
_____
శ్రమజీవుల ఉత్పత్తిశక్తులు, వారి కష్టసుఖాలు, వారి రాజకీయాలు వస్తువుగా రచించేది. వారికి చైతన్యమిచ్చేదే కదా ప్రజా సాహిత్యం. ఒక చారిత్రక జీవిత దృక్పథాన్ని కలిగిందే ప్రజా సాహిత్యం.
తెలంగాణారాష్ట్రం ప్రజలంత కొట్లాడి తెచ్చుకున్న రాజ్యం. ఒక ‘వలస విముక్త కొత్తరాష్ట్రం’ అంటున్నది దాసోజు లలిత (కొలిమి శనార్థులు)
‘ఆత్మగౌరవం పెలికి
ఉప్పెనైన వీరులరొమ్ములు
పల్లున విరిగి గుట్టలోలే
మండితే వసరై రాలిన రాజ్యం’
న్యూ ఓర్లియన్స్ కు చెందిన జిప్సీ ‘గిల్టీ’ రెవెల్యూషనరీ అనే కవితలో ఇట్లా రాస్తుంది
a spike in the chest
there goes the spark
burn the ghetto homes
spur the masses
a martyr never dies alone
శ్రీకాంత్,యాదయ్య వంటి వేలమంది అమరుల త్యాగం ఈ రాష్ట్రావతరణ. ‘ఊసరవెల్లులది, కండువమండువ(కల్లు అడ్డా)ల మీద గంతులేసే’ వేషగాళ్ళది కాదు తెలంగాణ. వీరులకు కొలిమిదండాలన్నది లలిత. కొలిమి బహుళార్థసాధక పదప్రయోగం. కొలిమి కవయిత్రి స్వీయసంకేతం. కొలిమి ఉద్యమానికి గుర్తు.
ఉత్పత్తికారకులు ఎక్కడపడితే అక్కడ అన్నంగిన్నెలయి దొరుకుతున్నరు కనుకనే అందరికి అన్నం. లేకుంటే సున్నం. మారుతున్న కాలానికి కలుగుతున్న కొత్త స్పృహలకు పాతకాలం పనితనాలకు అక్కరగా మారుతున్నయి. అందులో ‘గానుగ’ ఒకటి. మంచినూనె అంటే గానుగనూనే అని అంటున్నరు. ‘ఒంటెద్దు, గానుగగుంజ, రౌతుపిడి, ఇనుపగొలుసు’ గానుగ చిత్రం. కూరలకు, నెత్తులకు సమరుసుక్కే కావాలె. మరి ఆ గాండ్ల(గానుగల)వాండ్లు ‘లోకానికి సమరంటిన నాగరీకులు’ అంటుంది కవయిత్రి. తలచుకుంటే పాతకాలం ఉత్పత్తికారకాలైన పనిముట్లు, యంత్రాలు, వాటిని నడిపిన పనివాండ్లు ఈ లోకానికింత చలనం, గతి కలిగించినవాండ్లు. వాండ్లకు మర్యాదియ్యాలె.
‘మన్నుపెళ్ళ’ కవితలో దాసోజు లలిత:
‘ధగధగ థండర్ భవంతులు అందాల మేడలు
తీరొక్క చిత్రశాలలను సుతారించిన ఉప్పర్లు’ గురించి :
‘మిన్నంచు మేడలు
గోవాకట్టెల తడకల
మీది నడకలు
వుట్టిలా వేలాడే వెన్ను
పట్టుదప్పిన పాదం
నేల కప్పుకున్న దేహం’ అని వర్ణిస్తుంది.
సుద్దాల అశోక్ తేజ తన పాటలో
‘రాయి,సలాక,ఇసుక, ఇటుక/ తాపీతట్ట, సిమెంటు సెమట/గోడమీద గోడ మేడమీద మేడ/ కట్టిపోర కూలోడా పట్టణాలలో మేడ
కాళ్ళు జాగరత, వేళ్ళు జాగరత / నడుం జాగ్రత్త, నడక జాగ్రత’.. అన్నట్టుగనే లలిత గోవా మీద కాలు పట్టుదప్పితే సుతారిదేహం నేలకప్పుకుంటుందంటుంది. నేలకప్పుకోవడం కవితాత్మక క్రియ. ‘సుతారించిన’ అని సుతారి పనిని సుతారించుడనడం…కవయిత్రి కొత్త వ్యక్తీకరణరూపం. ‘చట్టసభలకు పైకప్పు కప్పటమే కాదు. అధికారరంగంలో వాటా పొందాలే’ సుతారి ఉప్పర్లు అని డిమాండ్ చేస్తున్నది కవయిత్రి .
అటువంటి జీవితమే నేతపనివాండ్లది. ఉలిబాడిశెలతో దాతి ‘రాట్నంపీట, ఆసుపూటి, మగ్గంనాడె’ లందిస్తుంది. వాటికి తన ‘పేగులే దారాలు’గా నేస్తాడు నేతన్న. తన వృత్తి ఉట్టిపోతున్నది. ప్రపంచానికి బట్టకట్టిన నాగరికత పద్మశాలీల, విశ్వకర్మల పీటముడి. ప్రభుత్వపథకాలు నేతన్న ఆసుపూటికి, సువ్వలకు గుచ్చుకోవు. ‘అంసలు, అంబారీలు’ నేసే నేతన్నకు గోసిపేలికలేనంటుంది కవయిత్రి ‘కిడ్నాపైన రాట్నం’ అనే కవితలో. ఎక్కడైన శ్రమ Exploit చేయబడుతూనే వుంది. ఈ కవితలోని ప్రతిపదం సజీవ సాంస్కృతిక వస్తువు. నేతన్న ఇంటిలోని నేత అసువావులు ‘ధోనుగ, గుమ్మి, లడి, చిట్టేలు, పింజిర్లు, లాకలు, బద్దెలు, రాట్నం పీట, ఆసుపూటి, కండెలు, నాడెలు, మగ్గం గుంటలో నేతన్న తొక్కే పీటలు…’ ఏ వృత్తిపరికరాల సంపద, ఆ వృత్తిదే. కాని, ఆ పరికరాలన్నింటిలో కమ్మరి, వడ్రంగుల పనితనముంటది. అంత విడదీయరాని శ్రమజీవన బాంధవ్యం. లలిత కవితా చిత్రణకొక సలాం. నేతబతుకులతో ఎంత దగ్గరితనం లేకపోతే ఇంత బాగా రాస్తుంది తను.
దాతి నిండా బాధల గాథలే. తీరొక్క దుఃఖాల సాలువోసిన నేల దాతి. కమ్మరి లక్ష్మమ్మదొక కథ. కథను కవితగా అలతి, అలతి పదాలతో కుట్టిన తీరు అనితరసాధ్యం.
కవిత బుడ్డిదీపం, ఎక్కల వెలుగుతోని మొదలు కండ్లల్ల వొత్తులేసుకుని పిల్లల కడుపు నింపెతానికి మలగనిసీకటి బతుకులో తండ్లాట. నిండుకున్న(ఖాళీ) తిండిగింజల గూనలు(బాన, కాగు, పెద్దకుండలు)… ఆమె కష్టం ఊరి మీదకి విసిరిన ‘ఎట్టి’ రెక్కలసాక. ఎట్టి అంటే వెట్టి. పైస రాని పని. ఊర్లల్ల అమ్మదేవతలకు మొక్కేటపుడు నీళ్ళు, కల్లు సాకలు పోస్తుంటరు. సమర్పణభావం. లక్ష్మమ్మ శ్రమంత ఉత్తగనే సాకపోసినట్టు పంచబడుతుంది. ఎందరి రైకలమీద, చీరెలమీద కుట్టిపోసిన జింకలు, హంసలు, నెమలికన్నులు.. చేతికి దక్కింది ఏకాణ అంటే అప్పట్లో ఆరు పైసలు. ఇంటాయన దొరలనెదిరిచ్చి రజాకార్ల కేసు గెలిచొచ్చిండు..వాయిదాలకే కష్టమంతా. కమ్మరి లక్ష్మమ్మ ఊరందరి నోట్లో. కాని, పెన్షన్ రాలే. జిట్టెడుపొట్టనింపే వొత్తులు వెలగలేదెన్నడు. ఇది తెలంగాణ ప్రజల కథ. నిజాంపాలనలో, రజాకార్లు, దొరలు కలిసిచేసిన దోపిడీలకు బలైన ప్రజలు గుత్పలందుకున్న తిరుగబడ్డ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో లక్ష్మమ్మ భర్తలవంటివాండ్లెందరు బాధలుపడ్డరు. ఎన్ని కష్టాలనీదిండ్రు.
‘తెలంగాణ సమాజమంతటినీ పట్టి పీడిస్తున్న అసమ భూసంబంధాలు, వెట్టి దోపిడీ, సాంఘిక పీడన సమస్యల గురించీ, ఆ సమస్యలను ఎదిరించే పోరాటం గురించీ ప్రజల అవగాహన పెరిగింది. వెట్టి, దొరల పీడన వంటి నిత్యజీవిత అనుభవం నుంచి భూమి-భుక్తి-విముక్తి పోరాటం అనే సైద్ధాంతిక విస్తరణ ప్రాచుర్యంలోకి వచ్చింది. తమ భూమి ఎన్ని ఊళ్లలో, ఏయే ఊళ్లలో ఉన్నదో కూడ తెలియని, ఎన్నడూ మట్టి పిసకని లక్షలాది ఎకరాల భూస్వాముల చెర నుంచి భూమిని విడిపించి దున్నేవారికే భూమి దక్కాలనే నినాదం తెలంగాణ అంతటా పెల్లుబికింది. ఊళ్లో తమకు కనబడుతున్న దొరలు, వారి మీద మక్తెదార్లు, దేశముఖ్ లు, జాగీర్దార్లు, ఆ పైన నిరంకుశ ప్రభువు, ఆ పైన వలసవాదులు ఈ నిచ్చెనమెట్ల దోపిడీ పీడక వ్యవస్థను కూల్చకుండా తమకు విముక్తి లేదని ప్రజలు భావించారు.’(సారంగ సంచిక 2021 జూలై 1-లో గుత్పమర్లేసిన బాటలపాటలు-ఎన్. వేణుగోపాల్)
దాసోజు లలిత తను కన్నవి, విన్నవి, అనుభవించినవి తనను కదిలించిన ఎన్నో అనుభూతులను, అలజడులను కవితలుగా రచించింది. స్పందించే హృదయానికే వేదనలోతులు తెలుసు. గుండెవెక్కిళ్ళను ఆపుకుంటు అలలు, అలలుగా రాసింది ఈ కవితల్ని.
తను ‘మూలధ్వని’ కార్యక్రమంలో పాల్గొన్న ఒక కోయవనిత మంగ అనే కళాకారిణిని చూసినంక..
‘ఆమె ఒక లయ
ఆమె ఒక అనాది సంగీతం
ఆమె ఒక గుజ్జిడిమొగ్గ
ఆమె ఒక గిల్లగజ్జె
ఆమె ఒక మూలధ్వని’ అన్నది. తనను ఆదివిద్వాంసురాలన్నది. ఎంత మమేకం కాకపోతే ఇంత మాటనగలుగుతుంది లలిత.
‘తెగల మధ్య జరిగే పోరాటంలో
తెగొచ్చిన పేగునో ఏమో
బహుశా
ఆమె నాకు తల్లో
నేనామెకు బిడ్డనో’ ఇద్దరికి ఇగం పుట్టిస్తున్న ఇద్దరి శబ్దాలు గుండె సవ్వడు లొక్కటై లయబద్ధంగా ధ్వనిస్తున్నాయంటుంది కవయిత్రి
‘ఆమె ఒక ధ్వని’ కవితలో..
‘వంటింట్ల ఎండిన మోదుగాకుల దోర్నం/ సాటుకు ఉన్న ముంతగూడే/ మా అమ్మకు బీరువా’ అంటుంది లలిత.
‘పన్నెండు మందాల కప్పుకింద
దాగిన ముంతగూడులు తనాబీలు
తూప్రాశి తాటిదూలాలు,
పరదచెక్కలగూడులో
నాయిన సన్నకురాళ్ళు బర్మోలలు
కొలిమి పనిముట్లు
దాతి కలపలతో
పదిమందికి పనినేర్పిన
మా నాయన ప్రొఫెసరు
మా అమ్మ ఆఫీసరు
మా యిల్లు చేతివృత్తిపనుల యూనివర్సిటి’ కాని నాయినకు ఎనభైయేండ్లొచ్చినా రిటైర్మెంటు లేదు. అమ్మ సెమటసుక్క తడవని ఇల్లు కూలిన ఎడారే ఇప్పటికి. ఆ పనితనం, ఆ సేతానం నుంచి వచ్చిన కొడవలిలిక్కి లలిత. పదునైంది. వాడివున్నది. వేగం వున్నది. ఈ పుస్తకంల భాష ఆమె పదభాండాగారం. తాను పదకావ్య సౌరభంతో పరిమళిస్తున్న పచ్చబంగారం. ‘దాతి’ మా లలిత కవితల ముంతగూడు.
‘తాను బతికిన, తమ బతుకుకోసం, తమలాంటి వాళ్ళకోసం రాయడం ఒక బాధ్యత’ (జయధీర్ తిరుమలరావు ముందుమాట ‘దాతిదెబ్బల దాసోజు కలం’ నుంచి) అనుకున్న లలిత అంగార కావ్యం దాతి. తన బతుకు తనకిచ్చిన భావజాలం, ఆధిపత్య వ్యతిరేక పోరాట నినాదంగా మలిచింది. శ్రమవిలువను పొందే హక్కు కొరకు పోరాడడమే తన కార్యాచరణ అనుకున్నది. ప్రజల భాషారూపాలను, వృత్తిపద సంపదలను నిలుపుకోవడానికి తపిస్తున్నది. ఆ తపన, ఆ ధిక్కార స్వరమే దాసోజు లలిత ‘దాతి’.
‘Under bludgeonings of chance
My head is bloody, but unbowed..
I am the master of my fate
I am the captain of my soul –William Ernest Henley
ఖలీల్ జీబ్రాన్ అన్నట్టు:
‘ఆమె తను ప్రయాణించిన
బాటనొకసారి తిరిగి చూసుకుంది
ఆ పర్వతాల శిఖరాల నుంచి
సుదీర్ఘంగా మలుపులు తిరుగుతూ అడవులు, ఊర్లను దాటిరావడం
ఆమె ఎదురుగా మహాసముద్రం ప్రవేశించడానికి…
నది కష్టాన్ని గట్టెక్కించాల్సిందే
నిర్భీతిగా మహాసముద్రం కావడానికి’
దాసోజు లలిత ‘దాతి’లో ఒర్రెగా మొదలై మహానదిగా మారింది. కవితాసముద్రమైంది.
-శ్రీరామోజు హరగోపాల్,
99494 98698